కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎప్పుడూ కలిసి ఉండాలని నిశ్చయించుకోవడం ఒక లంగరు లాంటిది. అది తుఫాను లాంటి సమస్యల్లో కూడా వివాహాన్ని బలంగా ఉంచుతుంది

 భార్యాభర్తలకు

1: వివాహానికి కట్టుబడి ఉండడం

1: వివాహానికి కట్టుబడి ఉండడం

అంటే ఏంటి?

ఎప్పుడూ కలిసి ఉండాలని నిశ్చయించుకున్న భార్యాభర్తలు, వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని శాశ్వత బంధంగా చూస్తారు. దానివల్ల వాళ్లలో భద్రంగా ఉన్నామనే నమ్మకం ఉంటుంది. సమస్యల్లో కూడా నా భర్త లేదా నా భార్య మా బంధాన్ని గౌరవిస్తారు అనే నమ్మకం భార్యాభర్తలిద్దరికీ ఉంటుంది.

కొంతమంది భార్యాభర్తలు సమాజం నుండి వచ్చే ఒత్తిడి వల్ల, లేదా ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్ల కలిసి ఉండక తప్పదని అనుకుంటారు. కానీ ఇలాంటి కట్టుబాట్ల వల్ల కాకుండా ఒకరిమీద ఒకరికున్న ప్రేమ, గౌరవాన్ని బట్టి కలిసి ఉండే భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది.

మంచి సూత్రాలు: “భర్త తన భార్యను వదిలేయకూడదు.”—1 కొరింథీయులు 7:11.

“మీ వివాహానికి కట్టుబడి ఉంటే మీరు త్వరగా నొచ్చుకోరు. మీరు త్వరగా క్షమిస్తారు, త్వరగా క్షమాపణ అడుగుతారు. మీరు సమస్యల్ని అడ్డంకులుగా మాత్రమే చూస్తారు. సమస్యలు వస్తే తెగతెంపులు చేసుకోవాలని లేదా విడాకులు తీసుకోవాలని అనుకోరు.”—మైకా.

ఎందుకు ముఖ్యం?

సమస్యలు వచ్చినప్పుడు కలిసి ఉండాలనే నిశ్చయత లేని భార్యాభర్తలు ‘మేము ఒకరికొకరం సరిపోము’ అని తొందరపడి అనుకుని, వివాహం నుండి బయటపడడానికి మార్గాలు వెతుకుతారు.

“చాలామంది పెళ్లి చేసుకునే ముందే, సమస్యలు వస్తే విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందిలే అనే విధంగా ఆలోచిస్తారు. అలా విడాకులు తీసుకునే అవకాశాల గురించి ఆలోచిస్తూ పెళ్లి చేసుకునేవాళ్లకు మొదటి నుండే జీవితాంతం కలిసి ఉండాలనే కోరిక లేదనే చెప్పాలి.”—జీన్‌.

మీరు ఏమి చేయవచ్చు

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

మీ ఇద్దరు గొడవపడుతున్నప్పుడు . . .

  • ఇతన్ని లేదా ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని మీరు బాధపడతారా?

  • వేరేవాళ్లతో కలిసి ఉన్నట్లుగా కలలుకంటూ ఉంటారా?

  • “నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోతాను” లేదా “నన్ను అర్థం చేసుకునే వాళ్లను చూసుకుంటాను” అనే మాటలు అంటారా?

వీటిలో ఏ ప్రశ్నకైనా మీ జవాబు అవును అయితే, జీవితాంతం కలిసి ఉండాలనే మీ నిశ్చయాన్ని పెంచుకోవడానికి ఇదే సరైన సమయం.

మీ భర్తతో లేదా భార్యతో ఇలా మాట్లాడి చూడండి

  • మన ఇద్దరిలో జీవితాంతం కలిసి ఉండాలనే కోరిక తగ్గిపోయిందా? అలా ఎందుకు జరిగింది?

  • జీవితాంతం కలిసి ఉండాలని మనం ఒకరికొకరం చేసుకున్న ఒప్పందాన్ని బలపర్చుకోవడానికి మనం ఇప్పుడు ఏమి చేయవచ్చు?

ఇలా చేయండి

  • అప్పుడప్పుడు మీ భర్తకు లేదా భార్యకు చిన్న లవ్‌ లెటర్‌ రాయండి

  • మీ భార్యకు లేదా భర్తకు మీరు కట్టుబడి ఉన్నారని చూపించడానికి వాళ్ల ఫోటోను మీ టేబుల్‌ మీద పెట్టుకోండి

  • ఏదైనా పని వల్ల లేదా ఉద్యోగం వల్ల మీ ఇద్దరు పక్కపక్కన లేనప్పుడు ఫోన్‌ చేసి మాట్లాడుకోండి

మంచి సూత్రాలు: “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.”—మత్తయి 19:6.