కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఏమి చేశాడు?

దేవుడు ఏమి చేశాడు?

మీరు ఎవరి గురించైనా బాగా తెలుసుకోవాలని అనుకుంటే, అతను ఏమేమి సాధించాడో, ఎలాంటి సమస్యలు అధిగమించాడో తెలుసుకోవడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. అదేవిధంగా, మీరు దేవుని గురించి బాగా తెలుసుకోవాలని అనుకుంటే, ఆయన ఏమి చేశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకుంటున్నప్పుడు ఆయన ఎప్పుడో చేసినవన్నీ ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో, భవిష్యత్తులో ఎంత బాగా ఉపయోగపడతాయో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు.

దేవుడు అన్నిటినీ మన మంచి కోసం తయారు చేశాడు

యెహోవా దేవుడు మహాగొప్ప సృష్టికర్త, “ఆయన అదృశ్య లక్షణాలు . . . సృష్టి ఆరంభం నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టించిన వాటిని పరిశీలిస్తే ఆ లక్షణాల్ని గ్రహించవచ్చు.” (రోమీయులు 1:20) “ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.” (యిర్మీయా 10:12) దేవునికి మనపట్ల ఎంత ఆసక్తి ఉందో సృష్టిలో ఉన్న అద్భుతాలు కూడా వెల్లడి చేస్తున్నాయి.

యెహోవా మనల్ని తన “స్వరూపమందు” తయారు చేయడం ద్వారా మనకు ఎంత ప్రత్యేకత ఇచ్చాడో ఆలోచించండి. (ఆదికాండము 1:27) అంటే సాటిలేని ఆయన లక్షణాలను కొంతవరకైనా చూపించగలిగే అవకాశాన్ని మనకు ఇచ్చాడు. దేవుడు మనకు ఆయన గురించి తెలుసుకునే సామర్థ్యాన్ని లేదా ఆయన అభిప్రాయాలు, ఆయన విలువలు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనం వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఎంతో సంతోషాన్ని పొందుతాం, మన జీవితం అర్థవంతంగా ఉంటుంది. వీటికన్నా ఎక్కువగా, మనం ఆయనతో మంచి సంబంధాన్ని కలిగివుండే సామర్థ్యాన్ని ఆయన మనకు ఇచ్చాడు.

దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో భూమిని చూస్తే తెలుస్తుంది. అది మనకు అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటల్లో కనిపిస్తుంది. దేవుడు “మంచి చేయడం ద్వారా ఆయన తన గురించి తాను సాక్ష్యమిచ్చాడు. ఎలాగంటే, ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ, పుష్కలంగా పంటనిచ్చే ఋతువుల్నీ ఇస్తూ ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.” (అపొస్తలుల కార్యాలు 14:17) మనం జీవించడానికి అవసరమైన వాటికంటే ఎక్కువే దేవుడు మనకు ఇచ్చాడు. మనం జీవితాన్ని ఆనందించేలా ఆయన అన్నిటిని పుష్కలంగా, ఎన్నో రకాలుగా తయారుచేశాడు. ఇదంతా ఆయన మనకోసం చేయాలనుకుంటున్న వాటన్నిటిలో రవ్వంత మాత్రమే.

మనుషులు శాశ్వతంగా జీవించేలా యెహోవా భూమిని తయారు చేశాడు. బైబిలు ఇలా చెప్తుంది: “భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు,” “నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు  నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (కీర్తన 115:16; యెషయా 45:18) భూమ్మీద ఎవరు ఉంటారు? ఎంతకాలం ఉంటారు? “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

యెహోవా మొదటి పురుషుడు, స్త్రీ అయిన ఆదాము, హవ్వను తయారు చేశాడు. పరదైసు భూమిని “సేద్యపరచుటకును దాని కాచుటకును” ఆయన వాళ్లను అందులో పెట్టాడు. (ఆదికాండము 2:8, 15) దేవుడు వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే రెండు నియామకాలు ఇచ్చాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:28) అలా భూమ్మీద జీవితాన్ని శాశ్వతంగా ఆనందించే నిరీక్షణ ఆదాము, హవ్వల ముందు ఉంది. విచారకరంగా, వాళ్లు దేవుడు చెప్పిన మాట వినకూడదని నిర్ణయించుకున్నారు, ఆ కారణాన్ని బట్టి వాళ్లు భూమిని స్వతంత్రించుకునే నీతిమంతుల్లో ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కానీ తర్వాత మనం చూడబోతున్నట్లు, వాళ్ల పనుల వల్ల భూమి విషయంలో గానీ, మన విషయంలో గానీ యెహోవాకున్న సంకల్పం మారలేదు. అయినా మొదటిగా మనం, దేవుడు చేసిన మరో విషయాన్ని పరిశీలిద్దాం.

దేవుడు తాను రాయించిన వాక్యాన్ని ఇచ్చాడు

బైబిలుకు దేవుని వాక్యం అనే పేరు కూడా ఉంది. యెహోవా మనకు బైబిలును ఎందుకు ఇచ్చాడు? ముఖ్యంగా మనం ఆయన గురించి తెలుసుకోవడానికి. (సామెతలు 2:1-5) నిజమే దేవుని గురించి మనకున్న ప్రతి ప్రశ్నకు బైబిలు సమాధానం ఇవ్వడం లేదు, ఏ పుస్తకం ఇవ్వలేదు. (ప్రసంగి 3:11) కానీ బైబిల్లో ఉన్న ప్రతీది మనం దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. దేవుడు మనుషులతో ఎలా వ్యవహరించాడో చూడడం ద్వారా ఆయన ఎలాంటివాడో మనం తెలుసుకుంటాం. ఇంకా ఆయనకు ఎలాంటి వాళ్లు ఇష్టమో, ఎలాంటి వాళ్లు ఇష్టం లేదో అందులో మనం గమనించవచ్చు. (కీర్తన 15:1-5) మనం ఆరాధన విషయంలో, నైతిక విషయాల్లో, వస్తుసంపదల విషయాల్లో ఆయన అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవచ్చు. యెహోవా వ్యక్తిత్వం గురించి చాలా స్పష్టమైన రూపాన్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాటలు, పనులు ద్వారా బైబిలు మనకు తెలియజేస్తుంది.—యోహాను 14:9.

మనం సంతోషంగా, అర్థవంతంగా ఎలా జీవించాలో తెలుసుకోవాలనే కారణంతో కూడా యెహోవా తన వాక్యమైన బైబిల్ని ఇచ్చాడు. బైబిలు ద్వారా యెహోవా మనకు సంతోషకరమైన కుటుంబాన్ని ఎలా పొందవచ్చో, సంతృప్తితో ఎలా ఉండవచ్చో, ఆందోళనను ఎలా తట్టుకోవచ్చో చెప్తున్నాడు. ఈ పత్రిక తర్వాత చెప్తున్నట్లు, జీవితంలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలకు అంటే ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు బైబిలు జవాబు ఇస్తుంది. అంతేకాదు, దేవుడు మొదట్లో అనుకున్న తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమి చేశాడో కూడా బైబిలు వివరిస్తుంది.

బైబిలు నిజంగా ఎన్నో విధాలుగా ప్రత్యేకమైన పుస్తకమని, దాన్ని రాయించింది దేవుడే అని చెప్పడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బైబిల్ని రాయడానికి 1,600 సంవత్సరాలు పట్టింది, 40 మంది దాన్ని రాశారు, కానీ దాని ముఖ్య ఉద్దేశం మాత్రం మారలేదు ఎందుకంటే దాన్ని నిజంగా రాయించింది దేవుడే. (2 తిమోతి 3:16) ప్రాచీనకాలంలో ఉన్న మిగతా గ్రంథాల్లా కాకుండా బైబిలు ఎన్నో సంవత్సరాలుగా చక్కగా భద్రపర్చబడిందని, ఎన్నో వేల ప్రాచీన బైబిలు చేతివ్రాత ప్రతులను పరిశీలించడం ద్వారా తెలిసింది. ఇంకా బైబిల్ని అనువదించకుండా, పంచిపెట్టకుండా, చదవకుండా ఉండడానికి చేసిన ఎన్నో ప్రయత్నాలను బైబిలు తట్టుకుంది. నేడు ఎక్కువగా పంచిపెట్టబడుతున్న, అనువదించబడుతున్న పుస్తకం బైబిలే. “దేవుని వాక్యము నిత్యము నిలుచును” అనడానికి బైబిలు ఉనికి ఒక రుజువు.—యెషయా 40:8.

దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు

యెహోవా సాధించిన వాటన్నిటిలో మరొకటి, మన విషయంలో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన చేసిన ప్రత్యేక ఏర్పాటు. ముందు చెప్పుకున్నట్లుగా, మనుషులు భూమ్మీద శాశ్వతంగా జీవించాలనేది ఆయన ఉద్దేశం. కానీ ఆదాము, హవ్వ దేవుని మాట వినకూడదని నిర్ణయించుకుని పాపం చేశారు, అందువల్ల ఆదాము అతనికే కాదు, అతనికి పుట్టబోయే పిల్లలకు కూడా శాశ్వత జీవాన్ని పొందే అవకాశాన్ని పోగొట్టాడు. “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) ఆదాము దేవుని మాట వినకపోవడం, భూమి పట్ల దేవుని సంకల్పం నెరవేరడానికి ఆటంకంగా కనిపించింది. అప్పుడు యెహోవా ఏమి చేశాడు?

యెహోవా దేవుని పనులు ఆయనకున్న లక్షణాలకు అనుగుణంగా ఉంటాయి. ఆయన న్యాయంగానే ఆదాము, హవ్వలు చేసిన పనులకు వాళ్లను బాధ్యులను చేశాడు, కానీ ప్రేమతో వాళ్లకు పుట్టబోయే సంతానానికి కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ పరిస్థితితో ఎలా వ్యవహరించాలో యెహోవా తన తెలివిని బట్టి నిర్ణయించుకుని, వెంటనే ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని ప్రకటించాడు. (ఆదికాండము 3:15) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాపాన్ని, మరణాన్ని తీసేసే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదెలా సాధ్యం?

 ఆదాము తిరుగుబాటు వల్ల వచ్చిన నష్టాల నుండి మనుషులను విడుదల చేయడానికి, జీవమార్గాన్ని బోధించి “ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి” యెహోవా యేసును భూమి మీదకు పంపించాడు. * (మత్తయి 20:28; యోహాను 14:6) యేసు ఆదాములా పరిపూర్ణుడు కాబట్టి ఆయన విమోచన క్రయధనాన్ని అర్పించగలడు. అయితే ఆదాములా కాకుండా యేసు పూర్తిగా, చివరికి చనిపోతున్నప్పుడు కూడా విధేయత చూపించాడు. యేసు చనిపోవడానికి అర్హుడు కాదు కాబట్టి, యెహోవా ఆయనను తిరిగి పరలోకానికి పునరుత్థానం చేశాడు. యేసు ఇప్పుడు ఆదాము చేయలేకపోయిన దాన్ని చేశాడు, అంటే విధేయులైన మనుషులకు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇవ్వగలిగాడు. “ఒక్క మనిషి అవిధేయత ద్వారా అనేకులు పాపులైనట్టే, ఒక్క వ్యక్తి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులౌతారు.” (రోమీయులు 5:19) మనుషులు శాశ్వత కాలం భూమ్మీద జీవిస్తారని తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు యేసు విమోచన క్రయధనం ద్వారా నెరవేర్చాడు.

ఆదాము అవిధేయత చూపించినప్పుడు వచ్చిన పరీక్షలతో యెహోవా వ్యవహరించిన విధానాన్నిబట్టి ఆయన గురించి ఎంతో తెలుసుకోవచ్చు. యెహోవా మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయకుండా ఆయనను ఏదీ ఆపలేదని మనం చూడవచ్చు; ఆయన మాట ఖచ్చితంగా ‘సఫలము’ అవుతుంది. (యెషయా 55:11) యెహోవా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా మనం అర్థం చేసుకున్నాం. “దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి మనమీద తనకున్న ప్రేమను వెల్లడిచేశాడు. మనం ఆ కుమారుని ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు. మన పాపాల కోసం బలిగా అర్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ బలి మనకూ, దేవునికీ మధ్య శాంతిని తిరిగి నెలకొల్పుతుంది. మనం దేవుణ్ణి ప్రేమించినందుకు కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి అలా చేశాడు.”—1 యోహాను 4:9, 10.

దేవుడు “మనందరి కోసం తన సొంత కుమారుణ్ణి మరణానికి అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు,” కాబట్టి “దయతో మిగతావన్నీ” అంటే ఆయన వాగ్దానం చేసినవన్నీ నెరవేరుస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (రోమీయులు 8:32) దేవుడు మనకు చేస్తానని వాగ్దానం చేసినవి ఏంటి? తర్వాత చదవండి.

దేవుడు ఏమి చేశాడు? భూమ్మీద మనుషులు శాశ్వతంగా జీవించాలని యెహోవా వాళ్లను సృష్టించాడు. మనం ఆయన గురించి ఎక్కువ తెలుసుకునేలా బైబిల్ని ఇచ్చాడు. యెహోవా యేసుక్రీస్తు ద్వారా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు, అలా తన సంకల్పం నెరవేరేలా చూశాడు

^ పేరా 16 విమోచన క్రయధనం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలో 5వ అధ్యాయం చూడండి. ఈ పుస్తకం, www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.