పత్రిక ముఖ్యాంశం | యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు?
నిజంగా జరిగిందా?
క్రీస్తు శకం 33వ సంవత్సరం, వసంత ఋతువులో నజరేతు ఊరివాడైన యేసును చంపేశారు. ఆయన మీద అబద్ధ ఆరోపణలు వేసి, క్రూరంగా కొట్టి, కొయ్యపై చేతులకు కాళ్లకు మేకులు కొట్టి వ్రేలాడదీసి చంపారు. ఆయన ఎంతో నొప్పితో మరణించాడు. కానీ దేవుడు ఆయనను మళ్లీ బ్రతికించాడు. 40 రోజుల తర్వాత యేసు పరలోకానికి వెళ్లిపోయాడు.
ఈ అసాధారణ సంఘటనల గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని సువార్తల్లో ఉంది. ఈ గ్రీకు లేఖనాల్ని కొత్త నిబంధన అని కూడా పిలుస్తారు. మరి సువార్తల్లో ఉన్నవన్నీ నిజంగా జరిగాయా? అది చాలా మంచి ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న. ఇవన్నీ జరగకపోతే క్రైస్తవత్వానికి అర్థం లేదు, భూమి మీద పరదైసులో నిత్యం జీవించడం కేవలం కలే ఔతుంది. (1 కొరింథీయులు 15:14) కానీ అవన్నీ నిజంగా జరిగితే మాత్రం మీకూ, మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంతకీ ఈ సువార్తల్లో ఉన్న విషయాలు నిజమా లేక కట్టు కథలా?
ఆధారాలు ఏమి చూపిస్తున్నాయి
మనం వినే ఎన్నో కథల్లా కాకుండా, ఈ సువార్త రచయితలు చాలా శ్రమ తీసుకుని, జాగ్రత్తగా ప్రతి చిన్న విషయం కూడా ఖచ్చితంగా ఉండేలా రాశారు. ఉదాహరణకు వాళ్లు రాసిన వాటిలో ఉన్న చాలా ఊర్లు ఈ రోజుకీ ఉన్నాయి. వాళ్లు నిజంగా ఉన్న మనుషుల గురించి రాశారు. వీళ్లు ఒకప్పుడు జీవించారని చరిత్రకారులు కూడా ఒప్పుకుంటారు.—లూకా 3:1, 2, 23, 24.
a యేసు చనిపోయిన విధానం గురించి సువార్తల్లో చెప్పిన విషయాలు, ఆ కాలంలో రోమన్లు మరణ శిక్ష విధించే పద్ధతులకు తగ్గట్లుగానే ఉన్నాయి. అంతేకాదు అన్నీ సంఘటనలు వాస్తవంగా, ఖచ్చితంగా ఉన్నాయి. యేసుశిష్యుల గురించి సువార్తల్లో రాసినప్పుడు వాళ్లలో ఉన్న తప్పులు గురించి కూడా నిజాయితీగా రాశారు. (మత్తయి 26:56; లూకా 22:24-26; యోహాను 18:10, 11) వీటన్నిటిని బట్టి సువార్త రచయితలు యేసు గురించి రాసిన విషయాలు నిజాయితీతో, ఖచ్చితంగా రాశారని తెలుస్తుంది.
మొదటి శతాబ్దంలో జీవించిన చాలామంది రచయితలు కూడా యేసు గురించి రాశారు.యేసు పునరుత్థానాన్ని నమ్మవచ్చా?
యేసు జీవించాడు, మరణించాడు అని నమ్మినా, ఆయన మళ్లీ బ్రతికిన విషయాన్ని కొంతమంది నమ్మరు. ఆయన బ్రతికాడని తెలిసినప్పుడు ఆయన శిష్యులు కూడా మొదట నమ్మలేదు. (లూకా 24:11) కానీ యేసును చూడగానే వాళ్ల సందేహాలన్నీ పోయాయి. వాళ్లతో పాటు మిగతా శిష్యులు కూడా యేసును వేర్వేరు సందర్భాల్లో చూశారు. ఒకసారి 500 కన్నా ఎక్కువ మంది ఆయన్ని చూశారు.—1 కొరింథీయులు 15:6.
బందించి, చంపేసే ప్రమాదం ఉన్నా కూడా క్రీస్తు శిష్యులు ధైర్యంగా యేసు మళ్లీ బ్రతికాడనే విషయాన్ని అందరికీ చెప్పారు. యేసును చంపిన వాళ్లకు కూడా చెప్పారు. (అపొస్తలుల కార్యములు 4:1-3, 10, 19, 20; 5:27-32) యేసు నిజంగా పునరుత్థానమయ్యాడని వాళ్లకు ఖచ్చితంగా తెలియకపోతే అంతమంది శిష్యులు అంత ధైర్యంగా ఆయన గురించి చెప్పేవాళ్లు కాదు కదా? అంతేకాదు ప్రపంచంలో అప్పుడూ ఇప్పుడూ క్రైస్తవత్వాన్ని ముందుకు నడిపించిన కారణం యేసు పునరుత్థానం అయ్యాడనే వాస్తవమే.
యేసు మరణం, పునరుత్థానం గురించి సువార్తల్లో ఉన్న సమాచారం చాలా ఖచ్చితంగా ఉంది, చరిత్రలో నమోదైంది. వాటిని జాగ్రత్తగా చదవడం ద్వారా ఇవన్నీ నిజంగా జరిగాయనే నమ్మకం మీకు కలుగుతుంది. అవన్నీ ఎందుకు జరిగాయో మీరు అర్థం చేసుకుంటే మీ నమ్మకం ఇంకా పెరుగుతుంది. దీని గురించి తర్వాత పేజీలో చూద్దాం. (w16-E No.2)
a టాసిటస్ క్రీస్తు శకం 55వ సంవత్సరంలో పుట్టి ఉంటాడు. ఆయన ఇలా రాశాడు, “క్రైస్తవులకు ఆ పేరు, క్రిస్తుస్ అనే అతని నుండి వచ్చింది. అతను తిబెరి ఏలుబడిలో అధిపతిగా ఉన్న పొంతి పిలాతు చేతుల్లో దారుణమైన శిక్షను అనుభవించాడు.” యేసు గురించి మొదటి శతాబ్దానికి చెందిన స్యుటోనియస్, అదే శతాబ్దానికి చెందిన యూదా చరిత్రకారుడు జోసిఫస్, రెండవ శతాబ్దం మొదట్లో బితూనియ అధికారి అయిన ప్లైని ద యంగర్ కూడా రాశారు.