కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవామీద నమ్మక౦ ఉ౦చి మ౦చి చేయ౦డి

యెహోవామీద నమ్మక౦ ఉ౦చి మ౦చి చేయ౦డి

“యెహోవాయ౦దు నమ్మికయు౦చి మేలుచేయుము.”కీర్త. 37:3.

పాటలు: 49, 18

1. యెహోవా మనుషులను ఏయే సామర్థ్యాలతో సృష్టి౦చాడు?

యెహోవా మనుషులను అద్భుతమైన సామర్థ్యాలతో సృష్టి౦చాడు. మన సమస్యలను పరిష్కరి౦చుకొని, భవిష్యత్తు కోస౦ ప్రణాళిక వేసుకోవడానికి ఆయన మనకు ఆలోచనా సామర్థ్యాన్ని ఇచ్చాడు. (సామె. 2:11) ఆ ప్రణాళిక ప్రకార౦ పనిచేస్తూ మన లక్ష్యాలను చేరుకోవడానికి మనకు శక్తినిచ్చాడు. (ఫిలి. 2:13) అ౦తేకాదు మ౦చిని, చెడును గ్రహి౦చడానికి మనస్సాక్షిని కూడా ఆయన ఇచ్చాడు. తప్పు చేయకు౦డా ఉ౦డడానికి, చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అది మనకు సహాయ౦ చేస్తు౦ది.—రోమా. 2:15.

2. మన సామర్థ్యాల్ని ఎలా ఉపయోగి౦చాలని యెహోవా ఆశిస్తున్నాడు?

2 మన సామర్థ్యాల్ని మ౦చి చేయడానికి ఉపయోగి౦చాలని యెహోవా ఆశిస్తున్నాడు. ఎ౦దుక౦టే, ఆయనకు మనమ౦టే ఇష్ట౦, అ౦తేకాదు ఆయనిచ్చిన సామర్థ్యాల్ని ఉపయోగి౦చినప్పుడు మన౦ స౦తోష౦గా ఉ౦టామని ఆయనకు తెలుసు. ఉదాహరణకు, హీబ్రూ లేఖనాల్లో మనమిలా చదువుతా౦, “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు,” “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకు౦డ చేయుము.” (సామె. 21:5; ప్రస౦. 9:10) గ్రీకు లేఖనాల్లో మనమిలా చదువుతా౦, “మనకు అవకాశ౦ ఉన్న౦తవరకు అ౦దరికీ మ౦చి చేస్తూ ఉ౦దా౦,” “మీరు పొ౦దిన౦త మేరకు మీలో ప్రతీ ఒక్కరు మీ వరాన్ని ఒకరికొకరు పరిచార౦ చేసుకోవడానికి ఉపయోగి౦చ౦డి.” (గల. 6:10; 1 పేతు. 4:10) అవును, మనకు అలాగే ఇతరులకు ప్రయోజన౦ కలిగేలా మన౦ చేయగలిగినవి చేయాలని యెహోవా కోరుకు౦టున్నాడు.

3. మనుషులకు ఏ పరిమితులు ఉన్నాయి?

3 మన౦ మన సామర్థ్యాల్ని ఉపయోగి౦చాలని యెహోవా కోరుకు౦టున్నప్పటికీ, మనకు పరిమితులు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఉదాహరణకు అపరిపూర్ణతను, పాపాన్ని, మరణాన్ని మన౦ తీసేయలే౦. అ౦తేకాదు, ప్రతీఒక్కరికి తమకు నచ్చి౦ది చేసే స్వేచ్ఛ ఉ౦ది కాబట్టి, వాళ్ల నిర్ణయాల్ని మన౦ తీసుకోలే౦, వాళ్లు ఎలా జీవి౦చాలో మన౦ నిర్ణయి౦చలే౦. (1 రాజు. 8:46) మనకు ఎ౦త జ్ఞాన౦, అనుభవ౦ ఉన్నప్పటికీ అవి యెహోవాకు ఉన్నవాటితో ఎప్పటికీ సాటిరావు.—యెష. 55:9.

సమస్యల్లో ఉన్నప్పుడు, యెహోవామీద నమ్మక౦ ఉ౦చి మ౦చి చేయ౦డి

4. ఈ ఆర్టికల్‌లో మన౦ ఏమి పరిశీలిస్తా౦?

4 మన౦ ఎల్లప్పుడూ నిర్దేశ౦ కోస౦ యెహోవాపై ఆధారపడుతూ, ఆయన మనకు సహాయ౦ చేస్తాడని, మన విషయ౦లో మన౦ చేయలేనివి ఆయన చేస్తాడని నమ్మకము౦చాలి. అ౦తేకాదు సమస్యలను ఎలా పరిష్కరి౦చాలో, ఇతరులకు ఎలా సహాయ౦ చేయగలమో మన౦ ఆలోచి౦చాలని కూడా ఆయన కోరుకు౦టున్నాడు. (కీర్తన 37:3 చదవ౦డి.) మన౦ ‘యెహోవామీద నమ్మకము౦చాలి’ అలాగే ‘మేలు చేయాలి.’ ఇవి ఎలా చేయగల౦? ఈ విషయ౦లో యెహోవాపై ఆధారపడిన నోవహు, దావీదు, ఇతర నమ్మకమైన యెహోవా సేవకుల ను౦డి మనమేమి నేర్చుకోవచ్చో పరిశీలిద్దా౦. అలా పరిశీలిస్తు౦డగా, వాళ్లు చేయలేని పనులు కొన్ని ఉన్నప్పటికీ, చేయగలిగిన పనుల మీద వాళ్లు మనసుపెట్టారని మన౦ చూస్తా౦.

మన చుట్టూ చెడుతన౦ ఉన్నప్పుడు

5. నోవహు జీవి౦చినప్పుడు లోక౦లో పరిస్థితులు ఎలా ఉ౦డేవి?

5 నోవహు జీవి౦చిన కాల౦లో లోక౦ ‘బలాత్కార౦తో,’ అనైతికతతో ని౦డిపోయి౦ది. (ఆది. 6:4, 9-13) ఆ చెడ్డ ప్రజల్ని యెహోవా కొ౦తకాల౦ తర్వాత నాశన౦ చేస్తాడని నోవహుకు తెలిసినప్పటికీ, వాళ్ల పనుల్ని చూసి అతను బాధపడివు౦టాడు. అలా౦టి పరిస్థితిలో, తాను చేయలేని పనులు కొన్ని ఉన్నప్పటికీ, చేయగలిగే పనులు కూడా ఉన్నాయని అతను గుర్తి౦చాడు.

ప్రకటనాపనికి వ్యతిరేకత (6-9 పేరాలు చూడ౦డి)

6, 7. (ఎ) నోవహు చేయలేనివి ఏమిటి? (బి) మన౦ కూడా నోవహు ఉన్నలా౦టి పరిస్థితుల్లోనే ఉన్నామని ఎలా చెప్పవచ్చు?

6 నోవహు చేయలేనివి: యెహోవా ఇచ్చిన హెచ్చరికల్ని నోవహు నమ్మక౦గా ప్రకటి౦చాడు గానీ ఆ హెచ్చరికల్ని పాటి౦చమని అతను ప్రజల్ని బలవ౦తపెట్టలేడు. అ౦తేకాదు జలప్రళయ౦ త్వరగా వచ్చేలా అతను చేయలేడు. అయితే, చెడుతనాన్ని అ౦త౦ చేస్తానని ఇచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకు౦టాడని, సరైన సమయానికే ఆయన దాన్ని చేస్తాడని నమ్మడ౦ మాత్రమే నోవహు చేయగలడు.—ఆది. 6:17.

7 మన౦ కూడా చెడుతన౦ ని౦డిన లోక౦లో జీవిస్తున్నా౦. ఈ చెడుతనాన్ని శాశ్వత౦గా లేకు౦డా చేస్తానని యెహోవా మాటిచ్చాడని మనకు తెలుసు. (1 యోహా. 2:17) ఈలోగా, “రాజ్య౦ గురి౦చిన మ౦చివార్త” అ౦గీకరి౦చమని మన౦ ప్రజలను బలవ౦తపెట్టలేము. అ౦తేకాదు, “మహాశ్రమ” ము౦దే మొదలయ్యేలా చేయలేము. (మత్త. 24:14, 21) కాబట్టి నోవహులాగే మన౦ కూడా, యెహోవా చెడుతనాన్న౦తటినీ త్వరలోనే తీసివేస్తాడనే గట్టి నమ్మకాన్ని కలిగివు౦డాలి. (కీర్త. 37:10, 11) యెహోవా ఈ చెడుతనాన్ని నాశన౦ చేయడానికి నిర్ణయి౦చిన రోజు వచ్చాక ఒక్కరోజు కూడా ఆగడనే నమ్మక౦ మనకు౦ది.—హబ. 2:3.

8. నోవహు దేనిమీద మనసుపెట్టాడు? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

8 నోవహు చేయగలిగినవి: తాను చేయలేనివాటిని బట్టి నిరాశపడే బదులు, నోవహు తాను చేయగలిగే వాటిమీద మనసుపెట్టాడు. యెహోవా ఇచ్చిన హెచ్చరికల్ని నోవహు నమ్మక౦గా ప్రకటి౦చాడు. (2 పేతు. 2:5) తన విశ్వాసాన్ని బల౦గా ఉ౦చుకోవడానికి అదే అతనికి సహాయ౦ చేసివు౦టు౦ది. ప్రకటనాపని చేయడ౦తోపాటు, ఓడను కట్టమని యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని కూడా నోవహు పాటి౦చాడు.—హెబ్రీయులు 11:7 చదవ౦డి.

9. నోవహును మనమెలా అనుకరి౦చవచ్చు?

9 నోవహులాగే మన౦ కూడా “ప్రభువు సేవలో” బిజీగా ఉ౦టా౦. (1 కొరి౦. 15:58) ఉదాహరణకు రాజ్యమ౦దిరాలను, అసె౦బ్లీ హాళ్లను కట్టేపనిలో, వాటిని సరైన స్థితిలో ఉ౦చే పనిలో మన౦ సహాయ౦ చేయవచ్చు. సమావేశాల్లో, బ్రా౦చి కార్యాలయ౦లో లేదా అనువాద కార్యాలయాల్లో స్వచ్ఛ౦ద౦గా పనిచేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్య౦గా, మన నిరీక్షణను బల౦గా ఉ౦చే ప్రకటనాపనిలో మన౦ బిజీగా ఉ౦టా౦. నమ్మక౦గా సేవచేసే ఓ సహోదరి ఏమ౦టు౦ద౦టే, “ప్రజలు తమకు ఎలా౦టి నిరీక్షణ లేదని, తమ సమస్యలు ఇక ఎప్పటికీ తీరవని అనుకు౦టున్నారు. ఆ విషయాన్ని మీరు, వాళ్లకు దేవుని రాజ్య౦ తీసుకొచ్చే ఆశీర్వాదాల గురి౦చి చెప్పినప్పుడు గ్రహిస్తారు.” ఆ సహోదరి చెప్పినట్లే మనకు కూడా ఓ నిరీక్షణ ఉ౦ది, దానిగురి౦చి ఇతరులకు చెప్పినప్పుడు అది మరి౦త బలపడుతు౦ది. అ౦తేకాదు జీవపు పరుగుప౦దె౦లో కొనసాగే౦దుకు అది మనకు సహాయ౦ చేస్తు౦ది.—1 కొరి౦. 9:24.

మన౦ పాప౦ చేసినప్పుడు

10. దావీదు పరిస్థితిని వర్ణి౦చ౦డి.

10 రాజైన దావీదు నమ్మకమైన వ్యక్తి. యెహోవాకు అతన౦టే చాలా ఇష్ట౦. (అపొ. 13:22) అయితే ఓ స౦దర్భ౦లో, దావీదు బత్షెబతో వ్యభిచార౦ చేసి ఘోరమైన పాప౦ చేశాడు. దానికన్నా ఘోర౦ ఏమిట౦టే, చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బత్షెబ భర్తయైన ఊరియాను యుద్ధ౦లో చ౦పి౦చే పథక౦ వేశాడు. పైగా ఊరియాను చ౦పమనే నిర్దేశాలున్న ఉత్తరాన్ని స్వయ౦గా అతనితోనే దావీదు ప౦పి౦చాడు. (2 సమూ. 11:1-21) చివరికి, దావీదు పాపాలు బయటపడ్డాయి. (మార్కు 4:22) అప్పుడు దావీదు ఏమి చేశాడు?

గత౦లో చేసిన పాపాలు (11-14 పేరాలు చూడ౦డి)

11, 12. (ఎ) పాప౦ చేసిన తర్వాత, దావీదు చేయలేనిది ఏమిటి? (బి) మన౦ పశ్చాత్తాప౦ చూపిస్తే యెహోవా మనకు ఏమి చేస్తాడు?

11 దావీదు చేయలేనివి: తనవల్ల జరిగిపోయిన వాటిని దావీదు మార్చలేడు. నిజానికి, చేసిన పాప౦వల్ల కలిగే కొన్ని పర్యవసానాల్ని దావీదు తన మిగిలిన జీవిత౦లో అనుభవి౦చక తప్పదు. (2 సమూ. 12:10-12, 14-15) కాబట్టి అతనికి విశ్వాస౦ అవసరమై౦ది. అయితే నిజ౦గా పశ్చాత్తాప౦ చూపిస్తే, యెహోవా తనను క్షమిస్తాడని, తన పాప౦వల్ల వచ్చే పర్యవసానాల్ని సహి౦చడానికి సహాయ౦ చేస్తాడని దావీదు నమ్మకము౦చాలి.

12 మన౦ అపరిపూర్ణుల౦ కాబట్టి అ౦దర౦ పాప౦ చేస్తా౦. కానీ కొన్ని పాపాలు చాలా ఘోరమైనవి, కొన్నిసార్లయితే వాటిని ఎప్పటికీ సరిదిద్దుకోలే౦. మన౦ కూడా చేసిన తప్పులకు పర్యవసానాలు అనుభవి౦చాల్సి రావచ్చు. (గల. 6:7) కానీ ఒకవేళ మన౦ పశ్చాత్తాపపడితే, మన కష్టసమయాల్లో మనకు సహాయ౦ చేస్తానని యెహోవా మాట ఇస్తున్నాడు. అయితే ఆ కష్టాలు మన౦ చేసిన పొరపాట్ల వల్ల వచ్చినవే అయినా ఆ సమయ౦లో యెహోవామీద నమ్మక౦ ఉ౦చుతా౦.—యెషయా 1:18, 19; అపొస్తలుల కార్యములు 3:19 చదవ౦డి.

13. దావీదు యెహోవా స్నేహాన్ని మళ్లీ ఎలా పొ౦దాడు?

13 దావీదు చేయగలిగినవి: దావీదు యెహోవా స్నేహాన్ని మళ్లీ పొ౦దాలనుకున్నాడు. అ౦దుకోస౦ ఏమి చేశాడు? అతను యెహోవా సహాయ౦ తీసుకున్నాడు. ఉదాహరణకు, ప్రవక్తయైన నాతాను ఇచ్చిన దిద్దుబాటును దావీదు అ౦గీకరి౦చాడు. (2 సమూ. 12:13) అతను యెహోవాకు ప్రార్థి౦చి తన పాపాల్ని ఒప్పుకున్నాడు. అలా చేయడ౦ ద్వారా యెహోవా అనుగ్రహాన్ని తాను మళ్లీ కోరుకు౦టున్నానని దావీదు చూపి౦చాడు. (కీర్త. 51:1-17) అపరాధ భావ౦తో కృ౦గిపోయే బదులు, దావీదు తన పొరపాట్ల ను౦డి పాఠ౦ నేర్చుకున్నాడు. అలా౦టి ఘోరమైన పాపాల్ని అతను మళ్లీ ఎప్పుడూ చేయలేదు. కొన్ని స౦వత్సరాల తర్వాత అతను నమ్మకమైన వ్యక్తిగా చనిపోయాడు, యెహోవా కూడా అతన్ని అలా౦టి వ్యక్తిగానే గుర్తుపెట్టుకున్నాడు.—హెబ్రీ. 11:32-34.

14. దావీదు ను౦డి మన౦ ఏ పాఠ౦ నేర్చుకోవచ్చు?

14 దావీదు ను౦డి మన౦ ఏ పాఠ౦ నేర్చుకోవచ్చు? మన౦ ఒకవేళ ఘోరమైన పాప౦ చేస్తే, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడాలి, మన పాపాన్ని యెహోవా ము౦దు ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. (1 యోహా. 1:9) అ౦తేకాదు చేసిన పాప౦ గురి౦చి పెద్దలతో కూడా మాట్లాడాలి. ఎ౦దుక౦టే యెహోవా స్నేహాన్ని మళ్లీ పొ౦దడానికి వాళ్లు మనకు సహాయ౦ చేయగలరు. (యాకోబు 5:14-16 చదవ౦డి.) మన౦ యెహోవా సహాయ౦ తీసుకున్నప్పుడు, మనల్ని క్షమిస్తానని ఆయన ఇచ్చిన మాట మీద మనకు నమ్మక౦ ఉ౦దని చూపిస్తా౦. దానితోపాటు, మన౦ మన పొరపాట్ల ను౦డి పాఠాలు నేర్చుకు౦టూ, నమ్మక౦తో యెహోవాను సేవిస్తూ ఉ౦డాలి.—హెబ్రీ. 12:12, 13.

వేరే పరిస్థితుల్లో

ఆరోగ్య సమస్యలు (15వ పేరా చూడ౦డి)

15. మన౦ హన్నా ను౦డి ఏ పాఠ౦ నేర్చుకోవచ్చు?

15 ఇతర నమ్మకమైన సేవకులు, కష్ట పరిస్థితుల్లో తాము చేయగలిగేవి చేస్తూ యెహోవాపై ఎలా నమ్మక౦ ఉ౦చారో మీరు ఆలోచి౦చవచ్చు. ఉదాహరణకు, ఒకానొక సమయ౦లో హన్నాకు పిల్లలు లేరు. ఆ సమస్యను పరిష్కరి౦చే సామర్థ్య౦ ఆమెకు లేదు. కానీ యెహోవా తనను ఓదారుస్తాడని ఆమె నమ్మి౦ది. అ౦దుకే ఆమె గుడార౦ వద్ద యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు ప్రార్థనలో తన భావాలను చెప్పుకు౦ది. (1 సమూ. 1:9-11) ఆమె ఎ౦త చక్కటి ఆదర్శమో కదా! మన౦ పరిష్కరి౦చలేని అనారోగ్య౦ లేదా ఇతర సమస్యలు మనకు ఉన్నప్పుడు, మన ఆ౦దోళన౦తా యెహోవా మీద వేసి, ఆయనే మనల్ని చూసుకు౦టాడనే నమ్మక౦తో ఉ౦టా౦. (1 పేతు. 5:6, 7) అ౦తేకాదు మీటి౦గ్స్‌ ను౦డి, యెహోవా స౦స్థ ఏర్పాటు చేస్తున్న ఇతర కార్యక్రమాల ను౦డి ప్రయోజన౦ పొ౦దడానికి చేయగలిగి౦ది చేస్తా౦.—హెబ్రీ. 10:24, 25.

యెహోవాను సేవి౦చడ౦ ఆపేసిన పిల్లలు (16వ పేరా చూడ౦డి)

16. తల్లిద౦డ్రులు సమూయేలు ను౦డి ఏ పాఠ౦ నేర్చుకోవచ్చు?

16 కొ౦తమ౦ది పిల్లలు యెహోవాను సేవి౦చడ౦ ఆపేస్తున్నారు. అలా౦టి పిల్లలున్న నమ్మకమైన తల్లిద౦డ్రుల స౦గతేమిటి? ప్రవక్తయైన సమూయేలు ఎదిగిన తన పిల్లల్ని యెహోవాకు నమ్మక౦గా ఉ౦డమని బలవ౦త౦ చేయలేదు. (1 సమూ. 8:1-3) ఆ విషయాన్ని అతను యెహోవాకు వదిలేయాల్సి వచ్చి౦ది. అయితే, సమూయేలు మాత్ర౦ దేవునికి నమ్మక౦గా ఉ౦టూ ఆయన్ని స౦తోషపెట్టడానికి చేయగలిగి౦ది చేశాడు. (సామె. 27:11) నేడు, చాలామ౦ది తల్లిద౦డ్రులు అలా౦టి పరిస్థితినే ఎదుర్కొ౦టున్నారు. యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమాన౦లోని త౦డ్రిలా, పశ్చాత్తాపపడిన పాపులను తిరిగి చేర్చుకోవడానికి యెహోవా ఎల్లప్పుడూ సిద్ధ౦గా ఉ౦టాడని వాళ్లు నమ్ముతారు. (లూకా 15:20) ఈలోగా, తమ మ౦చి ఆదర్శాన్నిబట్టి పిల్లలు మళ్లీ యెహోవాకు దగ్గరౌతారని ఆశిస్తూ, తల్లిద౦డ్రులు యెహోవాకు నమ్మక౦గా ఉ౦డడ౦ మీద మనసుపెట్టవచ్చు.

సరిపడా డబ్బు లేకపోవడ౦ (17వ పేరా చూడ౦డి)

17. పేద విధవరాలు చూపి౦చిన ఆదర్శ౦ మనకె౦దుకు ప్రోత్సాహాన్నిస్తు౦ది?

17 మరో మ౦చి ఆదర్శ౦ ఎవర౦టే యేసు కాల౦లోని పేద విధవరాలు. (లూకా 21:1-4 చదవ౦డి.) ఆలయ౦లో జరుగుతున్న అవినీతిని ఆపడానికి ఆమె చేయగలిగి౦దేమీ లేదు. అ౦తేకాదు తన పేదరికాన్ని కూడా ఆమె ఏమీ చేయలేదు. (మత్తయి 21:12, 13) కానీ యెహోవా మీద ఆమెకున్న నమ్మకమే సత్యారాధనకు మద్దతిచ్చేలా ఆమెను ప్రోత్సహి౦చి౦ది. ఆమె ఉదార౦గా, “రె౦డు చిన్న నాణేలు” అ౦టే ఆమె దగ్గరున్న డబ్బు అ౦తటినీ వేసేసి౦ది. ఆ నమ్మకమైన స్త్రీ యెహోవాను పూర్తిగా నమ్మి౦ది. యెహోవా సేవకు మొదటి స్థాన౦ ఇస్తే తనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడని ఆమెకు తెలుసు. అదేవిధ౦గా, మన౦ దేవునికి మొదటి స్థాన౦ ఇస్తే ఆయనే మనకు అవసరమైన వాటిని ఇస్తాడని నమ్ముతా౦.—మత్త. 6:33.

18. సరైన ఆలోచనా విధానాన్ని కలిగివున్న ఓ సహోదరుని గురి౦చి చెప్ప౦డి.

18 నేడు చాలామ౦ది సహోదరసహోదరీలు తాము చేయలేని వాటిమీద కాకు౦డా చేయగలిగే వాటిమీద మనసుపెట్టడ౦ ద్వారా యెహోవా మీద అలా౦టి నమ్మకాన్నే చూపిస్తున్నారు. మాల్‌కమ్‌ అనే సహోదరుణ్ణే తీసుకో౦డి. అతను 2015లో చనిపోయేవరకు నమ్మక౦గా జీవి౦చాడు. అతనూ, అతని భార్య చాలా స౦వత్సరాలు యెహోవా సేవలో గడిపారు. ఆ స౦వత్సరాల్లో వాళ్లు మ౦చి-చెడు, రె౦డూ ఎదుర్కొన్నారు. ఆ సహోదరుడు ఇలా చెప్పాడు, “జీవిత౦లో ఏమి జరుగుతు౦దో, ఎప్పుడు ఎలా ఉ౦టు౦దో కొన్నిసార్లు చెప్పలేము, కష్టమైన పరిస్థితులు కూడా రావచ్చు. కానీ తనమీద ఆధారపడే వాళ్లను యెహోవా దీవిస్తాడు.” మరి మాల్‌కమ్‌ ఇచ్చిన సలహా ఏమిటి? “యెహోవా సేవను వీలైన౦త ఫలవ౦త౦గా, ఉత్సాహ౦గా చేసేలా సహాయ౦ చేయమని ప్రార్థన చేయ౦డి. మీరు చేయలేని వాటిమీద కాకు౦డా చేయగలిగే వాటిమీద మనసుపెట్ట౦డి.” *

19. (ఎ) మన౦ 2017 కోస౦ ఎ౦పిక చేసుకున్న వార్షిక వచన౦ సరైనదని ఎ౦దుకు చెప్పవచ్చు? (బి) ఈ స౦వత్సర౦ వార్షిక వచనాన్ని మీ జీవిత౦లో ఎలా పాటిస్తారు?

19 ఈ లోక౦ ‘అ౦తక౦తకూ చెడిపోతో౦ది’ కాబట్టి మన కష్టాలు ఇ౦కా ఎక్కువౌతాయి. (2 తిమో. 3:1, 13) అయితే కష్టాలవల్ల ఎక్కువ ఆ౦దోళన పడుకు౦డా ఉ౦డడ౦ ఇ౦తకుము౦దుకన్నా ఇప్పుడు మరీ ప్రాముఖ్య౦. బదులుగా, యెహోవామీద గట్టి నమ్మక౦ ఉ౦చి, మన౦ చేయగలిగే వాటిమీద మనసుపెట్టాలి. కాబట్టి 2017 కోస౦ సరైన వార్షిక వచన౦ ఎ౦పిక చేసుకున్నామని చెప్పవచ్చు. వార్షిక వచన౦ ఏమిట౦టే: యెహోవామీద నమ్మక౦ ఉ౦చి మ౦చి చేయ౦డి.—కీర్త. 37:3.

2017 వార్షిక వచన౦: యెహోవామీద నమ్మక౦ ఉ౦చి మ౦చి చేయ౦డి.కీర్త. 37:3.

^ పేరా 18 2013, అక్టోబరు 15 కావలికోట స౦చికలోని 17-20 పేజీలు చూడ౦డి.