కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా ఏం చెప్పినా కాదనకుండా చేయాలని మేము నేర్చుకున్నాం

యెహోవా ఏం చెప్పినా కాదనకుండా చేయాలని మేము నేర్చుకున్నాం

ఒక పెద్ద తుఫాను తర్వాత నది అంతా బురదబురదగా అయిపోయింది. నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే, దాని ధాటికి పెద్దపెద్ద రాళ్లు సైతం కొట్టుకుపోతున్నాయి. మేము అవతలి ఒడ్డుకు వెళ్లాలి, కానీ నదీ ప్రవాహం వల్ల వంతెన పాడైంది. నాకు, నా భర్త హార్వీకి, మాతో పాటు ఉన్న అమీస్‌ భాషా అనువాదకుడికి చాలా భయమేసింది. మాకేం చేయాలో అర్థంకాలేదు. అవతలి ఒడ్డున ఉన్న సహోదరులు కంగారుగా చూస్తుండగా, మేము నది దాటడం మొదలుపెట్టాం. ముందు మా చిన్న కారును కాస్త పెద్ద ట్రక్కులోకి ఎక్కించాం. మా కారు ట్రక్కులో అటుఇటు కదలకుండా ఉండడానికి తాళ్లు గానీ, గొలుసులు గానీ కట్టలేదు. ట్రక్కు అలానే మెల్లగా నదిలోకి వెళ్లింది. ఒడ్డు ఎంతకీ రానట్టు అనిపించింది. మేము యెహోవాకు ప్రార్థిస్తూ మొత్తానికి ఒడ్డుకు చేరుకున్నాం. అది 1971. మేము మా స్వస్థలాలకు వేల మైళ్ల దూరంలో తైవాన్‌ తూర్పు తీరాన ఉన్నాం. మా కథ చెప్తాను, వినండి.

యెహోవాను ప్రేమించడం నేర్చుకున్నాం

హార్వీ వాళ్లు మొత్తం నలుగురు అన్నదమ్ములు. వాళ్లలో హార్వీ పెద్దవాడు. 1930లలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో, పశ్చిమ ఆస్ట్రేలియాలోని మిడ్‌లాండ్‌ జంక్షన్‌లో హార్వీ వాళ్ల కుటుంబం సత్యం తెలుసుకుంది. హార్వీ యెహోవా మీద ప్రేమ పెంచుకుని, 14 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాడు. సంఘంలో ఏ నియామకం ఇచ్చినా కాదనకుండా చేయాలని ఆయన కొంతకాలానికే నేర్చుకున్నాడు. చిన్నప్పుడు ఒకసారి మీటింగ్‌లో కావలికోట చదివే నియామకం ఇచ్చినప్పుడు, తనకు అంత అర్హత లేదనుకుని హార్వీ దాన్ని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ ఒక సహోదరుడు హార్వీతో ఇలా అన్నాడు: “యెహోవా సంస్థలో ఎవరైనా నీకు ఒక పని అప్పగించారంటే, ఆ పని చేసే అర్హత నీకు ఉందని వాళ్లు నమ్ముతున్నట్టు!”—2 కొరిం. 3:5.

నేను, మా అమ్మ, మా చిన్నక్క ఇంగ్లాండ్‌లో సత్యం తెలుసుకున్నాం. తర్వాత మా నాన్న కూడా సత్యం తెలుసుకున్నాడు, కానీ మొదట్లో ఆయన వ్యతిరేకించేవాడు. ఆయనకు ఇష్టం లేకపోయినా నేను బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నా వయసు తొమ్మిది ఏళ్లే. పయినీరు అవ్వాలని, ఆ తర్వాత మిషనరీ అవ్వాలని నేను లక్ష్యం పెట్టుకున్నాను. కానీ, నాకు 21 ఏళ్ల వయసు వచ్చేవరకు మా నాన్న నన్ను పయినీరు సేవ చేయనివ్వడు. అంతవరకు ఆగడం నాకు ఇష్టంలేదు. కాబట్టి నాకు 16 ఏళ్లు వచ్చినప్పుడు మా నాన్న అంగీకారంతో, ఆస్ట్రేలియాలో స్థిరపడిన మా పెద్దక్క దగ్గరికి వెళ్లిపోయాను. మొత్తానికి, 18 ఏళ్లు వచ్చినప్పుడు నేను పయినీరు సేవ మొదలుపెట్టాను.

1951 లో మా పెళ్లి రోజున

ఆస్ట్రేలియాలో నేను హార్వీని కలిశాను. మిషనరీగా సేవ చేయాలనే కోరిక మా ఇద్దరికీ ఉంది. మేము 1951 లో పెళ్లి చేసుకున్నాం. రెండేళ్లు కలిసి పయినీరు సేవ చేసిన తర్వాత, మాకు ప్రాంతీయ సేవ చేసే అవకాశం దొరికింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో మా సర్క్యూట్‌ చాలా పెద్దది. కాబట్టి, ఎడారి లాంటి నిర్మానుష్యమైన ప్రాంతాల గుండా మేము చాలా దూరాలు ప్రయాణించాల్సి వచ్చేది.

మా కల నిజమైంది

1955 లో యాంకీ స్టేడియంలో గిలియడ్‌ గ్రాడ్యుయేషన్‌

1954 లో, గిలియడ్‌ పాఠశాల 25వ తరగతికి మేము ఆహ్వానించబడ్డాం. మిషనరీలు అవ్వాలనే మా కల నిజం కాబోతోంది! మేము ఓడలో న్యూయార్క్‌ చేరుకుని, గిలియడ్‌ పాఠశాలలో బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాం. సిలబస్‌లో భాగంగా మేము స్పానిష్‌ చదవాల్సి వచ్చింది. కానీ ‘r’ అనే అక్షరాన్ని స్పానిష్‌లో పలకడం కష్టంగా ఉండడం వల్ల హార్వీకి అది ఇబ్బందిగా అనిపించింది.

జపాన్‌లో సేవ చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు జపనీస్‌ భాషా తరగతిలో చేరడానికి పేర్లు ఇవ్వవచ్చని పాఠశాల ఉపదేశకులు ప్రకటన చేశారు. ఎక్కడ సేవ చేయాలో మేము నిర్ణయించుకునే బదులు యెహోవా సంస్థే నిర్ణయించాలని మేము కోరుకున్నాం. కాసేపటికి, గిలియడ్‌ ఉపదేశకుల్లో ఒకరైన ఆల్బర్ట్‌ ష్రోడర్‌ మేము పేర్లు ఇవ్వలేదని తెలిసి, “దీని గురించి ఇంకోసారి ఆలోచించండి” అన్నాడు. అయినా మేము వెనకాడేసరికి, ఆయన ఇలా అన్నాడు: “నేను, మిగతా ఉపదేశకులు మీ పేర్లు రాసేశాం. మీకు జపనీస్‌ భాష తేలిగ్గా ఉంటుందేమో చూడండి.” హార్వీకి స్పానిష్‌లో కన్నా జపనీస్‌లో పదాలు పలకడం తేలికైంది.

మేము 1955 లో జపాన్‌కు వచ్చాం. అప్పట్లో జపాన్‌ మొత్తంలో 500 మంది ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. అప్పుడు హార్వీకి 26 ఏళ్లు, నాకు 24 ఏళ్లు. మమ్మల్ని కోబ్‌ అనే రేవు పట్టణానికి నియమించారు, మేము అక్కడ నాలుగు సంవత్సరాలు సేవ చేశాం. తర్వాత మమ్మల్ని మళ్లీ ప్రయాణ సేవకు ఆహ్వానించినప్పుడు మేము సంతోషించాం. మేము నగోయా అనే నగరానికి దగ్గర్లో సేవ చేశాం. అక్కడి సహోదరులు, ఆహారం, అందమైన ప్రదేశాలు మాకు బాగా నచ్చాయి. అయితే కొంతకాలానికే, యెహోవా అడిగింది కాదనకుండా చేసే మరో అవకాశం మాకు వచ్చింది.

కొత్త నియామకంలో వచ్చిన కొత్త సవాళ్లు

1957 లో జపాన్‌లోని కోబ్‌లో నేను, హార్వీ, ఇతర మిషనరీలు

మూడేళ్లు ప్రాంతీయ సేవ చేసిన తర్వాత, జపాన్‌ బ్రాంచి మమ్మల్ని తైవాన్‌కు వెళ్లి అమీస్‌ ప్రజల మధ్య సేవ చేయగలరా అని అడిగింది. ఎందుకంటే అక్కడ మతభ్రష్టత్వం మొదలైంది. వాళ్లకు సహాయం చేయడానికి జపనీస్‌ భాష వచ్చిన ఒక సహోదరుడు కావాలని తైవాన్‌ బ్రాంచి కోరింది. * జపాన్‌లో సేవ చేయడం మాకు బాగా నచ్చింది కాబట్టి, దాన్ని విడిచిపెట్టి తైవాన్‌కు వెళ్లడం కష్టంగా అనిపించింది. కానీ ఏ నియామకం ఇచ్చినా దాన్ని కాదనకూడదని హార్వీ నేర్చుకున్నాడు, కాబట్టి మేము తైవాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.

మేము 1962, నవంబరులో తైవాన్‌కు వచ్చాం. అప్పట్లో అక్కడ 2,271 మంది ప్రచారకులు ఉన్నారు, వాళ్లలో చాలామంది అమీస్‌ తెగకు చెందినవాళ్లే. కానీ ముందు మేము చైనీస్‌ భాష నేర్చుకోవాలి. మా దగ్గర చైనీస్‌ భాష నేర్చుకోవడానికి ఒక పుస్తకం ఉంది, ఒక టీచర్‌ కూడా ఉన్నారు. కాకపోతే టీచర్‌కి ఇంగ్లీషు రాదు. ఎలాగోలా మేము చైనీస్‌ నేర్చుకున్నాం.

తైవాన్‌కు రాగానే హార్వీని బ్రాంచి సేవకునిగా నియమించారు. బ్రాంచి చిన్నదే కాబట్టి, హార్వీ బ్రాంచికి సంబంధించిన పనులతో పాటు, నెలలో మూడు వారాలు అమీస్‌ సహోదరులతో కలిసి పని చేసేవాడు. అంతేకాదు, ఆయన మధ్యమధ్యలో జిల్లా పర్యవేక్షకునిగా కూడా పని చేసి ప్రాంతీయ సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చేవాడు. హార్వీ జపనీస్‌ భాషలో ప్రసంగాలు ఇచ్చినా అమీస్‌ సహోదరులు అర్థం చేసుకోగలిగేవాళ్లు. కానీ మతపరమైన కూటాలు చైనీస్‌ భాషలో మాత్రమే జరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి, హార్వీ ఇబ్బందిపడుతూనే చైనీస్‌ భాషలో ప్రసంగాలు ఇస్తుండేవాడు, ఒక సహోదరుడు అమీస్‌ భాషలోకి అనువదించేవాడు.

అప్పట్లో తైవాన్‌ సైనిక ప్రభుత్వం కింద ఉండేది, కాబట్టి సహోదరులు ప్రాంతీయ సమావేశాలు జరుపుకోవాలంటే అనుమతి తెచ్చుకోవాలి. అనుమతి అంత తేలిగ్గా దొరికేది కాదు, పైగా పోలీసులు తరచూ అనుమతి ఇవ్వడానికి ఆలస్యం చేసేవాళ్లు. ఒకవేళ ప్రాంతీయ సమావేశం జరిగే వారం కల్లా పోలీసులు అనుమతి ఇవ్వకపోతే, వాళ్లు అనుమతి ఇచ్చేవరకు హార్వీ పోలీస్‌ స్టేషన్‌లోనే కూర్చునేవాడు. అలా ఒక విదేశీయుడు తమ స్టేషన్‌లో వేచి ఉండడం ఇబ్బందిగా అనిపించి పోలీసులు వెంటనే అనుమతి ఇచ్చేవాళ్లు.

మొదటిసారి పర్వతం ఎక్కడం

తైవాన్‌లో పరిచర్యకు వెళ్తూ, ఒక చిన్న నదిని దాటుతున్నాం

సహోదరులతో గడిపే ఆ కొన్ని వారాలు మేము పర్వతాలు ఎక్కుతూ, నదులు దాటుతూ, గంట కన్నా ఎక్కువసేపు నడిచేవాళ్లం. నేను మొదటిసారి పర్వతం ఎక్కడం నాకింకా గుర్తుంది. ఆ రోజు, ఒక మారుమూల గ్రామానికి వెళ్లడానికి మేము ఉదయాన్నే త్వరత్వరగా టిఫిన్‌ తినేసి 5:30కి బస్సు ఎక్కాం. తర్వాత నడుచుకుంటూ ఒక పెద్ద నది దాటాం, ఏటవాలుగా ఉన్న పర్వతం ఎక్కాం. ఆ పర్వతం ఎంత ఏటవాలుగా ఉందంటే నా ముందు నడుస్తున్న సహోదరుని పాదాలు నా కళ్లకు దగ్గరగా ఉన్నాయి.

ఆ రోజు ఉదయం, హార్వీ కొంతమంది స్థానిక సహోదరులతో కలిసి పరిచర్య చేశాడు. నేను జపనీస్‌ మాట్లాడే ప్రజలు ఉండే చోట ఒక్కదాన్నే పరిచర్య చేశాను. నేను టిఫిన్‌ చేసి చాలా గంటలు అయింది కాబట్టి, మధ్యాహ్నం ఒంటి గంటకల్లా బాగా నీరసం వచ్చేసింది. నేను హార్వీని కలిసేసరికి వేరే సహోదరులు ఎవరూ లేరు. పరిచర్యలో హార్వీ కొన్ని పత్రికలు ఇచ్చినప్పుడు ఇంటివాళ్లు మూడు పచ్చి కోడిగుడ్లు ఇచ్చారు. ఒక గుడ్డుకు చిన్న రంధ్రం పెట్టి, దానిలోని సొన ఎలా తాగాలో హార్వీ నాకు చూపించాడు. అంత రుచిగా లేకపోయినా నేను ఒక గుడ్డు తిన్నాను. మరి, మూడో గుడ్డు మా ఇద్దరిలో ఎవరు తినాలి? ఒకవేళ నేను కళ్లు తిరిగి పడిపోతే నన్ను పర్వతం మీద నుండి కిందికి మోసుకెళ్లడం కష్టమని హార్వీ ఆ మూడో గుడ్డు నాకే ఇచ్చాడు.

కష్టమైన పరిస్థితుల మధ్య స్నానం చేయడం

ఒక ప్రాంతీయ సమావేశమప్పుడు నాకు ఊహించని అనుభవం ఎదురైంది. మేము రాజ్యమందిరం పక్కనే ఉన్న ఒక సహోదరుని ఇంట్లో ఉన్నాం. అమీస్‌ వాళ్లు స్నానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ప్రాంతీయ పర్యవేక్షకుని భార్య మా స్నానానికి ఏర్పాట్లు చేసింది. హార్వీ బిజీగా ఉండడం వల్ల ముందు నన్ను స్నానం చేయమన్నాడు. అక్కడ స్నానం కోసం ఒక బకెట్‌ చన్నీళ్లు, ఒక బకెట్‌ వేడి నీళ్లు, ఒక ఖాళీ బకెట్‌ ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, ప్రాంతీయ పర్యవేక్షకుని భార్య ఇంటి బయట మా స్నానానికి ఏర్పాట్లు చేసింది. అక్కడినుండి రాజ్యమందిరంలో ప్రాంతీయ సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్న సహోదరులు స్పష్టంగా కనిపిస్తున్నారు. నేను అడ్డుగా పెట్టుకోవడానికి ఏదైనా కర్టెన్‌ ఇవ్వమని ఆమెను అడిగాను. ఆమె చాలా పల్చగా ఉన్న ఒక ప్లాస్టిక్‌ షీట్‌ ఇచ్చింది. నేను ఇంటి వెనక చెట్ల మధ్యకు వెళ్దామనుకున్నాను. కానీ అక్కడ బాతులు కంచెలోకి తల దూర్చి, దగ్గరికి వచ్చినవాళ్లను పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ‘సహోదరులు ఎలాగూ బిజీగా ఉన్నారు కాబట్టి నన్ను గమనించకపోవచ్చు. ఒకవేళ నేను స్నానం చేయకపోతే వాళ్లు అభ్యంతరపడతారు. కాబట్టి ఎలాగోలా కానిచ్చేద్దాం’ అనుకున్నాను. అలాగే చేశాను.

అమీస్‌ సాంప్రదాయ దుస్తుల్లో నేను, హార్వీ

అమీస్‌ భాషలో ప్రచురణలు

చదువు రాకపోవడం వల్ల, తమ భాషలో ప్రచురణలు లేకపోవడం వల్ల అమీస్‌ సహోదరుల్లో చాలామంది ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించలేకపోతున్నారని హార్వీ గమనించాడు. అమీస్‌ భాషను ఇంగ్లీషు అక్షరాలతో రాయడం అప్పుడే కొత్తగా మొదలైంది, కాబట్టి సహోదరులకు తమ భాషను ఎలా చదవాలో నేర్పించడం మంచిదని మాకు అనిపించింది. అది చాలా పెద్ద పనే, కానీ దానివల్ల సహోదరులు మెల్లమెల్లగా తమ సొంత భాషలో యెహోవా గురించి నేర్చుకోగలిగారు. 1960ల చివర్లో అమీస్‌ భాషలో ప్రచురణలు అందుబాటులోకి వచ్చాయి. 1968 లో కావలికోట పత్రికను అమీస్‌ భాషలో ప్రచురించడం మొదలుపెట్టారు.

అయితే, చైనీస్‌ కాకుండా వేరే భాషలో ఉన్న ప్రచురణల్ని ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి, సమస్యలు రాకుండా ఉండడానికి సహోదరులు అమీస్‌ భాషలోని కావలికోటను వేర్వేరు విధాలుగా ప్రచురించారు. ఉదాహరణకు, కొన్ని నెలలపాటు చైనీస్‌-అమీస్‌ రెండు భాషలూ ఉన్న కావలికోట సంచికను మేము ఉపయోగించాం. కాబట్టి మా మీద ఎవరికైనా అనుమానం వచ్చినా, ఆ పత్రికను చూసి, మేము స్థానిక ప్రజలకు చైనీస్‌ భాష నేర్పిస్తున్నామని అనుకునేవాళ్లు. అప్పటినుండి, ఈ ప్రియమైన ప్రజలు బైబిలు సత్యాలు తెలుసుకునేలా సహాయం చేయడానికి యెహోవా సంస్థ అమీస్‌ భాషలో ఎన్నో ప్రచురణలు తయారుచేసింది.—అపొ. 10:34, 35.

శుద్ధి చేసే సమయం

1960, 1970లలో చాలామంది అమీస్‌ సహోదరులు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించేవాళ్లు కాదు. బైబిలు సూత్రాల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కొంతమంది అనైతికంగా జీవించేవాళ్లు, అతిగా తాగేవాళ్లు, పొగాకు అలాగే వక్క ఉపయోగించేవాళ్లు. హార్వీ చాలా సంఘాలు సందర్శించి, ఈ విషయాల్లో యెహోవా అభిప్రాయం ఏంటో అర్థం చేసుకునేలా సహోదరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. నేను ఆర్టికల్‌ ప్రారంభంలో చెప్పింది, అలాంటి ఒక ప్రయాణంలో జరిగిన సంఘటనే.

వినయస్థులైన సహోదరులు మార్పులు చేసుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ విచారకరంగా, చాలామంది మార్పులు చేసుకోలేదు. దాంతో 20 సంవత్సరాల్లో, తైవాన్‌లోని ప్రచారకుల సంఖ్య సుమారు 2,450 నుండి 900కి పడిపోయింది. అది మమ్మల్ని చాలా నిరుత్సాహపర్చింది. కానీ అపవిత్రంగా ఉన్న సంస్థను యెహోవా ఎన్నడూ దీవించడని మాకు తెలుసు. (2 కొరిం. 7:1) క్రమక్రమంగా చెడు పనుల నుండి సంఘం శుద్ధి చేయబడింది. యెహోవా దీవెన వల్ల, ఇప్పుడు తైవాన్‌లో 11,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు.

1980ల నుండి అమీస్‌ సంఘాలు ఆధ్యాత్మికంగా మెరుగవ్వడం మేము చూశాం. అంతేకాదు హార్వీ చైనీస్‌ సహోదరులతో ఎక్కువ సమయం గడపగలిగాడు. చాలామంది సహోదరీల భర్తలు సత్యంలోకి వచ్చేలా హార్వీ సహాయం చేశాడు. అలాంటివాళ్లలో ఒకతను జీవితంలో మొదటిసారి యెహోవాకు ప్రార్థించడం చూసి తనకు సంతోషంగా అనిపించిందని హార్వీ నాతో అన్నాడు. యెహోవాకు దగ్గరయ్యేలా మంచి మనసున్న ఎంతోమందికి సహాయం చేసే అవకాశం నాకు కూడా దొరికింది. అంతేకాదు, నేను స్టడీ ఇచ్చినవాళ్ల కొడుకుతో, కూతురితో కలిసి తైవాన్‌ బ్రాంచిలో సేవ చేయడం నాకు సంతోషంగా అనిపించింది.

ఒక విషాదం

ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. దాదాపు 59 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత, నా ప్రియమైన భర్త కాన్సర్‌తో పోరాడి 2010, జనవరి 1న చనిపోయాడు. ఆయన దాదాపు 60 సంవత్సరాలు పూర్తికాల సేవ చేశాడు. ఇప్పటికీ హార్వీ నాకు బాగా గుర్తొస్తాడు. కానీ రెండు మంచి దేశాల్లో హార్వీతో కలిసి పని చేసినందుకు నాకు సంతోషంగా ఉంది! మేము రెండు కష్టమైన ఆసియా భాషల్ని నేర్చుకున్నాం, నేను మాట్లాడడం మాత్రమే నేర్చుకున్నాను, హార్వీ రాయడం కూడా నేర్చుకున్నాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత, నా వయసుపైబడింది కాబట్టి నేను ఆస్ట్రేలియాకు తిరిగెళ్లడం మంచిదని పరిపాలక సభ నిర్ణయించింది. నాకు తైవాన్‌ విడిచి వెళ్లాలనిపించలేదు. కానీ యెహోవా సంస్థ ఏం చెప్పినా, కాదనకుండా చేయాలని హార్వీ నాకు నేర్పించాడు. కాబట్టి నేను ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాను. అదెంత తెలివైన పనో నాకు తర్వాత అర్థమైంది.

జపనీస్‌, చైనీస్‌ భాషల్లో టూర్లు ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది

నేను ఇప్పుడు సోమవారం నుండి శుక్రవారం వరకు ఆస్ట్రలేషియా బ్రాంచిలో పని చేస్తున్నాను, శని-ఆదివారాల్లో స్థానిక సంఘంతో కలిసి పని చేస్తున్నాను. బెతెల్‌లో జపనీస్‌, చైనీస్‌ భాషల్లో టూర్లు ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. హార్వీ పునరుత్థానమయ్యే రోజు కోసం నేను ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. యెహోవా ఏం చెప్పినా కాదనకుండా చేయాలని నేర్చుకున్న హార్వీ, ఆయన జ్ఞాపకంలో భద్రంగా ఉన్నాడని నాకు తెలుసు.—యోహా. 5:28, 29.

^ పేరా 14 ఇప్పుడు తైవాన్‌కు చైనీస్‌ అధికారిక భాషగా ఉన్నప్పటికీ, చాలా దశాబ్దాలు జపనీస్‌ భాషే దాని అధికారిక భాషగా ఉండేది. కాబట్టి ఇప్పటికీ తైవాన్‌లోని చాలా తెగలవాళ్లు జపనీస్‌ భాష మాట్లాడతారు.