కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి విశ్వాసాన్ని అనుసరించండి | దావీదు

”యుద్ధము యెహోవాదే”

”యుద్ధము యెహోవాదే”

దావీదు ముందుకు వెళ్తున్నాడు. అతన్ని నెడుతూ సైనికులు వెనక్కి పరుగులు తీస్తున్నారు. యుద్ధ భూమి నుండి పరుగులు తీస్తున్నప్పుడు వాళ్ల కళ్లల్లో భయం ఉంది. వాళ్లెందుకు అంత భయపడుతున్నారు. దావీదుకు వాళ్లు భయంతో అంటున్న ఒక మాట మళ్లీమళ్లీ వినబడుతుంది. అది ఒకతని పేరు. అతను భీకరంగా ఆ లోయలో వాళ్లకు ఎదురుగా నిలబడి ఉన్నాడు. అంత పెద్ద మనిషిని దావీదు బహుశా ఎప్పుడూ చూసి ఉండడు.

అతనే గొల్యాతు! సైనికులు ఎందుకు అంత భయపడుతున్నారో దావీదుకు అర్థమైంది. గొల్యాతు చాలా పెద్దగా కొండలా ఉన్నాడు. ఆయన వేసుకున్న పెద్ద కవచం తీసేసినా అతను ఇద్దరు మనుషుల బరువు ఉంటాడు. ఆయన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాడు, బాగా అనుభవం ఉన్న యుద్ధశూరుడు. ఆయన అరుస్తూ రెచ్చగొడుతున్నాడు. ఇశ్రాయేలు రాజైన సౌలుని, అతని సైన్యాన్ని వెక్కిరిస్తూ గొల్యాతు అన్న మాటలు, ఆ కొండల్లో ప్రతిధ్వనించడం ఊహించుకోండి. ఒక్క దెబ్బతో ఆ యుద్ధాన్ని తేల్చేయాలని, తనతో పోరాడడానికి ఎవరినైనా ముందుకు రమ్మని గొల్యాతు సవాలు చేస్తున్నాడు.—1 సమూయేలు 17:4-10.

ఇశ్రాయేలీయులు వణికిపోతున్నారు. రాజైన సౌలు కూడా భయపడిపోతున్నాడు. దాదాపు నెల నుండి పరిస్థితి ఇలానే ఉందని దావీదు తెలుసుకున్నాడు. ఫిలిష్తీయుల, ఇశ్రాయేలీయుల రెండు సైన్యాలు, ఎటూ కదలకుండా ఆగిపోయాయి. ఎన్నో రోజులుగా గొల్యాతు ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. దావీదుకు చాలా బాధేసింది. ఇశ్రాయేలు రాజు, అతని సైనికులు, దావీదు ముగ్గురు అన్నలు భయంతో వెనక్కి తగ్గడం ఎంత అవమానం. దావీదు దృష్టిలో ఈ అన్యుడైన గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాన్ని అవమానించడమే కాదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అవమానిస్తున్నాడు. అయినా ఈ చిన్న కుర్రాడు దావీదు, ఈ విషయంలో ఏమి చేయగలడు? దావీదుకున్న విశ్వాసం నుండి నేడు మనం ఏమి నేర్చుకోవచ్చు?—1 సమూయేలు 17:11-14.

నేను కోరుకొన్నవాడు ఇతనే, ఇతనిని అభిషేకించుము

మనం ఇప్పుడు కొన్ని నెలలు వెనక్కి వెళ్దాం. సాయంత్రం కావొస్తుంది. ఎక్కడో బేత్లెహేము పర్వత ప్రాంతంలో దావీదు తన తండ్రి గొర్రెల్ని కాస్తున్నాడు. అతను అందమైన కుర్రవాడు, ఎర్రగా ఉంటాడు, 19 సంవత్సరాల లోపే ఉంటాడు. అతని కళ్లు చాలా అందంగా ఉన్నాయి. ఆ కళ్లల్లో చురుకుదనం కనిపిస్తుంది. ప్రశాంత వేళల్లో ఆయన సంగీతం వాయిస్తూ సమయం గడిపేవాడు. దేవుని సృష్టిలో అందాన్ని చూస్తూ ఎన్నో గంటలు తన సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ మెల్లమెల్లగా ఆ కళను పెంచుకున్నాడు. కానీ ఒకరోజు సాయంత్రం వాళ్ల నాన్న అతనిని చూడాలని వెంటనే పిలిపించాడు.—1 సమూయేలు 16:12.

అక్కడకు వచ్చాక తన తండ్రి యెష్షయి ఒక వృద్ధుడితో మాట్లాడడం దావీదు చూశాడు. ఆ వృద్ధుడు నమ్మకమైన ప్రవక్త సమూయేలు. యెష్షయి కొడుకుల్లో ఒకరిని ఇశ్రాయేలుకు రెండవ రాజుగా అభిషేకించడానికి యెహోవా అతనిని పంపించాడు. దావీదు ఏడుగురు అన్నల్ని సమూయేలు చూశాడు, కానీ వాళ్లలో ఎవరిని ఎన్నుకోలేదని యెహోవా సమూయేలుతో చెప్పాడు. దావీదు రాగానే యెహోవా సమూయేలుతో, “నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని” చెప్పాడు. దావీదు అన్నల ముందు సమూయేలు ప్రత్యేకమైన నూనెతో నిండిన తైలపు కొమ్మును తెరిచి, కొంచెం నూనెను దావీదు తల మీద పోశాడు. అలా అభిషేకించినప్పటి నుండి దావీదు జీవితం ముందులా లేదు. బైబిల్లో ఇలా ఉంది: “నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను.”—1 సమూయేలు 16:1, 5-11, 13.

క్రూరమృగాల్ని చంపిన ఘనతను దావీదు వినయంగా యెహోవాకే ఇచ్చాడు

దావీదు, రాజు అవ్వాలనే కోరికల్ని పెంచుకున్నాడా? లేదు, యెహోవా ఆత్మ ఆ బాధ్యతలు చేపట్టడానికి నడిపించే వరకు ఎదురు చూస్తూ దావీదు సంతృప్తిగా ఉన్నాడు. ఈలోపు తక్కువ పనే అయినా గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నాడు. ఆ పనిని పట్టుదలతో, ధైర్యంగా చేశాడు. అతని తండ్రి మందలకు రెండుసార్లు ముప్పు వచ్చింది, ఒకసారి సింహం, ఒకసారి ఎలుగుబంటి నుండి. దావీదు దూరంగా ఉండి వాటిని తరిమేయడానికి ప్రయత్నించలేదు కానీ తండ్రి గొర్రెలను కాపాడాలని వెంటనే ఆ జంతువుతో పోరాడడానికి ముందుకెళ్లాడు. ఆ రెండుసార్లు ఒక్కడే పోరాడి ఆ క్రూర జంతువుల్ని చంపేశాడు.—1 సమూయేలు 17:34-36; యెషయా 31:4.

సమయం వచ్చినప్పుడు దావీదును మళ్లీ పిలిపించారు. ఈసారి అతనికున్న పేరు రాజైన సౌలు వరకు వెళ్లింది. సౌలు బలంగల యోధుడైనా యెహోవా ఉపదేశానికి ఎదురు తిరగడం వల్ల ఆయన ఆమోదాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా సౌలు నుండి తన ఆత్మను వెనక్కు తీసుకున్నాడు కాబట్టి ఆయనలో చెడు బాగా పెరిగిపోయింది. ఆయనలో విపరీతమైన కోపం, అనుమానం, దౌర్జన్యం కనబడేవి. వాటినుండి బయటకు తెచ్చి, ఆయనకు ఉపశమనం ఇవ్వగలిగింది ఒక సంగీతం మాత్రమే. సంగీతకారునిగా, వీరుడిగా దావీదుకున్న పేరు సౌలు మనుషులకు తెలిసింది. కాబట్టి దావీదును పిలిపించారు. కొంతకాలంలోనే దావీదు సౌలు ఆస్థానంలో ఉన్న సంగీతకారుల్లో, ఆయుధాలు మోసే వాళ్లలో ఒకడయ్యాడు.—1 సమూయేలు 15:26-29; 16:14-23.

యవనస్థులు ఈ విషయాల్లో దావీదు విశ్వాసాన్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన తన ఖాళీ సమయాన్ని యెహోవాకు దగ్గర చేసే పనుల్లో ఉపయోగించాడని గమనించండి. అంతేకాకుండా సమయం తీసుకుని కొన్ని ఉపయోగపడే పనులు నేర్చుకున్నాడు. వాటివల్ల ఆయనకు జీవనోపాధి సులువైంది. అన్ని విషయాల్లో ఆయన దేవుని ఆత్మ ఇస్తున్న నిర్దేశానికి అనుగుణంగా ఉన్నాడు. వీటి నుండి మనమంతా ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు.—ప్రసంగి 12:1.

అతనినిబట్టి ఎవరి మనస్సు క్రుంగిపోవాల్సిన అవసరం లేదు

సౌలుకు సేవ చేస్తూనే దావీదు మధ్యమధ్యలో ఇంటికి వెళ్లి కొన్ని రోజులు గొర్రెల్ని కాసుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో యెష్షయి, సౌలు సైన్యంలో పని చేస్తున్న తన ముగ్గురు కొడుకుల్ని చూసి రమ్మని చిన్న కొడుకైన దావీదుకు చెప్తాడు. ఆ మాటకు లోబడి దావీదు, తన అన్నలకు ఆహారం తీసుకుని, ఏలా అనే లోయకు బయలుదేరుతాడు. ముందు చూసినట్లు దావీదు అక్కడికి చేరుకోగానే ఆ రెండు సైన్యాలు కొండల్లో ఎటూ కదలని పరిస్థితిలో ఉండడాన్ని గమనిస్తాడు. అది అతనికి బాధ కలిగిస్తుంది. ఆ విశాలమైన లోయ అడుగున రెండు సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి.—1 సమూయేలు 17:1-3, 15-19.

దావీదు ఆ పరిస్థితిని సహించలేకపోయాడు. జీవముగల యెహోవా దేవుని సైన్యం ఒక మామూలు మనిషిని, అందులోనూ అన్యుడిని చూసి పారిపోవడం ఏంటి? గొల్యాతు బెదిరింపులు, ఎగతాళి యెహోవానే అవమానిస్తున్నట్లు దావీదుకు అనిపించింది. కాబట్టి వెంటనే అక్కడున్న సైనికులతో గొల్యాతును ఓడించడం గురించి మాట్లాడాడు. కాసేపటికి ఆ విషయం దావీదు పెద్ద అన్న ఏలీయాబుకు తెలిసింది. అతను దావీదును కఠినంగా గద్దించి, ఊరికే యుద్ధం చూడడానికి వచ్చాడని తప్పుగా నిందిస్తాడు. కానీ దావీదు, “నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని” అని జవాబిస్తాడు. అయినా దావీదు గొల్యాతును ఓడించడం గురించి ధైర్యంగా మాట్లాడుతూనే ఉంటాడు. చివరికి ఆ మాటలు సౌలుకు తెలుస్తాయి. అది విని రాజు దావీదును తన దగ్గరకు పిలిపిస్తాడు.—1 సమూయేలు 17:23-31.

దావీదు గొల్యాతు గురించి రాజుతో “ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరి మనస్సును క్రుంగ నిమిత్తము లేదు” అని ధైర్యంగా చెప్పాడు. సౌలుకు అతని మనుషులకు గొల్యాతును చూసి నిజంగానే గుండె జారిపోయింది. అందరూ చేసే తప్పే వాళ్లూ చేశారు. వాళ్లని గొల్యాతుతో పోల్చుకున్నారు. వాళ్లు అతనికి సగానికి లేదా గుండెల వరకు వచ్చారు. అంత పెద్ద ధీరుడు వాళ్లను ఒక్క దెబ్బతో ఓడించగలడని భయపడ్డారు. కానీ దావీదు అలా అనుకోలేదు. ఆయన ఆ సమస్యను వేరే విధంగా చూశాడని ముందుముందు చూస్తాం. అందుకే దావీదు గొల్యాతుతో ఒంటరిగా పోరాడడానికి ముందుకు వచ్చాడు.—1 సమూయేలు 17:32.

అప్పుడు సౌలు, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.” నిజంగానే దావీదు బాలుడా? కాదు, కానీ సైన్యంలో చేరే వయసు అతనికి లేదు, చూడడానికి ఇంకా చిన్న కుర్రాడిలా ఉన్నాడు. అయితే దావీదు అప్పటికే ధైర్యవంతుడైన యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు, అతని వయసు 19 సంవత్సరాలలోపే ఉంటుంది.—1 సమూయేలు 16:18; 17:33.

సింహంతో, ఎలుగుబంటితో పోరాడిన సంగతి గుర్తుచేసి దావీదు సౌలుకు భరోసా ఇస్తాడు. దావీదు గొప్పలు చెప్పుకుంటున్నాడా? లేదు. ఆ పోరాటాలు ఎలా గెల్చాడో దావీదుకు తెలుసు, అతను ఇలా అన్నాడు, “సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించును.” సౌలుకు నమ్మకం కలిగి, “పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండును గాక” అని అంటాడు.—1 సమూయేలు 17:37.

దావీదు లాంటి విశ్వాసం మీరూ చూపించాలని అనుకుంటున్నారా? అయితే గమనించండి, దావీదుకు విశ్వాసం ఒక ఊహ లేదా గుడ్డి నమ్మకాన్ని బట్టి రాలేదు. ఆ విశ్వాసం ఆయనకున్న జ్ఞానం, అనుభవం బట్టి వచ్చింది. యెహోవా ప్రేమతో రక్షిస్తాడని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని దావీదుకు తెలుసు. మనం కూడా అలాంటి విశ్వాసాన్ని పెంచుకోవాలంటే బైబిల్లో ఉన్న దేవుని గురించి నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకున్నవాటి ప్రకారం జీవిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయి.—హెబ్రీయులు 11:1.

“యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును”

సౌలు దావీదుకు తన కవచాన్ని వేయాలనుకుంటాడు. అది గొల్యాతు కవచంలా రాగితో చేసింది. ఆ కవచానికి పొలుసులతో ఉన్న పెద్ద చొక్కా ఉంటుంది. దాన్ని వేసుకుని కదలడానికి ప్రయత్నించినప్పుడు దావీదుకు చాలా ఇబ్బందిగా అనిపించింది, మోయడం కష్టమైంది. దానివల్ల అతనికి పెద్ద ఉపయోగం ఉండదు. అతను సైనికుడిగా శిక్షణ పొందలేదు కాబట్టి, యుద్ధ కవచం అతనికి అలవాటు లేదు. అందులోనూ రాజైన సౌలు ఇశ్రాయేలీయులందరిలో పొడవైన వాడు కాబట్టి అతని కవచం ధరించడం ఇంకా కష్టం. (1 సమూయేలు 9:2) అందుకే దావీదు దాన్ని తీసేసి, మందని కాపాడే గొర్రెల కాపరులు వేసుకునే దుస్తులనే వేసుకున్నాడు.—1 సమూయేలు 17:38-40.

దావీదు చేతి కర్రను, భుజం మీద సంచిని, వడిసెలను తీసుకెళ్తాడు. వడిసె చాలా చిన్నదే అయినా చాలా శక్తివంతమైన ఆయుధం. దానికి తోలుతో చేసిన రెండు పొడవైన తాళ్లు, తాళ్లను కలుపుతూ మధ్యలో ఒక చిన్న సంచి లాంటిది ఉంటుంది. ఇది గొర్రెల కాపరులకు చాలా ఉపయోగపడుతుంది. ఒక రాయిని తీసుకుని ఆ సంచి లాంటి దాంట్లో పెట్టి, రెండు తాళ్లను పట్టుకుని గిర్రున తిప్పి, అలా వేగంగా తిరుగుతున్నప్పుడు గురి చూసి తాడును వదిలితే ఆ రాయి గురి వైపు వెళ్లి తగులుతుంది. ఆ రాయి దేనికి తగిలితే దానికి చావు దెబ్బే. అంత ప్రమాదకరం కాబట్టే కొన్నిసార్లు యుద్ధాల్లో వడిసెలతో పోరాడే విభాగాలు ఉంటాయి.

అలాంటి ఆయుధంతో దావీదు తన శత్రువుని ఎదుర్కోడానికి బయలుదేరుతాడు. నది మధ్యలో ఐదు చిన్న నున్నని రాళ్లు ఏరుకుంటూ క్రిందికి వంగినప్పుడు భక్తితో దావీదు దేవునికి చేసిన ప్రార్థనలు ఊహించుకోండి. తర్వాత ఆయన నడుచుకుంటూ కాదు, పరిగెత్తుతూ యుద్ధ భూమిలోకి వెళ్తాడు.

గొల్యాతు శత్రువుని చూడగానే ఏమనుకున్నాడు? “అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.” గొల్యాతు గట్టిగా, “కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా?” అని అరుస్తాడు. బహుశా అతను దావీదు కర్రనే చూశాడు కానీ వడిసెలని చూడలేదు. ఆయన ఫిలిష్తీయుల దేవుళ్ల పేరిట దావీదుకు శాపనార్థాలు పెడతాడు. తనకు సమానం కాని దావీదు లాంటి శత్రువుని చంపి ఆకాశ పక్షులకి అడవిలో జంతువులకి ఆహారంగా వేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.—1 సమూయేలు 17:41-44.

దానికి దావీదు ఇచ్చిన జవాబు ఈ రోజు వరకు విశ్వాసానికి గొప్ప నిదర్శనంగా ఉంది. ఆ కుర్రవాడు గొల్యాతుతో, “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను” అనడం ఊహించుకోండి. మనుషుల శక్తి, వాళ్ల ఆయుధ బలం కొంతవరకే అని దావీదుకు తెలుసు. గొల్యాతు యెహోవా దేవునికి గౌరవం చూపించలేదు కాబట్టి యెహోవాయే అతనికి బదులిస్తాడు. అందుకే దావీదు ఇలా అన్నాడు, “యుద్ధము యెహోవాదే.”—1 సమూయేలు 17:45-47.

గొల్యాతు భారీ శరీరం, అతని ఆయుధాలు దావీదు కళ్లకు కనిపించక కాదు కానీ, వాటికి అతను భయపడలేదు. సౌలు, అతని సైన్యం చేసిన తప్పును దావీదు చేయలేదు. దావీదు తనని గొల్యాతుతో పోల్చుకోలేదు. కానీ గొల్యాతును యెహోవా దేవునితో పోల్చి చూశాడు. తొమ్మిదిన్నర అడుగులు (2.9 మీటర్ల) ఎత్తున్న గొల్యాతు అందరికన్నా ఎత్తుగా ఉన్నా, విశ్వానికి అధిపతియైన యెహోవాతో పోలిస్తే ఎంతమాత్రపువాడు? ఎంత ఎత్తున్నా ఒక చిన్న పురుగుతో సమానం, అదే గాక యెహోవా ఇతనిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు.

దావీదు సంచిలో రాయిని తీసుకుంటూ శత్రువు వైపు పరిగెత్తాడు. ఆయన వడిసెలో రాయిని పెట్టి పైకి పట్టుకుని గాలిలో గిర్రున తిప్పాడు. గొల్యాతు బహుశా తన ఆయుధాలు మోసే అతనికి దగ్గర్లో ఉంటూ దావీదు వైపుకు వస్తున్నాడు. గొల్యాతు చాలా ఎత్తుగా ఉండడం అతనికి నష్టాన్ని తెచ్చింది, ఎందుకంటే అతని ఆయుధాన్ని మోసే సైనికుడు అంత ఎత్తుగా డాలును పట్టుకోలేడు. కాబట్టి అతని తలకి సరైన రక్షణ లేదు. దావీదు గురి చూసింది కూడా సరిగ్గా అక్కడే.—1 సమూయేలు 17:41.

యెహోవా దేవునితో పోలిస్తే ఆ రాక్షసుడంతటి వాడు కూడా చిన్నవాడేనని దావీదు నమ్మాడు

దావీదు రాయిని విసిరాడు. అది గాలిలో వెళ్తున్నప్పుడు అందరూ ఎంత నిశ్శబ్దంగా చూసి ఉంటారో ఊహించుకోండి. దావీదు మరో రాయి విసరాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా చూసుకున్నాడు. ఆ రాయి సరిగ్గా వెళ్లి గొల్యాతు నుదుటికి తగిలింది. వెంటనే పెద్ద రాక్షసుడిలా ఉన్న గొల్యాతు కింద పడిపోయాడు. బహుశా అతని డాలు పట్టుకున్న సైనికుడు భయంతో పరుగు తీసి ఉంటాడు. దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్లి అతని కత్తిని తీసుకుని దాంతోనే ఆ రాక్షసుడి తల తీసేశాడు.—1 సమూయేలు 17:48-51.

చివరికి సౌలుకు అతని సైనికులకి ధైర్యం వచ్చింది. పెద్ద కేకలు వేస్తూ వాళ్లంతా ఫిలిష్తీయుల వైపు పరుగెత్తారు. యెహోవా మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడని దావీదు గొల్యాతుతో అన్న విధంగానే యుద్ధం జరిగింది.—1 సమూయేలు 17:47, 52, 53.

నేడు దేవుని సేవకులు ఆయుధాలతో యుద్ధం చేయరు. ఆ కాలం దాటిపోయింది. (మత్తయి 26:52) కానీ మనం దావీదు విశ్వాసాన్ని అనుసరించాల్సిన అవసరం ఇంకా ఉంది. ఆయనలానే మనం యెహోవా నిజంగా ఉన్నాడని, ఎంతో గౌరవంతో ఆరాధించాల్సిన ఏకైక దేవుడని గుర్తించాలి. కొన్నిసార్లు మన సమస్యల ముందు మనం చిన్నవాళ్లగా కనబడతాము, కానీ అపారమైన యెహోవా శక్తితో పోలిస్తే మన సమస్యలు చాలా చిన్నవి. యెహోవాను మన దేవునిగా చేసుకుంటే, దావీదులా ఆయన మీద విశ్వాసం ఉంచితే ఏ పరీక్ష ఏ సమస్య మనల్ని భయపెట్టలేదు. యెహోవా జయించలేనిదంటూ ఏదీ లేదు. ▪ (wp16-E No. 5)