కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి పేరు ఉంటే నమ్మకం, గౌరవం ఉంటాయి

గొప్ప ఆస్తి కన్నా మంచి పేరు మేలు

గొప్ప ఆస్తి కన్నా మంచి పేరు మేలు

మంచి పేరు, లేదా గౌరవం ఎంతో విలువైనవి. చాలా దేశాల్లో చట్టపరంగా వాటికి రక్షణ ఉంటుంది. ప్రచురణలు లేదా ప్రసార మాధ్యమాల ద్వారా, మాటల ద్వారా పేరును పాడు చేయకుండా చట్టం రక్షణ కల్పిస్తుంది. ఇది ఒక ప్రాచీన సామెతను గుర్తు చేస్తుంది: “గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.” (సామెతలు 22:1) మనం ఇతరుల దగ్గర మంచి పేరును, గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటాం? అద్భుతమైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.

ఉదాహరణకు బైబిల్లో 15వ కీర్తనలో ఏముందో చూడండి. ‘[దేవుని] గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?’ అనే ప్రశ్నకు జవాబు ఇలా ఉంది: “నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు . . . అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు . . . లంచము పుచ్చుకొనడు.” (కీర్తన 15:1-5) ఇలాంటి మంచి సూత్రాల ప్రకారం జీవించే ఎవరినైనా మీరు గౌరవించరా?

గౌరవాన్ని సంపాదించి పెట్టే మరో లక్షణం వినయం. “ఘనతకు ముందు వినయముండును” అని సామెతలు 15:33⁠లో ఉంది. ఎందుకంటే వినయం ఉన్నవాళ్లు ఎక్కడ తప్పు చేస్తున్నారో చూసుకుని దానిని సరిదిద్దుకోవడానికి బాగా ప్రయత్నిస్తారు. ఎవరినైనా బాధపెడితే క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉంటారు. (యాకోబు 3:2) పొగరుబోతులు అలా ఉండకపోగా వాళ్లే ముందు నొచ్చుకుంటారు. “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అని సామెతలు 16:18⁠లో ఉంది.

ఒకవేళ ఎవరైనా మీకున్న మంచి పేరును పాడు చేయడానికి అబద్ధాలు చెప్తే? మీరు తొందరపడి కోపంతో స్పందించాలా? ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను నా పేరును కాపాడుకోవాలనే ప్రయత్నంలో నేనే ఆ అబద్ధాన్ని అందరికీ తెలిసిపోయేలా చేస్తున్నానా?’ కొన్నిసార్లు చట్టపరంగా చర్యలు తీసుకోవడం మంచిదే, కానీ బైబిలు ఈ సలహా ఇస్తుంది: “న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు . . . మీ మధ్యనే నిర్ణయం కావాలి.” (సామెతలు 25:8, 9; పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) a ఇలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం వల్ల కోర్టు కేసులకు అయ్యే ఖర్చును మీరు తగ్గించుకోవచ్చు.

బైబిలు మత సంబంధమైన పుస్తకం మాత్రమే కాదు. జీవితంలో కావాల్సిన నమ్మదగిన నిర్దేశాలు ఇచ్చే పుస్తకం కూడా. అందులో ఉన్న జ్ఞానాన్ని పాటించే వాళ్లంతా ఎంతో గౌరవాన్ని, మంచి పేరును తెచ్చిపెట్టే లక్షణాలు పెంచుకుంటారు.

a గొడవల్ని పరిష్కరించుకునే విషయంలో అదనపు బైబిలు సూత్రాలు మత్తయి 5:23, 24; 18:15-17 లో ఉన్నాయి.