కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి ప్రార్థించడం గురించి చాలామంది ఏమంటారు?

దేవునికి ప్రార్థించడం గురించి చాలామంది ఏమంటారు?

“నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా పక్కనే ఉండి, నా చెయ్యి పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. నాకేం చేయాలో తోచనప్పుడు నన్ను నడిపిస్తున్నాడని అనిపిస్తుంది.”—మారియా.

“నా భార్య 13 సంవత్సరాలు కాన్సర్‌తో పోరాడి చనిపోయింది. ఆ సమయంలో నేను ప్రతీరోజు దేవునికి ప్రార్థించడం నాకు గుర్తుంది. నేను బాధలో చెప్పుకుంటున్న విషయాలని ఆయన నిజంగా వింటున్నాడని నాకు అనిపించేది. చాలా మనశ్శాంతిని పొందాను.”—రావుల్‌.

“ప్రార్థించడం దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప వరం.”—ఆర్నే.

మారియా, రావుల్‌, ఆర్నే అలాగే చాలామంది ప్రార్థనను ఒక ప్రత్యేక వరంగా చూస్తున్నారు. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడవచ్చని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చని, సహాయం చేయమని అడగవచ్చని వాళ్లు అనుకుంటారు. దేవునికి ప్రార్థించడం గురించి బైబిలు చెప్తున్న విషయాన్ని వాళ్లు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. బైబిల్లో ఇలా ఉంది: “మనకున్న నమ్మకం ఏమిటంటే, మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.”—1 యోహాను 5:14.

మరోపక్క, చాలామందికి ప్రార్థన గురించి బైబిలు చెప్తున్న విషయాలు అంగీకరించడం కష్టంగా ఉంది. స్టీవ్‌ అనే అతనికి ప్రార్థించడం ఎలా అనిపించిందో వివరిస్తున్నాడు. “నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నా ముగ్గురు స్నేహితులు రెండు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. ఒకతను కార్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడు, ఇంకో ఇద్దరు సముద్రంలో కొట్టుకుపోయారు.” అప్పుడు స్టీవ్‌ ఏం చేశాడు? ఆయన ఇలా అంటున్నాడు, “ఇదంతా ఎందుకు జరిగిందని నేను దేవుణ్ణి అడిగాను, కానీ నాకు ఏ సమాధానం దొరకలేదు. అప్పుడు ‘అసలెందుకు ప్రార్థించాలి?’ అనిపించింది.” చాలామంది తాము చేసే ప్రార్థనలకు జవాబు రానప్పుడు, ‘ప్రార్థించడం వల్ల అసలు ఉపయోగముందా?’ అని అనుకుంటారు.

కొంతమంది వేరే కారణాల్ని బట్టి కూడా ప్రార్థించడంలో ఉపయోగం లేదని అనుకుంటారు. దేవునికి అన్నీ తెలుసు కదా; మన అవసరాలు, మన సమస్యలు ఏంటో ఆయనకు ముందే తెలుసు కాబట్టి వాటి గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదని కొందరు అంటారు.

గతంలో చేసిన తప్పుల కారణంగా దేవుడు తమ ప్రార్థనలను వినడని ఇంకొంతమంది అనుకుంటారు. జెన్ని అనే ఆమె ఇలా చెప్తుంది: “నాకున్న పెద్ద సమస్య ఏంటంటే, నేను ఎందుకూ పనికిరానిదాన్నని, తప్పులు చేశాను కాబట్టి దేవుడు నా ప్రార్థనలు వినడానికి అర్హురాల్ని కాదని నాకు అనిపిస్తుంది.”

ప్రార్థన గురించి మీకేమనిపిస్తుంది? పైన ప్రస్తావించబడిన వాళ్లలాగే మీకూ ప్రార్థన విషయంలో సందేహాలు ఏమైనా ఉంటే, బైబిలు సంతృప్తికరమైన జవాబుల్ని ఇస్తుందని తెలుసుకోవడం వల్ల మీరు ఊరటను పొందవచ్చు. ప్రార్థన గురించి బైబిలు చెప్పేది * మనం నమ్మవచ్చు. ఈ కింద ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేలా బైబిలు మీకు సహాయం చేయగలదు.

  • దేవుడు నిజంగా మన ప్రార్థనలు వింటాడా?

  • కొన్ని ప్రార్థనలకు ఎందుకు జవాబులు దొరకడం లేదు?

  • దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?

  • ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

^ పేరా 9 యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు, అలాగే ఎంతోమంది దేవుని సేవకులు చేసిన ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. సాధారణంగా పాత నిబంధన అని పిలువబడే హీబ్రూ లేఖనాల్లో 150 కన్నా ఎక్కువ ప్రార్థనలు ఉన్నాయి.