కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం కోసం | యువత

అమ్మను గాని నాన్నను గాని పోగొట్టుకున్నప్పుడు

అమ్మను గాని నాన్నను గాని పోగొట్టుకున్నప్పుడు

సవాళ్లు

డామీకి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల నాన్న రక్తనాళంలో వాపు వల్ల చనిపోయారు. డెరిక్‌కు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల నాన్న గుండె జబ్బుతో చనిపోయారు. జీనీకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల అమ్మ అండాశయ క్యాన్సర్‌తో సంవత్సరం పాటు పోరాడి చనిపోయింది. a

ఈ ముగ్గురు చిన్న వయసులోనే ప్రియమైన వాళ్లను పోగొట్టుకున్నారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఆ బాధను తట్టుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. b ముందు, దుఃఖపడడం గురించి కొన్ని విషయాలను పరిశీలించండి.

మీరు తెలుసుకోవాల్సినవి

ఎన్నో విధాలుగా దుఃఖించవచ్చు. మీరు దుఃఖించే విధానానికి ఇతరులు దుఃఖించే విధానానికి తేడా ఉండవచ్చు. “మరణం వల్ల కలిగే బాధను తట్టుకోవడానికి ఒక సులువైన పద్ధతి లేదా కొన్ని నియమాలు అంటూ ఉండవు,” అని హెల్పింగ్‌ టీన్స్‌ కోప్‌ విత్‌ డెత్‌ పుస్తకం చెప్తుంది. కాని ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ దుఃఖాన్ని అనవసరంగా లోపలే అణచుకోకూడదు. ఎందుకు? ఎందుకంటే . . .

దుఃఖాన్ని అణచుకోవడం చాలా ప్రమాదం. మొదట్లో చెప్పిన జీనీ ఇలా అంటుంది: “నేను నా చెల్లి కోసమైనా ధైర్యంగా ఉండాలి అనుకున్నాను, అందుకే నా భావోద్వేగాలను బయటకు కనబడనివ్వలేదు. ఇప్పటికీ బాధ కలిగించే విషయాలని బయటకు కనబడనివ్వను, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు.”

నిపుణులు దీన్ని ఒప్పుకుంటారు. “బాధ లేదు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు. బలవంతంగా అణచిపెట్టిన భావాలు బయటకు రాకుండా ఎప్పటికీ ఆపలేరు,” అని ద గ్రీవింగ్‌ టీన్‌ పుస్తకం చెప్తుంది. “అణచిపెట్టిన భావాలను అనుకోని సమయంలో ఒక్కసారిగా బయటకు వెళ్లగ్రక్కుతారు లేదా అవి అనారోగ్య రూపంలో బయటకు వస్తాయి.” దుఃఖాన్ని అణచుకుంటే, ఆ నొప్పిని భరించడానికి మద్యానికి లేదా డ్రగ్స్‌కి బానిసలు అయ్యే అవకాశం కూడా ఉంది.

దుఃఖంలో కలిగే భావోద్వేగాలు అయోమయం కలిగిస్తాయి. ఉదాహరణకు చనిపోయిన వాళ్లు తమను “వదిలిపెట్టి వెళ్లిపోయారు” అనుకుని కొంతమంది వాళ్ల మీద కోపం పెట్టుకుంటారు. ఇంకొంతమంది దేవుడు తమ ప్రియమైన వాళ్లను చనిపోకుండా ఆపలేదని అనుకుంటూ ఆయన్ని నిందిస్తారు. చాలామంది చనిపోయిన వాళ్ల విషయంలో పొరపాటున చేసిన పనులను, అన్న మాటలను తిరిగి సరి చేసుకోలేరు కాబట్టి అపరాధ భావాలతో బాధపడతారు.

దుఃఖపడడం చిన్న విషయం కాదు, ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. దుఃఖం నుండి ఎలా బయటపడి ముందుకు సాగవచ్చు?

ఏమి చేయవచ్చు

ఎవరితోనైనా మాట్లాడండి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఒక్కరే ఉండాలని మీకు అనిపించవచ్చు. కాని మీకు ఎలా అనిపిస్తుందో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి లేదా మీ స్నేహితునికి అన్ని విషయాలు చెప్పండి. అప్పుడు మీరు విషాదంలో మునిగిపోకుండా బయట పడేందుకు వాళ్లు సహాయం చేస్తారు.—మంచి సలహా: సామెతలు 18:24.

డైరీ పెట్టుకోండి. చనిపోయిన అమ్మ గురించి లేదా నాన్న గురించి రాసుకోండి. ఉదాహరణకు, వాళ్ల గురించి మీరు ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకునే విషయం ఏంటి? అతనిలో లేదా ఆమెలో మెచ్చుకోదగిన లక్షణాలను రాసుకోండి. అందులో వేటిని మీ జీవితంలో అనుకరించాలని అనుకుంటున్నారు?

మీరు ప్రతికూల భావాలతో నలిగిపోతూ ఉండవచ్చు. అంటే మీ అమ్మ లేదా నాన్న చనిపోకముందు వాళ్లకు బాధ కలిగించేలా మీరు మాట్లాడిన విషయాలను మర్చిపోలేకపోవచ్చు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో, ఎందుకు అలా అనిపిస్తుందో రాసుకోండి. ఉదాహరణకు, “మా నాన్న చనిపోయే ముందురోజు ఆయనతో గొడవపడినందుకు నాకు చాలా బాధగా ఉంటుంది.”

మీరు అపరాధ భావాలతో నలిగిపోవడం ఎంత వరకు సరైనదో ఆలోచించుకోండి. “క్షమాపణ అడిగే అవకాశం మీకు ఇంకెప్పటికీ దొరకదని ముందే తెలుసుకోలేక పోయినందుకు మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు” అని ద గ్రీవింగ్‌ టీన్‌ పుస్తకం చెప్తుంది. “ఇతరులను నొప్పించే పనులను గానీ మాటలు గానీ ఎప్పుడు చేయకూడదు అని అనలేం, అది జరగని పని.” —మంచి సలహా: యోబు 10:1.

మీ గురించి మీరు ఆలోచించుకోండి. సరిపడేంత నిద్ర, విశ్రాంతి, మంచి వ్యాయామం ఉండాలి. మంచి పోషకాలు తీసుకోవాలి. మీకు తినాలని అనిపించకపోతే, మూడుసార్లు భోజనం చేసే బదులు ఆరోగ్యకరమైన అల్పాహారం రోజులో కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినండి. మళ్లీ మామూలుగా ఆకలి వేసేంత వరకు అలా చేయండి. బయట దొరికే చిరుతిళ్లు లేదా మద్యం తాగి మీ బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించకండి. అలాచేస్తే పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారవుతాయి.

ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడండి. బైబిలు ఇలా చెప్తుంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.” (కీర్తన 55:22) ప్రార్థన కేవలం బాధ నుండి బయట పడడానికి చేసేది కాదు. ప్రార్థన అంటే దేవునితో నిజంగా మాట్లాడడం. ఆయన “మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.”—2 కొరింథీయులు 1:3, 4.

దుఃఖపడే వాళ్లను దేవుడు ఓదార్చే ఒక మార్గం, ఆయన వాక్యమైన బైబిలు. కాబట్టి చనిపోయినవాళ్ల పరిస్థితి గురించి, వాళ్లు తిరిగి బ్రతుకుతారనే నిరీక్షణ గురించి బైబిలు ఏమి నేర్పిస్తుందో పరిశీలించి చూడండి. cమంచి సలహా: కీర్తన 94:19.

a తర్వాత ఆర్టికల్‌లో కూడా డామీ, డెరిక్‌, జీనీలకు జరిగిన దాని గురించి చదవవచ్చు.

b ఈ ఆర్టికల్‌ తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ల గురించి ఉన్నా, ఇందులో విషయాలు అక్కాచెల్లెళ్లను, అన్నదమ్ములను, స్నేహితులను పోగొట్టుకున్న వాళ్లకు కూడా ఉపయోగపడతాయి.

c కావలికోట No. 3, “ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు . . . ” అనే శీర్షికతో మొదలైన ఆర్టికల్స్‌లో 3-8 పేజీల్లో సమాచారాన్ని చూడండి. www.jw.org/te వెబ్‌సైట్‌ నుండి ఈ సమాచారాన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రచురణలు అనే విభాగంలో చూడండి.