కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టెక్నాలజీ మీ వివాహజీవితాన్ని ఎలా పాడుచేయగలదు?

టెక్నాలజీ మీ వివాహజీవితాన్ని ఎలా పాడుచేయగలదు?

టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే భార్యాభర్తల మధ్య ఉండే బంధం బలపడుతుంది. ఉదాహరణకు టెక్నాలజీ వల్ల భార్యాభర్తలు రోజులో ఎప్పుడైనా, ఎక్కడున్నా మాట్లాడుకోవచ్చు. దానివల్ల వాళ్లు ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు.

కానీ కొంతమంది భార్యాభర్తలు టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం లేదు. దానివల్ల . . .

  • వాళ్లిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపలేకపోతుంటారు.

  • అవసరం లేకపోయినా ఇంట్లో ఆఫీసు పనులు చేస్తుంటారు.

  • ఏదో దాస్తున్నారని ఒకరి మీద ఒకరు అనుమానం పెంచుకుంటూ నమ్మకద్రోహం కూడా చేస్తారు.

మీరు మనసులో ఉంచుకోవాల్సినవి . . .

కలిసి సమయం గడపడం

మైఖల్‌ అనే ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు, “కొన్నిసార్లు నేను, నా భార్య కలసి సమయం గడుపుతున్నప్పుడు ఆమె నా పక్కనే ఉన్నా లేనట్లే అనిపిస్తుంది. ఎప్పుడూ తన ఫోన్‌ చూసుకుంటూ ఉంటుంది. దాని గురించి అడిగితే, ‘నేను ఇప్పుడే ఫోన్‌ తీసుకున్నాను’ అని అంటోంది.” జానాతన్‌ అనే ఒక వ్యక్తి కూడా ఇలా అంటున్నాడు, “కొన్నిసార్లు భార్యాభర్తలు పక్కపక్కనే ఉన్నా ఇద్దరూ వేర్వేరు ప్రపంచాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది.”

ఇలా ఆలోచించండి: ఫోన్‌లు, మెసేజ్‌లు, వేరే నోటిఫికేషన్‌ల వల్ల మీరు మీ భర్తతో కానీ, భార్యతో కానీ మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్ని మధ్యలో ఎన్నిసార్లు ఆపేయాల్సి వచ్చింది?—ఎఫెసీయులు 5:33.

ఆఫీసు పనులు

వాళ్ల ఉద్యోగాన్ని బట్టి కొంతమంది 24 గంటల్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని చేయడానికి రెడీగా ఉండాలి. ఇంకొంతమందికి అలాంటి ఉద్యోగాలు ఉండకపోవచ్చు, అయినాసరే వాళ్లు ఆఫీసు పనుల్ని ఇంటికి తెచ్చుకుంటారు. లీ అనే ఒకతను ఇలా అంటున్నాడు “నేను నా భార్యతో కలిసి సమయం గడుపుతున్నప్పుడు ఆఫీసు నుండి ఏదైనా ఫోన్‌ లేదా మెసేజ్‌ వస్తే దాన్ని చూడకుండా ఉండడం నాకు కష్టంగా ఉంటుంది.” జాయ్‌ అనే ఒకామె ఇలా చెప్తుంది “నేను ఇంట్లో నుండే పని చేస్తాను. కాబట్టి ఆఫీసు పనులను ఎంతసేపు చేయాలో, ఎప్పుడు ఆపేయాలో నిర్ణయించుకోవడం అంత సులువేమీ కాదు.”

ఇలా ఆలోచించండి: మీ భర్త గానీ, భార్య గానీ మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటున్నారా?—లూకా 8:18.

నమ్మకంగా ఉండడం

ఒక సర్వే ప్రకారం దాదాపు 10 శాతం మంది తమ భర్తకు లేదా భార్యకు తెలియకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడానికి సోషల్‌ మీడియా కూడా ఒక కారణమని ఆ సర్వే చెప్తుంది.

సోషల్‌ మీడియా వల్ల పెళ్లైనవాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దాని ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా చాలా సులువైపోయింది. ఎక్కువమంది విడాకులు తీసుకోవడానికి ఇదొక ముఖ్యమైన కారణమని లాయర్‌లు చెప్తున్నారు.

ఇలా ఆలోచించండి: మీ భార్యకు లేదా భర్తకు తెలియకుండా మీరు సోషల్‌ మీడియాలో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా?—సామెతలు 4:23.

మీరు ఏం చేయవచ్చు?

ముఖ్యమైన వాటికి మొదటిస్థానం ఇవ్వండి

మంచి ఆహారం తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదే విధంగా మీ భార్యతో లేదా భర్తతో ఎక్కువ సమయం గడపకపోతే వివాహ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి.—ఎఫెసీయులు 5:28, 29.

మంచి సలహా: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలి.’—ఫిలిప్పీయులు 1:10.

టెక్నాలజీ వల్ల మీ వివాహ జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సలహాల్లో ఏం పాటించాలనుకుంటున్నారో ఇద్దరు కలిసి మాట్లాడుకోండి లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారో రాసుకోండి.

  • రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబమంతా కలిసి భోజనం చేయాలి

  • ఫోన్‌లు, ట్యాబ్‌లు ఫలానా సమయంలో ఉపయోగించకూడదని నిర్ణయించుకోవాలి

  • ఇద్దరం కలిసి సరదాగా సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలి

  • రాత్రిపూట ఫోన్‌లు, ట్యాబ్‌లు ఆఫ్‌ చేసి, పడుకునే దగ్గర పెట్టుకోకుండా ఉండాలి

  • ప్రతీరోజు ఇద్దరం కనీసం 15 నిమిషాలు మాట్లాడుకునేలా సమయం కేటాయించాలి. ఆ సమయంలో ఫోన్‌లకు దూరంగా ఉండాలి

  • రోజూ ఫలానా సమయానికి ఇంటర్నెట్‌ ఉపయోగించడం ఆపేయాలి