కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?

1. ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి

1. ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి

జీవితంలో అన్నీ వెంటనే మార్చేసుకోవాలని అనిపించవచ్చు. ‘ఈ వారంలో నేను పొగ త్రాగడం మానేస్తాను, శాపనార్థాలు, బూతులు, తిట్లు మానేస్తాను, రాత్రులు ఆలస్యంగా పడుకోను, ఎక్సర్‌సైజ్‌ మొదలుపెడతాను, మంచి ఆహారం తీసుకుంటాను, మా తాతవాళ్లకు ఫోన్‌ చేసి మాట్లాడతాను’ అని మీకు మీరు అనుకోవచ్చు. కానీ అన్నీ ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా ఒక్కటి కూడా చేయలేరు!

మంచి సలహా: “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.”సామెతలు 11:2.

వినయం లేదా అణకువ ఉంటే మనం నిజాన్ని చూస్తాము. మన సమయానికి, శక్తికి, వస్తువులకి కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తిస్తాము. కాబట్టే ప్రతీదీ ఒకేసారి మార్చేసుకోవాలి అని ప్రయత్నించే బదులు మెల్లమెల్లగా మార్చుకుంటాము.

అన్నీ అలవాట్లు ఒకేసారి మార్చుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక్కటి కూడా మార్చుకోలేరు!

ఇలా చేయండి

  1. రెండు పెద్ద లిస్ట్‌లు తయారు చేసుకోండి: ఒక లిస్ట్‌లో మీరు పెంచుకోవాలని అనుకుంటున్న మంచి అలవాట్ల గురించి, ఇంకో లిస్ట్‌లో మీరు వదులుకోవాలనుకుంటున్న చెడ్డ అలవాట్ల గురించి రాయండి. ఒకటి రెండు రాసి సరిపెట్టుకోకండి, మీకు అనిపించినవన్నీ రాయండి.

  2. మీరు రాసుకున్న వాటిలో ముఖ్యమైన వాటిని ముందు పెట్టండి.

  3. ప్రతి లిస్ట్‌ నుండి ఒకటి రెండు అలవాట్లు తీసుకోండి, వాటి మీద పని చేయండి. తర్వాత లిస్ట్‌లో ఉన్న మరో రెండు అలవాట్లపై పని చేయడం మొదలు పెట్టండి.

దేనికైనా పరిమితులు ఉంటాయి కాబట్టి ఒకటి, రెండు అలవాట్ల మీదే పని చేయండి. ఈ సలహాలు మీకు పనికొస్తాయేమో చూడండి:

చెడు అలవాటుకు ఇచ్చే సమయాన్ని మంచి అలవాటుకు ఇవ్వండి. అప్పుడు రెండు పనులు ఒకేసారి జరిగిపోతాయి, త్వరగా మీ లిస్టును పూర్తి చేయగలరు. ఉదాహరణకు, మీరు రాసుకున్న చెడ్డ అలవాట్లలో విపరీతంగా టి.వి. చూడడం, మంచి అలవాట్లలో మీ బంధువులు, స్నేహితుల బాగోగులు తెలుసుకోవడం ఉంటే మీరు ఇలా నిర్ణయించుకోవచ్చు: ‘నేను ప్రతిరోజు పని నుండి ఇంటికి రాగానే టి.వి. చూసే బదులు, నా బంధువుతోగానీ, స్నేహితునితోగాని మాట్లాడతాను.’ (g16-E No. 4)