కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా పక్షమున” ఎవరు ఉన్నారు?

“యెహోవా పక్షమున” ఎవరు ఉన్నారు?

‘నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకోవాలి.’ద్వితీ. 10:20.

పాటలు: 28, 32

1, 2. (ఎ) యెహోవా పక్షాన ఉండడం ఎందుకు తెలివైన పని? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

యెహోవాను హత్తుకొని ఉండడం తెలివైన పని. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి, తెలివి, ప్రేమ ఇంకెవ్వరికీ లేవు. అవును, మనందరం ఎల్లప్పుడు యెహోవాకు విశ్వసనీయంగా ఉంటూ ఆయన పక్షాన ఉండాలని కోరుకుంటాం. (కీర్త. 96:4-6) కానీ కొంతమంది దేవుని సేవకులు అలా ఉండలేకపోయారు.

2 వాళ్లు యెహోవా పక్షాన ఉన్నామని చెప్తూనే, ఆయన ద్వేషించే పనులు చేశారు. అలాంటివాళ్ల ఉదాహరణల్ని మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అలా పరిశీలిస్తుండగా యెహోవాకు విశ్వసనీయంగా ఉండడానికి సహాయపడే ప్రాముఖ్యమైన పాఠాల్ని నేర్చుకుంటాం.

యెహోవా మన హృదయాన్ని పరిశోధిస్తాడు

3. యెహోవా కయీను ఆరాధనను ఎందుకు అంగీకరించలేదు? యెహోవా కయీనును ఏమని హెచ్చరించాడు?

3 కయీను ఉదాహరణను పరిశీలించండి. అతను అబద్ధ దేవుళ్లను ఆరాధించలేదు, అయినప్పటికీ యెహోవా అతని ఆరాధనను అంగీకరించలేదు. ఎందుకు? కయీను ఆలోచనలు చెడ్డవని యెహోవా గమనించాడు. (1 యోహా. 3:12) అందుకే యెహోవా కయీనును ఇలా హెచ్చరించాడు, “నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు.” (ఆది. 4:6, 7) కయీను పశ్చాత్తాపపడి, తన పక్షాన ఉంటే, తాను కూడా కయీను పక్షాన ఉంటానని యెహోవా స్పష్టం చేశాడు.

4. యెహోవా పక్షాన ఉండే అవకాశం దొరికినప్పుడు కయీను ఏమి చేశాడు?

4 కయీను తన ఆలోచనల్ని మార్చుకుని ఉంటే, యెహోవా అతని ఆరాధనను మళ్లీ అంగీకరించేవాడు. కానీ కయీను యెహోవా మాట వినలేదు, చెడ్డ ఆలోచనలు, స్వార్థపు కోరికల వల్ల అతను చెడ్డపనులు చేశాడు. (యాకో. 1:14, 15) యెహోవాకు ఎదురుతిరుగుతానని బహుశా కయీను తన చిన్నతనంలో ఎన్నడూ ఊహించివుండడు. కానీ పెద్దయ్యాక యెహోవాకు ఎదురుతిరిగి, తన సొంత తమ్ముణ్ణే చంపేశాడు!

5. వేటివల్ల మనం యెహోవా ఆమోదాన్ని కోల్పోతాం?

5 కయీనులాగే, నేడు కూడా ఒక క్రైస్తవుడు యెహోవాను ఆరాధిస్తున్నానని చెప్తూనే మరోవైపు ఆయన ద్వేషించే పనులు చేస్తుండవచ్చు. (యూదా 11) అలాంటివ్యక్తి ఉత్సాహంగా పరిచర్య చేస్తుండవచ్చు, మీటింగ్స్‌కు క్రమంగా వస్తుండవచ్చు. కానీ అదే సమయంలో అనైతిక విషయాల గురించి ఆలోచిస్తుండవచ్చు, అత్యాశను లేదా తోటి క్రైస్తవుని పట్ల ద్వేషాన్ని పెంచుకుంటుండవచ్చు. (1 యోహా. 2:15-17; 3:15) అలాంటి ఆలోచనలు పాపం చేయడానికి దారితీస్తాయి. మనం ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి చేస్తున్నామో ఇతరులకు తెలియకపోవచ్చు కానీ యెహోవాకు తెలుస్తాయి. మనం పూర్తిగా తన పక్షాన ఉన్నామో లేదో యెహోవాకు తెలుసు.—యిర్మీయా 17:9, 10 చదవండి.

6. మనం తన పక్షాన ఉంటే ఏమి చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు?

6 మనం తప్పులు చేసినప్పటికీ, యెహోవా మన విషయంలో తొందరపడి ఆశ వదులుకోవట్లేదు. మనం యెహోవాకు దూరమయ్యే పనులు చేస్తుంటే, ఆయన ఇలా ఆహ్వానిస్తున్నాడు: “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.” (మలా. 3:7) మనం బలహీనతలతో పోరాడుతున్నామని యెహోవా అర్థంచేసుకుంటాడు. కానీ మనం స్థిరంగా ఉండాలని, చెడును ద్వేషించాలని ఆయన కోరుకుంటున్నాడు. (యెష. 55:7) ఆయన కోరుకున్నట్లు మనం ప్రవర్తిస్తే, తప్పుడు కోరికల్ని తీసేసుకోవడానికి సహాయం చేస్తానని, దానికి కావాల్సిన బలాన్ని ఇస్తానని మాటిస్తున్నాడు.—ఆది. 4:7.

మోసపోకండి

7. యెహోవాతో ఉన్న మంచి సంబంధాన్ని సొలొమోను ఎలా పాడుచేసుకున్నాడు?

7 సొలొమోనుకు చిన్నతనంలో యెహోవాతో మంచి సంబంధం ఉండేది. యెహోవా సొలొమోనుకు గొప్ప తెలివిని ఇచ్చి, యెరూషలేములో అందమైన ఆలయాన్ని కట్టే ప్రాముఖ్యమైన పనిని అప్పగించాడు. కానీ సొలొమోను యెహోవాతో ఉన్న మంచి సంబంధాన్ని పాడుచేసుకున్నాడు. (1 రాజు. 3:12; 11:1, 2) దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఒక రాజు, “తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు.” (ద్వితీ. 17:17) సొలొమోను ఆ ఆజ్ఞను పాటించలేదు. కొంతకాలం గడిచేసరికి ఆయనకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. (1 రాజు. 11:3) వాళ్లలో చాలామంది అబద్ధ దేవుళ్లను ఆరాధించే అన్యులు. అంటే, అన్యస్త్రీలను పెళ్లి చేసుకోకూడదని దేవుడిచ్చిన మరో ఆజ్ఞను కూడా సొలొమోను పాటించలేదని అర్థమౌతుంది.—ద్వితీ. 7:3, 4.

8. సొలొమోను ఎలాంటి చెడ్డపనులు చేసి యెహోవాను బాధపెట్టాడు?

8 మెల్లమెల్లగా, యెహోవా నియమాల పట్ల సొలొమోనుకు ఉన్న ప్రేమ తగ్గుతూ వచ్చింది. చివరికి ఆయన చెడ్డపనులు చేయడం మొదలుపెట్టాడు. అబద్ధ దేవత అయిన అష్తారోతుకు, అబద్ధ దేవుడైన కెమోషుకు బలిపీఠాలు కట్టి తన భార్యలతో కలిసి వాటిని ఆరాధించాడు. పైగా ఆ బలిపీఠాలను, సత్యారాధనకు కేంద్రమైన యెరూషలేము ఎదురుగా ఉన్న కొండమీద కట్టించాడు! (1 రాజు. 11:5-8; 2 రాజు. 23:13) ఆలయంలో బలులు అర్పించినంతకాలం ఎన్ని చెడ్డపనులు చేసినా యెహోవా పట్టించుకోడని అనుకుంటూ సొలొమోను తనను తాను మోసం చేసుకున్నాడు.

9. యెహోవా హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయడంవల్ల సొలొమోనుకు ఏమి జరిగింది?

9 కానీ యెహోవా పాపాన్ని పట్టించుకోకుండా అస్సలు ఉండడు. బైబిలు ఇలా చెప్తుంది, ‘సొలొమోను హృదయం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నుండి పక్కకు మళ్లింది కాబట్టి, యెహోవాకు అతనిమీద చాలా కోపం వచ్చింది.’ యెహోవా సొలొమోనుకు సహాయం చేయాలనుకున్నాడు. అందుకే ‘సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమై, ఈ విషయం గురించే, అంటే ఇతర దేవుళ్లను అనుసరించకూడదనే దాని గురించే హెచ్చరించాడు. కానీ యెహోవా ఆజ్ఞాపించినవాటికి సొలొమోను లోబడలేదు.’ ఫలితంగా సొలొమోను యెహోవా ఆమోదాన్ని, మద్దతును కోల్పోయాడు. అంతేకాదు, సొలొమోను వంశస్థులు ఇశ్రాయేలు జనాంగమంతటినీ పరిపాలించడానికి యెహోవా అనుమతించలేదు. పైగా వాళ్లు వందల సంవత్సరాల పాటు చాలా కష్టాలుపడ్డారు.—1 రాజు. 11:9-13, NW.

10. యెహోవాతో మనకున్న మంచి సంబంధాన్ని ఏది పాడుచేయగలదు ?

10 దేవుని ప్రమాణాల్ని అర్థంచేసుకోనివాళ్లను, వాటిని గౌరవించనివాళ్లను మనం స్నేహితులుగా చేసుకుంటే, వాళ్లు మన ఆలోచనల్ని కలుషితం చేసి యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లెవరంటే: యెహోవాతో బలమైన సంబంధంలేని తోటి సహోదరసహోదరీలు, లేదా యెహోవాసాక్షులుకాని మన బంధువులు, పొరుగువాళ్లు, తోటి ఉద్యోగస్థులు, తోటి విద్యార్థులు కావచ్చు. యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించని అలాంటివాళ్లతో మనం స్నేహం చేస్తే, కొంతకాలానికి యెహోవాతో మనకున్న మంచి సంబంధం పాడౌతుంది.

మీ స్నేహితులు యెహోవాతో మీకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు? (11వ పేరా చూడండి)

11. ఎలాంటివాళ్లతో స్నేహం చేయాలో మనకు ఎలా తెలుస్తుంది?

11 మొదటి కొరింథీయులు 15:33 చదవండి. చాలామందిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు యెహోవాను ఆరాధించనివాళ్లు అన్నిసార్లు చెడ్డపనులు చేయకపోవచ్చు. బహుశా అలాంటివాళ్లు మీకు తెలిసేవుంటారు. వాళ్లతో మీరు స్నేహం చేయవచ్చా? మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: అలాంటివాళ్ల వల్ల యెహోవాతో నా స్నేహం ఏమౌతుంది? వాళ్లవల్ల నేను యెహోవాకు మరింత దగ్గరౌతానా? వాళ్లు ఏ విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు? వాళ్లు ఏ విషయాల గురించి మాట్లాడతారు? వాళ్లు ఫ్యాషన్ల గురించి, డబ్బు, కంప్యూటర్లు, ఫోన్లు, టాబ్లెట్‌లు, వినోదం వంటివాటి గురించే ఎక్కువగా మాట్లాడతారా? వాళ్లు తరచూ ఇతరుల్ని విమర్శిస్తుంటారా? పిచ్చి జోకులు వేయడమంటే వాళ్లకు ఇష్టమా? యేసు ఇలా హెచ్చరించాడు, “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.” (మత్త. 12:34) ఒకవేళ మీ స్నేహితులవల్ల యెహోవాతో మీకున్న స్నేహం పాడయ్యేలా ఉందంటే, వెంటనే చర్య తీసుకోండి! వాళ్లతో గడిపే సమయాన్ని తగ్గించండి, అవసరమైతే స్నేహం చేయడమే పూర్తిగా మానేయండి.—సామె. 13:20.

మనం తనకు విశ్వసనీయంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

12. (ఎ) ఐగుప్తునుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులకు సీనాయి పర్వతం దగ్గర యెహోవా ఏమి చెప్పాడు? (బి) ఇశ్రాయేలీయులు యెహోవాకు ఏమని మాటిచ్చారు?

12 యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తునుండి విడుదల చేసిన వెంటనే జరిగిన సంఘటన నుండి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ప్రజలు సీనాయి పర్వతం ముందు సమకూడినప్పుడు, యెహోవా అసాధారణరీతిలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వాళ్లకు దట్టమైన మేఘం, మెరుపులు, పొగ కనిపించాయి; ఉరుముల శబ్దం, బూర శబ్దం లాంటి పెద్ద శబ్దం వినిపించాయి. (నిర్గ. 19:16-19) తాను సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుణ్ణని యెహోవా ఆ సందర్భంలో వాళ్లకు చెప్పాడు. అంతేకాదు తనను ప్రేమించి, తన ఆజ్ఞలకు లోబడే వాళ్లకు విశ్వసనీయంగా ఉంటానని ఆయన మాటిచ్చాడు. (నిర్గమకాండము 20:1-6 చదవండి.) ఇశ్రాయేలీయులు ఆయన పక్షాన ఉంటే, ఆయన వాళ్ల పక్షాన ఉంటానని యెహోవా తెలియజేశాడు. ఒకవేళ ఆ ప్రజల్లో మీరు ఒకరై ఉంటే, యెహోవా మాటలు విన్నప్పుడు మీకెలా అనిపించివుండేది? బహుశా ఇశ్రాయేలీయుల్లాగే మీరు కూడా “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదము” అని జవాబిచ్చి ఉండేవాళ్లేమో. (నిర్గ. 24:3) అదంతా జరిగి ఎంతోకాలం గడవకముందే, ఇశ్రాయేలీయుల విశ్వసనీయతకు ఒక పరీక్ష ఎదురైంది. ఏమిటా పరీక్ష?

13. ఇశ్రాయేలీయులకు ఎలాంటి పరీక్ష ఎదురైంది?

13 ఇశ్రాయేలీయులు దట్టమైన మేఘాన్ని, మెరుపులను, యెహోవా శక్తిని తెలియజేసిన మరికొన్ని సూచనల్ని చూసి భయపడిపోయారు. అందుకే వాళ్ల తరఫున యెహోవాతో మాట్లాడడానికి మోషే సీనాయి పర్వతంపైకి వెళ్లాడు. (నిర్గ. 20:18-21) రోజులు గడిచిపోతున్నాయి గానీ మోషే మాత్రం కిందికి దిగి రాలేదు. వాళ్లను నడిపించే నాయకుడు లేకపోయేసరికి అరణ్యంలో వాళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు భావించారు. మరి వాళ్లు ఏమి చేశారు? బహుశా ఇశ్రాయేలీయులు మానవ నాయకుడైన మోషే మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అందుకే, వాళ్లు కంగారుపడి అహరోనుతో ఇలా అన్నారు, “మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదు.”—నిర్గ. 32:1, 2.

14. ఇశ్రాయేలీయులు తమను తాము ఎలా మోసం చేసుకున్నారు? వాళ్లు చేసిన పనికి యెహోవా ఎలా స్పందించాడు?

14 విగ్రహాలను ఆరాధించడం తప్పని ఇశ్రాయేలీయులకు తెలుసు. (నిర్గ. 20:3-5) కానీ ఎంత త్వరగా బంగారు దూడను ఆరాధించడం మొదలుపెట్టారో కదా! వాళ్లు యెహోవా ఆజ్ఞను మీరినా, ఆయన ఇంకా వాళ్ల పక్షాన ఉన్నాడనుకొని ఇశ్రాయేలీయులు తమను తాము మోసం చేసుకున్నారు. అహరోను ఆ దూడ ఆరాధనను “యెహోవాకు పండుగ” అని కూడా పిలిచాడు. మరి యెహోవా ఏమి చేశాడు? ‘ప్రజలు చెడిపోయారని,’ ‘వాళ్లకు నియమించిన త్రోవనుండి తొలగిపోయారని’ యెహోవా మోషేతో చెప్పాడు. నిజానికి యెహోవాకు ఎంత కోపం వచ్చిందంటే, ఆ జనాంగమంతటినీ నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు.—నిర్గ. 32:5-10.

15, 16. మోషే, అహరోను పూర్తిగా యెహోవా పక్షాన ఉన్నారని ఎలా చూపించారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

15 కానీ యెహోవా కరుణగల దేవుడు. జనాంగమంతటినీ నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే, ఎవరు ఆయన పక్షాన ఉండాలనుకుంటున్నారో నిరూపించుకునే అవకాశాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. (నిర్గ. 32:14) వాళ్లు ఆ విగ్రహం ముందు అరుస్తూ, పాటలు పాడుతూ, నాట్యం చేయడం చూసినప్పుడు మోషే ఆ బంగారు దూడను పిండిపిండి చేశాడు. ఆ తర్వాత ఆయన, “యెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి” అన్నాడు. అప్పుడు, “లేవీయులందరును అతనియొద్దకు కూడి వచ్చిరి.”—నిర్గ. 32:17-20, 26.

16 ఆ బంగారు దూడను చేసింది అహరోనే అయినప్పటికీ, ఆయన పశ్చాత్తాపపడి ఇతర లేవీయుల్లాగే యెహోవా పక్షాన ఉండాలని నిశ్చయించుకున్నాడు. విశ్వసనీయంగా ఉన్న వీళ్లందరూ పాపం చేసినవాళ్ల పక్షాన లేరని స్పష్టంగా తెలియజేశారు. వాళ్లు తెలివైన పనిచేశారు! ఎందుకంటే బంగారు దూడను ఆరాధించిన వేలమంది ఆ రోజే చనిపోయారు. కానీ యెహోవా పక్షాన ఉన్నవాళ్లు తమ ప్రాణాల్ని దక్కించుకున్నారు. యెహోవా కూడా వాళ్లను దీవిస్తానని మాటిచ్చాడు.—నిర్గ. 32:27-29.

17. బంగారు దూడ వృత్తాంతం గురించి పౌలు రాసిన మాటల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

17 బంగారు దూడ వృత్తాంతం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, “ఆ విషయాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. వాళ్లలో కొందరు విగ్రహాల్ని పూజించేవాళ్లుగా తయారయ్యారు, మీరు వాళ్లలా అవ్వకండి.” ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఈ వ్యవస్థ అంతం కాబోయే సమయంలో జీవిస్తున్న మనకు హెచ్చరికగా ఉండడానికి ఆ విషయాలు లేఖనాల్లో రాయబడ్డాయి. అందుకే, తాను నిలబడి ఉన్నానని అనుకునే వ్యక్తి పడిపోకుండా చూసుకోవాలి.” (1 కొరిం. 10:6, 7, 11, 12) పౌలు మాటల్ని బట్టి, యెహోవా ఆరాధకులు కూడా చెడ్డ పనులు చేసే అవకాశం ఉందని అర్థమౌతుంది. అలా చేస్తున్నప్పటికీ యెహోవా ఆమోదం ఇంకా వాళ్లకు ఉందని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తికి యెహోవా స్నేహితునిగా ఉండాలనే కోరిక ఉన్నంత మాత్రాన లేదా అతను యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నానని చెప్పినంత మాత్రాన యెహోవా ఆమోదం ఎల్లప్పుడూ అతనికి ఉంటుందని కాదు.—1 కొరిం. 10:1-5.

18. మనం దేనివల్ల యెహోవాకు దూరమౌతాం? దానివల్ల వచ్చే పర్యవసానం ఏమిటి?

18 మోషే సీనాయి పర్వతం నుండి రావడం ఆలస్యం అయ్యేసరికి ఇశ్రాయేలీయులు కంగారుపడ్డారు. ఒకవేళ ఈ లోకాంతం మనం అనుకున్నంత త్వరగా రాకపోతే మనలో కూడా కంగారు మొదలవ్వవచ్చు. యెహోవా వాగ్దానం చేసిన అద్భుతమైన భవిష్యత్తు ఇప్పుడప్పుడే రాదేమో, అది అసలు నిజం కాదేమోనని ఆలోచించడం మొదలుపెట్టవచ్చు. అంతేకాదు యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడో మర్చిపోయి, మన కోరికల మీదే మనసుపెట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే మనం యెహోవాకు దూరమౌతాం, మనం ఎన్నడూ ఊహించని పనులు చేస్తాం.

19. మనం ఏ విషయాల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి? ఎందుకు?

19 మనం తనకు పూర్తిగా లోబడుతూ, తనను మాత్రమే ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (నిర్గ. 20:5) ఆయన ఎందుకలా కోరుకుంటున్నాడు? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం యెహోవా కోరేది చేయకపోతే, సాతాను కోరేది చేస్తున్నట్లే. అది మనకు హానికరం. పౌలు ఇలా అన్నాడు, “మీరు యెహోవా గిన్నెలోది తాగుతూ చెడ్డదూతల గిన్నెలోది తాగలేరు. ‘యెహోవా బల్ల’ మీదివి తింటూ, చెడ్డదూతల బల్ల మీదివి తినలేరు.”—1 కొరిం. 10:21.

యెహోవాను హత్తుకొని ఉండండి

20. మనం తప్పు చేసినప్పటికీ యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

20 కయీను, సొలొమోను, ఇశ్రాయేలీయులు వీళ్లందరికీ పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంది. (అపొ. 3:19) వాళ్లు తప్పు చేశారు కాబట్టి వాళ్లిక మారరు అనుకొని యెహోవా త్వరగా ఆశ వదులుకోలేదు. ఆయన అహరోనును క్షమించాడని గుర్తుంచుకోండి. నేడు, మనం తప్పు చేయకుండా ఉండడానికి యెహోవా ప్రేమపూర్వక హెచ్చరికల్ని ఇస్తున్నాడు. బైబిలు ద్వారా, మన ప్రచురణల ద్వారా, తోటి క్రైస్తవుల ద్వారా ఆయన వాటిని ఇస్తున్నాడు. ఆ హెచ్చరికల్ని మనం లక్ష్యపెట్టినప్పుడు, ఆయన మనపట్ల కరుణ చూపిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

21. యెహోవాపట్ల మన విశ్వసనీయతను పరీక్షించే సందర్భాలు ఎదురైతే ఏమి చేయాలి?

21 యెహోవా మనపై అపారదయ చూపించడానికి ఒక కారణం ఉంది. (2 కొరిం. 6:1) “భక్తిలేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా” అది మనకు సహాయం చేస్తుంది. (తీతు 2:11-14 చదవండి.) ఈ వ్యవస్థలో, యెహోవాపట్ల మన విశ్వసనీయతను పరీక్షించే సందర్భాలు ఎదురౌతూనే ఉంటాయి. కాబట్టి పూర్తిగా యెహోవా పక్షాన ఉండాలని నిశ్చయించుకోండి. అలాగే “నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని” ఉండాలని గుర్తుంచుకోండి.—ద్వితీ. 10:20.