అధ్యయన ఆర్టికల్ 10
యెహోవా మీద ఉన్న ప్రేమ బాప్తిస్మానికి నడిపిస్తుంది
“నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?”—అపొ. 8:36.
పాట 37 పూర్ణ ప్రాణంతో యెహోవాను సేవిద్దాం
ఈ ఆర్టికల్‌లో . . . *
1-2. అపొస్తలుల కార్యాలు 8:27-31, 35-38 ప్రకారం, బాప్తిస్మం తీసుకునేలా ఇతియోపీయుడైన అధికారిని ఏది పురికొల్పింది?
మీరు బాప్తిస్మం తీసుకొని, క్రీస్తు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? దేవుని పట్ల ప్రేమ, కృతజ్ఞతతో చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు. ఉదాహరణకు, ఇతియోపియా రాణి దగ్గర పనిచేసిన ఒక అధికారి గురించి పరిశీలించండి.
2 ఆ అధికారి, లేఖనాల నుండి నేర్చుకున్న దాన్నిబట్టి వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. (అపొస్తలుల కార్యాలు 8:27-31, 35-38 చదవండి.) బాప్తిస్మం తీసుకునేలా ఆయన్ని ఏది పురికొల్పింది? ఆయన రథం మీద యెరూషలేము నుండి ఇతియోపియాకు తిరిగి వెళ్తున్నప్పుడు యెషయా పుస్తకంలో ఉన్న కొన్ని వచనాలను చదవడాన్ని బట్టి ఆయనకు దేవుని వాక్యం అంటే ఎంతో గౌరవం ఉందని అర్థమౌతుంది. అయితే, ఫిలిప్పు ఆయన్ని కలిసి మాట్లాడిన తర్వాత యేసు తన కోసం చేసిన దానిపట్ల ఆ అధికారికి కృతజ్ఞత కలిగింది. ఇంతకీ ఆయన యెరూషలేముకు ఎందుకు వెళ్లాడు? ఆయన అప్పటికే యెహోవాను ప్రేమిస్తున్నాడు. అందుకే యెరూషలేముకు వెళ్లి యెహోవాను ఆరాధించి వస్తున్నాడు. నిజానికి ఆయన తన మతం విడిచిపెట్టి, సత్య దేవునికి సమర్పించుకున్న ఒకేఒక్క యూదా జనాంగంలో చేరాడు. ఇప్పుడు యెహోవా మీదున్న ఆ ప్రేమే మరో ప్రాముఖ్యమైన చర్య తీసుకునేలా అంటే బాప్తిస్మం తీసుకొని క్రీస్తు శిష్యుడు అయ్యేలా ఆయన్ని పురికొల్పింది.—మత్త. 28:19.
3. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోకుండా ఏది అడ్డుకోవచ్చు? (“ మీ హృదయం ఎలా ఉంది?” అనే బాక్సు చూడండి.)
3 మీరు బాప్తిస్మం తీసుకునేలా యెహోవా మీదున్న ప్రేమ మిమ్మల్ని పురికొల్పగలదు. అయితే అలా చేయకుండా ప్రేమ మిమ్మల్ని అడ్డుకోగలదు కూడా. ఎలా? కొన్ని ఉదాహరణల్ని గమనించండి. బహుశా సాక్షులుకాని మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మీరెంతో ప్రేమిస్తుండవచ్చు. ఒకవేళ బాప్తిస్మం తీసుకుంటే, వాళ్లు మిమ్మల్ని ద్వేషిస్తారేమో అని మీరు భయపడవచ్చు. మత్త. 10:37) లేదా, దేవునికి ఇష్టంలేని అలవాట్లను మీరు ప్రేమిస్తుండవచ్చు. వాటిని మానుకోవడం మీకు కష్టంగా ఉండవచ్చు. (కీర్త. 97:10) లేదా, మీరు చిన్నప్పటి నుండి అబద్ధమతానికి చెందిన పండుగల్ని చేస్తుండవచ్చు. ఆ పండుగల్లో మీకు ఎదురైన తీపి జ్ఞాపకాల్ని మీరు ప్రేమిస్తుండవచ్చు. కాబట్టి యెహోవా ఇష్టపడని ఆ పండుగలకు దూరంగా ఉండడం మీకు కష్టంగా అనిపించవచ్చు. (1 కొరిం. 10:20, 21) ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, “నేను దేన్ని లేదా ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను?”
(అత్యంత ప్రాముఖ్యమైన ప్రేమ
4. మీరు బాప్తిస్మం తీసుకునేలా అన్నిటికన్నా ముఖ్యంగా ఏది మిమ్మల్ని నడిపిస్తుంది?
4 మీరు ఇప్పటికే ఎన్నో మంచి విషయాలను ప్రేమిస్తుండవచ్చు, వాటిపట్ల కృతజ్ఞత కలిగివుండవచ్చు. ఉదాహరణకు, యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోకముందు కూడా, మీకు బైబిలు అంటే ఎంతో గౌరవం ఉండివుంటుంది. అలాగే మీరు యేసు మీద ప్రేమను పెంచుకొని ఉంటారు. యెహోవాసాక్షులు మీకు పరిచయం అయ్యాక, వాళ్లతో సహవసించడాన్ని మీరు ఇష్టపడుతుండవచ్చు. అలాంటి మంచి విషయాల్ని ప్రేమించినంత మాత్రాన యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీలో కలగకపోవచ్చు. మరి బాప్తిస్మం తీసుకునేలా ఏది మిమ్మల్ని నడిపిస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా మీదున్న ప్రేమే మిమ్మల్ని అలా నడిపిస్తుంది. మీరు యెహోవా దేవున్నే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆయన సేవచేసేలా ఏదీ లేదా ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. యెహోవా మీదున్న ప్రేమ కేవలం బాప్తిస్మం తీసుకునేలా నడిపించడమే కాదు, చివరివరకు ఆయనకు నమ్మకంగా ఉండేలా సహాయం చేస్తుంది.
5. మనం ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
5 మనం మన నిండు హృదయంతో, ప్రాణంతో, మనసుతో, బలంతో యెహోవాను ప్రేమించాలని యేసు చెప్పాడు. (మార్కు 12:30) మీరు యెహోవాను అంతగా ప్రేమించడం, గౌరవించడం ఎలా నేర్చుకోవచ్చు? యెహోవా మీపట్ల చూపించిన ప్రేమ గురించి ఆలోచించినప్పుడు, మీరూ ఆయన్ని ప్రేమించడం మొదలుపెడతారు. (1 యోహా. 4:19) యెహోవా మీద ప్రేమ పెంచుకోవడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి సహాయపడే కొన్ని సలహాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. *
6. రోమీయులు 1:20 ప్రకారం, యెహోవా గురించి నేర్చుకోవడానికి ఒక మార్గం ఏంటి?
6 సృష్టిని చూసి యెహోవా గురించి నేర్చుకోండి. (రోమీయులు 1:20 చదవండి; ప్రక. 4:11) యెహోవా చేసిన చెట్లను, జంతువులను గమనిస్తూ అవి ఆయనకున్న తెలివిని ఎలా రుజువు చేస్తున్నాయో ఆలోచించండి. మీ శరీరం అద్భుతంగా నిర్మించబడిన విధానం గురించి కొంచెం తెలుసుకోండి. (కీర్త. 139:14) అంతేకాదు, సూర్యుడిలో యెహోవా ఉంచిన శక్తి గురించి ఆలోచించండి. నిజానికి, సూర్యుడి లాంటి నక్షత్రాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. * (యెష. 40:26) సృష్టి గురించి ఆలోచించినప్పుడు, యెహోవా పట్ల మీకున్న గౌరవం ఇంకా పెరుగుతుంది. యెహోవాకు ఉన్న తెలివి, శక్తి గురించి తెలుసుకోవడం ప్రాముఖ్యమే. కానీ అది మాత్రమే సరిపోదు. మీకు ఆయన మీద ప్రేమ పెరగాలన్నా, మీరు ఆయనకు సన్నిహిత స్నేహితులు అవ్వాలన్నా మీరు ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి.
7. మీరు యెహోవాను ఎక్కువగా ప్రేమించాలంటే, మీకు ఏ నమ్మకం కలగాలి?
7 యెహోవాకు మీమీద శ్రద్ధ ఉందనే నమ్మకం మీకు కలగాలి. ఆకాశాన్ని, భూమిని చేసిన సృష్టికర్త మిమ్మల్ని చూస్తున్నాడని, మీ గురించి పట్టించుకుంటున్నాడని నమ్మడం మీకు కష్టంగా ఉందా? అలాగైతే, యెహోవా “మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని గుర్తుంచుకోండి. (అపొ. 17:26-28) ఆయన “హృదయాలన్నిటినీ పరిశీలిస్తాడు.” అంతేకాదు, మనం ఆయన్ని వెదికితే ఆయన్ని కనుగొంటామని మాటిస్తున్నాడు. (1 దిన. 28:9) నిజానికి యెహోవా మిమ్మల్ని తన ‘దగ్గరికి తెచ్చుకున్నాడు’ కాబట్టే మీరు బైబిలు స్టడీ తీసుకుంటున్నారు. (యిర్మీ. 31:3) యెహోవా మీ కోసం చేసినవాటి గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆయన మీద మీకున్న ప్రేమ అంత ఎక్కువౌతుంది.
8. యెహోవా ప్రేమకు మీరు కృతజ్ఞత చూపించే ఒక మార్గం ఏంటి?
8 యెహోవా ప్రేమకు కృతజ్ఞత చూపించే ఒక మార్గం ఏంటంటే, ప్రార్థనలో ఆయనతో మాట్లాడడం. ప్రార్థనలో మీ ఆందోళనల గురించి చెప్పుకున్నప్పుడు, ఆయన మీ కోసం చేస్తున్నవాటికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు దేవుని మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది. ఆయన మీ ప్రార్థనలకు ఎలా జవాబిస్తున్నాడో ఆలోచించినప్పుడు మీ మధ్యున్న స్నేహం బలపడుతుంది. (కీర్త. 116:1) ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడనే నమ్మకం మీకు కలుగుతుంది. అయితే, మీరు యెహోవాకు దగ్గరవ్వాలంటే ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలి; ఆయన మీ నుండి ఏం కోరుతున్నాడో తెలుసుకోవాలి. అలా చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఆయన వాక్యమైన బైబిల్ని చదవడం.
9. మీరు బైబిల్ని విలువైనదిగా ఎంచుతున్నారని ఎలా చూపించవచ్చు?
9 దేవుని వాక్యమైన బైబిల్ని విలువైనదిగా ఎంచడం నేర్చుకోండి. యెహోవా గురించిన సత్యం ఏంటో, మనుషుల విషయంలో ఆయన సంకల్పం ఏంటో బైబిలు మాత్రమే తెలియజేస్తుంది. ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా, స్టడీ తీసుకుంటున్న పుస్తకంలోని అధ్యాయాల్ని సిద్ధపడడం ద్వారా, నేర్చుకుంటున్నవాటిని పాటించడం ద్వారా మీరు బైబిల్ని విలువైనదిగా ఎంచుతున్నారని చూపిస్తారు. (కీర్త. 119:97, 99; యోహా. 17:17) మీరు బైబిలు చదవడానికి ఒక పట్టిక వేసుకుని, ప్రతీరోజు దాన్ని చదువుతున్నారా?
10. బైబిలుకున్న ఒక ప్రత్యేకత ఏంటి?
10 బైబిలుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దానిలో యేసు గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వృత్తాంతాలు ఉన్నాయి. యేసు మీ కోసం చేసినవాటి గురించి బైబిలు మాత్రమే ఖచ్చితమైన వివరాలు ఇస్తుంది. యేసు బోధల గురించి, పనుల గురించి నేర్చుకుంటుండగా ఆయనతో స్నేహం చేయాలనే కోరిక మీలో కలుగుతుంది.
11. యెహోవా మీద ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?
11 యేసును ప్రేమించడం నేర్చుకోండి, అప్పుడు యెహోవా మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది. ఎలా? యేసు తన తండ్రి లక్షణాల్ని పరిపూర్ణంగా అనుకరించాడు. (యోహా. 14:9) కాబట్టి మీరు యేసు గురించి తెలుసుకునేకొద్దీ, యెహోవాను ఇంకా బాగా అర్థంచేసుకుంటారు, గౌరవిస్తారు. ఉదాహరణకు యేసు చూపించిన కనికరం గురించి ఆలోచించండి. ఇతరులు పేదవాళ్లను, రోగులను, బలహీనుల్ని చిన్నచూపు చూశారు, కానీ యేసు వాళ్లమీద కనికరం చూపించాడు. అలాగే యేసు మీకు ఇచ్చిన చక్కని సలహాల గురించి, వాటిని పాటించడం వల్ల మీరు పొందే ప్రయోజనాల గురించి కూడా ఆలోచించండి.—మత్త. 5:1-11; 7:24-27.
12. యేసు గురించి నేర్చుకున్నప్పుడు ఏం చేయాలని మీకు అనిపించవచ్చు?
12 మన పాపాలు క్షమించబడాలని యేసు తన ప్రాణాన్ని అర్పించాడు. దాని గురించి మీరు లోతుగా ఆలోచించినప్పుడు, ఆయన మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది. (మత్త. 20:28) యేసు మీ కోసం చనిపోవడానికి ఇష్టంగా ముందుకొచ్చాడని మీరు అర్థంచేసుకున్నప్పుడు, పశ్చాత్తాపపడి యెహోవాను క్షమాపణ అడగాలని మీకు అనిపించవచ్చు. (అపొ. 3:19, 20; 1 యోహా. 1:9) మీరు యేసును, యెహోవాను ప్రేమించేకొద్దీ, వాళ్లను ప్రేమించే ప్రజలకు కూడా దగ్గరౌతారు.
13. యెహోవా మీకు ఏం ఇవ్వడం ద్వారా సహాయం చేస్తాడు?
13 యెహోవాను ప్రేమించేవాళ్లను ప్రేమించడం నేర్చుకోండి. మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలని అనుకుంటున్నారో సాక్షులుకాని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అర్థంకాకపోవచ్చు. వాళ్లు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు కూడా. కానీ ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా మీకు సహాయం చేస్తాడు. ఆ కుటుంబంలోని సహోదరసహోదరీలకు దగ్గరగా ఉంటే మీకు కావాల్సిన మద్దతు, ప్రేమ దొరుకుతాయి. (మార్కు 10:29, 30; హెబ్రీ. 10:24, 25) కొంతకాలానికి మీ కుటుంబ సభ్యులు కూడా మీతో కలిసి యెహోవాను ఆరాధించడం, ఆయన ప్రమాణాల్ని పాటించడం మొదలుపెట్టవచ్చు.—1 పేతు. 2:12.
14. మొదటి యోహాను 5:3 ప్రకారం, యెహోవా ప్రమాణాలు ఎలాంటివని మీరు అర్థంచేసుకున్నారు?
14 యెహోవా ప్రమాణాల్ని గౌరవించడం, వాటిని పాటించడం నేర్చుకోండి. యెహోవా గురించి మీకు తెలియకముందు, మీకు మీ సొంత ప్రమాణాలు ఉండివుంటాయి. కానీ ఇప్పుడు యెహోవా ప్రమాణాలే మంచివని మీరు అర్థంచేసుకున్నారు. (కీర్త. 1:1-3; 1 యోహాను 5:3 చదవండి.) బైబిలు భర్తలకు, భార్యలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఇస్తున్న సలహాల గురించి ఒకసారి ఆలోచించండి. (ఎఫె. 5:22–6:4) ఆ సలహాలను పాటించినప్పుడు, మీ కుటుంబం మరింత సంతోషంగా ఉన్నట్టు మీరు గమనించారా? స్నేహితుల్ని తెలివిగా ఎంపిక చేసుకోవడం గురించి యెహోవా ఇస్తున్న నిర్దేశానికి లోబడినప్పుడు, మీ వ్యక్తిత్వం మెరుగైనట్టు అనిపించిందా? మీరు మరింత సంతోషంగా జీవిస్తున్నారా? (సామె. 13:20; 1 కొరిం. 15:33) బహుశా ఈ ప్రశ్నలకు మీరు అవుననే జవాబిస్తారు.
15. బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో అర్థంచేసుకోవడానికి ఏవి మీకు సహాయం చేస్తాయి?
15 కొన్నిసార్లు, మీరు నేర్చుకుంటున్న బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో మీకు అర్థంకాకపోవచ్చు. కాబట్టి తప్పొప్పుల్ని గుర్తించేలా సహాయం చేయడానికి యెహోవా తన సంస్థ ద్వారా బైబిలు ఆధారిత ప్రచురణల్ని ఇస్తున్నాడు. (హెబ్రీ. 5:13, 14) మీరు వాటిని చదివి, అధ్యయనం చేసినప్పుడు వాటిలో ఉన్న బైబిలు సూత్రాలు ఎంత ఉపయోగకరమైనవో, వాటిని మీ జీవితంలో ఏయే సందర్భాల్లో పాటించవచ్చో మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీకు కూడా యెహోవా సంస్థలో ఒకరు అవ్వాలని అనిపించవచ్చు.
16. యెహోవా తన ప్రజల కోసం ఏయే ఏర్పాట్లు చేశాడు?
16 యెహోవా సంస్థను ప్రేమించడం, దానికి మద్దతివ్వడం నేర్చుకోండి. యెహోవా తన ప్రజల్ని సంఘాలుగా ఏర్పర్చాడు. ఆ సంఘాలన్నిటికీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. (ఎఫె. 1:22; 5:23) నేడు భూమ్మీద జరుగుతున్న తన పనులన్నీ చూసుకోవడానికి యేసు, అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపును నియమించాడు. ఆయన ఆ గుంపును “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” అని పిలుస్తున్నాడు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషించే, కాపాడే బాధ్యత వాళ్లకు ఉంది. వాళ్లు దాన్ని నమ్మకంగా చేస్తున్నారు. (మత్త. 24:45-47) మీకు కావాల్సిన సహాయాన్ని ఇవ్వడానికి ఆ దాసుడు చేసే ఒక పని ఏంటంటే, అర్హులైన పురుషులను పెద్దలుగా నియమించడం. ఆ పెద్దలు మీకు నిర్దేశాన్ని, కాపుదలను ఇస్తారు. (యెష. 32:1, 2; హెబ్రీ. 13:17; ) వాళ్లు మీకోసం చేయగలిగినదంతా చేయడానికి, మిమ్మల్ని ఓదార్చడానికి, మీరు యెహోవాకు మరింత దగ్గరయ్యేలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, వాళ్లు చేసే ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఇతరులకు యెహోవా గురించి ఎలా చెప్పాలో మీకు నేర్పించడం.— 1 పేతు. 5:2, 3ఎఫె. 4:11-13.
17. రోమీయులు 10:10, 13, 14 ప్రకారం, మనం ఎందుకు యెహోవా గురించి ఇతరులతో మాట్లాడతాం?
17 యెహోవాను ప్రేమించడం ఇతరులకు నేర్పించండి. యెహోవా గురించి ఇతరులకు బోధించమని, యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20) అయితే ఆ పనిని మీరు ఒక బాధ్యతలా చేసే అవకాశం ఉంది. కానీ యెహోవా మీద మీ ప్రేమ పెరిగేకొద్దీ అపొస్తలులైన పేతురు, యోహానులకు అనిపించినట్టే మీకూ అనిపించవచ్చు. వాళ్లు ఇలా అన్నారు, “మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.” (అపొ. 4:20) యెహోవాను ప్రేమించేలా మనం ఎవరికైనా సహాయం చేస్తే ఎంతో సంతోషం పొందుతాం. ఇతియోపీయుడైన అధికారికి లేఖనాల్లో ఉన్న సత్యాన్ని నేర్పించి, బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేసినందుకు సువార్తికుడైన ఫిలిప్పు ఎంతో సంతోషించి ఉంటాడు! మీరు ఫిలిప్పులాగే యేసు ఆజ్ఞకు లోబడి ప్రకటిస్తే, యెహోవాసాక్షి అవ్వాలనే కోరిక మీకూ ఉందని చూపిస్తారు. (రోమీయులు 10:10, 13, 14 చదవండి.) అప్పుడు, మీరు కూడా బహుశా ఇతియోపీయుడైన అధికారిలాగే, “నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” అని అడుగుతారు.—అపొ. 8:36.
18. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
18 బాప్తిస్మం తీసుకోవాలనే మీ నిర్ణయం మీ జీవితంలో మీరు తీసుకునే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతకీ మీరు బాప్తిస్మం గురించి ఏం తెలుసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.
పాట 2 యెహోవా నీ పేరు
^ పేరా 5 కొంతమందికి యెహోవా మీద ప్రేమ ఉన్నప్పటికీ, బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షి అవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. మీ పరిస్థితి కూడా అదే అయితే, మీరు చేయగలిగే కొన్ని పనుల గురించి మరొకసారి ఆలోచించుకునేలా ఈ ఆర్టికల్ మీకు సహాయం చేస్తుంది. ఆ పనులు చేయడం ద్వారా మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ముందడుగు వేస్తారు.
^ పేరా 5 అందరూ ఒకేలా ఉండరు, కాబట్టి ఈ ఆర్టికల్‌లో ఉన్న సలహాలను ఇక్కడిచ్చిన క్రమంలో కాకుండా వేరే క్రమంలో పాటించాలని కొంతమంది అనుకోవచ్చు.
^ పేరా 6 మరిన్ని ఉదాహరణల కోసం జీవం సృష్టించబడిందా? (ఇంగ్లీష్), అలాగే జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్) బ్రోషుర్‌లు చూడండి.
^ పేరా 61 చిత్రాల వివరణ: ఒక సహోదరి మార్కెట్‌కు వెళ్లినప్పుడు, అక్కడున్న ఒక యువతికి కరపత్రం ఇస్తోంది.