కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం

పనులు ఎక్కువైపోతే ఏమి చేయాలి?

పనులు ఎక్కువైపోతే ఏమి చేయాలి?

మీరు చాలా బిజీగా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది పరిస్థితి అలానే ఉంది. ది ఎకనామిస్ట్‌ అనే పత్రిక ఇలా చెప్తుంది, “ఎక్కడచూసినా అందరూ బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది.”

ఎనిమిది దేశాల్లో ఫుల్‌టైం వర్క్‌ లేదా రోజంతా పని చేస్తున్న వాళ్లను 2015⁠లో సర్వే చేశారు. వాళ్లలో చాలామంది ఇటు ఉద్యోగం అటు ఇంట్లో పనులన్నీ పూర్తిచేయడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఉద్యోగంలో లేదా కుటుంబంలో బాధ్యతలు పెరగడం, ధరలు పెరగడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడమే ఈ సమస్యకు కారణం అని ఆ సర్వేలో తేలింది. ఉదాహరణకు, ఇండియాలో ఒక సర్వే ప్రకారం, యువకులు వారానికి సగటున 52 గంటలు పని చేస్తున్నారు. మరో సర్వే ప్రకారం జాబ్‌ చేసే 1,000 మంది యువకుల్లో 16 శాతం కన్నా ఎక్కువ మంది రోజుకు 12 గంటల పైనే పని చేస్తున్నారు.

ముప్పై ఆరు దేశాల్లో చేసిన మరో సర్వేలో, 25 శాతం కంటే ఎక్కువమంది ఖాళీ సమయాల్లో కూడా ఏదో ఒక పని వెనుక పరిగెత్తాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. పిల్లలను కూడా ఒకదాని తర్వాత ఒకటి తీరికలేనన్ని పనులతో (activities) బిజీ చేసేస్తే వాళ్లు కూడా ఇబ్బంది పడతారు.

ఉన్న సమయంలో చేయగలిగే వాటికన్నా ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మనకు ఒత్తిడి పెరుగుతుంది. అంటే మనం టైం ప్రెషర్‌కి గురౌతున్నాం అని అర్థం. తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయాలనే ఒత్తిడిని టైం ప్రెషర్‌ అంటారు. కానీ సమయాన్ని సర్దుబాటు చేసుకుని లేదా బ్యాలెన్స్‌ చేసుకుని జీవించడం సాధ్యమేనా? మన నమ్మకాలు, నిర్ణయాలు, లక్ష్యాలు ఏ పాత్ర పోషిస్తాయి? ముందుగా, చాలామంది ఎక్కువ పని చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాలుగు కారణాల్ని పరిశీలిద్దాం.

కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే కోరిక

గ్యారీ అనే తండ్రి ఇలా చెప్తున్నాడు, “నేను వారంలో ఏడు రోజులూ పనిచేసే వాడిని. ఎందుకంటే నా పిల్లలకు ఏదైనా మంచిది ఇవ్వాలని ఎప్పుడూ కోరుకునే వాడిని. నేను అనుభవించ లేకపోయిన వాటిని వాళ్లకు ఇవ్వాలని అనుకున్నాను.” తల్లిదండ్రులకు మంచి ఉద్దేశాలు ఉండవచ్చు, కానీ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్లు ఆలోచించాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం, డబ్బుకు, వస్తుసంపదలకు తక్కువ విలువ ఇచ్చేవాళ్లతో పోలిస్తే, వాటికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్లు తక్కువ సంతోషంగా, తక్కువ సంతృప్తిగా, తక్కువ ఆరోగ్యంగా ఉంటారని తెలిసింది. ఈ విషయంలో పిల్లలు పెద్దవాళ్లు అనే తేడా ఉండదు.

వస్తువులకు ఎక్కువ విలువిచ్చే కుటుంబాల్లో పెరిగిన పిల్లలు నిజానికి తక్కువ సంతోషంగా ఉంటారు

పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొంతమంది తల్లిదండ్రులు, పిల్లల్ని ఎప్పుడూ ఏదో ఒక పనితో బిజీగా ఉంచుతారు, వాళ్లూ బిజీగా ఉంటారు. దానివల్ల పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడాల్సి వస్తుందని పుటింగ్‌ ఫ్యామిలి ఫస్ట్‌ అనే పుస్తకం చెప్తుంది.

‘ఎక్కువ ఉంటే మంచిది’ అనే ఆలోచన

మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వస్తువులను మనం కొనకపోతే ఏదో పోగొట్టుకుంటున్నామని వ్యాపారవేత్తలు మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ది ఎకానమిస్ట్‌ అనే పత్రిక ఇలా చెప్తుంది: “కొనడానికి మార్కెట్‌లో ఉన్న వస్తువులు పెరిగిపోవడంవల్ల” కస్టమర్లు “తమకు సమయం లేదన్నట్టు భావిస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలో ఏమి కొనాలి లేదా ఏమి చూడాలి లేదా ఏమి తినాలి అని తేల్చుకోవడానికి సతమతమౌతూ ఉన్నారు.”

టెక్నాలజీ పెరగడం వల్ల పనిచేసే వాళ్లందరికీ చాలా సమయం మిగులుతుందని 1930వ సంవత్సరంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఊహించి చెప్పాడు. కానీ అతను ఎంత పొరపాటు పడ్డాడు! న్యూ యార్కర్‌ పత్రిక స్టాఫ్‌ రైటర్‌ ఎలిజబెత్‌ కోల్‌బర్ట్‌ ఇలా చెప్పింది: ప్రజలు, “పనిని త్వరగా ముగించుకునే బదులు కొత్త అవసరాలు కల్పించుకుంటున్నారు.” వాటివల్ల వాళ్ల డబ్బు, సమయం ఆవిరైపోతున్నాయి.

ఇతరులను మెప్పించడానికి ప్రయత్నించడం

కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ల ఆఫీసర్లను మెప్పించడానికి ఎక్కువ గంటలు పనిచేస్తారు. కొన్నిసార్లు తోటి ఉద్యోగుల ఒత్తిడి కూడా ఉంటుంది. పక్కనవాళ్లు ఎక్కువసేపు పనిచేస్తున్నప్పుడు మనం చేయకపోతే బాగోదేమో అనే ఒత్తిడికి గురౌతుంటారు. ఆర్థిక పరిస్థితులు మారుతుండడం వల్ల ప్రజలు ఎక్కువ గంటలు పని చేయడానికి లేదా ఏ సమయంలోనైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.

మరో విషయం ఏంటంటే, మిగతా కుటుంబాలు బిజీగా ఉంటున్నాయి కాబట్టి వాళ్లలా ఉండాలనే ఒత్తిడి తల్లిదండ్రులకు ఉండవచ్చు. అలా బిజీగా ఉండకపోతే వాళ్ల పిల్లలకు ఏదో “తక్కువ చేస్తున్నాం” అనే ఆవేదన వాళ్లకు కలుగుతుంది.

హోదా కోసం, సంతృప్తి కోసం కష్టపడడం

“ఒకప్పుడు నేను చేసిన ఉద్యోగం నాకు చాలా ఇష్టం. నాకు చేతనైనంత వరకు కష్టపడేవాడిని. నేనేంటో నిరూపించుకోవాలని అనుకునే వాడిని” అని అమెరికాలో నివసిస్తున్న టిమ్‌ చెప్తున్నాడు.

ఎక్కువ పని చేయడం వల్ల గుర్తింపు ఉంటుందని టిమ్‌లానే చాలామంది అనుకుంటున్నారు. ఫలితం? “బిజీగా ఉండడం సమాజంలో హోదా అయిపోయింది,” అని ముందు మాట్లాడుకున్న ఎలిజబెత్‌ కొల్‌బర్ట్‌ చెప్తుంది. ఆమె ఇంకా ఇలా అంటుంది: “మీరు ఎంత బిజీగా ఉంటే అంత ముఖ్యమైన వాళ్లలా కనిపిస్తారు.”

బ్యాలెన్స్‌ చేసుకోవడం నేర్చుకోండి

శ్రద్ధగా, కష్టపడి పనిచేయాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. (సామెతలు 13:4) కానీ అన్నిటిని బ్యాలెన్స్‌ కూడా చేసుకోవాలి. ప్రసంగి 4:6 ఇలా చెప్తుంది: “రెండు చేతులనిండా కష్టం, గాలికోసం శ్రమించడం కంటే ఒక చేతినిండా శాంతి ఉంటే అది ఎంతో మేలు.”—పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

అన్ని విషయాలను బ్యాలెన్స్‌ చేసుకుని జీవించడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది. కానీ కొన్ని పనులు మానుకోవడం లేదా తగ్గించుకోవడం నిజంగా సాధ్యమౌతుందా? అవుతుంది. నాలుగు సలహాలను పరిశీలించండి:

మీ విలువలు, లక్ష్యాలు ఏమిటో తెలుసుకోండి

ఆర్థిక భద్రత ఉండాలనుకోవడం మంచిదే. కానీ అందుకు ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది? సక్సెస్‌ని దేన్నిబట్టి కొలవవచ్చు? మీకు వచ్చే ఆదాయం లేదా వస్తుసంపదలను బట్టి కొలవవచ్చా? మరోవైపు, విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడం లేదా వినోదానికి ఎక్కువ సమయం వెచ్చించడం కూడా మీ టైం ప్రెషర్‌ను పెంచుతుంది.

ముందు మాట్లాడుకున్న టిమ్‌ ఇలా చెప్తున్నాడు: “నేను, నా భార్య మా జీవన శైలిని సరిగ్గా పరిశీలించుకుని, జీవితాన్ని సింపుల్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితి గురించి, మా కొత్త లక్ష్యాల గురించి ఒక చార్ట్‌ని తయారు చేసుకున్నాం. ఇంతకుముందు మేము తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాల గురించి, మా లక్ష్యాలు చేరుకోవడానికి చేయాల్సిన వాటి గురించి చర్చించుకున్నాం.”

ఎడ్వర్టైస్మెంట్ల ప్రభావానికి లొంగిపోకండి

“నేత్రాశకు” లొంగిపోవద్దని బైబిలు సలహా ఇస్తుంది. (1 యోహాను 2:15-17) ఎడ్వర్టైస్మెంట్లు అలాంటి ఆశని ఇంకా పెంచి, ఎక్కువ గంటలు పనిచేసే పరిస్థితికి దారితీస్తాయి. లేదా ఎక్కువ వినోదంలోనో, ఖరీదైన వినోదంలోనో మునిగిపోయేలా చేస్తాయి. నిజమే, మీరు ఎడ్వర్టైస్మెంట్లు అన్నిటిని తప్పించుకోలేరు. కానీ ఎక్కువ చూడకుండా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మీకు నిజంగా ఏమి అవసరమో కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

మీరు ఎవరితో స్నేహం చేస్తే వాళ్ల ప్రభావమే మీ మీద ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ స్నేహితులు వస్తుసంపదల కోసం ఎక్కువ కష్టపడేవాళ్లు లేదా సక్సెస్‌ను వస్తుసంపదలను బట్టి లెక్కించేవాళ్లు అయితే, అంతకన్నా మంచి లక్ష్యాలు ఉన్నవాళ్లను మీ స్నేహితులుగా చేసుకోవడం తెలివైన పని. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 13:20.

ఎన్ని గంటలు పని చేయాలో నిర్ణయించుకోండి

మీ పనుల గురించి, మీ ప్రాధాన్యతల గురించి మీ యజమానితో మాట్లాడండి. ఉద్యోగమే జీవితం అనుకోకండి, బయట ఉన్న జీవితం గురించి ఆలోచించడానికి వెనకాడకండి. వర్క్‌ టు లివ్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “ఉద్యోగానికి ఇంటికీ మధ్య హద్దులు పెట్టుకున్నవాళ్లు లేదా సెలవులు తీసుకునే వాళ్లు ‘వాళ్లు లేకపోతే పెద్ద నష్టమేమి జరగదు’ అనే విషయాన్ని తెలుసుకున్నారు.”

ముందు చూసిన గ్యారీ, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన తన పని గంటల్ని తగ్గించుకోవాలని అనుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “నా కుటుంబంతో మాట్లాడి ‘మనం మన జీవితాన్ని సింపుల్‌ చేసుకుందాం’ అని చెప్పాను. తర్వాత మెల్లగా అలా చేయడానికి అడుగులు వేశాం. నా బాస్‌ దగ్గరకు కూడా వెళ్లి నేను వారంలో కొన్ని రోజులే పని చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాను. అతను ఒప్పుకున్నాడు.”

కుటుంబానికి సమయం ఇవ్వడం అన్నిటికన్నా ముఖ్యం

భార్యాభర్తలు కలిసి సమయం గడపాలి. తల్లిదండ్రులు పిల్లలకు సమయం ఇవ్వాలి. మిగతా కుటుంబాలు చాలా పనులు పెట్టుకుని ఎప్పుడూ పరుగులు తీస్తున్నారు కదా అని, వాళ్లలా ఉండాలని అనుకోవద్దు. “మీరు ఖాళీగా ఉండడానికి కొంత సమయాన్ని పెట్టుకోవాలి. అంత ముఖ్యం కాని విషయాలను వదిలేయాలి” అని గ్యారీ చెప్తున్నాడు.

కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు టీవీ, సెల్‌ఫోన్లు లేదా వేరే పరికరాల వల్ల ఒకరికొకరు దూరం అవ్వకుండా చూసుకోండి. రోజులో ఒక్కసారి అయినా అందరూ కలిసి భోజనం చేయండి. భోజనం చేసే సమయాలను కుటుంబంగా మాట్లాడుకోవడానికి ఉపయోగించుకోండి. తల్లిదండ్రులు ఈ చిన్న సలహాని పాటిస్తే వాళ్ల పిల్లలు చక్కగా ఉంటారు, స్కూల్లో మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు.

కుటుంబంగా మాట్లాడుకోవడానికి భోజనం చేసే సమయాన్ని ఉపయోగించండి

చివరిగా, ‘జీవితంలో నాకు ఏమి కావాలి? నా కుటుంబానికి ఏమి కావాలి?’ అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకుంటే మీకు ఏ విషయాలు ముఖ్యమైనవో బైబిల్లో ఉన్న జ్ఞానానికి అనుగుణంగా నిర్ణయించుకోండి.