అధ్యయన ఆర్టికల్ 11
మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
‘బాప్తిస్మం మిమ్మల్ని రక్షిస్తోంది.’—1 పేతు. 3:21.
పాట 28 యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం
ఈ ఆర్టికల్లో . . . *
1. ఇల్లు కట్టడం మొదలుపెట్టే ముందు ఏం చేయాలి?
ఒక వ్యక్తి ఇల్లు కట్టాలని అనుకుంటున్నట్టు ఊహించుకోండి. ఎలాంటి ఇల్లు కట్టాలో అతనికి తెలుసు. అయితే అతను వెంటనే షాపుకు వెళ్లి, కొన్ని సామాన్లు కొని పని మొదలుపెట్టడం సరైనదేనా? కాదు. అతను పనిని మొదలుపెట్టకముందు, ముఖ్యమైంది ఒకటి చేయాలి, అదేంటంటే ఇల్లు కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే, ఆ ఇల్లు కట్టడం మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో అతనికి తెలిసుండాలి. ఖర్చుల గురించి ముందే జాగ్రత్తగా లెక్క వేసుకుంటే, అతను తన ఇంటిని కట్టడం పూర్తి చేయగలుగుతాడు.
2. లూకా 14:27-30 ప్రకారం, మీరు బాప్తిస్మం తీసుకునే ముందు దేని గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి?
2 యెహోవా పట్ల మీకున్న ప్రేమ, కృతజ్ఞత వల్ల మీరు బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నారా? అలాగైతే, ఇల్లు కట్టాలనుకున్న వ్యక్తిలానే మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకలా చెప్పవచ్చు? లూకా 14:27-30 వచనాల్లో యేసు చెప్పిన మాటలు గమనించండి. (చదవండి.) తనకు శిష్యులుగా ఉండడం అంటే ఏంటో యేసు అక్కడ చెప్తున్నాడు. యేసు శిష్యులుగా ఉండాలంటే కొన్ని కష్టాల్ని సహించడానికి, కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. (లూకా 9:23-26; 12:51-53) కాబట్టి మీరు క్రీస్తు శిష్యులు అయినప్పుడు ఏమేం అనుభవించాల్సి ఉంటుందో బాప్తిస్మం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అప్పుడు బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవునిగా మీరు నమ్మకంగా దేవుని సేవలో కొనసాగడానికి సిద్ధంగా ఉంటారు.
3. ఈ ఆర్టికల్లో మనం ఏం చర్చిస్తాం?
3 మనం కష్టాల్ని సహిస్తూ, త్యాగాలు చేస్తూ క్రీస్తు శిష్యుడిగా జీవించడం వల్ల ఏమైనా ప్రతిఫలం పొందుతామా? ఖచ్చితంగా! మనం బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో ఎన్నో ఆశీర్వాదాలు పొందుతాం. అయితే, బాప్తిస్మం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ఇప్పుడు చర్చించుకుందాం.
దానివల్ల బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో మీకు తెలుస్తుంది.సమర్పణ, బాప్తిస్మం గురించి మీరు ఏం తెలుసుకోవాలి?
4. (ఎ) సమర్పణ అంటే ఏంటి? (బి) మత్తయి 16:24 చెప్తున్నట్టు, ఇక నుండి మీరు మీ కోసం జీవించరు అనే మాటల అర్థం ఏంటి?
4 సమర్పణ అంటే ఏంటి? బాప్తిస్మం తీసుకునే ముందు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. సమర్పించుకునేటప్పుడు మీరు యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఎప్పటికీ మీ జీవితాన్ని ఆయన సేవకే ఉపయోగిస్తారని చెప్తారు. అలా సమర్పించుకున్న తర్వాత మీరు మీ కోసం జీవించరు. (మత్తయి 16:24 చదవండి) మీరు ఇక యెహోవాకు చెందినవాళ్లౌతారు, అది ఎంతో గొప్ప గౌరవం. (రోమా. 14:8) ఇక నుండి మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడం కన్నా ఆయన సేవకే మొదటి స్థానం ఇస్తారని చెప్తారు. సమర్పించుకోవడం అనేది మీరు దేవునికి చేసుకునే ఒక మొక్కుబడి లేదా ముఖ్యమైన ప్రమాణం. అలా మొక్కుబడి చేసుకోమని యెహోవా మనల్ని బలవంతపెట్టడు. కానీ మనం మొక్కుబడి చేసుకున్నాక, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరుకుంటాడు.—కీర్త. 116:12, 14.
5. బాప్తిస్మానికి, సమర్పణకు ఎలాంటి సంబంధం ఉంది?
5 బాప్తిస్మానికి, సమర్పణకు ఎలాంటి సంబంధం ఉంది? సమర్పణ అనేది వ్యక్తిగత విషయం, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకునే మొక్కుబడి. అది మీకూ యెహోవాకూ మధ్య జరుగుతుంది. అయితే, బాప్తిస్మం మాత్రం అందరిముందు తీసుకునేది. సాధారణంగా సమావేశాల్లో బాప్తిస్మం ఇస్తుంటారు. మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీ జీవితాన్ని అప్పటికే యెహోవాకు సమర్పించుకున్నారని అందరికీ చూపిస్తారు. * మీరు యెహోవాను మీ నిండు హృదయంతో, మీ నిండు ప్రాణంతో, మీ నిండు మనసుతో, మీ పూర్తి బలంతో ప్రేమిస్తున్నారని, మీరు ఆయన సేవ ఎప్పటికీ చేయాలని నిశ్చయించుకున్నారని మీ బాప్తిస్మం ద్వారా ఇతరులకు తెలుస్తుంది.—మార్కు 12:30.
6-7. మొదటి పేతురు 3:18-22 ప్రకారం, ఏ రెండు కారణాల్ని బట్టి బాప్తిస్మం తీసుకోవడం నిజంగా అవసరం?
6 బాప్తిస్మం తీసుకోవడం నిజంగా అవసరమా? 1 పేతురు 3:18-22 వచనాల్లో ఉన్న మాటల్ని పరిశీలించండి. (చదవండి.) నోవహు విశ్వాసానికి ఓడ ఒక రుజువుగా ఉన్నట్టే, మీరు యెహోవాకు సమర్పించుకున్నారు అనడానికి బాప్తిస్మం ఒక స్పష్టమైన రుజువుగా ఉంటుంది. కానీ బాప్తిస్మం తీసుకోవడం నిజంగా అవసరమా? అవసరమే. దానికిగల కారణాన్ని పేతురు వివరించాడు. మొదటిగా, బాప్తిస్మం మిమ్మల్ని ‘రక్షిస్తుంది.’ మరి బాప్తిస్మం మనల్ని రక్షించాలంటే ఏం చేయాలి? యేసు మీద మనకున్న విశ్వాసాన్ని చేతల్లో చూపించాలి. అంతేకాదు ఆయన మనకోసం చనిపోయి, పునరుత్థానమై పరలోకానికి వెళ్లి, ఇప్పుడు “దేవుని కుడిపక్కన” ఉన్నాడని నమ్ముతున్నట్టు చేతల్లో చూపించాలి.
7 రెండవదిగా, బాప్తిస్మం వల్ల మనం “మంచి మనస్సాక్షి” పొందుతాం. దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకు ఆయనతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడుతుంది. మనం నిజంగా పశ్చాత్తాపపడి, విమోచన క్రయధనంపై విశ్వాసం చూపించాం కాబట్టి దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. దానివల్ల ఆయన ముందు మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది.
8. మీరు ఏ కారణాన్ని బట్టి బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవాలి?
8 మీరు ఏ కారణాన్ని బట్టి బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవాలి? బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం వల్ల మీరు యెహోవా గురించి, ఆయన లక్షణాల గురించి, ఆయన మార్గాల గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఆ విషయాలు మీ హృదయాన్ని తాకాయి, దాంతో ఆయన పట్ల మీ ప్రేమ ఇంకా పెరిగింది. అవును, బాప్తిస్మం తీసుకోవాలనే మీ నిర్ణయానికి యెహోవా మీదున్న ప్రేమే అత్యంత ముఖ్యమైన కారణం అయ్యుండాలి.
9. మత్తయి 28:19, 20 ప్రకారం తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి?
9 బాప్తిస్మం తీసుకోవాలనే మీ నిర్ణయానికి మరో మత్తయి 28:19, 20 చదవండి.) బాప్తిస్మం తీసుకునేవాళ్లు “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున” బాప్తిస్మం తీసుకోవాలని చెప్పాడు. అంటే ఏంటి? మీరు యెహోవా గురించిన, ఆయన కుమారుడైన యేసు గురించిన, పవిత్రశక్తి గురించిన బైబిలు సత్యాల్ని పూర్తిగా నమ్మాలి. ఈ సత్యాలు చాలా శక్తివంతమైనవి, అవి మీ హృదయాన్ని కదిలిస్తాయి. (హెబ్రీ. 4:12) ఆ సత్యాల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
కారణం, మీరు నేర్చుకుని, నమ్ముతున్న బైబిలు సత్యాలు. శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ ఇచ్చినప్పుడు యేసు ఏం చెప్పాడో గమనించండి. (10-11. మీరు తండ్రి గురించిన ఏ సత్యాల్ని నేర్చుకుని నమ్ముతున్నారు?
10 మీరు తండ్రి గురించిన ఈ సత్యాల్ని నేర్చుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒకసారి గుర్తుచేసుకోండి: ఆయన పేరు యెహోవా, ఆయన ‘భూమంతటి పైన మహోన్నతుడు,’ ఆయన ‘మాత్రమే సత్యదేవుడు.’ (కీర్త. 83:18; యెష. 37:16) ఆయన మన సృష్టికర్త, మనల్ని రక్షించేవాడు. (కీర్త. 3:8; 36:9) ఆయన మనల్ని పాపమరణాల నుండి రక్షించడానికి ఏర్పాట్లు చేశాడు, మనం శాశ్వత జీవితం పొందే నిరీక్షణ ఇచ్చాడు. (యోహా. 17:3) సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు ఒక యెహోవాసాక్షి అయ్యారని అందరికీ తెలుస్తుంది. (యెష. 43:10-12) అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరాధకుల కుటుంబంలో మీరూ ఒకరౌతారు. వాళ్లంతా దేవుని పేరుతో పిలవబడడాన్ని, దాన్ని ఇతరులకు తెలియజేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు.—కీర్త. 86:12.
11 తండ్రి గురించిన బైబిలు సత్యాల్ని అర్థంచేసుకోవడం నిజంగా మనకు దొరికిన గొప్ప గౌరవం! అమూల్యమైన ఈ సత్యాల్ని మీరు నమ్మినప్పుడు, మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకునేలా, బాప్తిస్మం తీసుకునేలా మీ హృదయం మిమ్మల్ని పురికొల్పుతుంది.
12-13. మీరు కుమారుడి గురించిన ఏ సత్యాల్ని నేర్చుకుని నమ్ముతున్నారు?
12 మీరు దేవుని కుమారుని గురించిన ఈ సత్యాల్ని నేర్చుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? యేసు ఈ విశ్వంలోనే రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన మన విమోచకుడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు. విమోచన క్రయధనంపై మనకున్న విశ్వాసాన్ని చేతల్లో చూపించినప్పుడు దేవుడు మన పాపాల్ని క్షమిస్తాడు, ఆయనతో మనకు దగ్గరి స్నేహం ఏర్పడుతుంది, శాశ్వత జీవితం కూడా పొందుతాం. (యోహా. 3:16) యేసు మన ప్రధానయాజకుడు. మనం విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందేలా, దేవునితో దగ్గరి సంబంధం కలిగి ఉండేలా యేసు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. (హెబ్రీ. 4:15; 7:24, 25) దేవుని రాజ్యానికి రాజుగా ఉన్న యేసు ద్వారా యెహోవా తన పేరును పవిత్రపర్చుకుంటాడు, దుష్టత్వాన్ని నాశనం చేస్తాడు, రానున్న పరదైసులో నిత్యాశీర్వాదాలు తీసుకొస్తాడు. (మత్త. 6:9, 10; ప్రక. 11:15) యేసు మనకు మంచి ఆదర్శం. (1 పేతు. 2:21) తన జీవితాన్ని దేవుని ఇష్టం చేయడానికి ఉపయోగించడం ద్వారా ఆయన మంచి ఆదర్శం ఉంచాడు.—యోహా. 4:34.
13 మీరు దేవుని ప్రియ కుమారుడైన యేసు గురించిన బైబిలు సత్యాల్ని నమ్మినప్పుడు ఆయన్ని ప్రేమించడం మొదలుపెడతారు. యేసులాగే మీ జీవితాన్ని దేవుని ఇష్టం చేయడానికి ఉపయోగించేలా ఆ ప్రేమ మిమ్మల్ని పురికొల్పుతుంది. ఫలితంగా యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలని మీరు బలంగా కోరుకుంటారు.
14-15. మీరు పవిత్రశక్తి గురించిన ఏ సత్యాల్ని నేర్చుకుని నమ్ముతున్నారు?
14 మీరు పవిత్రశక్తి గురించిన ఈ సత్యాల్ని నేర్చుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? పవిత్రశక్తి ఒక దేవుడు కాదు, దేవుని చురుకైన శక్తి. యెహోవా బైబిల్ని రాయించడానికి పవిత్రశక్తిని ఉపయోగించాడు, ఆ శక్తి వల్లే మనం బైబిల్లో ఉన్నవాటిని అర్థం చేసుకోగలం, పాటించగలం. (యోహా. 14:26; 2 పేతు. 1:21) తన పవిత్రశక్తి ద్వారా యెహోవా మనకు “అసాధారణ శక్తి” ఇస్తాడు. (2 కొరిం. 4:7) మంచివార్త ప్రకటించడానికి, శోధనలు తిప్పికొట్టడానికి, నిరుత్సాహం నుండి బయటపడడానికి, కష్టాల్ని సహించడానికి కావాల్సిన బలాన్ని పవిత్రశక్తి మనకు ఇస్తుంది. గలతీయులు 5:22, 23 లో ఉన్న లక్షణాల్ని చూపించేలా అది మనకు సహాయం చేస్తుంది. తనపై నమ్మకం ఉంచుతూ, పవిత్రశక్తి కోసం మనస్ఫూర్తిగా అడిగేవాళ్లకు దేవుడు దాన్ని ధారాళంగా ఇస్తాడు.—లూకా 11:13.
15 దేవుని సేవ చేయడానికి పవిత్రశక్తి యెహోవా ఆరాధకులకు సహాయం చేస్తుందని తెలుసుకోవడం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీరు పవిత్రశక్తి గురించిన సత్యాల్ని నమ్మినప్పుడు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలని బలంగా కోరుకుంటారు.
16. ఇప్పటివరకు ఈ ఆర్టికల్లో మనం ఏం నేర్చుకున్నాం?
16 దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలి అనే మీ నిర్ణయం చాలా ముఖ్యమైనది. మనం ఆర్టికల్ మొదట్లో చూసినట్టు కష్టాల్ని సహించడానికి, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ మనం చేసే త్యాగాల కన్నా పొందే ఆశీర్వాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బాప్తిస్మం మిమ్మల్ని రక్షిస్తుంది, మంచి మనస్సాక్షిని ఇస్తుంది. అయితే, బాప్తిస్మం తీసుకోవాలనే మీ నిర్ణయానికి యెహోవా మీద మీకున్న ప్రేమే అత్యంత ప్రాముఖ్యమైన కారణం అయ్యుండాలి. మీరు యెహోవా గురించి, ఆయన కుమారుడైన యేసు గురించి, పవిత్రశక్తి గురించి నేర్చుకున్న బైబిలు సత్యాల్ని కూడా పూర్తిగా నమ్మాలి. ఇప్పటివరకు మనం చర్చించుకున్న వాటన్నిటిని బట్టి మీకు ఏమనిపిస్తుంది, మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరేం చేయాలి?
17. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఒక వ్యక్తి ఏయే పనులు చేయాలి?
17 బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీకనిపిస్తే, మీరు యెహోవాతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి ఇప్పటికే ఎన్నో పనులు చేసి ఉంటారనడంలో సందేహం లేదు. * మీరు క్రమంగా బైబిలు స్టడీ తీసుకోవడం వల్ల యెహోవా గురించి, యేసు గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మీలో విశ్వాసం కలిగింది. (హెబ్రీ. 11:6) బైబిల్లో ఉన్న యెహోవా వాగ్దానాలన్నిటినీ మీరు పూర్తిగా నమ్ముతున్నారు. యేసు అర్పించిన బలి వల్ల పాపమరణాల నుండి రక్షించబడతారనే నమ్మకం మీకు కలిగింది. మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడ్డారు, ఎంతో బాధపడుతూ క్షమించమని యెహోవాను వేడుకున్నారు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు, చెడు జీవన విధానాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన విధంగా జీవించడం మొదలుపెట్టారు. (అపొ. 3:19) మీ నమ్మకాల గురించి ఇతరులకు చెప్పాలని కోరుకున్నారు. బాప్తిస్మం పొందని ప్రచారకులు అవ్వడానికి కావాల్సిన అర్హతల్ని సంపాదించి, సంఘంతో కలిసి ప్రకటించడం మొదలుపెట్టారు. (మత్త. 24:14) ముఖ్యమైన ఈ పనులన్నీ చేసినందుకు యెహోవా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాడు. మీరు ఆయన హృదయాన్ని ఎంతో సంతోషపెట్టారు.—సామె. 27:11.
18. బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు ఇంకా ఏ పనులు చేయాలి?
18 బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు ఇంకొన్ని పనులు కూడా చేయాలి. ముందటి పేరాల్లో చూసినట్లు మీరు దేవునికి సమర్పించుకోవాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ, మీ జీవితాన్ని ఆయన ఇష్టాన్ని చేయడానికి ఉపయోగిస్తారని మాట ఇవ్వాలి. (1 పేతు. 4:2) తర్వాత మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని పెద్దల సభ సమన్వయకర్తకు చెప్పండి. కొంతమంది పెద్దలు మిమ్మల్ని కలిసేలా ఆయన ఏర్పాటు చేస్తాడు. వాళ్లతో మాట్లాడడానికి భయపడకండి. ప్రియమైన ఈ సహోదరులకు మీ గురించి తెలుసు, వాళ్లకు మీమీద ప్రేమ ఉంది. వాళ్లు మీరు నేర్చుకున్న ప్రాథమిక బైబిలు బోధల గురించి మీతో కలిసి మాట్లాడతారు. ఆ బోధలన్నీ మీరు అర్థం చేసుకున్నారో లేదో, అలాగే సమర్పణకు బాప్తిస్మానికి ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసో లేదో వాళ్లు చూడాలనుకుంటారు. మీరు సిద్ధంగా ఉన్నారని వాళ్లకు కూడా అనిపిస్తే, మీరు తర్వాతి సమావేశంలో బాప్తిస్మం తీసుకోవచ్చని చెప్తారు.
బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరేం చేయాలి?
19-20. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరేం చేయాలి? అదెలా చేయవచ్చు?
19 బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరేం చేయాలి? * మనం ముందటి పేరాల్లో చూసినట్టు సమర్పణ అనేది ఒక మొక్కుబడి, మనం దానికి కట్టుబడి ఉండాలని యెహోవా కోరుకుంటాడు. కాబట్టి బాప్తిస్మం తర్వాత, మీ సమర్పణకు తగ్గట్టు జీవించాలి. అదెలా చేయవచ్చు?
20 మీ సంఘానికి సన్నిహితంగా ఉండండి. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవునిగా మీరు ఇప్పుడు ‘ప్రపంచవ్యాప్త సహోదర బృందంలో’ ఒకరయ్యారు. (1 పేతు. 2:17) సంఘంలో ఉన్న మీ సహోదరసహోదరీలు మీకు ఆధ్యాత్మిక కుటుంబంగా ఉంటారు. క్రమంగా మీటింగ్స్కు వెళ్లడం ద్వారా వాళ్లతో మీ స్నేహం బలపడుతుంది. దేవుని వాక్యాన్ని రోజూ చదవండి, చదివినవాటి గురించి ధ్యానించండి. (కీర్త. 1:1, 2) బైబిల్లో కొన్ని వచనాల్ని చదివాక, వాటిగురించి లోతుగా ఆలోచించడానికి సమయం కేటాయించండి. అప్పుడు అవి మీ హృదయాన్ని చేరుకుంటాయి. “ప్రార్థన చేస్తూ ఉండండి.” (మత్త. 26:41) మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనల వల్ల మీరు యెహోవాకు ఇంకా దగ్గరౌతారు. “మీరు ఆయన రాజ్యానికి, . . . మొదటిస్థానం ఇస్తూ ఉండండి.” (మత్త. 6:33) మీ జీవితంలో ప్రకటనా పనికి ముఖ్యమైన స్థానం ఇవ్వడం ద్వారా మీరలా చేయవచ్చు. క్రమంగా పరిచర్య చేయడం ద్వారా మీ విశ్వాసం బలంగా ఉంచుకోవచ్చు, అలాగే శాశ్వత జీవితం పొందేలా ఇతరులకు సహాయం చేయవచ్చు.—1 తిమో. 4:16.
21. బాప్తిస్మం తీసుకోవడం వల్ల మీరు ఇప్పుడూ, భవిష్యత్తులో ఏం పొందుతారు?
21 మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలనే మీ నిర్ణయం, అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం. బాప్తిస్మం తీసుకోవడం వల్ల మీరు కష్టాలు ఎదుర్కోవాలి, త్యాగాలు చేయాలి. అయితే, దానివల్ల ఉపయోగం ఉందా? ఖచ్చితంగా! ఇప్పుడున్న సాతాను లోకంలో “మనకు వచ్చే శ్రమలు కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి.” (2 కొరిం. 4:17) కానీ మీరు బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఇప్పుడు మరింత సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు, అలాగే భవిష్యత్తులో “వాస్తవమైన జీవితం” సొంతం చేసుకుంటారు. (1 తిమో. 6:19) కాబట్టి దయచేసి బాగా ఆలోచించుకుని, ప్రార్థనాపూర్వకంగా మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో పరిశీలించుకోండి.
పాట 50 నా సమర్పణ ప్రార్థన
^ పేరా 5 మీరు బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నారా? అలాగైతే, ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మీ కోసమే తయారు చేయబడింది. ఎంతో ప్రాముఖ్యమైన ఈ అంశం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని చర్చిస్తాం. ఆ ప్రశ్నలకు మీరిచ్చే జవాబుల్ని బట్టి మీరు బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నారో లేదో మీకు అర్థమౌతుంది.
^ పేరా 5 “ బాప్తిస్మం తీసుకునే రోజు మీరు ఈ రెండు ప్రశ్నలకు జవాబిస్తారు” అనే బాక్సు చూడండి.
^ పేరా 17 బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకంలో 18వ అధ్యాయం చూడండి.
^ పేరా 19 బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?, అలాగే దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి అనే రెండు పుస్తకాల నుండి మీ స్టడీ పూర్తవ్వకపోతే, వాటిని పూర్తి చేసేవరకు మీ స్టడీని కొనసాగించండి.