కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎందుకు కష్టాలు పడుతున్నాం? ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం?

ఎందుకు కష్టాలు పడుతున్నాం? ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం?

మనందరం దేవుని పిల్లలం. అందుకే, మనం కష్టాలు పడడం ఆయనకు ఇష్టంలేదు. మరి, మనకు ఇన్ని కష్టాలు, బాధలు ఎందుకు ఉన్నాయి?

మొదటి స్త్రీ, పురుషుడు చేసిన పని వల్ల మనం కష్టాలు పడుతున్నాం

“ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి . . . కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”—రోమీయులు 5:12.

దేవుడు భూమ్మీద సృష్టించిన మొట్టమొదటి మనుషులు పరిపూర్ణులు. అంటే వాళ్లకు ఎలాంటి లోపం గానీ, బలహీనతలు గానీ లేవు. వాళ్ల పేర్లు ఆదాము, హవ్వ. దేవుడు వాళ్లకు చాలా తెలివినిచ్చి, ఎలాంటి జబ్బులు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా సృష్టించాడు. వాళ్లు ఉండడానికి ఒక అందమైన తోట కూడా ఇచ్చాడు. ఆ తోట పేరు ఏదెను. అందులో ఉన్న ఏ చెట్టు పండ్లనైనా తినొచ్చు గానీ, ఒక్క చెట్టు పండ్లను మాత్రం తినొద్దని దేవుడు వాళ్లకు చెప్పాడు. కానీ ఆదాముహవ్వలు దేవుని మాట పట్టించుకోకుండా ఆ చెట్టు పండును తినడం ద్వారా పాపం చేశారు. (ఆదికాండం 2:15-17; 3:1-19) తన మాట వినలేదు కాబట్టి దేవుడు వాళ్లను ఏదెను తోట నుండి బయటికి పంపేశాడు. ఆ క్షణం నుండి వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. కాలం గడుస్తుండగా ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టారు. వాళ్లు కూడా కష్టాలు పడుతూ జీవించారు. చివరికి అందరూ ముసలివాళ్లు అయ్యి చనిపోయారు. (ఆదికాండం 3:23; 5:5) మనందరం ఆదాముహవ్వల నుండి వచ్చిన వాళ్లమే కాబట్టి, మనం కూడా జబ్బులు పడుతున్నాం, ముసలివాళ్లు అవుతున్నాం, ఏదోక రోజు చనిపోతున్నాం.

చెడ్డ దూతల వల్ల కూడా కొన్ని కష్టాలు పడుతున్నాం

“లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.”—1 యోహాను 5:19.

కొన్ని వేల సంవత్సరాల క్రితం, పరలోకంలో ఉండే ఒక దేవదూత దేవుని మాట వినకుండా, ఆయన మీద తిరుగుబాటు చేశాడు. ఆ ‘దుష్టుణ్ణి’ లేదా చెడ్డదూతను సాతాను అని పిలుస్తారు. (యోహాను 8:44; ప్రకటన 12:9) కొంతకాలానికి, ఇంకొంతమంది దూతలు కూడా సాతానుతో చేతులు కలిపి దేవునికి దూరమయ్యారు. ఈ చెడ్డదూతలు తమ శక్తి ఉపయోగించి మనుషుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, వాళ్లను సృష్టికర్తకు దూరం చేస్తున్నారు; చాలామంది చేత చెడ్డ పనులు కూడా చేయిస్తున్నారు. (కీర్తన 106:35-38; 1 తిమోతి 4:1) ఈ సాతాను, చెడ్డదూతలు మనుషుల్ని కష్టపెడుతూ, వాళ్ల బాధను చూసి సంతోషిస్తున్నారు.

కొన్నిసార్లు కష్టాలను మనమే కొని తెచ్చుకుంటాం

“మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు.” —గలతీయులు 6:7.

నిజమే, కొన్ని కష్టాలను ఆదాముహవ్వలు చేసిన పాపం వల్ల, సాతాను-అతని చెడ్డదూతలు వల్ల అనుభవిస్తున్నాం. అయితే కొన్నిసార్లు మాత్రం, మనమే స్వయంగా కష్టాలను కొని తెచ్చుకుంటాం. ఎలా? మనం చెడ్డ పనులు చేసినప్పుడు, తెలివితక్కువ నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నాం. అదే గనుక, మనం మంచిపనులు చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తాం. ఉదాహరణకు, భార్యాపిల్లలు ఉన్న ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటూ, కష్టపడి పనిచేస్తూ, కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటే అతనూ సంతోషంగా ఉంటాడు, అతని కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ అతను జూదానికి, తాగుడుకు బానిసై, ఏ పనీ చేయకుండా సోమరిలా ఉంటే, అతని కుటుంబం పేదరికంలో కూరుకుపోతుంది, వాళ్ల సంతోషం ఆవిరైపోతుంది. మనం సంతోషంగా ఉండాలని, “అపారమైన శాంతి” అనుభవించాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితం బాగుండాలంటే ఆయనిచ్చే సలహాలు పాటించాలి.—కీర్తన 119:165.

మనం జీవిస్తుంది “చివరి రోజుల్లో” కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నాం

‘చివరి రోజుల్లో ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు.’—2 తిమోతి 3:1-5.

ఈ లోకానికి “చివరి రోజుల్లో” మనుషులు ఎలా తయారౌతారో పవిత్ర గ్రంథం చాలాకాలం క్రితమే చెప్పింది. యుద్ధాలు జరుగుతాయని, ఆహారకొరతలు, పెద్దపెద్ద భూకంపాలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయని కూడా ఆ గ్రంథం చెప్పింది. (మత్తయి 24:3, 7, 8; లూకా 21:10, 11) ఇప్పుడు లోకంలో ఎటు చూసినా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వీటన్నిటి వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు, లెక్కలేనంతమంది చనిపోతున్నారు.