కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమానురాగాలు కరువైనప్పుడు వచ్చే భయాలను ఎలా పోగొట్టుకోవచ్చు?

ప్రేమానురాగాలు కరువైనప్పుడు వచ్చే భయాలను ఎలా పోగొట్టుకోవచ్చు?

అప్పుడే పుట్టిన పసి పాప చాలా నిస్సహాయ స్థితిలో ఉంటుంది. మనం పుట్టగానే మనల్ని అన్నివిధాలుగా కాపాడేది తల్లిదండ్రులే. మనం నడవడం మొదలుపెట్టాక, కొత్తవాళ్లను చూసి భయపడుతుంటాం. వాళ్లు ఎత్తుగా పెద్దగా కనిపిస్తారు. అమ్మానాన్న దగ్గర లేకపోతే వాళ్లను చూసి భయపడతాం. అమ్మగానీ నాన్నగానీ మన చెయ్యి పట్టుకోగానే ధైర్యం వస్తుంది.

చిన్నప్పుడు మన సంతోషం, ఆరోగ్యం అమ్మానాన్నలు చూపించే ప్రేమ, ఆదరణను బట్టి ఉంటాయి. అమ్మానాన్నలు మనల్ని ప్రేమిస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఇంకా ధైర్యంగా ఉంటుంది. వాళ్లు మనల్ని ఏదైనా విషయంలో మెచ్చుకున్నప్పుడు మనకు కొండంత బలం వస్తుంది, దాన్ని ఇంకా బాగా చేస్తాం.

కాస్త పెద్దయ్యాక, మన స్నేహితులు కూడా మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. వాళ్లతో ఉంటే బాగుంటుంది, స్కూల్లో కూడా ధైర్యంగా ఉండగలుగుతాం.

చాలామంది పిల్లలకు బాల్యం ఇలా చక్కగా గడుస్తుంది. కానీ కొంతమంది పిల్లలకు మంచి స్నేహితులు చాలా తక్కువ. ఎంతోమంది పిల్లల్ని అమ్మానాన్నలు సరిగ్గా పట్టించుకోరు. మెలిస * అనే అమ్మాయి ఇలా చెప్తుంది: “కుటుంబమంతా కలిసి సంతోషంగా ఉన్నవాళ్ల ఫోటోలు చూసి ఇలా అనుకుంటాను, ‘నేను కూడా చిన్నప్పుడు ఇలా ఆనందంగా ఉండివుంటే ఎంత బాగుండేది.’” మీకెప్పుడైనా అలా అనిపించిందా?

చిన్నతనంలో పట్టించుకునేవాళ్లు లేకపోతే వచ్చే సమస్యలు

పెరిగే వయసులో ఏదైన చేయడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం మీకు ఉండకపోవచ్చు. మీకు ప్రేమ, ఆదరణ సరిగా దొరికి ఉండకపోవచ్చు. బహుశా మీ అమ్మానాన్నలకు ఎప్పుడూ గొడవలై చివరికి విడిపోయి ఉండవచ్చు. దానికి కారణం మీరే అని మిమ్మల్ని మీరు నిందించుకోవచ్చు. ఇంకా ఘోరంగా, మీ అమ్మగానీ నాన్నగానీ మిమ్మల్ని బాగా తిట్టుంటారు లేదా కొట్టుంటారు.

అలా పెరిగిన పిల్లలు ఏమి చేస్తారు? కొంతమంది టీనేజీలోనే డ్రగ్స్‌కు, తాగుడుకు అలవాటు పడిపోతారు. ఇంకొంతమంది కుటుంబంలో దొరకని ఆప్యాయత రౌడీ ముఠాల్లో దొరుకుతుందని వాటిలో చేరతారు. మరికొంతమంది ప్రేమానురాగాలు కోరుకుంటూ చిన్నవయసులోనే ప్రేమలో పడతారు. కానీ ఇలాంటి ప్రేమలు ఎక్కువకాలం నిలవవు. విడిపోవడం వల్ల వాళ్లలో భయం ఇంకా ఎక్కువ అవుతుంది.

కొంతమంది పిల్లలకు కుటుంబ సంరక్షణ దొరకక పోయినా పెద్దపెద్ద సమస్యల్లో పడరు. కానీ వాళ్లలో ఆత్మగౌరవం తక్కువగా ఉండొచ్చు. “నావల్ల ఏ ఉపయోగం లేదని అనుకునేదాన్ని,  ఎందుకంటే మా అమ్మ నన్ను ఎప్పుడూ అలా తిట్టేది; మా అమ్మ నన్ను మెచ్చుకున్నట్లు, నన్ను ప్రేమిస్తున్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు” అని ఆన అంటుంది.

మనలో భయాలకు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడానికి మనం పెరిగిన విధానం ఒక్కటే కారణం కాదు. ఎంతో బాధను మిగిల్చిన విడాకుల వల్ల, ముసలితనంలో వచ్చే సమస్యల వల్ల, మనం కనబడడానికి ఎలా ఉంటామో అనే ఆలోచనల వల్ల కూడా మనలో భయం ఉండవచ్చు. కారణమేదైనా, అలాంటి భయాలు మన సంతోషాన్ని, వేరేవాళ్లతో సంబంధాల్ని పాడుచేస్తాయి. ఇలాంటి భయాల నుండి మనమెలా బయటపడొచ్చు?

దేవునికి మనమీద శ్రద్ధ ఉంది

భయాల్ని పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే, మనకు సహాయం చేయగలిగినవాళ్లు, సహాయం చేయాలని కోరుకునే వాళ్లు ఒకరున్నారు. ఆయనే దేవుడు.

తన సేవకుడైన యెషయా ద్వారా దేవుడు ఇలా చెప్పాడు: “నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.” (యెషయా 41:9, 10, 13) దేవుడు తన చేతితో మనల్ని పట్టుకుని తోడుగా ఉంటాడనే ఈ మాటలు ఎంత ఓదార్పుగా ఉన్నాయో కదా! మనం భయపడాల్సిన అవసరం లేదు.

దేవుని సేవకులు భయాందోళనలో ఉన్నప్పటికీ ఎలా ఆయన చెయ్యి పట్టుకుని ధైర్యం పొందారో బైబిలు వివరిస్తుంది. సమూయేలు తల్లి హన్నాకు పిల్లలు పుట్టలేదు. దానివల్ల ఆమె ఎందుకు పనికిరాదు అనే బాధతో కుమిలిపోయింది. ఎన్నో మాటలు పడింది. బాధతో ఆమెకు ఆకలి చచ్చిపోయింది, ఎన్నోసార్లు ఏడ్చింది. (1 సమూయేలు 1:6, 8) కానీ తన బాధనంతా దేవునికి చెప్పుకున్న తర్వాత ఆమె ఇక దుఃఖించలేదు.—1 సమూయేలు 1:18.

కీర్తనలు రాసిన దావీదును కూడా కొన్నిసార్లు భయం వెంటాడింది. రాజైన సౌలు అతణ్ణి చంపడానికి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్నోసార్లు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. సమస్యల్లో కూరుకుపోతున్నట్లు కొన్నిసార్లు ఆయన అనుకున్నాడు. (కీర్తన 55:3-5; 69:1) అందుకే ఆయన ఇలా రాశాడు: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.”—కీర్తన 4:8.

హన్నా, దావీదు తమ భారాన్నంతా యెహోవామీద వేశారు. యెహోవా వాళ్లను ఆదుకున్నాడు కూడా. (కీర్తన 55:22) మనం కూడా వాళ్లలా ఎలా ఉండొచ్చు?

 భయాలు పోగొట్టుకోవడానికి మూడు మార్గాలు

1. యెహోవాను మీ తండ్రిలా చూడడం నేర్చుకోండి.

తన తండ్రైన ‘అద్వితీయ సత్యదేవుని’ గురించి తెలుసుకోమని యేసు మనల్ని అడుగుతున్నాడు. (యోహాను 17:3) “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” అని పౌలు అభయం ఇస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:26, 27) “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని యాకోబు రాశాడు.—యాకోబు 4:8.

మనల్ని ప్రేమించే, శ్రద్ధ చూపించే తండ్రి పరలోకంలో ఉన్నాడని తెలుసుకోవడం వల్ల భయం, ఆందోళన నుండి బయటపడవచ్చు. ఆ నమ్మకాన్ని పెంచుకోవడానికి కొంత సమయం పట్టినా దానివల్ల ఫలితం ఉంటుంది. “యెహోవాను నేను తండ్రిగా చేసుకున్నప్పుడు, నా మనసులోని భావాలను ఆయనకు చెప్పుకోగలిగాను,” అని కారలైన్‌ అంటోంది. “నా భారమంతా తీరిపోయినట్లు అనిపించింది.”

“మా అమ్మానాన్నలు నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చింది యెహోవాయే” అని రేచల్‌ చెప్తుంది. “నేను ఆయనతో మాట్లాడాను, సమస్యల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేయమని అడిగాను. ఆయన నాకు సహాయం చేశాడు.” *

2. దేవునిపై నిజమైన భక్తి ఉన్నవాళ్లను స్నేహితులుగా చేసుకోండి.

యేసు తన శిష్యులకు అన్నదమ్ముల్లా ఉండాలని చెప్పాడు. “మీరందరు సహోదరులు” అని యేసు అన్నాడు. (మత్తయి 23:8) తన నిజమైన అనుచరులు ఒకర్నొకరు ప్రేమించుకోవాలని, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ పెద్ద కుటుంబంలా కలిసి ఉండాలని యేసు కోరుతున్నాడు.—మత్తయి 12:48-50; యోహాను 13:35.

యెహోవాసాక్షుల సంఘాల్లో ఆప్యాయత, ఆదరణ చూపించడానికి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కృషి చేస్తారు. (హెబ్రీయులు 10:24, 25) వాళ్ల సంఘాలకు వెళ్లినప్పుడు మనసుకు తగిలిన గాయాలు కూడా మానిపోయి ఉపశమనంగా ఉందని చాలామంది చెప్తున్నారు.

“మా సంఘంలో నాకొక ఫ్రెండ్‌ ఉంది, ఆమె నేను పడే బాధను అర్థంచేసుకుంది,” అని ఈవ అంటుంది. “నేను చెప్పేవి చక్కగా వింటుంది, నాకు బైబిలు చదివి వినిపిస్తుంది, నాతో కలిసి ప్రార్థన చేస్తుంది. నేను ఒంటరిదాన్ననే ఆలోచనే రానివ్వకుండా చేస్తుంది. నా బాధనంతా బయటపెట్టి నా భారాన్ని తగ్గించుకోవడానికి ఆమె నాకు సహాయం చేస్తుంది. ఆమె చేసిన సహాయం వల్ల నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది.” “సంఘంలో నాకు ‘అమ్మానాన్న’ దొరికారు,” అని రేచల్‌ చెప్తుంది. “వాళ్లు నన్ను ప్రేమిస్తారు కాబట్టి నాకు ధైర్యంగా ఉంటుంది.”

 3. ప్రేమ, దయ చూపించండి.

ప్రేమ, దయ చూపిస్తే ఏ స్నేహమైన చిరకాలం ఉంటుంది. తీసుకోవడం కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంటుందని యేసు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:35) ఎంత ప్రేమ చూపిస్తామో తప్పకుండా అంత ప్రేమ తిరిగి పొందుతాం. ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు అని యేసు తన శిష్యులకు చెప్పాడు.—లూకా 6:38.

మనం ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే మనలో ధైర్యం పెరుగుతుంది. ప్రేమ శాశ్వతంగా ఉంటుందని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 13:8) “నా గురించి నేను తక్కువగా అనుకునేవి నిజాలు కావని నాకు తెలుసు” అని మారీయా ఒప్పుకుంటుంది. “ఇతరులకు సహాయం చేస్తూ నా గురించి నేను మర్చిపోతాను. ఇలాంటి ఆలోచనలను తప్పించుకుంటాను. నేను ఇతరులకు ఏదైనా మంచి చేసిన ప్రతీసారి చాలా తృప్తిగా ఉంటుంది.”

ప్రతీ ఒక్కరు ధైర్యంగా ఉండవచ్చు

పైన చెప్పినవన్నీ చేస్తే మ్యాజిక్‌లా వెంటనే ఉపశమనం రాదు. కానీ తప్పకుండా మీకు తేడా తెలుస్తుంది. “ఇప్పటికీ కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది,” అని కారలైన్‌ అంటోంది. “కానీ ఇప్పుడు నాకు ఆత్మగౌరవం పెరిగింది. దేవునికి నామీద శ్రద్ధ ఉందని నాకు తెలుసు. ధైర్యాన్నిచ్చే మంచి స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు.” రేచల్‌కు కూడా ఇలాగే అనిపిస్తోంది. “అప్పుడప్పుడు విషాదం నన్ను ముంచెత్తుతుంది,” అని ఆమె అంటోంది. “నాకు మంచి సలహాలు ఇస్తూ సరిగ్గా ఆలోచించడానికి సహాయం చేసే ఆధ్యాత్మిక సహోదరసహోదరీలు నాకున్నారు. అంతకన్నా ఎక్కువగా, నేను రోజు మాట్లాడే పరలోక తండ్రి నాకున్నాడు. నాకది చాలు.”

రానున్న కొత్త లోకంలో ప్రతీ ఒక్కరు ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చని బైబిలు వివరిస్తుంది

అయితే, శాశ్వత పరిష్కారం కూడా ఉంది. రానున్న కొత్త లోకంలో ప్రతీ ఒక్కరు ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చని బైబిలు వివరిస్తుంది. దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.” (మీకా 4:4) మనల్ని భయపెట్టేవాళ్లుగానీ మనకు హాని చేసేవాళ్లుగానీ ఎవరూ ఉండరు. మనం ఎప్పటికీ మర్చిపోలేము అనుకున్న సంఘటనలు కూడా “జ్ఞాపకమునకు రావు.” (యెషయా 65:17, 25) దేవుడు, ఆయన కుమారుడైన యేసు “నీతి సమాధానము” స్థాపిస్తారు. దానివల్ల “నిమ్మళము నిబ్బరము కలుగును.”—యెషయా 32:17. ▪ (w16-E No.1)

^ పేరా 5 అసలు పేర్లు కావు.

^ పేరా 21 దేవుని గురించి తెలుసుకోవాలని అనుకునేవాళ్లకు యెహోవాసాక్షులు బైబిలు గురించి నేర్పిస్తారు.