మీకు తెలుసా?
బైబిలు కాలాల్లో గృహనిర్వాహకుడు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించేవాడు?
బైబిలు కాలాల్లో, గృహనిర్వాహకుడు ఒకవ్యక్తి ఇంటిని లేదా అతని ఆస్తిపాస్తుల్ని చూసుకునేవాడు. “గృహనిర్వాహకుడు” అని అనువదించబడిన హీబ్రూ, గ్రీకు పదాలు కొన్నిసార్లు పర్యవేక్షకుణ్ణి లేదా ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునే అధికారిని సూచిస్తాయి.
యాకోబు కొడుకైన యోసేపు ఐగుప్తులో దాసునిగా ఉన్నప్పుడు, ఆయన యజమాని ఆయన్ని తన ఇంటిపై గృహనిర్వాహకునిగా నియమించాడు. నిజానికి, ఐగుప్తీయుడైన ఆయన యజమాని ‘తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించాడు.’ (ఆది. 39:2-6) కొంతకాలానికి, యోసేపు ఐగుప్తులో శక్తివంతమైన అధికారి అయ్యాడు. అప్పుడు ఆయన కూడా తన సొంత ఇంటిపై ఒక గృహనిర్వాహకుణ్ణి నియమించుకున్నాడు.—ఆది. 44:4.
యేసు కాలంలో, సాధారణంగా భూస్వాములు తమ వ్యవసాయ భూములకు దూరంగా నగరాల్లో నివసించేవాళ్లు. కాబట్టి తమ పొలాల్లో పనిచేసే కూలీల రోజువారీ పనుల్ని పర్యవేక్షించేందుకు భూస్వాములు గృహనిర్వాహకుల్ని నియమించేవాళ్లు.
గృహనిర్వాహకుడిగా అయ్యే వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి? మొదటి శతాబ్దానికి చెందిన కాల్యమెల అనే రోమా రచయిత ఏం చెప్పాడంటే, ఒక దాసుడు పర్యవేక్షకునిగా లేదా గృహనిర్వాహకునిగా నియమించబడాలంటే అతనికి ‘చక్కగా పనిచేయడం తెలిసుండాలి. కూలీలు పనిచేస్తున్నారో లేదో కనిపెట్టుకుంటూ ఉండాలి కానీ, వాళ్లతో క్రూరంగా ప్రవర్తించకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా తనకు అన్నీ తెలుసని అనుకోకూడదు, బదులుగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక ఎప్పుడూ ఉండాలి.’
క్రైస్తవ సంఘంలో జరిగే కొన్ని పనుల్ని దేవుని వాక్యం గృహనిర్వాహకునితో, అతను చేసే పనులతో పోల్చింది. ఉదాహరణకు, అపొస్తలుడైన పేతురు క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తూ, మీరు “దేవుడు చూపించే అపారదయకు మంచి గృహనిర్వాహకులుగా ఉంటూ” దేవుడు ఇచ్చిన సామర్థ్యాలను ‘ఒకరికొకరు పరిచారం చేసుకోవడానికి ఉపయోగించాలి’ అని చెప్పాడు.—1 పేతు. 4:10.
యేసు కూడా లూకా 16:1-8లో గృహనిర్వాహకుని గురించిన ఉదాహరణ చెప్పాడు. అలాగే యేసు తన ప్రత్యక్షత కాలంలో జరిగే సూచనల గురించి ప్రవచించినప్పుడు, ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ లేదా ‘నమ్మకమైన గృహనిర్వాహకుణ్ణి’ నియమిస్తానని ఆయన తన అనుచరులకు హామీ ఇచ్చాడు. ఆ గృహనిర్వాహకుని ముఖ్యమైన పని ఏంటంటే, ఈ చివరి రోజుల్లో క్రీస్తు అనుచరులకు కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని పెడుతూ ఉండడం. (మత్త. 24:45-47; లూకా 12:42) నమ్మకమైన గృహనిర్వాహకుడు మన విశ్వాసాన్ని బలపర్చే ప్రచురణల్ని తయారుచేసి, ప్రపంచవ్యాప్తంగా అందజేస్తున్నాడు. వాటిని మనం కూడా పొందుతున్నందుకు ఎంతో కృతజ్ఞులం.