కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యానికి మద్దతివ్వాలని ఇప్పుడే నిర్ణయించుకోండి!

దేవుని రాజ్యానికి మద్దతివ్వాలని ఇప్పుడే నిర్ణయించుకోండి!

ఒక నాశనకరమైన తుఫాను మీ ప్రాంతానికి రాబోతుందని ఊహించుకోండి. ప్రభుత్వ అధికారులు రేడియోల ద్వారా, టీవీల ద్వారా ఈ అత్యవసర హెచ్చరికలు జారీ చేస్తున్నారు: “వెళ్లిపోండి! తక్షణమే సురక్షిత ప్రాంతాలకు పారిపోండి!” అప్పుడు చేయాల్సిన తెలివైన పనేంటి? తప్పకుండా ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్లడమే కదా.

ఒకవిధంగా, మనందరం నాశనకరమైన “తుఫాను” వచ్చేలాంటి పరిస్థితిలో నివసిస్తున్నాం. యేసు దాన్ని “మహాశ్రమ” అని అన్నాడు. (మత్తయి 24:21) మనం ఆ శ్రమను తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేం. కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక పని చేయవచ్చు. ఏంటది?

యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో ఇలా నిర్దేశించాడు: “మీరు ఆయన [దేవుని] రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి.” (మత్తయి 6:33) మనం దాన్నెలా చేయవచ్చు?

దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వండి. అంటే, మనం దేవుని రాజ్యాన్ని అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచాలని అర్థం. (మత్తయి 6:25, 32, 33) దేవుని రాజ్యాన్ని ఎందుకలా ఎంచాలి? ఎందుకంటే, మనుషులు తమ సమస్యల్ని పరిష్కరించుకోలేకపోతున్నారు. ఆ కష్టమైన పనిని దేవుని రాజ్యం మాత్రమే చేయగలదు.

ఆయన నీతికి మొదటిస్థానం ఇవ్వండి. దేవుని నీతి ప్రమాణాల ప్రకారం, సూత్రాల ప్రకారం జీవించడానికి మనం కృషి చేయాలి. ఎందుకు? ఎందుకంటే, మంచిచెడులను ఎవరికి వాళ్లు నిర్ణయించుకుంటే ఫలితాలు ఘోరంగా ఉంటాయి. (సామెతలు 16:25) దానికి భిన్నంగా మనం దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తే, ఆయన్ని సంతోషపెడతాం. అంతేకాదు మనం కూడా ప్రయోజనం పొందుతాం.—యెషయా 48:17, 18.

దేవుని రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి. కొందరు పక్కదారి పట్టవచ్చని యేసు హెచ్చరించాడు. అంతేకాదు, అలాంటివాళ్లు వీలైనంత ఎక్కువ డబ్బు కూడబెట్టుకుంటేనే భద్రత ఉంటుందనుకుంటారని ఆయన  చెప్పాడు. ఇంకొందరు తమను, తమ ఇంటివాళ్ల బాగోగులను చూసుకోవడంలో ఎంతగా మునిగిపోతారంటే, దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడానికి వాళ్ల దగ్గర సమయమే ఉండకపోవచ్చు.—మత్తయి 6:19-21, 25-32.

అయితే, దేవుని రాజ్యానికి మద్దతిచ్చేవాళ్లకు ఇప్పుడు ఏం అవసరమో అవి సమకూరతాయని, దేవుని రాజ్యంలో లెక్కలేనన్ని ఆశీర్వాదాల్ని సొంతం చేసుకుంటారని యేసు మాటిచ్చాడు.—మత్తయి 6:33.

మొదటి శతాబ్దంలో యేసు శిష్యులు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికినా కష్టాలు, బాధలు పూర్తిగా పోవడం తమ జీవితకాలంలో చూడలేదు. కానీ వాళ్లు కాపాడబడ్డారు. ఎలా?

వాళ్లు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించారు. దానివల్ల దేవుడు చెప్పేది నిర్లక్ష్యం చేసిన వాళ్లకు వచ్చిన కష్టాలు శిష్యులకు రాలేదు. రాజ్యం మీద వాళ్లకున్న బలమైన విశ్వాసం జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవడానికి వాళ్లకు సహాయం చేసింది. కష్టాల్ని తట్టుకోవడానికి కావాల్సిన “అసాధారణ శక్తి” దేవుడు వాళ్లకు ఇచ్చాడు.—2 కొరింథీయులు 4:7-9.

మీరు దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇస్తారా?

మొదటి శతాబ్దంలో జీవించిన క్రైస్తవులు దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వమని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించారు. వాళ్లు మంచివార్తను అన్ని ప్రాంతాల్లో ప్రకటించారు. (కొలొస్సయులు 1:23) ఈ రోజుల్లో ఆ పనిని ఎవరైనా చేస్తున్నారా?

అవును, చేస్తున్నారు! దేవుని రాజ్యం ఈ వ్యవస్థను నాశనం చేసే సమయం చాలా దగ్గరపడిందని యెహోవాసాక్షులు గ్రహించారు. కాబట్టి యేసు చెప్పిన మాటల ప్రకారం జీవించడానికి వాళ్లు శాయశక్తులా కృషిచేస్తారు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14.

ఆ మంచివార్తకు మీరెలా స్పందిస్తారు? మాసిదోనియలోని బెరయ నగర క్రైస్తవుల్లా ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. వాళ్లు అపొస్తలుడైన పౌలు ప్రకటించిన మంచివార్తను విన్నప్పుడు దానిపట్ల ‘ఎక్కువ ఆసక్తి’ చూపించారు. తర్వాత, ‘తాము విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్లు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధించి,’ నేర్చుకున్నవాటి ప్రకారం చర్య తీసుకున్నారు.—అపొస్తలుల కార్యాలు 17:11, 12.

మీరూ అదే చేయవచ్చు. దేవుని రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తే ఇప్పుడు సురక్షితంగా ఉండడమే కాదు భవిష్యత్తులో శాశ్వతమైన శాంతిని, భద్రతను కూడా అనుభవిస్తారు.