జీవిత కథ
“మేమున్నాము! మమ్మల్ని పంపించండి!”
అవసరం ఎక్కువున్న ప్రాంతానికి, బహుశా వేరేదేశానికి వెళ్లి మీరు యెహోవా సేవ ఎక్కువ చేయాలనుకుంటున్నారా? అలాగైతే, బేర్గమ్ దంపతుల అనుభవం నుండి మీరెన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
జాక్, ఆయన భార్య మారీలీన్ ఇద్దరూ కలిసి 1988 నుండి పూర్తికాల సేవ చేస్తున్నారు. సర్దుకుపోయే స్వభావం ఎక్కువున్న ఈ దంపతులు గ్వాడెలోప్, ఫ్రెంచ్ గయానా ప్రాంతాల్లో అనేక నియామకాల్లో సేవచేశారు. ఈ రెండు ప్రాంతాలు ఇప్పుడు ఫ్రాన్స్ బ్రాంచి పర్యవేక్షణ కింద ఉన్నాయి. మనం జాక్, మారీలీన్లను కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ల సేవ గురించి తెలుసుకుందాం.
పూర్తికాల సేవ మొదలుపెట్టాలని మీకెందుకు అనిపించింది?
మారీలీన్: నేను గ్వాడెలోప్‌లో పెరిగాను. నా చిన్నతనంలో తరచూ మా అమ్మతో కలిసి రోజంతా ప్రీచింగ్ చేసేదాన్ని. ఆమె ఉత్సాహంగా ప్రీచింగ్ చేసేది. నాకు ప్రజలంటే చాలా ఇష్టం కాబట్టి నా చదువు పూర్తయిన వెంటనే 1985 లో పయినీరు సేవ మొదలుపెట్టాను.
జాక్: నా యౌవనంలో, పరిచర్యను ఎంతో ప్రేమించే పూర్తికాల సేవకులతోనే నేను ఎక్కువగా ఉండేవాన్ని. స్కూల్ సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేసేవాన్ని. శని, ఆదివారాల్లో అమ్మతో గానీ వేరొక సహోదరునితో గానీ బస్‌లో వెళ్లి పయినీర్లను కలిసేవాన్ని. మేమందరం రోజంతా ప్రీచింగ్ చేసి, సాయంత్రం బీచ్‌కు వెళ్లేవాళ్లం. ఆ రోజులు చాలా సరదాగా ఉండేవి.
1988 లో మారీలీన్ను పెళ్లి చేసుకున్న కొన్నిరోజులకు నేనిలా అనుకున్నాను: ‘మాకు ఎలాంటి బాధ్యతలూ లేవు కాబట్టి, మేము పరిచర్య ఎక్కువ చేయాలి.’ అప్పటికే పయినీరు సేవ చేస్తున్న మారీలీన్తో పాటు నేను కూడా పయినీరింగ్ మొదలుపెట్టాను. ఒక సంవత్సరం తర్వాత మేము పయినీరు పాఠశాలకు హాజరయ్యాం. అప్పుడు మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. మేము గ్వాడెలోప్‌లో ఎన్నో ప్రాంతాల్లో సంతోషంగా సేవచేశాం. తర్వాత మాకు ఫ్రెంచ్ గయానాకు రమ్మని ఆహ్వానం వచ్చింది.
గడిచిన సంవత్సరాల్లో మీరు వేర్వేరు ప్రాంతాల్లో సేవచేశారు. మరి కొత్త పరిస్థితులకు అలవాటుపడేలా మీకేది సహాయం చేసింది?
మారీలీన్: మాకు బాగా ఇష్టమైన లేఖనం యెషయా 6:8 అని ఫ్రెంచ్ గయానాలోని బెతెల్ సహోదరులకు తెలుసు. వాళ్లు మాకు ఫోన్ చేసినప్పుడు, ‘మీకు బాగా ఇష్టమైన లేఖనం గుర్తుందా’ అని సరదాగా అడిగేవాళ్లు. దాంతో మా నియామకం మారబోతుందని మాకు అర్థమయ్యేది. అప్పుడు, “మేమున్నాము! మమ్మల్ని పంపించండి!” అని చెప్పేవాళ్లం.
మేము మా కొత్త నియామకాన్ని పాత నియామకాలతో పోల్చుకునేవాళ్లం కాదు. అలాచేస్తే బహుశా కొత్త నియామకాన్ని
ఆనందించలేం. మేము వెళ్లిన కొత్త ప్రాంతంలోని సహోదర సహోదరీలతో స్నేహం చేయడానికి కూడా ప్రయత్నించేవాళ్లం.జాక్: గతంలో, మేము వేరే ప్రాంతానికి వెళ్లిపోవడం ఇష్టంలేని కొంతమంది సహోదర సహోదరీలు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ మేము గ్వాడెలోప్ విడిచి వెళ్తున్నప్పుడు, మత్తయి 13:38 లో “పొలం ఈ లోకం” అని యేసు చెప్పిన మాటల్ని ఒక సహోదరుడు మాకు గుర్తుచేశాడు. కాబట్టి మా నియామకాలు మారినప్పుడు, మేము ఎక్కడికి వెళ్లినా ఒకే పొలంలో సేవ చేస్తున్నామని గుర్తుంచుకునేవాళ్లం. మాకు కావాల్సిందల్లా ప్రకటించడానికి ఒక ప్రాంతం, అందులో ప్రజలు ఉండడం, అంతే!
మేము కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా అక్కడి ప్రజలు సంతోషంగా జీవించడాన్ని చూసేవాళ్లం. కాబట్టి మేము కూడా వాళ్లలాగే జీవించడానికి ప్రయత్నించేవాళ్లం. వాళ్ల ఆహార అలవాట్లు వేరైనా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్లు తినేవి తినేవాళ్లం, వాళ్లు తాగేవి తాగేవాళ్లం. ప్రతీ నియామకం గురించి సానుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నించేవాళ్లం.
మారీలీన్: స్థానిక సహోదర సహోదరీల నుండి కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మేము ఫ్రెంచ్ గయానాకు వెళ్లిన కొత్తలో ఏం జరిగిందంటే, ఒకరోజు వర్షం బాగా కురుస్తోంది. దాంతో వర్షం ఆగాకే ప్రీచింగ్‌కు వెళ్లాలని అనుకున్నాం. కానీ ఒక సహోదరి, “ప్రీచింగ్‌కి వెళ్దామా” అంది. నేను ఆశ్చర్యపోయి, “ఎలా వెళ్తాం” అన్నాను. అప్పుడు ఆమె “నీ గొడుగు తీసుకో, మనం సైకిళ్ల మీద వెళ్దాం” అంది. అలా గొడుగు పట్టుకుని, సైకిల్ ఎలా తొక్కాలో నేర్చుకున్నాను. ఒకవేళ నేర్చుకోకపోయుంటే, వర్షాకాలంలో ప్రీచింగ్ చేయలేకపోయేదాన్ని.
మీరు దాదాపు 15 సార్లు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మారారు. వేరే ప్రాంతానికి మారే వాళ్ల కోసం ఏమైనా సలహాలు చెప్తారా?
మారీలీన్: వేరే ప్రాంతానికి మారడం చిన్న విషయం కాదు. ప్రీచింగ్ నుండి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి మంచి ఇల్లు వెతుక్కోవడం ప్రాముఖ్యం.
జాక్: సాధారణంగా నేను కొత్త ఇంటికి వెళ్లినప్పుడల్లా ఇంటికి పెయింట్ వేసేవాన్ని. కొన్నిసార్లు మమ్మల్ని వేరే ప్రాంతానికి పంపించేటప్పుడు, బహుశా మేము అక్కడ ఎక్కువకాలం ఉండమని తెలిసిన బ్రాంచిలోని సహోదరులు నన్ను ఆటపట్టిస్తూ, “జాక్, ఈసారి ఇంటికి పెయింట్ వేయద్దులే” అనేవాళ్లు.
మారీలీన్ ప్యాకింగ్ చాలా బాగా చేస్తుంది. ఆమె అన్నిటినీ బాక్సుల్లో సర్ది, వాటి మీద “బాత్రూమ్,” “బెడ్రూమ్,” “కిచెన్” అని పేర్లు రాస్తుంది. కాబట్టి మేము కొత్త ఇంటికి వెళ్లాక ఆ బాక్సుల మీదున్న పేర్లు చూసి వాటిని ఆ రూముల్లో పెడతాం. ఏయే బాక్సుల్లో ఏమేం ఉన్నాయో ఆమె లిస్టు రాసి పెట్టేది. దానివల్ల మాకు కావాల్సింది తేలిగ్గా దొరికేది.
మారీలీన్: మేము అన్నీ పద్ధతి ప్రకారం చేయడం నేర్చుకున్నాం కాబట్టి సమయం వృథా కాకుండా వీలైనంత త్వరగా ప్రీచింగ్ మొదలుపెట్టేవాళ్లం.
‘మీ పరిచర్యను పూర్తిగా నెరవేర్చేలా’ మీరెలాంటి ప్రణాళికలు వేసుకుంటారు?—2 తిమో. 4:5.
మారీలీన్: సోమవారాల్లో మేము విశ్రాంతి తీసుకుని మీటింగ్స్‌కి సిద్ధపడతాం. మంగళవారం నుండి ప్రీచింగ్‌కి వెళ్తాం.
జాక్: మేము ప్రతీనెల ఖచ్చితంగా కొన్ని గంటలు పరిచర్య చేయాలి. అయితే మేము గంటల మీద మనసుపెట్టం, మాకు పరిచర్యే అన్నిటికన్నా ప్రాముఖ్యం. ఇంట్లోంచి బయల్దేరి, ఇంటికి తిరిగొచ్చే వరకు కలిసిన ప్రతీ ఒక్కరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం.
మారీలీన్: పిక్నిక్కి వెళ్లేటప్పుడు కూడా కరపత్రాలు తీసుకెళ్తాను. మేము యెహోవాసాక్షులమని చెప్పకపోయినా కొంతమంది మా దగ్గరికి వచ్చి ప్రచురణల కోసం అడుగుతారు. అందుకే మా బట్టల విషయంలో, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటాం. మన చుట్టూ ఉన్నవాళ్లు అలాంటివి గమనిస్తారు.
జాక్: మంచిపనులు చేయడం ద్వారా కూడా మేము మా చుట్టుపక్కల వాళ్లకు సాక్ష్యమిస్తాం. నేను కింద పడిపోయిన పేపర్లను తీసి చెత్త బుట్టలో పడేస్తాను, మా ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్లో రాలిపోయిన ఆకుల్ని ఊడ్చేస్తాను. మా చుట్టుపక్కలవాళ్లు వాటిని గమనించేవాళ్లు. వాళ్లలో కొంతమంది, “మీ దగ్గర ఒక బైబిలు ఉంటే మాకు ఇస్తారా?” అని అడిగారు.
మీరు తరచూ మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రకటించేవాళ్లు. ఆ ప్రయాణాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన విషయాలు చెప్తారా?
జాక్: గయానాలో కొన్ని ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టం. మేము చాలాసార్లు ఒక వారంలో దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఆ రోడ్లు బాగుండేవి కాదు. అమెజాన్ అడవిలోని సాంతెలీ అనే ఊరికి చేసిన ప్రయాణం నాకు బాగా గుర్తుంది. మేము ఒక జీపులో, అలాగే పడవలో కొన్ని గంటలపాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాం. అక్కడ నివసించే చాలామంది బంగారు గనుల్లో పనిచేసేవాళ్లు. మేము ప్రచురణల్ని ఇచ్చినప్పుడు కృతజ్ఞతతో, కొంత బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. సాయంత్రం మన సంస్థ తయారుచేసిన వీడియో చూపించాం. దాన్ని చూడడానికి చాలామంది వచ్చారు.
మారీలీన్: ఈమధ్యే, కామోపీలో జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగాన్ని ఇవ్వడానికి జాక్‌ను పిలిచారు. మేము ఓయపోక్ నది మీద పడవలో నాలుగు గంటలపాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాం. అది మర్చిపోలేని అనుభవం.
జాక్: నది లోతు తక్కువగా ఉన్న చోట బండ రాళ్ల మధ్య నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటే అది చాలా ప్రమాదకరం. బండ రాళ్ల మధ్య నీళ్లు అలా వేగంగా ప్రవహించడం చూడడానికి చాలా బాగుంటుంది. అలాంటి చోట పడవ నడపాలంటే మంచి నైపుణ్యం ఉండాలి. ఆ ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. అక్కడ ఆరుగురు సాక్షులే ఉన్నా, జ్ఞాపకార్థ ఆచరణకు 50 మంది హాజరయ్యారు, వాళ్లలో కొంతమంది అమరిండియన్లు.
మారీలీన్: యెహోవా సేవ ఎక్కువ చేయాలనుకునే యౌవనస్థులు కూడా ఇలాంటి అద్భుతమైన అనుభవాన్ని రుచి చూడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు యెహోవా మీద నమ్మకముంచాలి, అప్పుడు మీ విశ్వాసం బలపడుతుంది. మేమైతే చాలాసార్లు యెహోవా సహాయాన్ని రుచిచూశాం.
మీరు చాలా భాషలు నేర్చుకున్నారు. మీకు సహజంగానే భాషలు నేర్చుకునే సామర్థ్యం ఉందా?
జాక్: కానేకాదు, అవసరం ఉంది కాబట్టే నేర్చుకున్నాను. స్రానన్టోంగో * భాషలో కనీసం బైబిలు చదివే నియామకం కూడా రాకముందే, కావలికోట అధ్యయనాన్ని నిర్వహించే నియామకం నాకు ఇచ్చారు. మీటింగ్ అయిపోయాక, “నేనెలా చేశాను?” అని ఒక సహోదరుణ్ణి అడిగాను. “మీరు ఉపయోగించిన కొన్ని పదాలు మాకు అర్థం కాలేదు, కానీ బాగా చేశారు” అని ఆయన అన్నాడు. పిల్లలు నాకు ఎంతో సహాయం చేసేవాళ్లు. నా భాషలో ఏమైనా తప్పులు ఉంటే, పెద్దవాళ్లు చెప్పేవాళ్లు కాదుగానీ పిల్లలు చెప్పేవాళ్లు. వాళ్ల నుండి నేను ఎంతో నేర్చుకున్నాను.
మారీలీన్: ఒక ప్రాంతంలో నేను ఫ్రెంచ్, పోర్చుగీస్, స్రానన్టోంగో భాషల్లో బైబిలు స్టడీలు చేసేదాన్ని. అలా ఎక్కువ భాషల్లో స్టడీలు ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందో ఒక సహోదరి నాకు సలహా ఇచ్చింది. ముందు నాకు కష్టంగా ఉండే పోర్చుగీస్ భాషలో బైబిలు స్టడీ చేసి, తర్వాత సులభంగా ఉండే భాషలో స్టడీ చేయమని చెప్పింది. ఆ సలహా ఎంత తెలివైనదో నాకు ఒకరోజున అర్థమైంది.
ఆ రోజు ఏమైందంటే, నేను రెండు స్టడీలు చేయాల్సి ఉంది. ఒకటి స్రానన్టోంగో భాషలో, రెండోది పోర్చుగీస్
భాషలో. నేను రెండో స్టడీ మొదలుపెట్టాక నాతో ఉన్న సహోదరి, “మారీలీన్, నువ్వు ఏం చెప్తున్నావో ఆమెకు అర్థంకావట్లేదు!” అంది. నేను నిజానికి పోర్చుగీస్ భాషలో కాకుండా, స్రానన్టోంగో భాషలో మాట్లాడుతున్నానని నాకర్థమైంది!మీరు సేవచేసిన ప్రాంతాల్లోని వాళ్లు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరెలా అంత మంచి స్నేహితులయ్యారు?
జాక్: సామెతలు 11:25 ఇలా చెప్తుంది: “ఉదారంగా ఇచ్చేవాళ్లు వర్ధిల్లుతారు.” సహోదరులతో సమయం గడపడానికి, వాళ్లకు సహాయం చేయడానికి మేము వెనకాడం. రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం, మరమ్మతులు చేయడం గురించి కొంతమంది నాతో ఇలా అన్నారు: “ఆ పనులు ప్రచారకులు చేస్తారు.” అప్పుడు, “నేను కూడా ప్రచారకుణ్ణే. ఏమైనా పని ఉంటే, నేను కూడా చేయాల్సిందే” అని అన్నాను. అంతేకాదు, మనందరికీ కొంత ఏకాంత సమయం కావాలి. కానీ అవసరమైతే, ఆ సమయంలో కూడా సహోదరులకు సహాయం చేయడానికి వెనకాడకూడదని మేము గుర్తుంచుకుంటాం.
మారీలీన్: మేము సహోదర సహోదరీల పట్ల శ్రద్ధ చూపించడానికి కృషిచేస్తాం. దానివల్ల కొంతమందికి తమ పిల్లల్ని చూసుకునే విషయంలో లేదా వాళ్లను స్కూల్ నుండి తీసుకొచ్చే విషయంలో సహాయం అవసరమని మాకు తెలిసేది. దాంతో వాళ్లకు సహాయం చేయడానికి మా పనుల్ని సర్దుబాటు చేసుకునేవాళ్లం. అలా అవసరమైనప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడం వల్ల మేము వాళ్లకు మంచి స్నేహితులం అయ్యాం.
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడం ద్వారా మీరెలాంటి ఆశీర్వాదాలు పొందారు?
జాక్: పూర్తికాల సేవలో ఉండడం వల్ల మేము చాలా ఆశీర్వాదాలు పొందాం. యెహోవా సృష్టిని ఆస్వాదించే ఎన్నో అవకాశాలు మాకు దొరికాయి. పూర్తికాల సేవలో సవాళ్లు ఉంటాయి, అయినా మేము ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే, మేము ఎక్కడికి వెళ్లినా దేవుని ప్రజల సహాయం ఉంటుందని మాకు తెలుసు.
నా యౌవనంలో, ఫ్రెంచ్ గయానాలో ఉన్నప్పుడు క్రైస్తవ తటస్థత కారణంగా నన్ను జైల్లో వేశారు. నేను మిషనరీగా ఫ్రెంచ్ గయానాకు మళ్లీ వెళ్తానని, ఒక సువార్తికునిగా అక్కడ జైల్లో ఉన్నవాళ్లను కలిసే అవకాశం నాకు దొరుకుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నిజంగా, యెహోవా మమ్మల్ని విస్తారంగా దీవించాడు!
మారీలీన్: వేరేవాళ్ల కోసం నా సమయాన్ని, శక్తిని ఉపయోగించడం వల్ల నేను ఎంతో ఆనందాన్ని పొందాను. యెహోవా సేవ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. అంతేకాదు, పూర్తికాల సేవవల్ల మా భార్యాభర్తల బంధం బలపడింది. కొన్నిసార్లు ఎవరైనా భార్యాభర్తలు నిరుత్సాహంలో ఉన్నట్టు గమనిస్తే, “వాళ్లను భోజనానికి పిలుద్దామా?” అని జాక్ నన్ను అడిగేవాడు. అప్పుడు, “నేనూ అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను” అని చెప్పేదాన్ని. ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది.
జాక్: నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని ఈమధ్యే తెలిసింది. మారీలీన్కు బాధగా అనిపించినా నేనిలా చెప్తుంటాను: ‘మారీలీన్, నేనింకా ముసలివాణ్ణి కాలేదు. అయినా త్వరలో నేను చనిపోవాల్సి వస్తే, నా జీవితాన్ని ఎంతో విలువైన యెహోవా సేవ కోసం ఉపయోగించాననే సంతృప్తితో చనిపోతాను.’—ఆది. 25:8.
మారీలీన్: మేము ఎన్నడూ ఊహించని నియామకాల్ని, పనుల్ని చేసే అవకాశాన్ని యెహోవా మాకు ఇచ్చాడు. మేము ఎన్నో దీవెనలు పొందాం. యెహోవా ఎప్పుడూ సహాయం చేస్తాడనే నమ్మకం మాకు ఉంది కాబట్టి, ఆయన సంస్థ ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లడానికి మేము సిద్ధం!
^ పేరా 32 ఇంగ్లీష్, డచ్, పోర్చుగీస్, ఆఫ్రికన్ భాషల నుండి స్రానన్టోంగో భాష పుట్టింది. ఈ భాషను బానిసలు కనిపెట్టారు.