కుటుంబం కోసం | తల్లిదండ్రులు
ఎదిగే వయసులో వచ్చే మార్పులు గురించి పిల్లలతో మాట్లాడండి
సమస్య
నిన్నటివరకు మీ చిన్న బిడ్డని ఎత్తుకున్నట్లే ఉంది. కానీ అంతలోనే టీనేజ్‌లో అడుగుపెట్టబోయే పిల్లలు మీ ముందున్నారు. వాళ్లు ఇంకా చిన్న పిల్లలే, కానీ త్వరలో పెద్దవాళ్లు అవుతారు. ఇప్పుడు puberty లేదా ఎదిగే వయసులోకి అడుగుపెట్టబోతున్నారు.
ఎదుగుతున్న మీ అబ్బాయికి లేదా అమ్మాయికి శరీరంలో వచ్చే మార్పుల వల్ల గందరగోళంగా, కొన్నిసార్లు భయంగా, కంగారుగా కూడా ఉంటుంది. అప్పుడు మీరెలా సహాయం చేస్తారు?
మీరు తెలుసుకోవాల్సినవి
ఒక్కొక్కరికి ఒక్కో వయసులో శరీరంలో మార్పులు వస్తాయి. కొంతమంది పిల్లల్లో 8వ సంవత్సరంలోనే శరీరంలో మార్పులు మొదలౌతాయి, ఇంకొంతమందికి 15, 16 సంవత్సరాలు వచ్చాక మార్పులు కనిపిస్తాయి. “ఎదిగే వయసు మొదలయ్యే నిడివి చాలా ఎక్కువ,” అని Letting Go With Love and Confidence అనే పుస్తకం చెబుతుంది.
ఎదిగే వయసులో వచ్చే భయాలు. ఇతరులు వాళ్ల గురించి ఏమనుకుంటారో అని ఈ వయసువాళ్లు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. “నేను చూడ్డానికి ఎలా ఉంటాను, ఎలా ప్రవర్తిస్తాను లాంటి విషయాల గురించి బాగా పట్టించుకోవడం మొదలుపెట్టాను” అని జారడ్ a అనే యువకుడు చెప్తున్నాడు. “నలుగురిలో ఉన్నప్పుడు అందరూ నన్ను వింతగా చూస్తున్నట్లు అనుకునేవాణ్ణి.” ఉన్నకాస్త ఆత్మవిశ్వాసం మొటిమల వల్ల తగ్గిపోతుంది. “నా ముఖం మీద దాడి జరుగుతున్నట్లు అనిపించింది!” అని కెల్లి అనే 17 సంవత్సరాల అమ్మాయి చెప్తుంది. “నేను అందంగా లేను అనుకుని బాగా ఏడ్చేదాన్ని.”
ఎదిగే వయసు త్వరగా రావడం వల్ల వచ్చే సమస్యలు. ఈ సమస్య ముఖ్యంగా అమ్మాయిలకు వస్తుంది. ఈ వయసులో వాళ్ల శరీరం, ఛాతి ఒంపులు తిరగడం మొదలవుతుంది కాబట్టి వాళ్లను ఏడిపించే అవకాశం ఉంది. “వాళ్లకన్నా పెద్ద వయసు అబ్బాయిలకు ఈ విషయాలు కాస్త తెలుస్తుంటాయి కాబట్టి వాళ్ల దృష్టి ఎదిగే అమ్మాయిలపై పడుతుంది,” అని A Parent’s Guide to the Teen Years పుస్తకం చెప్తుంది.
శరీరంలో మార్పులు పరిణతికి గుర్తుకాదు. “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అని సామెతలు 22:15 చెబుతుంది. ఎదిగే వయసు రావడంతో, ఆ మూఢత్వము దానంతట అది పోదు. పిల్లలు శారీరకంగా ఎదిగినట్లు కనిపిస్తుంటారు కానీ, “వాళ్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని, బాధ్యతగా ప్రవర్తిస్తారని, హద్దులు దాటరని, అన్నిటిలో పరిణతి చూపిస్తారని అనుకోవడానికి లేదు” అని You and Your Adolescent అనే పుస్తకం చెప్తుంది.
ఏమి చేయవచ్చు
శరీరంలో మార్పులు మొదలవ్వకముందే వాటిగురించి చెప్పండి. ఆడపిల్లలకు మెచ్యూర్ (పుష్పవతి) అవడం గురించి, అబ్బాయిలకు రాత్రులు అయ్యే స్రావం గురించి అమ్మానాన్నలుగా మీరు ముందే చెప్పాలి. ఈ మార్పులు ఒక్కసారిగా మొదలౌతాయి, కానీ కొన్ని మార్పులు నెమ్మదిగా కనిపిస్తాయి. ఒక్కసారిగా జరిగే మార్పుల వల్ల మీ పిల్లలు కంగారు పడతారు లేదా భయపడతారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లల్లో ధైర్యాన్ని పెంచండి. పెద్దవాళ్లుగా ఎదిగే ముందు ఈ యుక్తవయసు ముఖ్యమైన దశ అని చెప్పండి.—మంచి సలహా: కీర్తన 139:14.
వివరంగా చెప్పండి. “మా అమ్మానాన్న నాకు ఈ విషయాల గురించి మొహమాటపడి అర్థమయ్యేలా చెప్పలేదు. ఇంకాస్త సూటిగా, స్పష్టంగా చెప్తే బాగుండేది అనిపించింది” అని జాన్ అనే యువకుడు చెప్తున్నాడు. 17 సంవత్సరాలు ఉన్న అనూషకు కూడా ఇలాగే అనిపించింది: “శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో మా అమ్మ నాకు వివరించింది, కానీ ఆ సమయంలో మానసికంగా వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో కూడా చెప్పుంటే బాగుండేది.” పాఠం? ఎంత ఇబ్బందిగా ఉన్నా, మీ పిల్లలకు యుక్తవయసుకు సంబంధించిన అన్నీ విషయాల గురించి వివరంగా చెప్పండి.—మంచి సలహా: అపొస్తలుల కార్యములు 20:20.
ప్రశ్నలు అడుగుతూ పిల్లల్ని మాట్లాడించండి. మీ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి యుక్తవయసుకు చేరుకున్న తోటివాళ్ల గురించి అడుగుతూ మాట్లాడడం మొదలుపెట్టండి. ఉదాహరణకు, మీ కూతుర్ని ఇలా అడగండి, “మీ క్లాసులో ఎవరికైనా పీరియడ్స్ మొదలైనట్లు చెప్పారా?” “మీలో త్వరగా మెచ్యూర్ అయిన అమ్మాయిలను ఎవరైనా ఏడిపిస్తున్నారా?” మీ బాబుని ఇలా అడగవచ్చు, “యుక్తవయసులో రావాల్సిన మార్పులు ఇంకా రాని పిల్లల్ని స్కూల్లో ఏడిపిస్తున్నారా?” వేరే పిల్లలకు ఎదురయ్యే సమస్యల గురించి మీ పిల్లలు మాట్లాడడం మొదలుపెడితే, వాళ్ల సొంత భావాలను, వాళ్ల సమస్యలు గురించి కూడా స్వేచ్ఛగా మీతో చెప్తారు. వాళ్లు చెప్తున్నప్పుడు, బైబిల్లో ఉన్న ఈ సలహాను గుర్తుపెట్టుకోండి: “వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై . . . యుండవలెను.”—యాకోబు 1:19.
మీ టీనేజ్ పిల్లలు “లెస్సయైన జ్ఞానమును వివేచనను” పెంచుకునేలా సహాయం చేయండి. (సామెతలు 3:21) యుక్తవయసులో శారీరక, మానసిక మార్పులు జరుగుతాయి, వాటితోపాటు పిల్లలు ఈ వయసులో దేన్నైనా సరిగ్గా ఆలోచించడం నేర్చుకుంటారు. దానివల్ల పెద్దవాళ్లు అయ్యాక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ వయసులోనే మీ పిల్లలకు మంచి విలువలు ఖచ్చితంగా నేర్పించండి.—మంచి సలహా: హెబ్రీయులు 5:14.
మాట్లాడడం ఆపేయవద్దు. చాలామంది పిల్లలు శరీరంలో వచ్చే మార్పులు గురించి తల్లిదండ్రులతో మాట్లాడడం ఇష్టం లేదన్నట్లు ఉంటారు, కానీ అది నిజం కాదు. “ఈ విషయాలు చెప్తున్నప్పుడు పిల్లలు అస్సలు ఇష్టం లేనట్లు, బోర్ కొట్టినట్లు, విసుక్కున్నట్లు, అస్సలు విననట్లు ఉంటారు కానీ వాళ్లు మీరు చెప్పిన ప్రతీ మాట గుర్తుపెట్టుకుంటారు,” అని You and Your Adolescent అనే పుస్తకం చెప్తుంది.
a ఈ ఆర్టికల్లో కొన్ని అసలు పేర్లు కావు.