కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునితో ఉన్న సంబంధం

దేవునితో ఉన్న సంబంధం

పత్రిక మొదట్లో చెప్పినట్లు, చాలామంది బైబిల్ని పవిత్ర పుస్తకమని గౌరవిస్తారు. బైబిల్ని చదువుతూ, దానిలోని సలహాల్ని పాటించడం ద్వారా దేవునికి దగ్గరయ్యామని, జీవితానికి ఉన్న అర్థాన్ని కనుగొన్నామని వాళ్లు చెప్తారు.

ఆధ్యాత్మికత గల ప్రజలు, అంటే దేవునితో తమకున్న సంబంధం గురించి ఆలోచించే ప్రజలు దేవుని అభిప్రాయాన్ని గౌరవిస్తారు, ఆయన ప్రమాణాల ప్రకారం జీవిస్తారు. దానికి భిన్నంగా శరీర కోరికల ప్రకారం జీవించే ప్రజలు తమ సొంత అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటూ, తమ సొంత కోరికల్ని తీర్చుకుంటారు.—యూదా 18, 19; ఎఫెసీయులు 5:1.

భవిష్యత్తు మీద ఆశ

బైబిలు సూత్రం: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.”—సామెతలు 24:10.

అంటే: కృంగుదల లేదా నిరుత్సాహం వల్ల జీవితంలోని సమస్యలతో పోరాడడానికి కావాల్సిన శక్తి తగ్గిపోతుంది. అయితే, భవిష్యత్తు మీద ఆశ ముందుకు సాగడానికి కావాల్సిన బలాన్నిస్తుంది. చాలావరకు మన సమస్యలు కొంతకాలమే ఉంటాయని గుర్తించడం మనకు ఓదార్పునిస్తుంది; నిజానికి కష్టాల్ని సహించడం వల్ల మనకు మేలే జరుగుతుంది.

మీరేం చేయవచ్చు: భవిష్యత్తు గురించి సానుకూలంగా (పాజిటివ్‌గా) ఆలోచించండి. ఏం జరుగుతుందో అని దిగులుపడే బదులు లేదా సరైన పరిస్థితులు వచ్చేవరకు ఎదురుచూసే బదులు, మీ లక్ష్యాలకు అనుగుణంగా కృషిచేస్తూ ఉండండి. నిజమే, కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి. (ప్రసంగి 9:11) అయితే చాలావరకు పరిస్థితులు మనం అనుకున్న దానికంటే మెరుగ్గానే ఉంటాయి. రైతు జీవితానికి సంబంధించిన ఉదాహరణ ఉపయోగిస్తూ బైబిలు ఇలా చెప్తుంది: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.”—ప్రసంగి 11:6.

జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు

బైబిలు సూత్రం: ‘నాకు తెలివి దయచేయుము. నీ వాక్యము సత్యము.’—కీర్తన 119:144, 160.

 అంటే: జీవితం గురించి దాదాపు ప్రతీఒక్కరు అడిగే ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయి. ఉదాహరణకు, ఇలాంటి ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయి.

  • మనం ఎక్కడి నుండి వచ్చాం?

  • మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం?

  • చనిపోయిన తర్వాత ఏమౌతుంది?

  • జీవితం అంటే ఇంతేనా?

ఆ ప్రశ్నలకు, ఇతర ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుల్ని తెలుసుకోవడం ద్వారా లక్షలమంది తమ జీవితాల్ని మెరుగుపర్చుకున్నారు.

మీరేం చేయవచ్చు: బైబిలు చెప్తున్నదాన్ని మీరే స్వయంగా పరిశీలించండి. బైబిల్ని అర్థం చేసుకోవడానికి యెహోవాసాక్షుల్ని సహాయం అడగవచ్చు. మా jw.org వెబ్‌సైట్‌ని చూడండి లేదా మా కూటాలకు రండి. మా కూటాలకు అందరూ రావచ్చు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంకొన్ని బైబిలు సూత్రాలు

jw.org వెబ్‌సైట్‌లోబైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూడండి. ఆ వీడియో 880 కన్నా ఎక్కువ భాషల్లో ఉంది

దేవునితో సంబంధం అవసరమని గుర్తించండి.

“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.” —మత్తయి 5:3.

బైబిలు చెప్తున్న దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోండి.

‘తన కోసం వెతికి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.’ —అపొస్తలుల కార్యాలు 17:27.

బైబిలు సందేశాన్ని చదివి, లోతుగా ఆలోచించండి.

“యెహోవా * ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. . . . అతడు చేయునదంతయు సఫలమగును.”—కీర్తన 1:2, 3.

^ పేరా 23 దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.