కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం

క్షమించండి

క్షమించండి

“నా చిన్నతనంలో చాలా అవమానాన్ని, హేళనను చూశాను,” అని పెట్రిసియా చెప్తుంది. “నేను క్షమించడాన్ని నేర్చుకోలేదు. నేను పెద్దదాన్ని అయ్యాక కూడా ఎవరైనా బాధ పెడితే చాలా రోజులు దాని గురించే ఆలోచిస్తూ రాత్రులు నిద్ర పోయేదాన్ని కాదు.” అవును కోపం, క్రోధం నిండిన జీవితంలో సంతోషం గానీ ఆరోగ్యం గానీ ఉండవు. క్షమించని వాళ్ల గురించి కొన్ని అధ్యయనాలు ఏమి చెప్తున్నాయంటే:

 • కోపం సంబంధాలను పాడుచేసి, అందరికీ దూరం చేసి ఒంటరివాళ్లు అయ్యేలా చేస్తుంది

 • త్వరగా నొచ్చుకునేలా, కంగారు పడేలా లేదా తీవ్రంగా కృంగిపోయేలా చేస్తుంది

 • తప్పు గురించే ఆలోచించేలా చేస్తూ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది

 • వాళ్లు ఆధ్యాత్మిక విలువలను పాటించడం లేదని అనుకునేలా చేస్తుంది

 • ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల వ్యాధులు, తలనొప్పి లాంటి సమస్యలు ఎక్కువగా రావడం వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి a

క్షమించడం అంటే ఏంటి? క్షమించడం అంటే తప్పు చేసిన వాళ్లను క్షమించి, కోపాన్ని, క్రోధాన్ని, కక్షను తీసేసుకోవడం. అంతేగానీ తప్పును చూసీచూడనట్లు ఊరుకోవడం, తీవ్రతను తగ్గించడం లేదా అసలు ఏమి జరగలేదు అనేలా ఉండడం కాదు. క్షమించడం అనేది బాగా ఆలోచించి సొంతగా తీసుకునే నిర్ణయం. ఎదుటి వ్యక్తి మీద ప్రేమతో వాళ్లతో శాంతిని, మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోవాలనే బలమైన ఉద్దేశం.

క్షమించడంలో అర్థం చేసుకోవడం కూడా ఉంది. క్షమించేవాళ్లు మనందరం మాటల్లోనూ పనుల్లోనూ తప్పులు చేస్తామని అర్థం చేసుకుంటారు. (రోమీయులు 3:23) ఇలాంటి మాటలనే బైబిలు కూడా చెప్తుంది: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరులు మిమ్మల్ని నొప్పించినా సరే అలా చేయండి.”—కొలొస్సయులు 3:13.

అందుకే క్షమాపణ ప్రేమలో ఒక భాగం అని చెప్పవచ్చు. ఆ ప్రేమ “పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది.” (కొలొస్సయులు 3:14) మెయో క్లినిక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, క్షమించడం వల్ల . . .

 • మంచి సంబంధాలతోపాటు సహానుభూతిని, అర్థం చేసుకునే గుణాన్ని, తప్పు చేసిన వాళ్లమీద దయను పెంచుకుంటాము

 • మానసికంగా, ఆధ్యాత్మికంగా బాగుంటాం

 • కంగారు, ఒత్తిడి తగ్గుతాయి, శత్రుత్వం పెంచుకోము

 • డిప్రెషన్‌ లక్షణాలు తక్కువగా ఉంటాయి

మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. మనల్ని మనం క్షమించుకోవడం “చాలా చాలా కష్టం,” కానీ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి “క్షమించుకోవడం చాలాచాలా ముఖ్యం” అని డిసెబిలిటి & రీహేబిలిటేషన్‌ జర్నల్‌ చెప్తుంది. మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

 • మీరు అన్నీ కరెక్ట్‌గా చేయాలని అనుకోకండి, కానీ అందరిలాగే మీరు కూడా పొరపాట్లు చేస్తారని నిజాయితీగా ఒప్పుకోండి.—ప్రసంగి 7:20

 • మీరు చేసిన పొరపాట్ల నుండి నేర్చుకోండి, అప్పుడు ఇంకోసారి ఆ పొరపాట్లు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి

 • మీ విషయంలో మీరు ఓపిక చూపించుకోండి, మన మనస్తత్వంలో ఉండే కొన్ని తప్పులు, చెడు అలవాట్లు ఒక్క రాత్రిలోనే పోవు.—ఎఫెసీయులు 4:23, 24

 • మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్లతో, మీతో సానుకూలంగా, దయగా ఉండేవాళ్లతో స్నేహం చేయండి, కానీ వాళ్లు మీతో నిజాయితీగా ఉండేవాళ్లై కూడా ఉండాలి.—సామెతలు 13:20

 • మీరు ఎవరినైనా బాధపెడితే దాన్ని ఒప్పుకుని, త్వరగా క్షమాపణ అడగండి. మీరు సమాధాన పడితే, మీకు ప్రశాంతంగా ఉంటుంది.—మత్తయి 5:23, 24

బైబిలు సలహాలు నిజంగా ఉపయోగపడతాయి!

మొదట్లో మాట్లాడుకున్న పెట్రిసియా బైబిలు స్టడీ తీసుకున్నాక క్షమించడం నేర్చుకుంది. “నా జీవితంలో విషాన్ని నింపిన కోపం నుండి స్వేచ్ఛను పొందినట్లు నాకు అనిపించింది, ఇప్పుడు నేను బాధ పడడం లేదు, ఇతరులను బాధ పెట్టడం లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మనకు శ్రేష్ఠమైనది ఇవ్వాలని కోరుకుంటున్నాడని బైబిలు సలహాలు నాకు నేర్పించాయి” అని ఆమె రాసింది.

రాన్‌ అనే అతను ఇలా చెప్పాడు: “ఇతరుల ఆలోచనలను, పనులను నేను కంట్రోల్‌ చేయలేను. కానీ నావి కంట్రోల్‌ చేసుకోగలను. నాకు ప్రశాంతత కావాలంటే, నా కోపాన్ని వదిలి పెట్టాలి. నేను శాంతిని-కోపాన్ని ఉత్తరం-దక్షిణంలా వేర్వేరు దిక్కులుగా చూడడం మొదలు పెట్టాను. ఒకే సమయంలో నేను రెండు చోట్ల ఉండలేను కదా. నాకు ఇప్పుడు మంచి మనస్సాక్షి ఉంది.”

a మూలం: మెయో క్లినిక్‌, జాన్స్‌ హోప్‌కిన్స్‌ మెడిసిన్‌ వెబ్‌సైట్స్‌, సోషల్‌ సైక్యాట్రీ అండ్‌ సైక్యాట్రిక్‌ ఎపిడిమియోలజి జర్నల్‌.