కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

దేవుని రాజ్యం రావాలనే విషయం గురించి ప్రార్థించమని యేసు తన శిష్యులకు బోధించాడు. భూమ్మీద జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు దేవునికి ఇష్టంలేదని, వాటిని సరిచేయగల ఏకైక ప్రభుత్వం దేవుని రాజ్యమేనని యేసుకు తెలుసు. అయితే దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

దేవుని రాజ్యం ఇప్పటి వరకు ఏమి సాధించింది?

ముందటి ఆర్టికల్‌లో, మనం యేసు ఇచ్చిన సూచనను పరిశీలించాం. ఆ సూచన, దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడిందని చెప్పడానికి కంటికి కనిపించే రుజువును ఇచ్చింది. దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు రాజు.

యేసు రాజ్యాధికారం పొందిన వెంటనే సాతానును, అతని చెడ్డ దూతల్ని పరలోకం నుండి పడేస్తాడని బైబిలు చెప్తుంది. ఇప్పుడు వాళ్ల పనులు భూమికే పరిమితమయ్యాయి. 1914 నుండి భూమ్మీద పరిస్థితులు ఇంకా చెడుగా తయారవడానికి అదొక కారణం.—ప్రకటన 12:7, 9.

ప్రపంచ పరిస్థితులు రోజురోజుకు ఘోరంగా తయారౌతున్నా, దేవుని రాజ్యానికి రాజైన యేసు మాత్రం భూమ్మీదున్న వాళ్లందరికీ ప్రయోజనం చేకూర్చే పనులు చేశాడు. యేసు ముందే చెప్పిన ప్రపంచవ్యాప్త బైబిలు విద్యాపని వల్ల, చాలామంది బైబిలు సూత్రాల్ని నేర్చుకుంటున్నారు, తమ రోజూవారి జీవితంలో వాటిని పాటిస్తున్నారు. (యెషయా 2:2-4) లక్షలమంది ప్రజలు ఉద్యోగాల్లోనే మునిగిపోకుండా ఇతర విషయాల్ని కూడా పట్టించుకోవడం నేర్చుకున్నారు. వాళ్లు తమ కుటుంబ జీవితాన్ని మెరుగుపర్చుకున్నారు, వస్తుసంపదలకు దాసోహం కాకుండా వాటిని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు. వీళ్లు ఇప్పుడు  తమకు ప్రయోజనం కలిగే విధంగా జీవించడం నేర్చుకుంటున్నారు; దేవుని రాజ్యంలో ఆయనకు నచ్చిన పౌరులుగా ఉండేలా తయారౌతున్నారు.

దేవుని రాజ్యం ముందుముందు ఏమి సాధిస్తుంది?

యేసు పరలోకం నుండి పరిపాలిస్తున్నప్పటికీ, భూమ్మీద ఇంకా మనుషుల పరిపాలనే కొనసాగుతోంది. అయితే, దేవుడు యేసుకు ఇలా చెప్పాడు: “నీ శత్రువుల మధ్య జయిస్తూ వెళ్లు.” (కీర్తన 110:2) త్వరలో యేసు శత్రువులందర్నీ పూర్తిగా నాశనం చేస్తాడు, దేవుని రాజ్యానికి ఇష్టంగా లోబడే వాళ్లందరికీ విముక్తి కలగజేస్తాడు.

త్వరలోనే దేవుని రాజ్యం ఈ కింది చర్యలు తీసుకుంటుంది:

  • అబద్ధమతాన్ని నాశనం చేస్తుంది. దేవుని గురించి అబద్ధాలు బోధించి, ప్రజల జీవితాల్ని కష్టతరంగా చేసిన మతాలు నాశనమౌతాయి. అబద్ధమతాన్ని బైబిలు ఒక వేశ్యతో పోల్చింది. దాని నాశనం చూసి చాలామంది నివ్వెరపోతారు.—ప్రకటన 17:15, 16.

  • మనుషుల పరిపాలనను తీసేస్తుంది. దేవుని రాజ్యం చర్య తీసుకొని, మనుషుల పరిపాలనను తీసేస్తుంది.—ప్రకటన 19:15, 17, 18.

  • చెడ్డవాళ్లను మట్టుపెడుతుంది. మొండిగా చెడ్డపనులు చేస్తూ, దేవునికి లోబడడానికి ఇష్టపడని వాళ్ల గతి ఏంటి? “దుష్టులు భూమ్మీద ఉండకుండా నాశనం చేయబడతారు.”—సామెతలు 2:22.

  • సాతానును, చెడ్డదూతల్ని నాశనం చేస్తుంది. సాతాను, అతని చెడ్డదూతలు ఇక ‘దేశాల్ని మోసం చేయలేరు.’—ప్రకటన 20:3, 10.

దేవుని రాజ్యాన్ని అంగీకరించేవాళ్లకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

 దేవుని రాజ్యం మనుషుల కోసం ఏం చేస్తుంది?

పరలోకంలో రాజుగా ఏలుతున్న యేసు, ఏ మానవ పాలకుడు ఎన్నడూ చేయలేని గొప్ప పనుల్ని చేస్తాడు. ఆయనకు 1,44,000 మంది తోటి పరిపాలకులు సహాయకరంగా ఉంటారు; వీళ్లు భూమ్మీద నుండి ఎంపిక చేయబడ్డారు. (ప్రకటన 5:9, 10; 14:1, 3) దేవుని ఇష్టం భూమ్మీద నెరవేరేలా ఆయన చూస్తాడు. మరి దేవుని రాజ్యం, భూమ్మీద ఉండే దాని పౌరుల కోసం ఏం చేస్తుంది?

  • రోగాలు, చావు లేకుండా చేస్తుంది. “అందులో నివసించే వాళ్లెవ్వరూ, ‘నాకు ఒంట్లో బాలేదు’ అని అనరు” అలాగే “మరణం ఇక ఉండదు.”—యెషయా 33:24; ప్రకటన 21:4.

  • నిజమైన శాంతి, భద్రత తెస్తుంది. “నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది.” అంతేకాదు, “వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ ద్రాక్షచెట్టు కింద, తమ అంజూర చెట్టు కింద కూర్చుంటారు, ఎవ్వరూ వాళ్లను భయపెట్టరు.”—యెషయా 54:13; మీకా 4:4.

  • మంచి పని కల్పిస్తుంది. “నేను ఎంచుకున్న ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు. వాళ్లు వృథాగా ప్రయాసపడరు.”—యెషయా 65:22, 23.

  • పర్యావరణ సమస్యల్ని పరిష్కరిస్తుంది. “ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి, ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.”—యెషయా 35:1.

  • శాశ్వతకాలం జీవించాలంటే ఏం చేయాలో బోధిస్తుంది. “ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.”—యోహాను 17:3.

మీరు కూడా ఆ దీవెనలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. (యెషయా 48:18) ఆ బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏం చేయవచ్చో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.