పాఠకుల ప్రశ్న
యూదా ఆలయ రక్షక భటులు ఎవరు? వాళ్లు ఏయే పనులు చేసేవాళ్లు?
యాజకులుకాని లేవీయులు చేసే ఎన్నో పనుల్లో ఒకటి, రక్షక భటులుగా ఉండడం. ఆలయ పర్యవేక్షకుడి (కెప్టెన్) నిర్దేశాల ప్రకారం వాళ్లు పనిచేసేవాళ్లు. యూదా రచయిత అయిన ఫీలో, వాళ్లు చేసే పనుల గురించి ఇలా రాశాడు: ‘ఈ లేవీయుల్లో కొంతమంది, ప్రజలు ఆలయంలోకి ప్రవేశించే తలుపుల దగ్గర నిలబడేవాళ్లు, ఇంకొందరు ఆలయం లోపలున్న పవిత్రమైన స్థలం ఎదురుగా నిలబడేవాళ్లు. అర్హతలేనివాళ్లు తెలిసో, తెలియకో అందులో అడుగుపెట్టకుండా వాళ్లు చూసుకునేవాళ్లు. మరికొంతమంది వంతులవారీగా పగలూ రాత్రి ఆలయం చుట్టు తిరుగుతూ కాపలా కాసేవాళ్లు.’
మహాసభ ఈ రక్షక భటుల సహాయం తీసుకునేది. రక్షక భటులుగా ఉన్న ఈ యూదా గుంపుకు మాత్రమే రోమా ప్రభుత్వం ఆయుధాలు ధరించే అనుమతి ఇచ్చింది.
రక్షక భటులు తనను బంధించడానికి వచ్చినప్పుడు, తాను ఆలయంలో బోధిస్తున్నప్పుడు ఎందుకు బంధించలేదని యేసు వాళ్లను అడిగాడు. (మత్త. 26:55) ఒకవేళ వాళ్లు ఆలయ రక్షక భటులు కాకపోతే యేసు అలా అడిగి ఉండేవాడు కాదని యోయాకిమ్ యేరెమీయాస్ అనే రచయిత వివరించాడు. అంతేకాదు, అంతకుముందు ఒక సందర్భంలో యేసును బంధించడానికి వచ్చినవాళ్లు కూడా ఆలయ రక్షక భటులే అన్నది ఆ రచయిత అభిప్రాయం. (యోహా. 7:32, 45, 46) కొంతకాలానికి మహాసభ, అపొస్తలులను తమ దగ్గరకు తీసుకురమ్మని ఆలయ పర్యవేక్షకుణ్ణి, కొందరు అధికారుల్ని పంపించింది. బహుశా అపొస్తలుడైన పౌలును ఆలయం నుండి బయటికి ఈడ్చుకొచ్చింది కూడా ఈ రక్షక భటులే అయ్యుంటారు.—అపొ. 4:1-3; 5:17-27; 21:27-30.