మీకు తెలుసా?
సభామందిరాలు ఎలా ఆరంభమయ్యాయి?
“సభామందిరం” అనే పదం, “సమావేశమవ్వడం” లేదా “సమకూడడం” అనే అర్థాలున్న గ్రీకు పదం నుండి వచ్చింది. ప్రాచీనకాలాల నుండి యూదులు ఉపదేశం కోసం, ఆరాధన కోసం సభామందిరాల్లో సమకూడేవాళ్లు కాబట్టి వాటికి ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. హీబ్రూ లేఖనాలు సభామందిరాల గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా, అవి క్రీ.శ. మొదటి శతాబ్దం నాటికే ఉనికిలో ఉన్నాయని గ్రీకు లేఖనాల నుండి అర్థమౌతుంది.
యూదులు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు సభామందిరాలు మొట్టమొదటిగా ఏర్పడ్డాయని చాలామంది విద్వాంసులు నమ్ముతున్నారు. దానికిగల కారణాన్ని ఎన్‌సైక్లోపీడియా జూడైకా ఇలా చెప్తుంది: “ఆలయంలేని అన్యదేశంలో బందీలుగా ఉన్న యూదులు ఓదార్పు కోసం అప్పుడప్పుడు సమకూడి లేఖనాలు చదివేవాళ్లు. బహుశా సబ్బాతు రోజున అలా సమకూడేవాళ్లు.” వాళ్లు బబులోను నుండి విడుదలైన తర్వాత కూడా అలా సమకూడి ప్రార్థించేవాళ్లని, లేఖనాలు చదివేవాళ్లని స్పష్టమౌతుంది. కాబట్టి యూదులు తాము స్థిరపడ్డ ప్రాంతాల్లో సభామందిరాలను కట్టుకొనివుంటారు.
అలా క్రీ.శ. మొదటి శతాబ్దానికల్లా, సభామందిరాలు యూదుల మతపరమైన, సామాజికపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో, మధ్యప్రాచ్య దేశాల్లో, ఇశ్రాయేలులో చెదిరిపోయిన యూదులకు అవి కేంద్రంగా మారాయి. హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెంకు చెందిన ప్రొఫెసర్ లీ లవీన్ ఇలా చెప్తున్నాడు: “అధ్యయనం చేయడానికి, పవిత్ర భోజనాలు చేయడానికి, న్యాయ విచారణలు జరపడానికి, నిధులు నిల్వచేయడానికి, రాజకీయ-సామాజిక సమావేశాలు జరుపుకోవడానికి [సభామందిరాల్ని] ఉపయోగించేవాళ్లు. అయితే వాటిని ముఖ్యంగా మతపరమైన కార్యకలాపాలకే ఉపయోగించేవాళ్లు.” అందుకే యేసు తరచూ సభామందిరాలకు వెళ్లేవాడు. (మార్కు 1:21; 6:2; లూకా 4:16) సభామందిరాలకు వచ్చేవాళ్లకు ఆయన బోధించేవాడు, ఉపదేశించేవాడు, ప్రోత్సాహాన్నిచ్చేవాడు. క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత కూడా, అపొస్తలుడైన పౌలు తరచూ సభామందిరాలకు వెళ్లి ప్రకటించాడు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు సాధారణంగా అక్కడికి వస్తారు కాబట్టి పౌలు ఏదైనా పట్టణంలోకి ప్రవేశించగానే నేరుగా సభామందిరానికే వెళ్లేవాడు.—అపొ. 17:1, 2; 18:4.