కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హోమోసెక్సువల్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

హోమోసెక్సువల్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఎన్నో దేశాల్లో “గే” పెళ్లిళ్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే 2015న అమెరికా సుప్రీం కోర్టు “గే” పెళ్లిళ్లకు చట్టబద్ధంగా గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత ఈ విషయం గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. చాలామంది “గే పెళ్లిళ్ల గురించి బైబిలు ఏం చేప్తుంది?” అనే ప్రశ్న కూడా అడిగారు.

మగవాళ్లు మగవాళ్లను, ఆడవాళ్లు ఆడవాళ్లను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్లకు ఉండే చట్టపరమైన హక్కుల గురించి బైబిల్లో లేదు. కానీ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే: హోమోసెక్సువాలిటీ లేదా స్వలింగ సంపర్కం గురించి బైబిల్లో ఏముంది?

బైబిల్ని పూర్తిగా చూడకుండానే మాకు జవాబు తెలుసు అని చాలామంది అనుకుంటారు. అయితే, వాళ్ల జవాబులు రకరకాలుగా ఉంటాయి. బైబిలు హోమోసెక్సువాలిటీకి పూర్తి విరుద్ధం అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది, “నీ పొరుగువాని ప్రేమింపవలెను” అనే ఆజ్ఞ బైబిల్లో ఉంది కాబట్టి ఎవర్నైనా, అంటే లైంగికంగా ఎలా జీవించే వాళ్లనైనా ప్రేమించాలి అని చెప్తారు.—రోమీయులు 13:9.

బైబిలు ఏం చెప్తుంది?

ఈ కింది వాటిల్లో ఏది నిజమని మీకనిపిస్తుంది?

  1. హోమోసెక్సువాలిటీని బైబిలు ఖండిస్తుంది.

  2. హోమోసెక్సువాలిటీని బైబిలు అనుమతిస్తుంది.

  3. హోమోసెక్సువల్స్‌ని లేదా గేస్‌ని ద్వేషించాలని బైబిలు చెప్తుంది.

జవాబులు:

  1. నిజం. ‘పురుషసంయోగులు . . . దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు,’ అని బైబిల్లో ఉంది. (1 కొరింథీయులు 6:9, 10) స్త్రీలకు కూడా అదే నియమం ఉంది.—రోమీయులు 1:26.

  2. అబద్ధం. భార్యాభర్తల మధ్య మాత్రమే లైంగిక సంబంధాలు ఉండాలని బైబిలు నేర్పిస్తుంది.—ఆదికాండము 1:27, 28; సామెతలు 5:18, 19.

  3. అబద్ధం. బైబిలు హోమోసెక్సువాలిటీ తప్పని చెప్తుంది కానీ అలాంటివాళ్లను ద్వేషించడాన్ని, చులకనగా చూడడాన్ని, ఏ విధంగానైనా అవమానించి, హింసించడాన్ని అస్సలు ఒప్పుకోదు.రోమీయులు 12:18. [1]

యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు?

మన జీవితానికి ఉపయోగపడే నియమాల్లో బైబిలులో ఉన్న నీతినియమాలే సరైనవని యెహోవాసాక్షులు నమ్ముతారు. వాటి ప్రకారమే జీవించాలని నిర్ణయించుకున్నారు. (యెషయా 48:17) [2] అందుకే యెహోవాసాక్షులు అన్ని రకాల లైంగిక పాపాలకు, హోమోసెక్సువాలిటీకి కూడా దూరంగా ఉంటారు. (1 కొరింథీయులు 6:18) [3] ఇలా జీవించాలని యెహోవాసాక్షులు నిర్ణయించుకున్నారు, వాళ్లకు ఆ హక్కు ఉంది.

ఇతరులు వాళ్లతో ఎలా ఉండాలని కోరుకుంటారో వాళ్లు కూడా అలానే ఉండాలనే బంగారు సూత్రాన్ని పాటించడానికి యెహోవాసాక్షులు ప్రయత్నిస్తారు

అదే సమయంలో యెహోవాసాక్షులు “అందరితో సమాధానమును . . . కలిగి యుండుటకు ప్రయత్నించుడి” అనే మాటలు పాటించడానికి ప్రయత్నిస్తారు. (హెబ్రీయులు 12:14) హోమోసెక్సువాలిటీ నుండి దూరంగా ఉన్నా, యెహోవాసాక్షులు వాళ్ల అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దరు, హోమోసెక్సువల్స్‌ని ద్వేషించరు, హింసించరు, హింసించేవాళ్లను చూసి సంతోషించరు. ఇతరులు వాళ్లతో ఎలా ఉండాలని కోరుకుంటారో వాళ్లు కూడా వేరేవాళ్లతో అలానే ఉండాలనే బంగారు సూత్రాన్ని పాటించడానికి యెహోవాసాక్షులు ప్రయత్నిస్తారు.—మత్తయి 7:12.

గేస్‌ని చులకనగా చూడమని బైబిలు చెప్తుందా?

హోమోసెక్సువల్స్‌ని చులకనగా చూడడాన్ని బైబిలు ప్రోత్సహిస్తుందని, బైబిల్ని పాటించేవాళ్లు హోమోసెక్సువల్స్‌ పట్ల చాలా కఠినంగా ఉంటారని కొంతమంది చెప్తారు. ‘బైబిలు రాసిన సమయంలో జీవించిన ప్రజలకు విశాల భావాలు తక్కువ. మేము ఈ కాలంలో అన్నీ జాతుల, దేశాల, లైంగిక ఇష్టాయిష్టాలున్న వాళ్లందర్నీ దగ్గరికి తీసుకుంటాం,’ అని కూడా వాళ్లు అంటారు. హోమోసెక్సువల్స్‌ని ద్వేషించడం జాతి వివక్షతో సమానం అని వాళ్ల అభిప్రాయం. కానీ, ఈ రెండు విషయాలను పోల్చడం సరైనదేనా? కాదు. ఎందుకు కాదు?

ఎందుకంటే హోమోసెక్సువల్‌ ప్రవర్తనను ద్వేషించడానికి అలా చేసే మనుషులను ద్వేషించడానికి తేడా ఉంది. క్రైస్తవులు అన్ని రకాల ప్రజలను గౌరవించాలని బైబిలు చెప్తుంది. (1 పేతురు 2:17) [4] కానీ దానర్థం, క్రైస్తవులు అన్ని రకాల ప్రవర్తనను అంగీకరించాలని కాదు.

ఈ విషయం గురించి ఆలోచించండి: సిగరెట్‌ కాల్చడం మంచిది కాదని మీ అభిప్రాయం. అది మీకు అసహ్యం కూడా. అయితే, మీతోపాటు పనిచేసే ఒకతను సిగరెట్‌ కాలుస్తాడు అనుకుందాం. మీ అభిప్రాయం ఆయనలా లేదు కాబట్టి మీకు విశాల భావాలు లేవని ఎవరైనా అంటారా? ఆయన సిగరెట్‌ కాలుస్తాడు, మీరు కాల్చరు. అంతమాత్రాన మీరు ఆయనను ద్వేషిస్తున్నట్లా? సిగరెట్‌ కాల్చడం గురించి మీ అభిప్రాయం మార్చుకోవాలని అతను మీమీద ఒత్తిడి తీసుకువస్తే, విశాలంగా ఆలోచించకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నది అతను కాదా?

యెహోవాసాక్షులు బైబిల్లో ఉన్న నీతినియమాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నారు. బైబిలులో చేయవద్దు అని చెప్పిన పనులను వాళ్లు అంగీకరించరు. కానీ, యెహోవాసాక్షులు ఇతరుల అలవాట్లను బట్టి ఎవర్నీ ఎగతాళి చేయరు, హింసించరు.

బైబిలు చెప్పేది కఠినంగా, క్రూరంగా ఉందా?

హోమోసెక్సువల్‌ కోరికలు ఉన్నవాళ్ల విషయం ఏంటి? వాళ్లు పుట్టడమే అలా పుట్టారా? అప్పుడు సహజంగా ఉండే కోరికల్ని బట్టి ప్రవర్తించేవాళ్లను తప్పుపట్టడం క్రూరత్వమే కదా?

హోమోసెక్సువల్స్‌ శరీరతత్వం గురించి బైబిలు మాట్లాడడం లేదు. కానీ, మనుషుల్లో సహజంగా కొన్ని లక్షణాలు లోతుగా నాటుకుని ఉంటాయని మాత్రం బైబిల్లో ఉంది. అయినప్పటికి, కొన్ని విధాల ప్రవర్తన నుండి దూరంగా ఉంటేనే దేవున్ని ఆరాధించగలమని బైబిలు చెప్తుంది. అందులో హోమోసెక్సువల్‌ ప్రవర్తన కూడా ఉంది.—2 కొరింథీయులు 10:4, 5.

కొంతమంది బైబిలు చెప్పేది చాలా కఠినంగా, క్రూరంగా ఉందని అంటారు. మనకు శరీరంలో ఎలా అనిపిస్తే అలా చేసేయాలనే అభిప్రాయాన్ని బట్టి వాళ్లు అలా అంటున్నారు. లైంగిక కోరికలు చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని ఆపుకోకూడదు, అసలు ఆపుకోలేము అని కూడా అంటారు. కానీ, మనుషులు వాళ్ల కోరికలను ఆపుకోవచ్చని చెప్తూ బైబిలు మనుషులను ఎంతో గౌరవిస్తుంది. జంతువుల్లా కాకుండా, వాళ్ల కోరికలను బట్టి ప్రవర్తించాలా వద్దా అని సొంతగా నిర్ణయించుకునే శక్తి మనుషులకు ఉంది.—కొలొస్సయులు 3:5. [5]

ఈ విషయం గురించి ఆలోచించండి: కోపం లాంటి లక్షణాలకు కారణం శరీరతత్వం కావచ్చని కొంతమంది నిపుణులు చెప్తారు. బైబిలు కోపంగా ఉండేవాళ్ల శరీరతత్వం గురించి మాట్లాడడం లేదు. కానీ, కొంతమంది సహజంగానే కోపచిత్తులుగా, కోపిష్ఠులుగా ఉంటారని ఒప్పుకుంటుంది. (సామెతలు 22:24; 29:22) అయినప్పటికీ “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము,” అని కూడా బైబిలు చెప్తుంది.—కీర్తన 37:8; ఎఫెసీయులు 4:31.

ఈ సలహా కఠినంగా ఉందని లేదా అసాధ్యమని ఎవరూ అనరు. కోపం ఒకరి శరీరతత్వమని, తల్లిదండ్రులనుండి వచ్చి లోతుగా నాటుకుపోయే ఒక లక్షణమని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. కానీ నిజానికి వాళ్లే, కోపపడే వాళ్ల కోపం తగ్గించడానికి చాలా కష్టపడతారు.

యెహోవాసాక్షులు కూడా బైబిలు నీతినియమాలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి ప్రవర్తన విషయంలోనైనా అలానే ఆలోచిస్తారు. స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోకుండా లైంగిక సంబంధాల పెట్టుకునే విషయంలో కూడా అలానే ఆలోచిస్తారు. ఇలాంటి పరిస్థితులన్నిటి గురించి బైబిలు ఈ ఉపదేశం ఇస్తుంది: “మీలో ప్రతివాడును . . . పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది” తెలుసుకుని ఉండాలి.—1 థెస్సలొనీకయులు 4:4, 5.

“మీలో కొందరు అట్టివారై యుంటిరి”

దాదాపు 2000 సంవత్సరాల క్రితం రకరకాల నేపథ్యాలు, జీవనవిధానాలు నుండి వచ్చినవాళ్లు క్రైస్తవులుగా మారాలి అనుకున్నారు. వాళ్లలో కొందరు జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఆడంగితనముగలవారు, పురుషసంయోగులు అని బైబిలు చెప్తుంది. వాళ్లు, వాళ్ల జీవితాల్లో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారు. అందుకే వాళ్ల గురించి “మీలో కొందరు అట్టివారై యుంటిరి,” అని బైబిల్లో ఉంది.—1 కొరింథీయులు 6:9-11.

“మీలో కొందరు అట్టివారై యుంటిరి” అంటే, హోమోసెక్సువల్‌ క్రియలు మానేసినవాళ్లకు మళ్లీ ఎప్పుడూ అలాంటి కోరికలు రావని అర్థమా? కానేకాదు, ఎందుకంటే బైబిలు ఇలా కూడా అంటుంది: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.”—గలతీయులు 5:16.

క్రైస్తవులకు చెడు కోరికలు అస్సలు రావని బైబిలు చెప్పడం లేదు కానీ, ఆ కోరికలను నెరవేర్చరు అంటే చేయకూడదని నిర్ణయించుకుంటారని చెప్తుంది. క్రైస్తవులు ఆ కోరికల గురించే ఆలోచిస్తూ చివరకు వాటి ప్రకారం ప్రవర్తించే వరకు తెచ్చుకోరు, బదులుగా వాటిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటారు.—యాకోబు 1:14, 15. [6]

అలా కోరికలకు, ప్రవర్తనకు మధ్య ఉన్న తేడాను బైబిలు చూపిస్తుంది. (రోమీయులు 7:16-25) కోపం, వ్యభిచారం, అత్యాశ లాంటి చెడు విషయాల గురించి ఆలోచించకుండా వాటిని తగ్గించుకున్నట్లే, హోమోసెక్సువల్‌ కోరికలు ఉన్నవాళ్లు అలాంటి కోరికల గురించి ఆలోచించకుండా వాటిని తగ్గించుకోవచ్చు.—1 కొరింథీయులు 9:27; 2 పేతురు 2:14, 15.

బైబిలులో ఉన్న నీతినియమాలను యెహోవాసాక్షులు సమర్థిస్తారు కానీ వాళ్ల అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దరు. మానవ హక్కులను గౌరవిస్తారు. ఎవరైనా వాళ్లలా జీవించకపోయినా అలాంటివాళ్ల హక్కులను మార్చడానికి ప్రయత్నించరు. యెహోవాసాక్షులు చెప్పే సందేశం సంతోషాన్ని తెస్తుంది. వినాలనుకున్న వాళ్లందరికీ యెహోవాసాక్షులు ఆ సందేశాన్ని చెప్తారు.—అపొస్తలుల కార్యములు 20:20. ◼ (g16-E No. 4)

^ 1. రోమీయులు 12:18: “సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”

^ 2. యెషయా 48:17: “యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.”

^ 3. 1 కొరింథీయులు 6:18: “జారత్వమునకు దూరముగా పారిపోవుడి.”

^ 4. 1 పేతురు 2:17: “అందరిని సన్మానించుడి.”

^ 5. కొలొస్సయులు 3:5: “కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను . . . చంపి వేయుడి.”

^ 6. యాకోబు 1:14, 15: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును . . . కనును.”