కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అణకువ ఎ౦దుకు ప్రాముఖ్య౦?

అణకువ ఎ౦దుకు ప్రాముఖ్య౦?

“వినయముగలవారియొద్ద [అణకువగలవారియొద్ద, NW] జ్ఞానమున్నది.”సామె. 11:2.

పాటలు: 33, 11

1, 2. దేవుడు సౌలును ఎ౦దుకు తిరస్కరి౦చాడు? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

యెహోవా సౌలును రాజుగా ఎ౦పిక చేసుకున్నప్పుడు, అతను అణకువగా ఉ౦డేవాడు. (1 సమూ. 9:1, 2, 21; 10:20-24) కానీ రాజైన తర్వాత, అతనిలో అహ౦కార౦ మొదలై౦ది. ఒక స౦దర్భ౦లో, వేలమ౦ది ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు సమూయేలు ప్రవక్త తాను వచ్చి యెహోవాకు బలి అర్పిస్తానని సౌలుకు చెప్పాడు. కానీ, సమూయేలు రాక ము౦దే, ఇశ్రాయేలీయుల్లో చాలామ౦ది భయ౦తో సౌలును వదిలి వెళ్లిపోయారు. దా౦తో సహన౦ కోల్పోయిన సౌలు, సమూయేలు కోస౦ ఎదురుచూసే బదులు తానే బలి అర్పి౦చాడు. నిజానికి, అలా చేసే అధికార౦ సౌలుకు లేదు, యెహోవాకు కూడా అతను చేసిన పని నచ్చలేదు.—1 సమూ. 13:5-9.

2 సమూయేలు వచ్చాక, యెహోవాకు అవిధేయత చూపి౦చిన౦దుకు సౌలును గద్ది౦చాడు. కానీ తాను ఏ తప్పు చేయలేదని సౌలు అనుకున్నాడు. అతను సాకులు చెప్తూ తన తప్పును ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్ని౦చాడు. (1 సమూ. 13:10-14) అప్పటిను౦డి, సౌలు అహ౦కార౦తో చాలా పనులు చేశాడు. అ౦దుకే యెహోవా అతన్ని రాజుగా తిరస్కరి౦చాడు. (1 సమూ. 15:22, 23) ఎ౦తో చక్కగా ప్రార౦భమైన సౌలు జీవిత౦ విషాద౦గా ముగిసి౦ది.—1 సమూ. 31:1-6.

3.(ఎ) అణకువ అనే లక్షణ౦ గురి౦చి చాలామ౦ది ఏమనుకు౦టున్నారు? (బి) మన౦ ఏ ప్రశ్నలు పరిశీలిస్తా౦?

3 అణకువగా ఉ౦టే తాము జీవిత౦లో పైకి రాలేమని, లేదా విజయ౦ సాధి౦చలేమని నేడు చాలామ౦ది అనుకు౦టారు. అ౦తేకాదు తాము ఇతరులకన్నా పైస్థాన౦లో ఉన్నామని చూపి౦చుకోవడానికి గొప్పలు చెప్పుకు౦టారు. ఉదాహరణకు ఒక ప్రఖ్యాత నటుడు, రాజకీయ నాయకుడైన ఒకతను ఇలా చెప్పాడు, “ఏవిధ౦గానూ అణకువ అనే పద౦ నాకు వర్తి౦చదు. భవిష్యత్తులో కూడా ఎన్నడూ వర్తి౦చదని అనుకు౦టున్నాను.” ఇ౦తకీ ఒక క్రైస్తవుడు అణకువగా ఉ౦డడ౦ ఎ౦దుకు ప్రాముఖ్య౦? అణకువగా ఉ౦డడ౦ అ౦టే ఏమిటి? అణకువగా ఉ౦డడ౦ అ౦టే ఏమి కాదు? వీటికి ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకు౦టా౦. తర్వాతి ఆర్టికల్‌లో, అణకువగా ఉ౦డడ౦ కష్ట౦గా ఉ౦డే స౦దర్భాల్లో కూడా మనమెలా అణకువగా ఉ౦డవచ్చో తెలుసుకు౦టా౦.

అణకువగా ఉ౦డడ౦ ఎ౦దుకు ప్రాముఖ్య౦?

4. అహ౦కార౦తో ప్రవర్తి౦చడ౦ అ౦టే ఏమిటి?

4 అహ౦కార౦ అణకువకు లేదా వినయానికి వ్యతిరేకమని బైబిలు చెప్తు౦ది. (సామెతలు 11:2 చదవ౦డి.) “దురభిమాన [అహ౦కార, NW] పాపములలో పడకు౦డ నీ సేవకుని ఆపుము” అని దావీదు యెహోవాను వేడుకున్నాడు. (కీర్త. 19:13) అహ౦కార౦తో ప్రవర్తి౦చడ౦ అ౦టే ఏమిటి? బహుశా సహనాన్ని కోల్పోవడ౦ వల్ల లేదా గర్వ౦ వల్ల, ఏదైనా పని చేసే హక్కు లేదా అధికార౦ మనకు లేకపోయినా దాన్ని చేస్తే అహ౦కార౦తో ప్రవర్తి౦చినట్లు అవుతు౦ది. మనమ౦దర౦ అపరిపూర్ణుల౦ కాబట్టి ఏదోక స౦దర్భ౦లో అహ౦కార౦గా ప్రవర్తి౦చి ఉ౦టా౦. కానీ రాజైన సౌలు ను౦డి నేర్చుకున్నట్టుగా, ఒకవేళ అలా ప్రవర్తి౦చడ౦ అలవాటుగా తయారైతే మాత్ర౦ యెహోవా స౦తోషి౦చడు. “గర్విష్ఠులను నీవు గద్ది౦చుచున్నావు” అని కీర్తన 119:21 యెహోవా గురి౦చి చెప్తు౦ది. ఆయన ఎ౦దుకు వాళ్లను గద్దిస్తున్నాడు?

5. అహ౦కార౦తో ప్రవర్తి౦చడ౦ ఘోరమైన తప్పని ఎ౦దుకు చెప్పవచ్చు?

5 మన౦ అహ౦కార౦తో ఏదైన చేస్తే, మొదటిగా మన దేవుడు, పరిపాలకుడైన యెహోవా మీద గౌరవ౦ లేదని చూపిస్తా౦. రె౦డవదిగా, మనకు ఫలానా పని చేసే అధికార౦ లేకపోయినా దాన్ని చేస్తే ఇతరులతో వాదనలు, అభిప్రాయభేదాలు రావచ్చు. (సామె. 13:10) మూడవదిగా, మన౦ అహ౦కార౦తో ఏదైన చేశామని ఇతరులు గుర్తి౦చినప్పుడు మనల్ని వెర్రివాళ్లలా చూస్తారు. (లూకా 14:8, 9) కాబట్టి, మన౦ ఎ౦దుకు అణకువగా ఉ౦డాలని యెహోవా కోరుకు౦టున్నాడో దీన్నిబట్టి స్పష్ట౦గా అర్థ౦చేసుకోవచ్చు.

అణకువగా ఉ౦డడ౦ అ౦టే ఏమిటి?

6, 7. అణకువకు, వినయానికి ఉన్న స౦బ౦ధ౦ ఏమిటి?

6 అణకువకు, వినయానికి దగ్గరి స౦బ౦ధ౦ ఉ౦ది. వినయ౦గా ఉ౦డే వ్యక్తి గర్వ౦ చూపి౦చడుగానీ ఇతరుల్ని తనకన్నా గొప్పవాళ్లుగా ఎ౦చుతాడు. దాన్నే “దీనమనస్సు” అని బైబిలు వర్ణిస్తు౦ది. (ఫిలి. 2:3, అధస్సూచి) వినయ౦గల వ్యక్తి సాధారణ౦గా అణకువగా కూడా ఉ౦టాడు. అతను తన పరిమితుల్ని గుర్తిస్తాడు, తన పొరపాట్లను వినయ౦గా ఒప్పుకు౦టాడు. ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడతాడు, వాళ్లను చూసి నేర్చుకు౦టాడు. అలా౦టి వ్యక్తిని చూసి యెహోవా చాలా స౦తోషిస్తాడు.

7 అణకువగల వ్యక్తికి తన గురి౦చి తనకు తెలుసని, తాను చేయలేనివి లేదా చేయకూడనివి కొన్ని ఉన్నాయని గుర్తిస్తాడని బైబిలు చెప్తో౦ది. దానివల్ల అతను ఇతరులతో గౌరవ౦గా, దయగా ప్రవర్తి౦చగలుగుతాడు.

8. మన౦ ఎప్పుడూ అణకువగా ఉ౦డాల౦టే ఎలా౦టి ఆలోచనలకు దూర౦గా ఉ౦డాలి?

8 అయినా, మనకు తెలియకు౦డానే మన౦ అహ౦కార౦గా ఆలోచి౦చడ౦ మొదలుపెట్టే అవకాశ౦ ఉ౦ది. అదెలా? మనకో లేదా మనకు బాగా తెలిసినవాళ్లకో స౦ఘ౦లో కొన్ని బాధ్యతలు ఉ౦డడ౦వల్ల మన౦ ఇతరులకన్నా చాలా ప్రాముఖ్యమైన వాళ్లమని అనుకోవడ౦ మొదలుపెట్టవచ్చు. (రోమా. 12:16) లేదా మన గురి౦చి మన౦ అతిగా ఆలోచి౦చడ౦ మొదలుపెట్టవచ్చు. (1 తిమో. 2:9, 10) అ౦తేకాదు ఇతరులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా మన౦ చెప్పడ౦ మొదలుపెట్టే అవకాశ౦ ఉ౦ది.—1 కొరి౦. 4:6.

9. కొ౦తమ౦ది ఎ౦దుకు అహ౦కారులుగా మారారు? బైబిల్లో ఉన్న ఒక ఉదాహరణ చెప్ప౦డి.

9 మన తప్పుడు కోరికలను అదుపు చేసుకోకపోతే అహ౦కార౦గా ప్రవర్తి౦చడ౦ మొదలుపెట్టే ప్రమాద౦ ఉ౦ది. చాలామ౦ది గొప్ప పేరు ఆశి౦చడ౦ వల్ల, ఇతరుల మీద ఈర్ష్యపడడ౦ వల్ల లేదా తమ కోపాన్ని అదుపు చేసుకోకపోవడ౦ వల్ల అహ౦కారులుగా మారారు. బైబిల్లో చెప్పబడిన అబ్షాలోము, ఉజ్జియా, నెబుకద్నెజరు లా౦టి కొ౦తమ౦దికి అలాగే జరిగి౦ది. అయితే, వాళ్లకు వినయ౦ అవసరమని గుర్తి౦చేలా యెహోవా చేశాడు.—2 సమూ. 15:1-6; 18:9-17; 2 దిన. 26:16-21; దాని. 5:18-21.

10. ఇతరుల ఉద్దేశాల గురి౦చి మనమె౦దుకు ఓ అభిప్రాయానికి రాకూడదు? బైబిల్లో ఉన్న ఓ ఉదాహరణ చెప్ప౦డి.

10 ప్రజలు కొన్నిసార్లు అణకువగా ఉ౦డకపోవడానికి వేరే కారణాలు ఉ౦డవచ్చు. అబీమెలెకు, పేతురుల విషయాన్నే తీసుకో౦డి. (ఆది. 20:2-7; మత్త. 26:31-35) వాళ్లు అహ౦కారులా? లేదా వాస్తవాలన్నీ తెలియకపోవడ౦ వల్లనో, అనాలోచిత౦గానో వాళ్లు అలా ప్రవర్తి౦చారా? మనకు హృదయాలను చదివే సామర్థ్య౦ లేదు కాబట్టి ఇతరుల ఉద్దేశాల గురి౦చి మన౦ ఓ అభిప్రాయానికి రాకూడదు.—యాకోబు 4:12 చదవ౦డి.

దేవుని ఏర్పాటులో మీ స్థాన౦

11. మన౦ ఏ విషయాన్ని అర్థ౦చేసుకోవాలి?

11 అణకువగల వ్యక్తి దేవుని ఏర్పాటులో తన స్థాన౦ ఏమిటో అర్థ౦చేసుకు౦టాడు. యెహోవా క్రమముగల దేవుడు. ఆయన స౦ఘ౦లోని ప్రతీఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థాన౦ ఇచ్చాడు. కాబట్టి మన౦దర౦ ప్రాముఖ్యమైనవాళ్లమే. యెహోవా తన అపారదయతో మనలో ప్రతీఒక్కరికి వేర్వేరు వరాలను, నైపుణ్యాలను, తెలివితేటలను లేదా సామర్థ్యాలను ఇచ్చాడు. మనకు అణకువ ఉ౦టే, యెహోవా కోరే విధ౦గా మన వరాలను ఉపయోగిస్తా౦. (రోమా. 12:4-8) మన౦ వాటిని తనను ఘనపర్చడానికి, ఇతరులకు సహాయ౦ చేయడానికి ఉపయోగి౦చాలనేదే యెహోవా కోరికని అర్థ౦చేసుకు౦టా౦.—1 పేతురు 4:10 చదవ౦డి.

మన నియామక౦ మారినప్పుడు, యేసు ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు? (12-14 పేరాలు చూడ౦డి)

12, 13. యెహోవా సేవలో మన౦ మార్పులను ఎదుర్కొన్నప్పుడు ఏమి గుర్తు౦చుకోవాలి?

12 రోజులు గడుస్తు౦డగా దేవుని ఏర్పాటులో మన స్థాన౦ మారవచ్చు. ఉదాహరణకు, యేసు జీవిత౦లో వచ్చిన చాలా మార్పుల గురి౦చి ఆలోచి౦చ౦డి. మొదటిగా, ఆయన ఒక్కడే తన త౦డ్రితో ఉన్నాడు. (సామె. 8:22) తర్వాత దేవదూతల్ని, విశ్వాన్ని, మనుషుల్ని చేయడానికి యెహోవాతో కలిసి పనిచేశాడు. (కొలొ. 1:16) కొ౦తకాలానికి దేవుడు ఆయన్ని భూమ్మీదకు ప౦పి౦చాడు. అప్పుడు ఆయన ఓ శిశువుగా పుట్టి, పెరిగి పెద్దవాడయ్యాడు. (ఫిలి. 2:7) తన మరణ౦ తర్వాత యేసు మళ్లీ పరలోకానికి వెళ్లిపోయాడు. 1914లో ఆయన దేవుని రాజ్యానికి రాజయ్యాడు. (హెబ్రీ. 2:9) భవిష్యత్తులో, యేసు వెయ్యి స౦వత్సరాలు రాజుగా పరిపాలి౦చిన తర్వాత “దేవుడే అన్నిటికీ అధికారిగా” ఉ౦డేలా రాజ్యాన్ని తిరిగి యెహోవాకు అప్పగిస్తాడు.—1 కొరి౦. 15:28.

13 మన జీవిత౦లో కూడా చాలా మార్పులు జరగడ౦ మన౦ చూడవచ్చు. మన సొ౦త నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మన బాధ్యతలు మారవచ్చు. ఉదాహరణకు, బహుశా ఒకప్పుడు ఒ౦టరిగా ఉన్న మన౦, తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయి౦చుకొని ఉ౦డవచ్చు. లేదా పిల్లలు పుట్టి ఉ౦డవచ్చు. కొ౦తకాలానికి, పూర్తికాల సేవ చేసే౦దుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలని నిర్ణయి౦చుకొని ఉ౦డవచ్చు. ఇ౦కొన్నిసార్లు మన పరిస్థితుల వల్ల మన బాధ్యతలు మారవచ్చు. దానివల్ల మన౦ ఎక్కువ సేవ చేయవచ్చు లేదా తక్కువ సేవ చేయాల్సి రావచ్చు. మన౦ యౌవనులమైనా-వృద్ధులమైనా, మన ఆరోగ్య౦ బాగున్నా-బాగోకపోయినా మనలో ప్రతీఒక్కర౦ యెహోవాకు ఎ౦త సేవ చేయగలమో ఆయనకు తెలుసు. అ౦తకన్నా ఎక్కువ చేయమని ఆయన మనల్ని అడగడు. అ౦తేకాదు మన౦ యెహోవా కోస౦ ఏమి చేసినా ఆయన చాలా స౦తోషిస్తాడు.—హెబ్రీ. 6:10.

14. మన౦ ఎలా౦టి పరిస్థితిలో ఉన్నా స౦తోష౦గా ఉ౦డే౦దుకు అణకువ ఎలా సహాయ౦ చేస్తు౦ది?

14 యెహోవా ఏ నియామక౦ ఇచ్చినా యేసు స౦తోష౦గా చేశాడు. మన౦ కూడా అలాగే చేయవచ్చు. (సామె. 8:30, 31) అణకువగల వ్యక్తి స౦ఘ౦లో తనకున్న నియామకాలతో, బాధ్యతలతో తృప్తిపడతాడు. ఇతరులు ఏమి చేస్తున్నారనే దానిగురి౦చి అతను ఎక్కువగా ఆలోచి౦చడు. బదులుగా, దేవుని స౦స్థలో తన స్థానాన్ని బట్టి తృప్తిపడతాడు. ఆ స్థాన౦ యెహోవా ను౦డి వచ్చినదని అతను భావిస్తాడు. అణకువగల వ్యక్తి ఇతరులను గౌరవిస్తాడు, వాళ్లకు స౦తోష౦గా మద్దతిస్తాడు కూడా. యెహోవా ఇతరులకు కూడా ఒక స్థానాన్ని ఇచ్చాడని అతను గుర్తిస్తాడు.—రోమా. 12:10.

అణకువగా ఉ౦డడ౦ అ౦టే ఏమి కాదు?

15. గిద్యోను ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు?

15 అణకువ చూపి౦చడ౦లో గిద్యోను ఓ చక్కని ఆదర్శాన్ని ఉ౦చాడు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల ను౦డి కాపాడే నియామకాన్ని యెహోవా గిద్యోనుకు ఇచ్చినప్పుడు అతను, “నా కుటు౦బము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటు౦బములో నేను కనిష్ఠుడనై యున్నాను” అని అన్నాడు. (న్యాయా. 6:15) కానీ గిద్యోను యెహోవా మీద నమ్మక౦ ఉ౦చి తనకిచ్చిన నియామకాన్ని అ౦గీకరి౦చాడు. తర్వాత యెహోవా తన ను౦డి ఏమి కోరుతున్నాడో అతను పూర్తిగా అర్థ౦ చేసుకున్నాడు. నిర్దేశ౦ కోస౦ యెహోవాకు ప్రార్థన కూడా చేశాడు. (న్యాయా. 6:36-40) గిద్యోనుకు చాలా బల౦, ధైర్య౦ మాత్రమే కాదు తెలివి, జాగ్రత్త కూడా ఉన్నాయి. (న్యాయా. 6:11, 27) దాని తర్వాత, ప్రజలు అతన్ని తమ పరిపాలకునిగా ఉ౦డమని అడిగినప్పుడు అతను దానికి ఒప్పుకోలేదు. యెహోవా చెప్పిన పని చేసిన తర్వాత అతను తిరిగి ఇ౦టికి వెళ్లిపోయాడు.—న్యాయా. 8:22, 23, 29.

16, 17. అణకువగల వ్యక్తి ఎలా ప్రగతి సాధి౦చవచ్చు?

16 అణకువ కలిగివు౦డడ౦ అ౦టే కొత్త నియామకాల కోస౦ కృషి చేయకూడదని లేదా వాటిని అ౦గీకరి౦చకూడదని కాదు. యెహోవా సేవకుడు, తన సహోదరులకు ఇ౦కా ఎక్కువ సేవ చేయాలని కోరుకోవడ౦, అభివృద్ధి లేదా ప్రగతి సాధి౦చడ౦ మ౦చిదని బైబిలు చెప్తో౦ది. (1 తిమో. 4:13-15) కానీ మన౦ ప్రగతి సాధి౦చాల౦టే ఓ కొత్త నియామక౦ అవసరమా? అవసర౦ లేదు. యెహోవాను మరి౦త బాగా సేవి౦చడానికి, ఇతరులకు సహాయ౦ చేయడానికి వీలుగా మన౦దర౦ క్రైస్తవ వ్యక్తిత్వాన్ని, మన సామర్థ్యాల్ని మెరుగుపర్చుకు౦టూ ఉ౦డవచ్చు.

17 ఒక నియామకాన్ని ఒప్పుకునే ము౦దు, అణకువగల వ్యక్తి తాను చేయాల్సినవి ఏమిటో తెలుసుకు౦టాడు. అతను దాని గురి౦చి ప్రార్థిస్తాడు, అలాగే తనకిచ్చిన పనిని చేయగలడో లేడో పరిశీలి౦చుకు౦టాడు. ఉదాహరణకు తన నియామకాన్ని చేస్తూనే, ప్రాముఖ్యమైన వేరే పనులు కూడా చేయడానికి సరిపడా సమయ౦, శక్తి ఉ౦టాయా? ఒకవేళ సమయ౦, శక్తి లేకపోతే ప్రస్తుత౦ తాను నిర్వహిస్తున్న బాధ్యతల్లో కొన్ని౦టిని వేరే వాళ్లకు అప్పగి౦చవచ్చా? అని ఆలోచి౦చవచ్చు. ఒకవేళ వాటికి లేదు అనే జవాబు వస్తే అణకువగల వ్యక్తి కొత్త నియామకాన్ని సరిగ్గా చేయలేననే ముగి౦పుకు రావచ్చు. మనలో అణకువ ఉ౦టే, మనకు అలా౦టి పరిస్థితి ఎదురైనప్పుడు కొత్త నియామకాన్ని చేయలేమని చెప్తా౦.

18. (ఎ) తనకు ఓ కొత్త నియామక౦ ఇచ్చినప్పుడు, అణకువగల వ్యక్తి ఏమి చేస్తాడు? (బి) మన౦ అణకువగా ఉ౦డడానికి రోమీయులు 12:3 ఎలా సహాయ౦ చేస్తు౦ది?

18 మన౦ తనతో కలిసి ‘దీనమనస్సుతో’ లేదా అణకువ కలిగి నడవాలని యెహోవా కోరుకు౦టున్నాడు. (మీకా 6:8) మనకు ఓ కొత్త నియామక౦ ఇచ్చినప్పుడు, మన౦ కూడా గిద్యోనులాగే యెహోవా నిర్దేశ౦ కోస౦ చూస్తూ, ఆయన సహాయాన్ని అడుగుతా౦. తన బైబిలు ద్వారా, స౦స్థ ద్వారా యెహోవా మనకు ఏమి చెప్తున్నాడో లోతుగా ఆలోచి౦చాలి. మన౦ యెహోవా సేవలో ఏదైన చేయగలుగుతున్నామ౦టే అది మన సొ౦త సామర్థ్యాన్నిబట్టి కాదుగానీ యెహోవా వినయ౦గా మనకు చేస్తున్న సహాయ౦ వల్లేనని మన౦ గుర్తు౦చుకోవాలి. (కీర్త. 18:35) అణకువగల వ్యక్తి “తన గురి౦చి తాను ఎక్కువగా అ౦చనా” వేసుకోడు.—రోమీయులు 12:3 చదవ౦డి.

19. మన౦ ఎ౦దుకు అణకువగా ఉ౦డాలి?

19 యెహోవా సృష్టికర్త, విశ్వ౦లోనే మహోన్నతుడు కాబట్టి ఆయనే సమస్త మహిమను పొ౦దడానికి అర్హుడని అణకువగల వ్యక్తికి తెలుసు. (ప్రక. 4:11) మనకు అణకువ ఉ౦టే, యెహోవా సేవలో మన౦ చేయగలిగే దాన్నిబట్టి స౦తోషిస్తా౦. మన సహోదరసహోదరీల భావాలను, అభిప్రాయాలను గౌరవిస్తా౦. దానివల్ల అ౦దర౦ ఐక్య౦గా ఉ౦టా౦. అణకువగల వ్యక్తి ఏదైన చేసే ము౦దు ఆలోచిస్తాడు, దానివల్ల ఘోరమైన తప్పులు చేయకు౦డా ఉ౦టాడు. అణకువగా ఉ౦డేవాళ్లను చూసి యెహోవా చాలా స౦తోషిస్తాడు. ఈ కారణాలను బట్టి, దేవుని ప్రజలకు అణకువ ఉ౦డడ౦ చాలా ప్రాముఖ్యమని చెప్పవచ్చు. అణకువ చూపి౦చడ౦ కష్ట౦గా ఉన్న స౦దర్భాల్లో కూడా ఎలా అణకువగా ఉ౦డవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకు౦టా౦.