కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

ఎత్తులో ఎగిరే పక్షుల రెక్కలు

ఎత్తులో ఎగిరే పక్షుల రెక్కలు

జెట్‌ విమానం ఎగురుతున్నప్పుడు రెక్కల అంచులో గాలి వేగంగా సుడులు తిరుగుతుంది. ఈ సుడులు విమానాన్ని వెనక్కి లాగుతాయి. దానివల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. ఆ సుడులు దగ్గర్లో ఎగురుతున్న విమానాలను కూడా పక్కకు నెడతాయి. అందుకే ఒకే రన్‌వే నుండి రెండు విమానాలు బయల్దేరుతుంటే గాలి సుడులు చెదిరిపోయేంత దూరం ఆ విమానాల మధ్య ఉండేలా చూసుకుంటారు.

విమానాలు తయారుచేసే ఇంజనీర్లు ఇలాంటి సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఏమిటది? రెక్కల అంచుల్ని పైకి తిప్పి తయారుచేయడం. రాబందులు, గద్దలు, కొంగలు లాగ ఎత్తులో ఎగిరే పక్షుల రెక్కల అంచులో, ఈకలు పైకి తిరిగి ఉండడాన్ని చూసి అలా తయారుచేశారు.

ఎలానో చూద్దాం: ఈ పెద్ద పక్షులు ఎత్తులో ఎగురుతున్నప్పుడు వాటి రెక్కల అంచులో ఉండే ఈకలు నిలువుగా అయ్యేవరకు పైకి తిరిగిపోతాయి. ఇలా తిరగడం వల్ల రెక్కల పొడవు తగ్గినా ఎగరడం తేలికవుతుంది. విమానం రెక్కల్ని కూడా అలాగే ఉండేలా తయారుచేశారు. ఇలా విమానం రెక్కల అంచుల్ని సరైన కోణంలో పైకి తిప్పి గాలి ప్రవాహానికి అనుగుణంగా తయారు చేసినప్పుడు విమాన సామర్థ్యం పది శాతం లేదా అంతకన్నా ఎక్కువ పెంచవచ్చని “అధునాతన విండ్‌ టన్నెల్‌” పరీక్షల ద్వారా తెలుసుకున్నారు. ఎలా? రెక్కల అంచులు పైకి తిప్పడం వల్ల వాటి చివర్లో ఏర్పడే గాలి సుడులు చిన్నగా ఉంటాయి. అప్పుడు ఆ సుడులు విమానాన్ని వెనక్కి లాగడం కూడా తగ్గుతుంది. అంతేకాక ఈ అంచులు విమానం ముందుకు వెళ్లే బలాన్నిస్తాయి, ఆ బలం ఎదురుగాలి విమానాన్ని వెనక్కి నెట్టకుండా అడ్డుకుంటుంది అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఫ్లైట్‌ చెబుతుంది.

ఇలా అంచులు పైకి తిప్పి తయారుచేయడం వల్ల రెక్కల పొడవు తగ్గి విమానాలను తక్కువ స్థలంలోనే పార్కింగ్‌ చేయవచ్చు, ఎక్కువ బరువులు తీసుకెళ్ళవచ్చు, ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు, ఇంధనం ఆదా చేయవచ్చు. ఉదాహరణకు 2010లో విమానాలు “ప్రపంచమంతటా 760కోట్ల లీటర్ల ఇంధనం” ఆదా చేశాయి, దానివల్ల విమానాల నుండి వచ్చే కాలుష్యం కూడా తగ్గింది అని నాసా (NASA) చెప్పింది.

మీరేమంటారు? ఈ పక్షుల రెక్కల అంచులో ఈకలు పైకి తిరిగి ఉండడం అనుకోకుండా జరిగిందా? లేదా ఎవరైనా అలా తయారు చేశారా?