తెలుగు
కుటుంబ విజయం—కష్టపడి పనిచేసే లక్షణం
https://cms-imgp.jw-cdn.org/img/p/102018055/univ/art/102018055_univ_sqr_xl.jpg
g18 No. 2 పేజీ 14

కష్టపడి పనిచేయడం నేర్చుకుంటే అది ఎక్సర్‌సైజ్‌లా మీకు ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ప్రయోజనాలు ఇస్తుంది

ఎదుగుతున్న పిల్లలకు

11: కష్టపడి పనిచేసే లక్షణం

11: కష్టపడి పనిచేసే లక్షణం

అంటే ఏంటి?

కష్టపడే లక్షణం ఉన్నవాళ్లు పని చేయడానికి వెనకాడరు. బదులుగా, వాళ్ల సొంత అవసరాలు తీర్చుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి సంతోషంగా కష్టపడతారు. వాళ్లు చేసే పని ఇతరులు గమనించేంత పెద్దది కాకపోయినా వాళ్లు ఆ పనిని సంతోషంగా చేస్తారు.

ఎందుకు ముఖ్యం?

మనకు ఇష్టమున్నా లేకపోయినా జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి. నేడున్న ప్రపంచంలో కష్టపడి పనిచేయడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ల మధ్య కష్టపడి పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.—ప్రసంగి 3:13.

“కష్టపడి పనిచేసినప్పుడు కాస్త గర్వంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. నిజానికి లోలోపల కలిగే ఆ సంతృప్తి వల్ల నేను ఇష్టంగా పనిచేయడం నేర్చుకున్నాను. కష్టపడి పనిచేసే లక్షణం ఉంటే మీరు మంచి పేరు కూడా సంపాదించుకోగలుగుతారు.”—రెయాన్‌.

మంచి సూత్రాలు: “ఏ కష్టము చేసినను లాభమే కలుగును.”—సామెతలు 14:23.

మీరు ఏమి చేయవచ్చు

కింద చెప్పిన విషయాల్ని పాటించడం ద్వారా పనిచేసే విషయంలో అనుకూల దృక్పథాన్ని వృద్ధి చేసుకోండి.

పనులు చక్కగా చేయడం నేర్చుకుని గర్వపడండి. మీరు ఇంటి పనులు చేస్తున్నా, మీ హోంవర్క్‌ చేస్తున్నా, లేదా ఉద్యోగం చేస్తున్నా మీరు చేస్తున్న దానిలో పూర్తిగా లీనమైపోండి. మీరు ఒక పనిని చక్కగా చేయడం నేర్చుకున్నాక, దానిలో మెరుగుపడడానికి చూడండి. అంటే త్వరగా చేసేలా లేదా ఇంకా బాగా చేసేలా నేర్చుకోండి. మీరు మీ పనిని ఎంత బాగా చేస్తే, అంత ఎక్కువ ఎంజాయ్‌ చేస్తారు.

మంచి సూత్రాలు: “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.”—సామెతలు 22:29.

మీ చుట్టూ ఉన్నవాటిని కూడా చూడండి. దాదాపు ప్రతిసారి మీరు మీ బాధ్యతల్ని చక్కగా చేస్తుంటే, మీ వల్ల ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, ఇంటిపనుల్లో మీరు కష్టపడి పనిచేస్తే, మీరు మీ ఇంట్లోవాళ్లపై ఉన్న భారాన్ని తగ్గిస్తారు.

మంచి సూత్రాలు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.

అడిగినదానికన్నా ఎక్కువ చేయండి. మిమ్మల్ని అడిగినంత వరకే చేసే బదులు, ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని బలవంత పెడుతున్నారని మీరు ఎక్కువ చేయడం లేదు కాని, మీరు చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు.—మత్తయి 5:41.

మంచి సూత్రాలు: “నువ్వు చేసే మేలు బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా చేసేదై ఉండాలని నా ఉద్దేశం.”—ఫిలేమోను 14.

అన్నిటిలో నిలకడగా ఉండండి. కష్టపడి పనిచేసేవాళ్లు బద్దకంగా ఉండరు, అలాగని పని రాక్షసులుగా ఉండరు. అన్నిటికీ సమయం ఇవ్వాలి, కష్టపడి పనిచేస్తూ ఆనందించాలి, మధ్యమధ్యలో రెస్ట్‌ కూడా తీసుకోవాలి.

మంచి సూత్రాలు: “శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మది కలిగియుండుట మేలు.”—ప్రసంగి 4:6.