కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం

సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం

సంతోషాన్ని, విజయాన్ని ఆస్తిపాస్తులను బట్టి కొలిచినట్లు మీరు ఎన్నిసార్లు విన్నారు? ఆ అభిప్రాయంతో కోట్లమంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంతో సమయం, ఎన్నో గంటలు అలసిపోయేలా పని చేస్తారు. కానీ డబ్బు, ఆస్తులు చిరకాలం ఉండే సంతోషాన్ని తెస్తాయా? రుజువులు ఏమి చూపిస్తున్నాయి?

జర్నల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ స్టడీస్‌ ప్రకారం మన అవసరాలు తీరిపోయాక, మిగిలే ఆదాయం మన సంతోషాన్ని లేదా మన క్షేమాన్ని ఎక్కువ చేయలేదు. అయినా డబ్బు అసలు సమస్య కాదు. ఎందుకంటే “దాని [డబ్బు] కోసం ఎక్కువ కష్టపడడానికీ, అసంతోషానికీ సంబంధం ఉంది” అని మోనిటర్‌ ఆన్‌ సైకాలజీ అనే పత్రిక చెప్తుంది. ఈ మాటలు బైబిల్లో రెండువేల సంవత్సరాల క్రితం రాసిన మాటలకు దగ్గరగా ఉన్నాయి: ధనాపేక్ష అన్నిరకాల కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి . . . నానాబాధలతో వాళ్లను వాళ్లే పొడుచుకున్నారు. (1 తిమోతి 6:9, 10) ఆ నానాబాధలు ఏమై ఉండవచ్చు?

ఆస్తిని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఆందోళన, నిద్రపట్టకపోవడం. “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.”—ప్రసంగి 5:12.

అనుకున్న సంతోషం రాకపోతే కలిగే నిరాశ. కొంతవరకు ఆ నిరాశ ఎందుకంటే డబ్బు మీదున్న ఆశకు తృప్తి ఉండదు. “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు; ఇదియు వ్యర్థమే.” (ప్రసంగి 5:10) ఆస్తులు కోసం ప్రాకులాడేవాళ్లు సంతోషాన్ని తీసుకోచ్చే ముఖ్యమైన విషయాలను త్యాగం చేయాల్సివస్తుంది. అంటే కుటుంబంతో, స్నేహితులతో లేదా ఆధ్యాత్మికంగా గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది.

పెట్టుబడులు పోయినా లేదా లాభం రాకపోయినా కలిగే దుఃఖం, చిరాకు. “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.”—సామెతలు 23:4, 5.

సంతోషాన్ని తీసుకొచ్చే లక్షణాలు

సంతృప్తి. “మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం. కాబట్టి ఆహారం, బట్టలు ఉంటే చాలు; వాటితోనే తృప్తిపడదాం.” (1 తిమోతి 6:7, 8) సంతృప్తిగా ఉన్నవాళ్లు ఫిర్యాదులు చేసేవాళ్లుగా లేదా సణిగే వాళ్లుగా తయారు అవ్వరు. ఆ మంచి స్వభావం వల్ల వాళ్లలో కుళ్లు కూడా ఉండదు. ఇంకా వాళ్ల కోరికలు వాళ్ల ఆదాయానికి మించి ఉండవు కాబట్టి వాళ్లకు అనవసరమైన ఆందోళన, ఒత్తిడి ఉండవు.

దానం లేదా సహాయం చేసే లక్షణం. “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొస్తలుల కార్యాలు 20:35) ఉదార స్వభావం ఉన్నవాళ్లు ఇతరులను సంతోషపెట్టడం కోసం వాళ్లకున్న సమయంలో, శక్తిలో కొంతే ఇవ్వగలిగినా సంతోషంగా ఉంటారు. వాళ్లు ఎంత డబ్బు పెట్టినా కొనలేని ప్రేమను, గౌరవాన్ని, తిరిగి ఉదారంగా ఇచ్చే నిజమైన స్నేహితులను విస్తారంగా సంపాదించుకుంటారు.—లూకా 6:38.

వస్తువులకన్నా మనుషులకు ఎక్కువ విలువను ఇస్తారు. “పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.” (సామెతలు 15:17) దీని అర్థం ఏంటి? ఆస్తిపాస్తుల కన్నా ఇతరులతో మంచి సంబంధాలు ఎంతో విలువైనవి. ఇంకా సంతోషానికి ప్రేమ చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మనం తర్వాత చూస్తాము.

దక్షిణ అమెరికాలో ఉంటున్న సబీనా అనే ఆమె బైబిలు సలహాల విలువను నేర్చుకుంది. ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు కాబట్టి తనకోసం తన ఇద్దరి కూతుర్ల అవసరాల కోసం ఆమె ఎంతో కష్టపడేది. ఆమె రోజుకు రెండు ఉద్యోగాలు చేసేది. ఉదయం 4:00 గంటలకు లేచేది. సమయం లేనంతగా ఆమె కష్టపడుతున్నా, సబీనా బైబిలు గురించి నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఫలితం?

ఆమె ఆర్థిక పరిస్థితి అలానే ఉంది. కానీ జీవితం గురించి ఆమె అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఉదాహరణకు ఆమె ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవడం వల్ల వచ్చే సంతోషాన్ని పొందింది. (మత్తయి 5:3) నిజమైన స్నేహితుల్ని తోటి ఆరాధకుల మధ్య పొందింది. ఆమె నేర్చుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం ద్వారా కలిగే సంతోషాన్ని పొందింది.

వచ్చే ఫలితాలను బట్టే తెలివి బయటపడుతుంది అని బైబిలు చెప్తుంది. (మత్తయి 11:19) ఆ విధంగా ఆలోచిస్తే సంతృప్తి, ఉదారస్వభావం, వస్తువుల కన్నా మనుషులకు ఎక్కువ విలువ ఇవ్వడం ఖచ్చితంగా తెలివైన పనులే.