అధ్యయన ఆర్టికల్ 13
ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి
“మనస్ఫూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి.”—1 పేతు. 1:22.
పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి
ఈ ఆర్టికల్‌లో . . . *
1. యేసు తన శిష్యులకు ఏ ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు? (ముఖచిత్రం చూడండి.)
యేసుక్రీస్తు తాను చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన శిష్యులకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహా. 13:34, 35.
2. ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకుంటూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
2 తన శిష్యులు తాను చూపించినలాంటి ప్రేమను చూపిస్తే, వాళ్లు నిజ క్రైస్తవులని అందరూ వెంటనే గుర్తిస్తారని యేసు చెప్పాడు. ఆ మాటలు మొదటి శతాబ్దంలోనూ, ఇప్పుడూ నిజం. కాబట్టి కష్టంగా అనిపించినప్పుడు కూడా మనం ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకుంటూ ఉండడం చాలా ప్రాముఖ్యం.
3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?
3 మనందరం అపరిపూర్ణులం కాబట్టి ఒకరి మీద ఒకరం ప్రగాఢమైన ప్రేమ చూపించుకోవడం కష్టమే. అయినా మనం క్రీస్తును అనుసరించడానికి ప్రయత్నించాలి. సమాధానపడేలా, పక్షపాతం చూపించకుండా ఉండేలా, ఆతిథ్య స్ఫూర్తి చూపించేలా ప్రేమ మనకు ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. దీన్ని చదువుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘కష్టంగా అనిపించినా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉన్న సహోదర సహోదరీల నుండి నేను ఏం నేర్చుకోవచ్చు?’
సమాధానపడే వ్యక్తులుగా ఉండండి
4. మత్తయి 5:23, 24 ప్రకారం, మనవల్ల బాధపడిన సహోదరునితో మనం ఎందుకు సమాధానపడాలి?
4 మనవల్ల ఎవరైనా బాధపడినప్పుడు మనం వాళ్లతో సమాధానపడడం ప్రాముఖ్యమని యేసు మనకు బోధించాడు. (మత్తయి 5:23, 24 చదవండి.) దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, మనం ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుండడం అవసరమని యేసు చెప్పాడు. సహోదరులతో సమాధానపడడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. మనం మనసులో కోపం పెట్టుకుని, సమాధానపడడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకపోతే ఆయన మన ఆరాధనను అంగీకరించడు.—1 యోహా. 4:20.
5. మార్క్ అనే సహోదరునికి సమాధానపడడం ఎందుకు కష్టంగా అనిపించింది?
5 సమాధానపడడం మనకు కష్టంగా అనిపించవచ్చు. ఎందుకు? మార్క్ * అనే సహోదరుని విషయంలో ఏం జరిగిందో చూడండి. ఒక సహోదరుడు ఆయన్ని తప్పుపట్టి, సంఘంలోని వాళ్ల దగ్గర ఆయన గురించి చెడుగా మాట్లాడినప్పుడు మార్క్ చాలా బాధపడ్డాడు. దాంతో ఆయన ఆ సహోదరునితో చాలా కోపంగా మాట్లాడాడు. అయితే అలా చేయడం తప్పని తర్వాత అర్థం చేసుకుని, ఆ సహోదరుణ్ణి క్షమాపణ అడిగి, సమాధానపడడానికి ప్రయత్నించాడు. కానీ ఆ సహోదరుడు దానికి ఒప్పుకోలేదు. ‘అతను సమాధానపడడానికి ఇష్టపడనప్పుడు నేను ఎందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి?’ అని మార్క్ మొదట్లో అనుకున్నాడు. కానీ పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆయన్ని ప్రోత్సహించాడు. మరి మార్క్ ఏం చేశాడు?
6. (ఎ) మార్క్ సమాధానపడడానికి ఎలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు? (బి) కొలొస్సయులు 3:13, 14 లో ఉన్న సలహాను మార్క్ ఎలా పాటించాడు?
6 మార్క్ తన ఆలోచనా తీరును పరిశీలించుకున్నప్పుడు, కొన్నిసార్లు తాను మిగతావాళ్ల కన్నా గొప్పవాణ్ణని అనుకున్నట్టు గుర్తించాడు. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాడు. (కొలొ. 3:8, 9, 12) ఆయన మళ్లీ ఆ సహోదరుని దగ్గరికి వెళ్లి, తాను తప్పుగా ప్రవర్తించినందుకు క్షమించమని వినయంగా అడిగాడు. అంతేకాదు, తాను ఎంతగా బాధపడుతున్నాడో, మళ్లీ అతనితో స్నేహం చేయాలని ఎంతగా కోరుకుంటున్నాడో తెలియజేస్తూ ఆ సహోదరునికి ఉత్తరాలు రాశాడు. ఆ సహోదరునికి నచ్చే చిన్నచిన్న బహుమతులు కూడా ఇచ్చాడు. అయితే విచారకరంగా ఆ సహోదరుడు మార్క్‌ను క్షమించలేదు, కోపం తగ్గించుకోలేదు. అయినాసరే తన సహోదరుణ్ణి ప్రేమించాలని, క్షమిస్తూ ఉండాలని యేసు ఇచ్చిన ఆజ్ఞను మార్క్ పాటిస్తూనే ఉన్నాడు. (కొలొస్సయులు 3:13, 14 చదవండి.) మనం ఎంత ప్రయత్నించినా ఇతరులు సమాధానపడడానికి ఇష్టపడకపోతే అప్పుడేంటి? మనకు క్రీస్తులాంటి ప్రేమ ఉంటే క్షమిస్తూనే ఉంటాం, మళ్లీ మంచి స్నేహితులయ్యేలా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటాం.—మత్త. 18:21, 22; గల. 6:9.
7. (ఎ) యేసు మనకు ఏం చెప్పాడు? (బి) లారా అనే సహోదరికి ఎలాంటి కష్టమైన పరిస్థితి ఎదురైంది?
7 ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో, మనమూ వాళ్లతో అలాగే వ్యవహరిస్తూ ఉండాలని యేసు చెప్పాడు. అంతేకాదు, మనల్ని ప్రేమించేవాళ్లను మాత్రమే ప్రేమిస్తే సరిపోదని చెప్పాడు. (లూకా 6:31-33) సంఘంలో ఎవరైనా మిమ్మల్ని దూరం పెడుతూ, కనీసం పలకరించకపోతే మీకెలా అనిపిస్తుంది? నిజానికి సంఘంలో సాధారణంగా అలాంటివి జరగవు, కానీ లారా అనే సహోదరి విషయంలో అలా జరిగింది. ఆమె ఇలా చెప్తోంది: “ఒక సహోదరి నన్ను అసలు పట్టించుకునేది కాదు, దానికి కారణం ఏంటో నాకు తెలీదు. నేను చాలా ఒత్తిడికి గురయ్యాను, మీటింగ్స్‌కు సంతోషంగా వెళ్లలేకపోయేదాన్ని.” మొదట్లో లారా ఇలా అనుకుంది: ‘నేనైతే ఏ తప్పూ చేయలేదు. పైగా ఈ సహోదరి ప్రవర్తన వింతగా ఉంటుందని సంఘంలోవాళ్లు కూడా అనుకుంటున్నారు.’
8. సమాధానపడడానికి లారా ఏం చేసింది? ఆమె అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
8 లారా సమాధానపడడానికి ప్రయత్నించింది. యెహోవాకు ప్రార్థన చేసి, ఆ సహోదరితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. వాళ్లు తమ మధ్యున్న సమస్య గురించి మాట్లాడుకున్నారు, ఒకరినొకరు హత్తుకున్నారు, సమాధానపడ్డారు. సమస్య ముగిసిపోయినట్టు అనిపించింది. లారా ఇలా చెప్తోంది: “కానీ కొన్నిరోజుల తర్వాత ఆ సహోదరి మళ్లీ నాతో అంతకుముందులాగే ప్రవర్తించింది. నేను చాలా నిరుత్సాహపడ్డాను.” ఆ సహోదరి తన ప్రవర్తన మార్చుకుంటేనే సమస్య పరిష్కారమై, సంతోషంగా ఉంటానని లారా మొదట అనుకుంది. కానీ తర్వాత, ఆ సహోదరి మీద ప్రేమ చూపిస్తూనే ఉండాలని, మనస్ఫూర్తిగా క్షమిస్తూనే ఉండాలని, అదే సరైన పద్ధతని లారా అర్థం చేసుకుంది. (ఎఫె. 4:32–5:2) నిజమైన ప్రేమ ‘హానిని మనసులో పెట్టుకోదు. అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది” అని లారా గుర్తుచేసుకుంది. (1 కొరిం. 13:5, 7) లారా ఇక ఆ సమస్య గురించి ఆందోళనపడడం మానేసింది. కొంతకాలానికి ఆ సహోదరి ఆమెతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. మీరు సహోదర సహోదరీలతో సమాధానపడడానికి ప్రయత్నిస్తూ ఉంటే, వాళ్లను ప్రేమిస్తూ ఉంటే, “ప్రేమకు, శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుంటాడు” అనే నమ్మకంతో ఉండవచ్చు.—2 కొరిం. 13:11.
పక్షపాతం చూపించకండి
9. అపొస్తలుల కార్యాలు 10:34, 35 ప్రకారం, మనం ఎందుకు పక్షపాతం చూపించకుండా ఉండాలి?
9 యెహోవా పక్షపాతం లేని దేవుడు. (అపొస్తలుల కార్యాలు 10:34, 35 చదవండి.) మనం పక్షపాతం చూపించకుండా ఉన్నప్పుడు, ఆయన పిల్లలమని నిరూపించుకుంటాం. మనల్ని మనం ప్రేమించుకున్నట్టే సాటిమనిషిని ప్రేమించాలనే ఆజ్ఞను పాటిస్తాం, మన సహోదర సహోదరీల మధ్య ఉన్న శాంతిని కాపాడతాం.—రోమా. 12:9, 10; యాకో. 2:8, 9.
10-11. రూతు అనే సహోదరి తన ఆలోచనా తీరును ఎలా సరిచేసుకుంది?
10 పక్షపాతం చూపించకుండా ఉండడం అందరికీ అంత తేలిక కాకపోవచ్చు. రూతు అనే సహోదరి విషయంలో ఏం జరిగిందో పరిశీలించండి. ఆ సహోదరికి చిన్నతనంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. వేరే దేశానికి చెందిన ఒకరు ఆమె కుటుంబానికి చాలా హాని చేశారు. దానివల్ల రూతు ఆలోచనా తీరు మారిపోయింది. ఆమె ఇలా అంది: “నేను పూర్తిగా ఆ దేశాన్నే అసహ్యించుకోవడం మొదలుపెట్టాను. ఆ దేశానికి చెందిన వాళ్లందరూ అలాగే ఉంటారని, చివరికి మన సహోదర సహోదరీలు కూడా అలాగే ఉంటారని అనుకున్నాను.” మరి రూతు అలాంటి ఆలోచనల నుండి ఎలా బయటపడింది?
11 తన ఆలోచనా తీరును మార్చుకోవడానికి తీవ్రంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని రూతు గుర్తించింది. ఆమె వార్షిక పుస్తకంలో ఆ దేశానికి సంబంధించిన అనుభవాలను, రిపోర్టులను చదివింది. ఆమె ఇలా అంది: “నేను ఆ దేశ ప్రజల గురించి మంచిగా ఆలోచించడానికి ప్రయత్నించాను. ఆ దేశానికి చెందిన సహోదర సహోదరీలకు యెహోవా మీద ఉన్న ప్రేమను గుర్తించడం మొదలుపెట్టాను. వాళ్లు కూడా మన ప్రపంచవ్యాప్త సహోదర బృందంలో భాగమని స్పష్టంగా అర్థంచేసుకున్నాను.” అయితే అంతటితో సరిపోదని తను ప్రేమ చూపించాల్సిన అవసరం కూడా ఉందని కొంతకాలానికి ఆమె గుర్తించింది. ఆమె ఇలా వివరించింది: “నేను ఆ దేశానికి చెందిన సహోదర సహోదరీల్ని కలిసిన ప్రతీసారి, వాళ్లతో స్నేహంగా ఉండడానికి బాగా కృషిచేసేదాన్ని. నేను వాళ్లతో మాట్లాడేదాన్ని, వాళ్ల గురించి ఎక్కువగా తెలుసుకునేదాన్ని.” దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి? రూతు ఇలా అంది: “కొంతకాలానికి వాళ్ల విషయంలో నాకున్న తప్పుడు అభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది.”
12. శారా అనే సహోదరికి ఎలాంటి సమస్య ఉంది?
12 కొంతమంది తమకు తెలీకుండానే పక్షపాతం చూపిస్తుంటారు. శారా అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఒక వ్యక్తి జాతి, ఆస్తిపాస్తులు, సంస్థలో వాళ్లకున్న బాధ్యతల్ని చూసి శారా వాళ్ల గురించి ఒక అభిప్రాయానికి రాదు. కాబట్టి తనలో పక్షపాతం లేదని ఆమె అనుకుంది. కానీ నిజానికి తనలో పక్షపాతం ఉందని ఆమె గుర్తించింది. శారా ఏ విషయంలో పక్షపాతం చూపించింది? శారా బాగా చదువుకున్న కుటుంబం నుండి వచ్చింది, కాబట్టి ఆమె అలాంటి వాళ్లతోనే కలిసి ఉండడానికి ఇష్టపడేది. ఒకసారి ఆమె తన స్నేహితునితో ఇలా అంది: “నేను బాగా చదువుకున్న సహోదర సహోదరీలతోనే స్నేహం చేస్తాను. చదువుకోని వాళ్లతో స్నేహం చేయను.” నిజంగా, శారా తన ఆలోచనా తీరును మార్చుకోవాలి. మరి తను ఎలా మార్చుకుంది?
13. శారా తన ఆలోచనా తీరును మార్చుకున్న విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
13 శారా తన ఆలోచనా తీరును పరిశీలించుకోవడానికి ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు సహాయం చేశాడు. ఆమె ఇలా అంది: “నేను నమ్మకంగా చేస్తున్న సేవ, నేనిచ్చే మంచి వ్యాఖ్యానాలు, నాకున్న బైబిలు జ్ఞానాన్ని బట్టి ఆయన నన్ను మెచ్చుకున్నాడు. అయితే మన జ్ఞానం పెరిగే కొద్దీ వినయం, అణకువ, కరుణ వంటి క్రైస్తవ లక్షణాల్ని కూడా అలవర్చుకోవాలని ఆయన వివరించాడు.” ఆ సహోదరుడు ఇచ్చిన సలహాను శారా పాటించింది. ఆమె ఇలా అంది: “మనం ప్రేమ, దయ చూపించడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను.” ఫలితంగా, సహోదర సహోదరీల్ని చూసే విధానంలో ఆమె మార్పు చేసుకుంది. ఆమె ఇలా వివరించింది: “ఏ లక్షణాల్ని బట్టి యెహోవా వాళ్లను విలువైన వ్యక్తులుగా ఎంచుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.” మరి మన సంగతేంటి? మన చదువును బట్టి మనం వేరేవాళ్ల కన్నా గొప్పవాళ్లం అని ఎన్నడూ అనుకోకూడదు! ‘ప్రపంచవ్యాప్త సహోదర బృందం’ మీద మనకు ప్రగాఢమైన ప్రేమ ఉంటే పక్షపాతం చూపించం.—1 పేతు. 2:17.
ఆతిథ్య స్ఫూర్తి చూపించండి
14. హెబ్రీయులు 13:16 చెప్తున్నట్టు, మనం ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
14 మనం ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (హెబ్రీయులు 13:16 చదవండి.) ఆతిథ్యం ఇవ్వడాన్ని, ముఖ్యంగా అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడాన్ని యెహోవా తన ఆరాధనలో భాగంగా ఎంచుతాడు. (యాకో. 1:27; 2:14-17) కాబట్టి “ఆతిథ్యం ఇస్తూ ఉండండి” అని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. (రోమా. 12:13) ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మనకు సహోదరుల మీద శ్రద్ధ ఉందని, మనం వాళ్లను ప్రేమిస్తున్నామని, వాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నామని తెలియజేస్తాం. మనం ఇతరులకు అల్పాహారం గానీ భోజనం గానీ పెట్టినప్పుడు, లేదా తాగడానికి ఏమైనా ఇచ్చినప్పుడు, లేదా వాళ్లతో సమయం గడిపినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (1 పేతు. 4:8-10) అయితే కొన్ని కారణాల వల్ల మనం ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాడుతుండవచ్చు.
15-16. (ఎ) కొంతమంది ఆతిథ్యం ఇవ్వడానికి ఎందుకు వెనకాడవచ్చు? (బి) ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చేలా లీనా అనే సహోదరికి ఏది సహాయం చేసింది?
15 మన ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి లేదా నేపథ్యాన్ని బట్టి లేదా గతంలో మనకున్న అలవాట్లను బట్టి ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాడుతుండవచ్చు. లీనా అనే ఒక విధవరాలి అనుభవం పరిశీలించండి. యెహోవాసాక్షి కాకముందు, ఆమె ఇతరులతో అంతగా కలిసేది కాదు. తనకన్నా మిగతావాళ్లే బాగా ఆతిథ్యం ఇవ్వగలరని అనుకునేది.
16 యెహోవాసాక్షి అయిన తర్వాత ఆమె తన ఆలోచనా తీరును మార్చుకుంది, ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించింది. ఆమె ఇలా అంది: “మా రాజ్యమందిరాన్ని కడుతున్నప్పుడు, దాని నిర్మాణ పనిలో సహాయం చేయడానికి వస్తున్న ఒక జంట గురించి మా సంఘపెద్ద నాకు చెప్పాడు. వాళ్లను రెండు వారాలపాటు మా ఇంట్లో ఉంచుకోవడం వీలౌతుందేమో అడిగాడు. అప్పుడు నేను, సారెపతులోని విధవరాలిని యెహోవా ఎలా ఆశీర్వదించాడో గుర్తుచేసుకున్నాను.” (1 రాజు. 17:12-16) వాళ్లను తన ఇంట్లో ఉంచుకోవడానికి లీనా ఒప్పుకుంది. మరి దానివల్ల ఆమె ఎలాంటి దీవెనలు పొందింది? ఆమె ఇలా చెప్పింది: “వాళ్లు కేవలం రెండు వారాలే కాదు, రెండు నెలలపాటు మా ఇంట్లో ఉన్నారు. ఆ రెండు నెలల్లో మేము మంచి స్నేహితులమయ్యాం.” అంతేకాదు, సంఘంలో కూడా ఆమెకు మంచి స్నేహితులు దొరికారు. ఆమె ఇప్పుడు పయినీరుగా సేవచేస్తోంది. ఆమెతోపాటు పరిచర్య చేసేవాళ్లు ఆమె ఇంటికి వస్తూ, ఆమెతో సమయం గడపడాన్ని కూడా లీనా ఆనందిస్తుంది. ఆమె ఇలా అంటోంది: “ఆతిథ్యం ఇవ్వడం నాకు సంతోషాన్ని ఇస్తుంది! దానివల్ల నేను ఎన్నో దీవెనలు కూడా పొందుతున్నాను.”—హెబ్రీ. 13:1, 2.
17. లూక్, ఆయన భార్య ఏ విషయాన్ని గుర్తించారు?
17 మనం ఇప్పటికే ఆతిథ్యం ఇస్తుండవచ్చు, అయితే మనం ఆతిథ్య స్ఫూర్తిని ఇంకా బాగా ఎలా చూపించవచ్చు? ఈ ఉదాహరణ పరిశీలించండి. లూక్, ఆయన భార్య చక్కని ఆతిథ్య స్ఫూర్తి చూపించేవాళ్లు. తమ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, దగ్గరి స్నేహితుల్ని, ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి, ఆయన భార్యను తమ ఇంటికి ఆహ్వానిస్తుండేవాళ్లు. అయితే, “మేము మాతో సన్నిహితంగా ఉండేవాళ్లను మాత్రమే ఆహ్వానిస్తున్నామని గుర్తించాం” అని లూక్ చెప్తున్నాడు. మరి ఈ విషయంలో వాళ్లు ఎలాంటి మార్పులు చేసుకున్నారు?
18. లూక్, ఆయన భార్య ఆతిథ్య స్ఫూర్తిని ఇంకా బాగా ఎలా చూపించగలుగుతున్నారు?
18 “మిమ్మల్ని ప్రేమించేవాళ్లనే మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం దొరుకుతుంది?” అని యేసు చెప్పిన మాటల గురించి ఆలోచించడం ద్వారా నిజంగా ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటో లూక్, ఆయన భార్య అర్థం చేసుకున్నారు. (మత్త. 5:45-47) అందరి పట్ల ఉదారంగా ఉండే యెహోవాను అనుసరించాల్సిన అవసరం ఉందని వాళ్లు గుర్తించారు. కాబట్టి ఇప్పటివరకు వాళ్లు ఏ సహోదర సహోదరీలనైతే ఆహ్వానించలేదో, వాళ్లను ఆహ్వానించాలని లూక్, ఆయన భార్య నిర్ణయించుకున్నారు. లూక్ ఇలా అన్నాడు: “సహోదర సహోదరీలతో గడిపే సమయాన్ని మేమంతా ఇప్పుడు చాలా ఆనందిస్తున్నాం, ప్రోత్సాహం పొందుతున్నాం. ఒకరికొకరం అలాగే యెహోవాకు మరింత దగ్గరౌతున్నాం.”
19. మనం యేసు శిష్యులమని ఎలా నిరూపించుకుంటాం? మీరేం చేయాలని నిశ్చయించుకున్నారు?
19 సమాధానపడేలా, పక్షపాతం చూపించకుండా ఉండేలా, ఆతిథ్య స్ఫూర్తి చూపించేలా ప్రగాఢమైన ప్రేమ మనకు ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలించాం. ఒకవేళ మనకు ఏవైనా ప్రతికూల ఆలోచనలు ఉంటే వాటిని సరిచేసుకొని మన సహోదర సహోదరీల మీద మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించాలి. అలా చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటాం, నిజంగా యేసు శిష్యులమని నిరూపించుకుంటాం.—యోహా. 13:17, 35.
పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి
^ పేరా 5 ప్రేమ నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నమని యేసు చెప్పాడు. సహోదర సహోదరీల పట్ల ఉన్న ప్రేమ మనల్ని సమాధానపడేలా, పక్షపాతం చూపించకుండా ఉండేలా, ఆతిథ్య స్ఫూర్తి చూపించేలా పురికొల్పుతుంది. అలా చేయడం అన్నిసార్లూ తేలిక కాకపోవచ్చు. అయితే ఒకరి పట్ల ఒకరు ఎలా మనస్ఫూర్తిగా ప్రేమ చూపిస్తూ ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.
^ పేరా 5 ఈ ఆర్టికల్‌లో కొన్ని అసలు పేర్లు కాదు.
^ పేరా 57 చిత్రాల వివరణ: ఒక సహోదరి సమాధానపడడానికి చేసిన మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినా ఆమె పట్టువిడవలేదు. ప్రేమ చూపించడానికి ఆమె పట్టుదలగా చేసిన ప్రయత్నాల వల్ల చివరికి మంచి ఫలితం వచ్చింది.
^ పేరా 59 చిత్రాల వివరణ: సంఘంలోనివాళ్లు తనను పట్టించుకోవట్లేదని ఒక వృద్ధ సహోదరుడు బాధపడుతున్నాడు.
^ పేరా 61 చిత్రాల వివరణ: మొదట్లో ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాడిన ఒక సహోదరి తన ఆలోచనా తీరును మార్చుకుంది, దానివల్ల ఆమె సంతోషం ఎక్కువైంది.