కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం

దేవుడు ఉన్నాడా? తెలుసుకోవడం వల్ల ఉపయోగమేంటి?

దేవుడు ఉన్నాడా? తెలుసుకోవడం వల్ల ఉపయోగమేంటి?

దేవుడున్నాడా? అని అడిగితే చాలామంది ఏమీ చెప్పలేరు, ఇంకొంతమంది అసలు ఆ విషయాన్ని పట్టించుకోరు. ఫ్రాన్స్‌లో పెరిగిన ఎర్వే ఇలా అంటున్నాడు: “నేను నాస్తికున్ని కాదు, అలాగని దేవుడు ఉన్నాడని చెప్పడం అసాధ్యం అని కూడా అనను, కానీ నేను దేవున్ని నమ్మను. చక్కగా జీవించడానికి కామన్‌ సెన్స్‌ లేదా కొంచెం బుద్ధి ఉంటే చాలు, దేవున్ని నమ్మాల్సిన అవసరం లేదు.”

అమెరికాలో ఉన్న జాన్‌ ఇలా అన్నాడు: “నా తల్లిదండ్రులకు దేవుని మీద నమ్మకం లేదు. యువకునిగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో నాకు ఎలాంటి అభిప్రాయమూ ఉండేది కాదు. కానీ ఆ విషయం గురించి కొన్నిసార్లు ఆలోచించే వాడిని.” అతనిలా అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు.

దేవుడు ఉన్నాడా? ఆయనే మనల్ని చేసి ఉంటే జీవితానికేదైనా అర్థం ఉందా? అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ దేవుడు లేడు అంటే కొన్ని విషయాలు వివరించడం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు భూమ్మీద ప్రాణులు జీవించడానికి ప్రకృతిలో అన్నీ సరిగ్గా అమర్చి ఉన్నాయి అని సైన్స్‌ ఇస్తున్న వివరాల్ని, అంతేకాకుండా జీవం లేని వాటి నుండి జీవం ఎందుకు రాదు అనడానికి ఉన్న రుజువులను సృష్టికర్తను పక్కన పెట్టి వివరించడం కష్టం.—“ రుజువులు పరిశీలించండి” బాక్సు చూడండి.

పైన చెప్పిన విషయాలు ఎంత ముఖ్యమైనవో ఒకసారి ఆలోచించండి. అవి ఒక పెద్ద నిధిని చేరడానికి దారిలో పెట్టిన గుర్తుల్లాంటివి. దేవుడు ఉన్నాడు అనడానికి కావాల్సినంత రుజువులతో పాటు, ఆయన గురించి నమ్మదగిన సమాచారం దొరికితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. వాటిలో నాలుగు ఇప్పుడు చూద్దాం.

1. జీవితానికున్న అర్థం

జీవితానికి ఒక అర్థం ఉంటే అదేంటో, దానివల్ల మనకు ఉపయోగమేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉండీ మనకు ఆ విషయం తెలియకపోతే, సృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని గ్రహించకుండానే జీవిస్తున్నట్లు అవుతుంది.

దేవుడే జీవానికి మూలం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. (ప్రకటన 4:10, 11) ఈ విషయానికీ మన జీవితానికీ సంబంధం ఏమిటి? దీని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందో చూడండి.

భూమి మీదున్న ప్రాణులన్నిటిలో మనిషి ప్రత్యేకమైన వాడు. దేవుడు మనల్ని ఆయనలా ఉండేలా, ఆయనకున్న లక్షణాలు చూపించేలా చేశాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. (ఆదికాండము 1:27) అంతేకాదు మనుషులు దేవునితో స్నేహం చెయ్యవచ్చు అని కూడా ఉంది. (యాకోబు 2:23) సృష్టికర్తతో మంచి స్నేహాన్ని సంపాదించుకోవడమే జీవితానికున్న అసలు అర్థం.

దేవునికి స్నేహితుడిగా ఉండడం అంటే ఏమిటి? దేవుని స్నేహితులు నేరుగా ఏదైనా దేవునితోనే చెప్పుకోవచ్చు. చెప్పుకున్న వాటిని వింటాను, విని సహాయం చేస్తాను అని కూడా ఆయన మాటిస్తున్నాడు. (కీర్తన 91:15) దేవుని స్నేహితులుగా చాలా విషయాల్లో ఆయన ఆలోచనలు మనం తెలుసుకోవచ్చు. వాటినిబట్టి మన జీవితాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం.

దేవుడు ఉండీ మనకు ఆ విషయం తెలియకపోతే సృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని గ్రహించకుండానే జీవిస్తున్నట్లు అవుతుంది

2. మనశ్శాంతి

చుట్టూ ఉన్న కష్టాలను చూసి దేవున్ని నమ్మడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. ‘ఎంతో శక్తి ఉన్న దేవుడు కష్టాలను, చెడుతనాన్ని ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు?’ అంటారు.

మనుషులు బాధపడాలని దేవుడు ఎప్పుడూ అనుకోలేదని ఆయనే చెప్తున్నాడు. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు వాళ్లకు కష్టాలే లేవు. మనుషులు చనిపోవాలని కూడా దేవుడు ఎప్పుడూ అనుకోలేదు. (ఆదికాండము 2:7-9, 15-17) ఇది నమ్మడానికి కష్టంగా ఉందా? పగటికలలా అనిపిస్తుందా? ఒకవేళ శక్తిమంతుడైన సృష్టికర్త ఉండి, ఆయనకు చాలా ప్రేమ ఉంటే ఖచ్చితంగా మనుషులకు మంచి జీవితమే ఇస్తాడు కదా.

అలాంటప్పుడు మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు? దేవుడు మనుషులకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పినట్లే చేయడానికి మనం రోబోలం కాదు. మనందరికీ జన్మనిచ్చిన మొదటి తల్లిదండ్రులు దేవుని మాట వినకూడదని నిర్ణయించుకున్నారు. స్వార్థంతో వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేశారు. (ఆదికాండము 3:1-6, 22-24) అందుకే మనమిప్పుడు ఈ కష్టాలు పడుతున్నాం.

మనం బాధపడాలని దేవుడు కోరుకోట్లేదని తెలుసుకున్నప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మనశ్శాంతిగా ఉండాలనే కాదు, కష్టాలనుండి బయటపడాలని కూడా మనం కోరుకుంటాం. మనకు మంచి భవిష్యత్తు కావాలి.

3. ఆశ

మనిషి దేవునికి ఎదురు తిరిగిన వెంటనే, భూమి ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా మళ్లీ సరిచేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి అనుకున్నది చేయకుండా ఆయనను ఏదీ ఆపలేదు. (యెషయా 55:11) మనుషుల తిరుగుబాటు వల్ల జరిగిన నష్టమంతటినీ త్వరలోనే తీసేసి మొదట్లో భూమి, మనుషులు ఎలా ఉండాలనుకున్నాడో అలా మార్చేస్తాడు.

అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో దేవుడు చేస్తానన్న రెండు వాగ్దానాలను చూడండి.

  • ప్రపంచమంతా శాంతి ఉంటుంది, చెడు ఇక ఉండదు. “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:10, 11.

  • జబ్బులు, మరణాలు ఉండవు. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8.

పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాగ్దానాలను మనం ఎందుకు నమ్మవచ్చు? ఎందుకంటే చాలా వాగ్దానాలు ఇప్పటికే నెరవేరాయని రుజువులున్నాయి. అయితే భవిష్యత్తులో బాధలుండవనే వాగ్దానం ఇప్పుడున్న కష్టాలను తీసేయదు. మరి ఇప్పుడున్న కష్టాల్లో దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

4. సమస్యల్లో, నిర్ణయాల్లో సహాయం

సమస్యల్ని తట్టుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొన్ని నిర్ణయాలు చిన్నవి, కొన్ని మాత్రం జీవితాన్నే మార్చేస్తాయి. ఏ మానవుడూ మన సృష్టికర్తకన్నా మంచి సలహాలు ఇవ్వలేడు. ఆయన చెప్పే సలహాలు అన్ని కాలాల్లో ఉపయోగపడతాయి. అందరికీ ప్రాణం ఇచ్చేది ఆయనే. కాబట్టి మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు.

పరిశుద్ధ గ్రంథంలో యెహోవా దేవుని ఆలోచనలు ఉన్నాయి, వాటిని ఆయనే మనుషులతో రాయించాడు. అందులో ఇలా ఉంది: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17, 18.

దేవునికి అంతులేని శక్తి ఉంది. ఆ శక్తితో మనకు సహాయం చేయడం ఆయనకు ఇష్టం. దేవుడు మనకు సహాయం చేయాలనుకుంటున్న ప్రేమగల తండ్రి. “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను” అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. (లూకా 11:13) ఈ పరిశుద్ధాత్మ మనల్ని నడిపించి మనకు బలాన్నిస్తుంది.

మనకు దేవుని నుండి సహాయం ఎలా దొరుకుతుంది? “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. (హెబ్రీయులు 11:6) దేవుడున్నాడని నమ్మాలంటే అందుకు రుజువుల్ని పరిశీలించాలి.

మీరు పరిశీలించి తెలుసుకుంటారా?

దేవుని గురించిన నిజాలు తెలుసుకోవడానికి సమయం పట్టినా తెలుసుకుంటే మీకు చాలా లాభాలుంటాయి. స్యూజిన్‌ సియావ్‌ అనుభవం చూద్దాం. చైనాలో పుట్టిన స్యూజిన్‌ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “పరిణామ సిద్ధాంతాన్ని నమ్మినా బైబిల్లో ఏముందో తెలుసుకోవాలని అనుకునేవాన్ని. అందుకే నేను యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. కాలేజీ చివరి సంవత్సరంలో, బైబిలు నేర్చుకోవడానికి చాలా తక్కువ సమయం దొరికేది. అప్పుడు నేను అంత సంతోషంగా లేను. మళ్లీ సమయం తీసుకుని బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంది.”

మనల్ని సృష్టించిన యెహోవా దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? సమయం తీసుకుని పరిశీలించి చూడండి.