కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 1

కంగారుపడకుండా యెహోవా మీద నమ్మకం ఉంచండి

కంగారుపడకుండా యెహోవా మీద నమ్మకం ఉంచండి

2021 వార్షిక వచనం: “మీరు కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”—యెష. 30:15.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. దావీదు రాజులాగే మనలో కొంతమంది ఏమని అడగవచ్చు?

మనందరం కంగారుపడకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాం. ఆందోళనపడడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ కొన్నిసార్లు మనకు చాలా ఆందోళనగా అనిపించవచ్చు. అందుకే, దావీదు రాజు యెహోవాను అడిగిన ఈ ప్రశ్నే కొంతమంది దేవుని సేవకులు కూడా అడగవచ్చు: “ప్రతీరోజు హృదయ వేదన అనుభవిస్తూ నేను ఎంతకాలం ఆందోళనపడాలి?”—కీర్త. 13:2.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 మనం ఆందోళనను పూర్తిగా తీసేసుకోలేకపోయినా, దాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో, ముందుగా ఎలాంటి విషయాల వల్ల మనకు ఆందోళన కలగవచ్చో తెలుసుకుంటాం. తర్వాత, సమస్యలు వచ్చినప్పుడు కంగారుపడకుండా ఉండడానికి సహాయం చేసే ఆరు విషయాల్ని పరిశీలిస్తాం.

ఏ విషయాలు మనకు ఆందోళన కలిగించవచ్చు?

3. మనం ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం? వాటిని ఆపడం మన చేతిలో ఉందా?

3 చాలా విషయాల వల్ల మనకు ఆందోళన కలగవచ్చు. వాటిలో కొన్ని మన చేతిలో లేని విషయాలు. ఉదాహరణకు, ప్రతీ సంవత్సరం ఆహారం, బట్టలు, ఇల్లు వంటివాటి ధరలు ఎంత పెరుగుతాయి అనేది మన చేతిలో ఉండదు. అంతేకాదు తోటి ఉద్యోగులు లేదా తోటి విద్యార్థులు మన నిజాయితీని, నైతికతను ఎన్నిసార్లు పరీక్షిస్తారో మనం చెప్పలేం. పైగా మన చుట్టూ జరుగుతున్న నేరాల్ని మనం ఆపలేం. లోకంలోని చాలామంది బైబిలు సూత్రాల ప్రకారం ఆలోచించట్లేదు కాబట్టే మనం అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. “ఈ వ్యవస్థలో ఉన్న ఆందోళనల” వల్ల కొంతమంది యెహోవాను సేవించడం ఆపేస్తారని లోక పరిపాలకుడైన సాతానుకు తెలుసు. (మత్త. 13:22; 1 యోహా. 5:19) ఈ లోకం ఆందోళన కలిగించే విషయాలతో నిండిపోవడంలో ఆశ్చర్యం లేదు!

4. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురైతే మనకు ఎలా అనిపించవచ్చు?

4 తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురైతే మనం బాగా ఆందోళనపడతాం. ఉదాహరణకు, మన అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించలేమని, అనారోగ్యం వస్తుందని, పని చేయలేమని, లేదా ఉద్యోగం పోతుందని మనం ఆందోళనపడవచ్చు. దేవుని నియమానికి విరుద్ధమైన పని చేయమనే ఒత్తిడి వచ్చినప్పుడు, మనం నమ్మకంగా ఉంటామో ఉండమో అని కూడా ఆందోళనపడవచ్చు. భవిష్యత్తులో సాతాను తన అధీనంలో ఉన్న ప్రజల్ని ఉపయోగించి దేవుని సేవకుల మీద దాడి చేస్తాడు. కాబట్టి ఆ దాడి సమయంలో మనం ఎలా స్పందిస్తామో అని ఆందోళనపడవచ్చు. అలాంటి విషయాల గురించి కొంచెం ఆందోళనపడడం తప్పా?

5. “ఆందోళన పడడం మానేయండి” అని చెప్తున్నప్పుడు యేసు ఉద్దేశం ఏంటి?

5 “ఆందోళన పడడం మానేయండి” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 6:25) అంటే మనం దేని గురించీ ఆందోళన పడకూడదని ఆయన చెప్తున్నాడా? కాదు. గతంలో దేవుని నమ్మకమైన సేవకుల్లో కొంతమంది ఆందోళనతో సతమతమయ్యారు, కానీ వాళ్లు యెహోవా ఆమోదాన్ని కోల్పోలేదు. * (1 రాజు. 19:4; కీర్త. 6:3) నిజానికి, యేసు మనకు భరోసా ఇస్తున్నాడు. మనం జీవిత అవసరాల గురించి అతిగా ఆందోళనపడుతూ దేవుని సేవ నుండి పక్కకు మళ్లకూడదని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆందోళనను తగ్గించుకోవడానికి మనం ఏం చేయవచ్చు?—“ ఈ లేఖనాన్ని ఎలా పాటించవచ్చు?” బాక్సు చూడండి.

కంగారుపడకుండా ఉండడానికి సహాయం చేసే ఆరు విషయాలు

6వ పేరా చూడండి *

6. ఫిలిప్పీయులు 4:6, 7 ప్రకారం, మన ఆందోళన తగ్గించుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

6 (1) తరచూ ప్రార్థించండి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు యెహోవాకు పట్టుదలగా ప్రార్థించడం ద్వారా ఊరట పొందవచ్చు. (1 పేతు. 5:7) మీ ప్రార్థనలకు జవాబుగా, ‘మానవ అవగాహనకు మించిన దేవుని శాంతిని’ మీరు పొందుతారు. (ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.) యెహోవా తన పవిత్రశక్తి ద్వారా మన ఆందోళన తగ్గించి, ప్రశాంతతను ఇస్తాడు.—గల. 5:22.

7. యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి?

7 యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించండి. నిర్దిష్టంగా ప్రార్థించండి. అంటే మీకున్న సమస్య ఏంటో, దాని గురించి మీకు ఎలా అనిపిస్తుందో ఆయనకు వివరంగా చెప్పండి. ఒకవేళ మీ సమస్యకు పరిష్కారం ఉందనిపిస్తే, దాన్ని కనుగొనడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని, దాన్ని అమలు చేయడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని అడగండి. ఒకవేళ ఆ సమస్య విషయంలో మీరు చేయగలిగింది ఏమీ లేకపోతే, దాని గురించి అతిగా ఆందోళనపడకుండా ఉండడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. మీరు నిర్దిష్టంగా ప్రార్థించినప్పుడు, యెహోవా మీ ప్రార్థనలకు ఎలా జవాబిస్తున్నాడో ఇంకా స్పష్టంగా చూడగలుగుతారు. మీ ప్రార్థనలకు జవాబు వెంటనే రాకపోయినా, ప్రార్థించడం ఆపకండి. మీరు నిర్దిష్టంగానే కాదు పట్టుదలగా కూడా ప్రార్థించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—లూకా 11:8-10.

8. ప్రార్థనలో మనం ఏం చెప్పడం మర్చిపోకూడదు?

8 ప్రార్థనలో మీ ఆందోళనంతా యెహోవా మీద వేస్తున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. మనం ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, ఆయన చేసిన మేలుల గురించి ఆలోచించడం మంచిది. ఇంకొన్నిసార్లు మీరు లోలోపల ఎంత వేదన పడుతున్నారో మాటల్లో చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు ‘దయచేసి సహాయం చేయి’ అని చేసే చిన్న ప్రార్థనను కూడా యెహోవా వింటాడని గుర్తుంచుకోండి.—2 దిన. 18:31; రోమా. 8:26.

9వ పేరా చూడండి *

9. భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

9 (2మీ తెలివి మీద కాకుండా, యెహోవా తెలివి మీద ఆధారపడండి. క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దంలో యూదా ప్రజలు అష్షూరీయుల దాడి గురించి భయపడ్డారు. (యెష. 30:1, 2) ఎలాగైనా అష్షూరీయుల నుండి తప్పించుకోవాలన్న కంగారులో వాళ్లు అన్యులైన ఐగుప్తీయుల సహాయం కోరారు. వాళ్లు తీసుకున్న తప్పుడు నిర్ణయం నాశనానికి నడిపిస్తుందని యెహోవా హెచ్చరించాడు. (యెష. 30:7, 12, 13) భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలో యెహోవా యెషయా ద్వారా వాళ్లకు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు కంగారుపడకుండా, [యెహోవా మీద] నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”—యెష. 30:15బి.

10. మనం ఎలాంటి పరిస్థితుల్లో యెహోవా మీద నమ్మకం ఉందని చూపించవచ్చు?

10 యెహోవా మీద నమ్మకం ఉందని మనం ఎలా చూపించవచ్చు? కొన్ని ఉదాహరణలు పరిశీలించండి: బహుశా మీకు మంచి జీతం వచ్చే ఉద్యోగ అవకాశం రావచ్చు, కానీ దానివల్ల ఎక్కువ గంటలు పనిచేస్తూ యెహోవా సేవను అంతకుముందులా చేయలేకపోవచ్చు. లేదా మీ తోటి ఉద్యోగి మిమ్మల్ని ఇష్టపడుతుండవచ్చు, కానీ ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షి కాదు. లేదా మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుడు, ‘నేను కావాలో మీ దేవుడు కావాలో తేల్చుకో’ అని మీతో అనవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ప్రతీ సందర్భంలో మీకు కావాల్సిన నిర్దేశాన్ని యెహోవా ఇస్తాడు. (మత్త. 6:33; 10:37; 1 కొరిం. 7:39) అయితే ప్రశ్న ఏంటంటే, మీరు యెహోవా మీద నమ్మకం ఉంచుతూ ఆయన నిర్దేశానికి లోబడతారా?

11వ పేరా చూడండి *

11. వ్యతిరేకత ఎదురైనప్పుడు కంగారుపడకుండా ఉండడానికి ఏ బైబిలు ఉదాహరణలు సహాయం చేస్తాయి?

11 (3) మంచి ఉదాహరణల నుండి, చెడ్డ ఉదాహరణల నుండి నేర్చుకోండి. కంగారుపడకుండా యెహోవా మీద నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో తెలిపే ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాటిని చదువుతున్నప్పుడు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా కంగారుపడకుండా ఉండడానికి దేవుని సేవకులకు ఏది సహాయం చేసిందో గమనించండి. ఉదాహరణకు, ప్రకటించడం ఆపమని యూదుల మహాసభ అపొస్తలుల్ని ఆదేశించినప్పుడు వాళ్లు భయపడలేదు. బదులుగా వాళ్లు ధైర్యంగా ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.” (అపొ. 5:29) కొరడాలతో కొట్టినా అపొస్తలులు బెదిరిపోలేదు. ఎందుకు? ఎందుకంటే యెహోవా తమ వైపు ఉన్నాడని, తమను చూసి సంతోషిస్తున్నాడని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు మానకుండా మంచివార్త ప్రకటించారు. (అపొ. 5:40-42) అదేవిధంగా, శిష్యుడైన స్తెఫను చనిపోబోతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా, నెమ్మదిగా ఉన్నాడంటే ఆయన ముఖం “దేవదూత ముఖంలా” కనిపించింది. (అపొ. 6:12-15) ఎందుకంటే యెహోవా తనను చూసి సంతోషిస్తున్నాడని ఆయనకు తెలుసు.

12. మొదటి పేతురు 3:14; 4:14 ప్రకారం, మనం హింసించబడినా ఎందుకు సంతోషించవచ్చు?

12 యెహోవా అపొస్తలుల వైపు ఉన్నాడనే రుజువు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆయన వాళ్లకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. (అపొ. 5:12-16; 6:8) నేడు మనకు అలాంటి శక్తిని ఇవ్వట్లేదు. కానీ యెహోవా తన వాక్యం ద్వారా ప్రేమతో మనకు భరోసా ఇస్తున్నాడు. నీతి కోసం బాధలు పడుతున్నప్పుడు మనకు యెహోవా ఆమోదం ఉంటుందని, ఆయన పవిత్రశక్తి మన మీద ఉంటుందని బైబిలు చెప్తుంది. (1 పేతురు 3:14; 4:14 చదవండి.) కాబట్టి భవిష్యత్తులో తీవ్రమైన హింస ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తామో అని ఆందోళనపడే బదులు, యెహోవా మనల్ని కాపాడగలడు, విడిపించగలడు అనే నమ్మకాన్ని బలపర్చుకోవడానికి ఇప్పుడు ఏం చేయగలమో ఆలోచించాలి. మొదటి శతాబ్దంలోని శిష్యుల్లాగే, యేసు ఇచ్చిన ఈ మాట మీద మనం నమ్మకం ఉంచాలి: “మీ వ్యతిరేకులందరు కలిసినా ఎదిరించలేని, తిప్పికొట్టలేని తెలివిని, మాటల్ని నేను మీకు ఇస్తాను.” యేసు ఈ అభయం కూడా ఇచ్చాడు: “మీ సహనం వల్ల మీరు మీ ప్రాణాలు రక్షించుకుంటారు.” (లూకా 21:12-19) తనకు నమ్మకంగా ఉండి చనిపోయిన సేవకులకు సంబంధించిన ప్రతీ చిన్న వివరాన్ని యెహోవా గుర్తుపెట్టుకుని, వాళ్లను పునరుత్థానం చేస్తాడని మర్చిపోకండి.

13. యెహోవా మీద నమ్మకం ఉంచనివాళ్ల గురించి పరిశీలించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

13 యెహోవా మీద నమ్మకం ఉంచనివాళ్ల నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ చెడ్డ ఉదాహరణల్ని పరిశీలించడం వల్ల, వాళ్లు చేసిన పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్తపడతాం. ఉదాహరణకు, యూదా రాజైన ఆసా పరిపాలన ప్రారంభంలో, ఒక పెద్ద సైన్యం దేశం మీద దాడి చేసింది. అప్పుడు ఆసా యెహోవా మీద ఆధారపడ్డాడు, ఆయన సహాయంతో ఆ సైన్యాన్ని ఓడించాడు. (2 దిన. 14:9-12) కానీ ఆ తర్వాత అంతకన్నా చిన్న సైన్యంతో ఇశ్రాయేలు రాజైన బయెషా ఆసా మీదికి వచ్చాడు. ఈసారి ఆసా రక్షణ కోసం యెహోవా వైపు చూడకుండా, సిరియన్లకు డబ్బు ఇచ్చి వాళ్ల సహాయం అడిగాడు. (2 దిన. 16:1-3) ముసలితనంలో తీవ్రమైన జబ్బు వచ్చినప్పుడు కూడా ఆసా యెహోవా మీద ఆధారపడలేదు.—2 దిన. 16:12.

14. ఆసా చేసిన పొరపాట్ల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

14 మొదట్లో, ఆసా సమస్యలు రాగానే యెహోవా మీద ఆధారపడ్డాడు. కానీ తర్వాత సహాయం కోసం దేవుని వైపు చూసే బదులు, సమస్యల్ని తానే పరిష్కరించగలనని అనుకున్నాడు. మామూలుగా చూస్తే, ఆసా ఇశ్రాయేలుతో పోరాడడానికి సిరియన్ల సహాయం తీసుకోవడం తెలివైన పనిలాగే కనిపించవచ్చు. కానీ ఆయన సాధించిన విజయం ఎంతోకాలం నిలవలేదు. యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఆసాతో ఇలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవా మీద ఆధారపడకుండా, సిరియా రాజు మీద ఆధారపడ్డావు కాబట్టి, సిరియా రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకుంది.” (2 దిన. 16:7) కాబట్టి యెహోవా తన వాక్యం ద్వారా ఇస్తున్న నిర్దేశాన్ని పట్టించుకోకుండా, సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలం అని అనుకోకూడదు. అత్యవసరమైన పరిస్థితి వచ్చినా, కంగారుపడకుండా యెహోవా మీద ఆధారపడాలి. అలా చేస్తే మనం విజయం సాధించేలా ఆయన సహాయం చేస్తాడు.

15వ పేరా చూడండి *

15. బైబిలు చదువుతున్నప్పుడు మనం ఏం చేయవచ్చు?

15 (4) బైబిలు వచనాల్ని గుర్తుపెట్టుకోండి. మీరు బైబిలు చదువుతున్నప్పుడు, కంగారుపడకుండా యెహోవా మీద నమ్మకం ఉంచడమే బలం అని తెలిపే లేఖనాలు కనిపిస్తే, వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వాటిని బయటికి చదవడం, లేదా వాటిని రాసిపెట్టుకుని తరచూ చదువుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. తెలివిగా నడుచుకోవాలంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రోజూ చిన్న స్వరంతో చదవాలని యెహోవా యెహోషువకు చెప్పాడు. భయపడకుండా, ధైర్యంగా దేవుని ప్రజల్ని నడిపించడానికి కూడా అది ఆయనకు సహాయం చేస్తుంది. (యెహో. 1:8, 9, అధస్సూచి) ఆందోళన లేదా భయం కలిగించే పరిస్థితుల్లో మనశ్శాంతిగా ఉండడానికి దేవుని వాక్యంలో ఉన్న ఎన్నో వచనాలు మీకు సహాయం చేస్తాయి.—కీర్త. 27:1-3; సామె. 3:25, 26.

16వ పేరా చూడండి *

16. మనం కంగారుపడకుండా తన మీద నమ్మకం ఉంచేలా యెహోవా సంఘం ద్వారా ఎలా సహాయం చేస్తాడు?

16 (5) దేవుని ప్రజలతో సహవసించండి. మనం కంగారుపడకుండా తన మీద నమ్మకం ఉంచేలా యెహోవా సహోదర సహోదరీల్ని ఉపయోగించి సహాయం చేస్తాడు. మీటింగ్స్‌లో ప్రసంగాల నుండి వచ్చే ఉపదేశం ద్వారా, ప్రేక్షకులు చేసే వ్యాఖ్యానాల ద్వారా, సహోదర సహోదరీల ప్రోత్సాహకరమైన మాటల ద్వారా మనం ప్రయోజనం పొందుతాం. (హెబ్రీ. 10:24, 25) అంతేకాదు మన ఆందోళనల్ని సంఘంలో ఉన్న స్నేహితులకు చెప్పుకున్నప్పుడు మనకు ప్రోత్సాహంగా ఉంటుంది. స్నేహితులు చెప్పే “మంచి మాట” మన హృదయంలో ఉన్న భారాన్ని దించేసుకోవడానికి సహాయం చేస్తుంది.—సామె. 12:25.

17వ పేరా చూడండి *

17. హెబ్రీయులు 6:19 ప్రకారం, కష్టాలు వచ్చినప్పుడు స్థిరంగా ఉండడానికి రాజ్య నిరీక్షణ ఎలా సహాయం చేస్తుంది?

17 (6) మీ నిరీక్షణను బలంగా ఉంచుకోండి. రాజ్య నిరీక్షణ “మన ప్రాణాలకు లంగరులా” పని చేసి, కష్టాలు లేదా ఆందోళనలు మనల్ని ముంచెత్తినప్పుడు స్థిరంగా ఉండడానికి సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 6:19 చదవండి.) అసలు ఏ ఆందోళనా ఉండని మంచి రోజులు తెస్తానని యెహోవా చేసిన వాగ్దానం గురించి ధ్యానించండి. (యెష. 65:17) ఆందోళన కలిగించే పరిస్థితులు ఉండని ప్రశాంతమైన కొత్తలోకంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. (మీకా 4:4) అంతేకాదు మీ నిరీక్షణను ఇతరులతో పంచుకోండి. ప్రకటించడంలో, శిష్యుల్ని చేయడంలో మీరు చేయగలిగినదంతా చేయండి. అలా చేస్తే, “మీ నిరీక్షణ అంతం వరకు దృఢంగా” ఉంటుంది.—హెబ్రీ. 6:11.

18. భవిష్యత్తులో మనకు ఎలాంటి కష్టాలు రావచ్చు? మనం వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు?

18 ఈ వ్యవస్థ ముగింపు దగ్గరపడుతుండగా, ఆందోళన కలిగించే మరిన్ని కష్టాల్ని మనం ఎదుర్కొంటాం. కంగారుపడకుండా ఆ కష్టాల్ని ఎదిరించడానికి, మన సొంత శక్తి మీద కాకుండా యెహోవా మీద నమ్మకం ఉంచడానికి 2021 వార్షిక వచనం మనకు సహాయం చేస్తుంది. ఈ సంవత్సరమంతా, యెహోవా చేసిన ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉందని మన పనుల ద్వారా చూపిద్దాం: “మీరు కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.”యెష. 30:15.

పాట 8 యెహోవా మనకు ఆశ్రయం

^ పేరా 5 ఇప్పుడు అలాగే భవిష్యత్తులో, ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు యెహోవా మీద నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో మన 2021 వార్షిక వచనం చెప్తుంది. వార్షిక వచనంలో ఉన్న సలహాను మనం ఏయే విధాలుగా పాటించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 5 కొంతమంది నమ్మకమైన సహోదరసహోదరీలు విపరీతమైన ఆందోళనతో లేదా భయంతో సతమతమౌతున్నారు. అది తీవ్రమైన అనారోగ్య సమస్య. యేసు మాట్లాడుతున్నది అలాంటి ఆందోళన గురించి కాదు.

^ పేరా 63 చిత్రాల వివరణ: (1) ఒక సహోదరి రోజంతా తన ఆందోళనల గురించి పట్టుదలగా ప్రార్థిస్తోంది.

^ పేరా 65 చిత్రాల వివరణ: (2) పని చేసే చోట, భోజనం సమయంలో ఆమె తెలివి కోసం దేవుని వాక్యం చదువుతోంది.

^ పేరా 67 చిత్రాల వివరణ: (3) బైబిల్లో ఉన్న మంచి ఉదాహరణల్ని, చెడ్డ ఉదాహరణల్ని ధ్యానిస్తోంది.

^ పేరా 69 చిత్రాల వివరణ: (4) గుర్తు పెట్టుకోవాలనుకున్న ఒక ప్రోత్సాహకరమైన లేఖనాన్ని ఫ్రిజ్‌ మీద అంటిస్తోంది.

^ పేరా 71 చిత్రాల వివరణ: (5) పరిచర్యలో మంచి సహవాసం ఆనందిస్తోంది.

^ పేరా 73 చిత్రాల వివరణ: (6) భవిష్యత్తు గురించి ఆలోచించడం ద్వారా తన నిరీక్షణను బలంగా ఉంచుకుంటోంది.