కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 ఇప్పటికీ ఉపయోగపడే అప్పటి మాటలు

కంగారు పడకండి

కంగారు పడకండి

అప్పటి మాట: ‘మీ ప్రాణమును గూర్చి చింతించకండి.’ —మత్తయి 6:25.

అంటే ఏంటి? పైమాటల్ని యేసు కొండమీద ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు చెప్పాడు. ఒక బైబిలు డిక్షనరీ ప్రకారం, “రోజూవారి జీవితంలో పేదరికం, ఆకలి లాంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనుషులు సాధారణంగా ఎలా స్పందిస్తారు” అనేదాన్ని గ్రీకులో “చింతించడం” అనే క్రియ పదం సూచిస్తుంది. మనం భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతిస్తాం లేదా కంగారు పడతాం. మన అవసరాల గురించి, మనవాళ్ల క్షేమం గురించి సహజంగా ఆలోచిస్తాం, అది మంచిదే. (ఫిలిప్పీయులు 2:20) కానీ యేసు, “చింతింపకుడి” అని చెప్పాడు. యేసు ఇక్కడ తన అనుచరులకు అనవసరంగా కంగారు పడొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే, రేపటి గురించి ఎక్కువగా భయపడితే ఈ రోజు మనకున్న సంతోషం పోతుంది.—మత్తయి 6:31, 34.

ఇప్పటికీ ఉపయోగపడుతుందా? యేసు చెప్పిన సలహాలను వినడం మంచిది. ఎందుకు? కొన్ని రెఫరెన్సు పుస్తకాల ప్రకారం అతిగా కంగారు పడే వాళ్ల మెదడు, నరాలు మామూలుకన్నా ఎక్కువ చురుగ్గా పనిచేస్తాయి, అప్పుడు “అల్సర్లు, గుండె జబ్బులు, ఆయాసం లేదా ఉబ్బసం” వంటి ఆరోగ్య సమస్యలు కొన్ని వస్తాయి.

యేసు అనవసరంగా కంగారు పడకుండా ఉండడానికి ఒక బలమైన కారణం చెప్పాడు. అదేమిటంటే, కంగారు పడితే ఏ ఉపయోగం ఉండదు. “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?” (మత్తయి 6:27) మన చింతల గురించి అతిగా ఆలోచించడం వల్ల మనం జీవితాన్ని ఒక సెకను కూడా పెంచుకోలేము, మంచిగా మార్చుకోలేము. అంతేకాదు, చాలాసార్లు మనం భయపడినట్లుగా జరగకపోవచ్చు. ఒక విద్వాంసుడు ఇలా చెప్తున్నాడు: “భవిష్యత్తు గురించి కంగారు పడడం వల్ల ఒరిగేది ఏమి ఉండదు, ఏదో జరుగుతుందని కంగారు పడతాము, కానీ చాలాసార్లు అలా జరగకపోవచ్చు.”

కంగారు పడకుండా ఎలా ఉండొచ్చు? మొదటిగా, దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు పక్షులకు ఆహారాన్ని ఇస్తున్నాడు, అడవి పువ్వులను అందంగా అలంకరిస్తున్నాడు. అలాంటప్పుడు, జీవితంలో దేవునికి మొదటిస్థానం ఇచ్చిన వాళ్లకు కావాల్సినవి ఇవ్వడా? (మత్తయి 6:25, 26, 28-30) రెండవది, ఏ రోజు గురించి ఆ రోజే ఆలోచించండి. “రేపటినిగూర్చి చింతింపకుడి” అని యేసు చెప్పాడు. “రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును.” “ఏనాటికీడు ఆనాటికి చాలును” అనే విషయాన్ని అందరు ఒప్పుకుంటారు.—మత్తయి 6:34.

యేసు చెప్పిన సలహాను పాటిస్తే, మన ఆరోగ్యం పాడవదు. ముఖ్యంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాన్నే బైబిలు “దేవుని సమాధానము” అని పిలుస్తుంది.—ఫిలిప్పీయులు 4:6, 7. ▪ (w16-E No.1)