కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎవరి గుర్తింపు కోరుకుంటారు?

మీరు ఎవరి గుర్తింపు కోరుకుంటారు?

“మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు.”హెబ్రీ. 6:10.

పాటలు: 39, 30

1. మనందరిలో ఉండే సహజ కోరిక ఏమిటి?

మీకు బాగా పరిచయమున్నవాళ్లు, మీరు ఎంతో గౌరవించేవాళ్లు మీ పేరును మర్చిపోతే లేదా మిమ్మల్ని గుర్తుపట్టకపోతే ఎలా అనిపిస్తుంది? చాలా బాధనిపిస్తుంది కదా! ఎందుకంటే ఇతరులు మనల్ని గుర్తించాలనే సహజ కోరిక మనలో ప్రతీఒక్కరికి ఉంటుంది. అయితే ఇతరులకు కేవలం మన పేరు తెలిస్తే సరిపోదుగానీ, మనం ఎలాంటి వాళ్లమో, ఏమి సాధించామో తెలిసివుండాలని కోరుకుంటాం.—సంఖ్యా. 11:16; యోబు 31:6.

2, 3. గుర్తింపు పొందాలనే మన సహజ కోరిక వల్ల ఏమి జరిగే అవకాశం ఉంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే, గుర్తింపు పొందాలనే ఈ సహజ కోరిక వల్ల మనం తప్పుదారి పట్టే అవకాశం ఉంది. గొప్ప పేరు తెచ్చుకోవాలనే, ప్రముఖుల జాబితాలో ఉండాలనే ఆశను సాతాను లోకం మనలో కలిగించవచ్చు. ఒకవేళ అదే జరిగితే మన పరలోక తండ్రికి చెందాల్సిన ఘనతను, ఆరాధనను ఆయనకు ఇవ్వం.—ప్రక. 4:11.

3 యేసు కాలంలోని కొంతమంది మతనాయకులు ప్రజల గుర్తింపు కావాలని కోరుకున్నారు. అందుకే యేసు తన అనుచరుల్ని ఇలా హెచ్చరించాడు, “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొడవాటి అంగీలు వేసుకొని తిరగడం, సంతల్లో ప్రజల చేత నమస్కారాలు పెట్టించుకోవడం వాళ్లకు ఇష్టం. సభామందిరాల్లో ముందువరుస కుర్చీలు, విందుల్లో ప్రత్యేక స్థానాలు వాళ్లకు కావాలి.” అంతేకాదు అలాంటివాళ్లు, “ఇంకా తీవ్రమైన తీర్పు పొందుతారు” అని కూడా ఆయన చెప్పాడు. (లూకా 20:46-47, అధస్సూచి) అయితే, యేసు వాళ్లకు భిన్నంగా రెండు చిన్న కాసులు విరాళంగా ఇచ్చిన ఒక పేద విధవరాలిని మెచ్చుకున్నాడు. బహుశా మిగతావాళ్లు ఎవ్వరూ ఆమెను పట్టించుకొని ఉండరు. (లూకా 21:1-4) అవును మిగతావాళ్లతో పోలిస్తే, గుర్తింపు విషయంలో యేసు ఆలోచనా విధానం భిన్నంగా ఉంది. గుర్తింపు విషయంలో మనం ఎలాంటి ఆలోచనా విధానం కలిగివుండాలని యెహోవా కోరుకుంటున్నాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

శ్రేష్ఠమైన గుర్తింపు

4. ఎలాంటి గుర్తింపు శ్రేష్ఠమైనది? ఎందుకు?

4 ఎలాంటి గుర్తింపు శ్రేష్ఠమైనది? చాలామంది అనుకుంటున్నట్లు చదువుల్లో, వ్యాపారంలో, వినోద రంగంలో గొప్ప పేరు సంపాదించడం వల్ల వచ్చే గుర్తింపు శ్రేష్ఠమైనది కాదు. ఏది శ్రేష్ఠమైన గుర్తింపో వివరిస్తూ పౌలు ఇలా చెప్పాడు, “కానీ ఇప్పుడు మీకు దేవుడు తెలుసు, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడికి మీరు తెలుసు. అలాంటప్పుడు పనికిరాని, విలువలేని ప్రాథమిక విషయాల వైపుకు మీరు మళ్లీ ఎందుకు వెళ్తున్నారు? మళ్లీ ఎందుకు వాటికి దాసులు అవ్వాలనుకుంటున్నారు?” (గల. 4:9) విశ్వ సర్వాధిపతియైన దేవునికి మనం తెలియడమే చాలా గొప్ప గౌరవం. అవును యెహోవాకు మనం తెలుసు, మనమంటే ఆయనకెంతో ఇష్టం. అంతేకాదు మనం తనతో స్నేహం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, నిజానికి ఆ ఉద్దేశంతోనే ఆయన మనల్ని సృష్టించాడు.—ప్రసం. 12:13, 14.

5. యెహోవాకు స్నేహితులు అవ్వాలంటే మనమేమి చేయాలి?

5 మోషే యెహోవా స్నేహితుడని మనకు తెలుసు. “నీ మార్గములు నాకు తెలుపుము” అని మోషే వేడుకున్నప్పుడు, యెహోవా ఇలా జవాబిచ్చాడు, “నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదును.” (నిర్గ. 33:12-17) యెహోవా మన గురించి కూడా వ్యక్తిగతంగా తెలుసుకోగలడు. అయితే ఆయనకు స్నేహితులు అవ్వాలంటే మనమేమి చేయాలి? ఆయన్ని ప్రేమించాలి, మన జీవితాన్ని సమర్పించుకోవాలి.—1 కొరింథీయులు 8:3 చదవండి.

6, 7. దేనివల్ల యెహోవాతో మన స్నేహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది?

6 మన పరలోక తండ్రితో స్నేహాన్ని ఏర్పర్చుకున్న తర్వాత దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. గలతీయలోని తొలి క్రైస్తవుల్లా మనం కూడా లోకం ఇచ్చే విజయం, పేరుప్రఖ్యాతులు వంటి ‘పనికిరాని, విలువేలేని ప్రాథమిక విషయాలకు’ బానిసలుగా ఉండకూడదు. (గల. 4:9) గలతీయలోని క్రైస్తవులకు అప్పటికే దేవుడు తెలుసు, దేవునికి కూడా వాళ్లు తెలుసు. కానీ వాళ్లు “మళ్లీ” వ్యర్థమైన విషయాల వైపుకు వెళ్తున్నారని పౌలు రాశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ‘మీరు విడిచిపెట్టిన ఆ వ్యర్థమైన, పనికిరాని విషయాలకు మళ్లీ ఎందుకు దాసులు అవ్వాలనుకుంటున్నారు?’ అని పౌలు వాళ్లను అడిగాడు.

7 మనం కూడా వాళ్లలా తయారయ్యే పరిస్థితి రావచ్చు. పౌలులాగే మనం కూడా సత్యంలోకి వచ్చినప్పుడు సాతాను లోకంలోని పేరుప్రఖ్యాతల్ని వదులుకుని ఉండవచ్చు. (ఫిలిప్పీయులు 3:7, 8 చదవండి.) బహుశా స్కాలర్‌షిప్‌లను, ప్రమోషన్‌లను, బాగా డబ్బు సంపాదించే అవకాశాలను మనం వదులుకుని ఉండవచ్చు. ఒకవేళ సంగీతం, ఆటలు వంటి రంగాల్లో మనకున్న నైపుణ్యాన్నిబట్టి గొప్ప పేరు లేదా ఎక్కువ డబ్బు సంపాదించుకుని ఉండేవాళ్లమేమో. కానీ వాటన్నిటినీ వద్దనుకున్నాం. (హెబ్రీ. 11:24-27) అయితే అంత మంచి నిర్ణయం తీసుకుని, వాటిని అనవసరంగా వదిలేశామనీ, లేకపోతే మన జీవితం చాలా బాగుండేదనీ బాధపడడం తెలివితక్కువ పని. అలా ఆలోచిస్తే, మనం ఒకప్పుడు ‘పనికిరానివిగా, విలువలేనివిగా’ భావించినవాటి దగ్గరకే మళ్లీ వెళ్లే ప్రమాదం ఉంది.

యెహోవా దగ్గర గుర్తింపు పొందాలనే మీ కోరికను బలపర్చుకోండి

8. యెహోవా దగ్గర గుర్తింపు పొందాలనే మన కోరికను మరింత బలపర్చుకోవడానికి ఏమి చేయవచ్చు?

8 లోకంలో కాదుగానీ, యెహోవా దగ్గర గుర్తింపు పొందాలనే మన కోరికను మరింత బలపర్చుకోవడానికి ఏమి చేయవచ్చు? దానికోసం మనం రెండు ప్రాముఖ్యమైన సత్యాలపై మనసుపెట్టాలి. మొదటిది, తనకు నమ్మకంగా సేవచేసే వాళ్లకు యెహోవా దగ్గర ఎల్లప్పుడూ గుర్తింపు దొరుకుతుంది. (హెబ్రీయులు 6:10 చదవండి; 11:6) తన నమ్మకమైన సేవకుల్లో ప్రతీఒక్కరిని ఆయన విలువైనవాళ్లుగా చూస్తాడు. వాళ్లలో ఒక్కరిని కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు ఎందుకంటే ఆయన “నీతిమంతుడు.” “తనవాళ్లు ఎవరో” యెహోవాకు తెలుసు (2 తిమో. 2:19) ‘నీతిమంతుల మార్గం’ ఏమిటో, వాళ్లనెలా కాపాడాలో ఆయనకు తెలుసు.—కీర్త. 1:6; 2 పేతు. 2:9.

9. యెహోవా తన ప్రజల్ని ఆమోదిస్తున్నాడని ఎలా చూపించాడో ఉదాహరణలు చెప్పండి.

9 కొన్ని సందర్భాల్లో యెహోవా తన ప్రజల్ని ఆమోదిస్తున్నాడని ప్రత్యేకమైన విధానాల్లో చూపించాడు. (2 దిన. 20:20, 29) ఉదాహరణకు, శక్తివంతమైన ఫరో సైన్యాలు తన ప్రజల్ని తరుముతున్నప్పుడు యెహోవా ఎలా కాపాడాడో ఒకసారి ఆలోచించండి. (నిర్గ. 14:21-30; కీర్త. 106:9-11) అది ఎంత అద్భుతమైన సంఘటన అంటే, 40 ఏళ్లు గడిచిపోయిన తర్వాత కూడా అక్కడి ప్రజలు దానిగురించి మాట్లాడుకున్నారు. (యెహో. 2:9-11) యెహోవా తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడో, వాళ్లను కాపాడడానికి తన శక్తిని గతంలో ఎలా ఉపయోగించాడో గుర్తుచేసుకోవడం చాలా ప్రోత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే త్వరలోనే మాగోగువాడగు గోగు మనపై దాడిచేస్తాడు. (యెహె. 38:8-12) లోకంలో కాదుగానీ, యెహోవా దగ్గర గుర్తింపు పొందడానికి కృషిచేసినందుకు మనం ఆ సమయంలో ఎంతో సంతోషిస్తాం.

10. మనం మనసుపెట్టాల్సిన రెండవ సత్యం ఏమిటి?

10 మనం మనసుపెట్టాల్సిన రెండవ ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, మనం ఊహించని విధంగా యెహోవా మనకు గుర్తింపు ఇవ్వవచ్చు. అయితే కేవలం ఇతరులు మెచ్చుకోవాలని మంచిపనులు చేస్తే యెహోవా ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకు? ఎందుకంటే, ఇతరులు మెచ్చుకున్నప్పుడే వాళ్లు ప్రతిఫలం పొందేశారని యేసు చెప్పాడు. (మత్తయి 6:1-5 చదవండి.) దానికి భిన్నంగా, తాము చేసిన మంచివాటికి గుర్తింపు పొందనివాళ్లను “రహస్యంగా చూస్తున్న” యెహోవా మర్చిపోడు. వాళ్లు చేసినవాటిని చూసి ఆయన వాళ్లకు ప్రతిఫలమిస్తాడు లేదా ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు ఊహించని విధానాల్లో యెహోవా తన సేవకులకు ప్రతిఫలమిస్తాడు. అలాంటి కొన్ని ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

వినయస్థురాలైన యువతికి ఊహించనిరీతిలో యెహోవా గుర్తింపునిచ్చాడు

11. మరియకు యెహోవా ఎలాంటి గుర్తింపునిచ్చాడు?

11 తన కుమారుడైన యేసుకు జన్మనివ్వడానికి యెహోవా వినయస్థురాలైన మరియను ఎంచుకున్నాడు. ఆమె యెరూషలేముకు, అక్కడి అందమైన ఆలయానికి చాలా దూరంలో ఉన్న నజరేతు అనే చిన్న పల్లెటూరిలో ఉండేది. (లూకా 1:26-33 చదవండి.) యెహోవా మరియను ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆమె “దేవుని ఆశీర్వాదం” పొందిందని గబ్రియేలు దూత ఆమెను కలిసినప్పుడు చెప్పాడు. మరియ, తన బంధువైన ఎలీసబెతుతో చెప్పిన మాటల్ని బట్టి ఆమె యెహోవాకు మంచి స్నేహితురాలని మనకు అర్థమౌతుంది. (లూకా 1:46-55) ఆమె నమ్మకంగా సేవచేస్తోందని యెహోవా గమనించి, ఊహించనిరీతిలో దీవించాడు.

12, 13. యేసు పుట్టినప్పుడు, అలాగే 40 రోజుల తర్వాత యెహోవా ఆయన్ని ఏవిధంగా ఘనపర్చాడు?

12 యేసు పుట్టినప్పుడు, ఆయన పుట్టిన విషయం యెహోవా ఎవరికి చెప్పాడు? యెరూషలేములో అలాగే బేత్లెహేములో ఉన్న ముఖ్య అధికారులకు లేదా పరిపాలకులకా? కాదు. బేత్లెహేము బయట పొలాల్లో గొర్రెల్ని కాస్తున్న సాధారణ కాపరులకు చెప్పమని యెహోవా దూతలను పంపించాడు. (లూకా 2:8-14) అప్పుడు ఆ కాపరులు వెళ్లి పసివాడైన యేసును చూశారు. (లూకా 2:15-17) ఆ విధంగా యేసు ఘనపర్చబడడం చూసి యోసేపు, మరియ చాలా ఆశ్చర్యపోయి ఉంటారు. పనులు చేసే విధానంలో యెహోవాకు, సాతానుకు చాలా తేడా ఉంది. యేసును, ఆయన తల్లిదండ్రులను చూసిరమ్మని సాతాను జ్యోతిష్యులను పంపించడం వల్ల యేసు పుట్టిన విషయం యెరూషలేమంతా పాకిపోయింది. దానివల్ల పెద్ద సమస్య తలెత్తింది. (మత్త. 2:3) అమాయకులైన ఎంతోమంది పసిపిల్లలు తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.—మత్త. 2:16.

13 ధర్మశాస్త్రం ప్రకారం, మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి 40 రోజుల తర్వాత యెహోవాకు ఒక బలి అర్పించాలి. కాబట్టి మరియ యోసేపుతో కలిసి యేసును తీసుకుని దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి వెళ్లింది. (లూకా 2:22-24) ఈసారి యేసు ఏవిధంగా ఘనపర్చబడతాడోనని మరియ ఆలోచించివుంటుంది. యాజకుడు ఏదైనా ప్రత్యేకమైన పని చేసి యేసును ఘనపరుస్తాడా? నిజంగానే యేసు ఘనపరచబడ్డాడు, కానీ మరియ ఊహించినరీతిలో కాదు. సుమెయోను అనే “నీతిమంతుడు, దైవభక్తి గల” వ్యక్తి ద్వారా, అలాగే అన్న అనే 84 ఏళ్ల ప్రవక్త్రి ద్వారా, యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ లేదా క్రీస్తు అవుతాడనే ప్రకటనను యెహోవా చేయించాడు.—లూకా 2:25-38.

14. యెహోవా మరియకు ఏ ప్రతిఫలం ఇచ్చాడు?

14 మరియ సంగతేంటి? యేసును పెంచి, పెద్ద చేసే బాధ్యతను నమ్మకంగా పూర్తిచేసినందుకు యెహోవా ఆమెకు ఇంకా ఏవిధంగానైనా గుర్తింపునిచ్చాడా? అవును ఇచ్చాడు. మరియ మాటల్లో కొన్నిటిని, అలాగే ఆమె పనుల్లో కొన్నిటిని బైబిల్లో నమోదయ్యేలా చేశాడు. అయితే, యేసు పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాల కాలంలో మరియ ఆయనతోపాటు ప్రయాణించలేకపోయింది. బహుశా ఆమె విధవరాలు అవ్వడం వల్ల, నజరేతులోనే ఉండిపోవాల్సి వచ్చివుంటుంది. దానివల్ల ఆమె ఎన్నో అద్భుతమైన అనుభవాల్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. కానీ యేసు చనిపోతున్నప్పుడు ఆమె ఆయనతోనే ఉంది. (యోహా. 19:26) తర్వాత పెంతెకొస్తు రోజున యెరూషలేములో యేసు శిష్యులు పవిత్రశక్తి పొందినప్పుడు మరియ కూడా వాళ్లతోనే ఉంది. (అపొ. 1:13, 14) బహుశా ఆమె కూడా ఇతర శిష్యులతోపాటు అభిషేకించబడి ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే, పరలోకంలో శాశ్వతంగా యేసుతోపాటు ఉండే గొప్ప అవకాశాన్ని మరియ సొంతం చేసుకుని ఉంటుంది. ఆమె నమ్మకంగా చేసిన సేవకు అంతకుమించిన గుర్తింపు లేదా ప్రతిఫలం మరొకటి ఉండదు.

యెహోవా తన కుమారునికి గుర్తింపునిచ్చాడు

15. యేసు భూమ్మీదున్నప్పుడు యెహోవా ఆయనకు ఎలా గుర్తింపునిచ్చాడు?

15 మతనాయకులు గానీ, రాజకీయ నాయకులు గానీ తనను ఘనపర్చాలని యేసు కోరుకోలేదు. కానీ స్వయంగా యెహోవాయే మూడు వేర్వేరు సందర్భాల్లో పరలోకం నుండి నేరుగా మాట్లాడి యేసును ప్రేమిస్తున్నానని చెప్పాడు. అది యేసుకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చివుంటుందో కదా! యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న వెంటనే యెహోవా ఇలా అన్నాడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” (మత్త. 3:17) ఆ మాటల్ని యేసుతోపాటు బాప్తిస్మమిచ్చు యోహాను మాత్రమే వినుంటాడు. యేసు చనిపోవడానికి దాదాపు ఏడాది ముందు, ఆయన శిష్యుల్లో ముగ్గురు యెహోవా చెప్పిన ఈ మాటల్ని విన్నారు: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి.” (మత్త. 17:5) చివరిగా, యేసు చనిపోవడానికి కొన్నిరోజుల ముందు పరలోకం నుండి యెహోవా మరొకసారి తన కుమారునితో మాట్లాడాడు.—యోహా. 12:28.

యెహోవా తన కుమారునికి గుర్తింపునిచ్చిన విధానం నుండి మీరేమి తెలుసుకున్నారు? (15-17 పేరాలు చూడండి)

16, 17. ఊహించనిరీతిలో యెహోవా యేసును ఎలా ఘనపర్చాడు?

16 దైవదూషణ చేస్తున్నాడంటూ ప్రజలు తనను నిందిస్తారనీ, చివరికి అవమానకరమైన మరణాన్ని అనుభవించాలనీ యేసుకు తెలుసు. అయినాసరే దేవుని ఇష్టమే నెరవేరాలని ఆయన ప్రార్థించాడే తప్ప తన సొంత ఇష్టానికి ప్రాముఖ్యతనివ్వలేదు. (మత్త. 26:39, 42) యేసు లోకంలో కాదుగానీ, తన తండ్రి దగ్గర గుర్తింపు పొందాలని కోరుకున్నాడు కాబట్టి “హింసాకొయ్య మీద బాధను ఓర్చుకున్నాడు, అవమానాన్ని లెక్కచేయలేదు.” (హెబ్రీ. 12:2) మరి యెహోవా ఆయనకు తగిన గుర్తింపును ఎలా ఇచ్చాడు?

17 పరలోకంలో తండ్రితోపాటు ఉన్నప్పుడు తనకు ఎలాంటి మహిమ ఉండేదో అదే మహిమను తిరిగి ఇవ్వమని యేసు భూమ్మీదున్నప్పుడు ప్రార్థించాడు. (యోహా. 17:5) ఆయన అంతకుమించి ఎక్కువ కోరుకున్నట్లు బైబిల్లో లేదు. భూమ్మీద యెహోవా ఇష్టం చేస్తున్నందుకు తనకు ప్రత్యేకమైన ప్రతిఫలమివ్వాలని యేసు కోరుకోలేదు. కానీ యెహోవా ఏమి చేశాడు? ఊహించనిరీతిలో యేసును ఘనపర్చాడు. యెహోవా ఆయన్ని పునరుత్థానం చేసి పరలోకంలో ‘ఉన్నతమైన స్థానం’ ఇచ్చాడు. దానితోపాటు ఇంతకుముందు ఎవ్వరూ పొందని అమర్త్యతను ఆయనకు ఇచ్చాడు. * (ఫిలి. 2:9; 1 తిమో. 6:16) యేసు చేసిన నమ్మకమైన సేవకు యెహోవా ఎంత అద్భుతమైన ప్రతిఫలం ఇచ్చాడో కదా!

18. లోకంలో కాకుండా యెహోవా దగ్గర గుర్తింపు పొందాలనే కోరికను వృద్ధిచేసుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది?

18 లోకంలో కాకుండా యెహోవా దగ్గర గుర్తింపు పొందాలనే కోరికను వృద్ధిచేసుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది? దానికోసం మనం ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, తన నమ్మకమైన సేవకుల్ని యెహోవా ఎల్లప్పుడూ గుర్తిస్తాడు, ఎవ్వరూ ఊహించనిరీతిలో వాళ్లకు ప్రతిఫలమిస్తాడు. మనకోసం ఎలాంటి ప్రతిఫలాలు వేచివున్నాయో ఎవరికి తెలుసు! కానీ ప్రస్తుతానికైతే, ఈ దుష్టలోకంలో మనకు ఎదురౌతున్న సమస్యల్ని, కష్టాల్ని సహిస్తుండగా ఈ లోకానికి నాశనం దగ్గరపడిందని మనం గుర్తుంచుకోవాలి. లోకం ఇచ్చే గుర్తింపు కూడా దానితోపాటే నాశనమౌతుంది. (1 యోహా. 2:17) మరోవైపున, మన ప్రేమగల తండ్రైన యెహోవా మన సేవను, తన పేరు విషయంలో మనం చూపించే ప్రేమను ఎన్నటికీ మర్చిపోడు, ఎందుకంటే ఆయన “నీతిమంతుడు.” (హెబ్రీ. 6:10) ఆయన మనకు ఖచ్చితంగా గుర్తింపునిస్తాడు, అది కూడా మనం ఎన్నడూ ఊహించని రీతిలో కావచ్చు!

^ పేరా 17 అమర్త్యత అనే ప్రతిఫలం బహుశా ఊహించనిది అయ్యుండవచ్చు, ఎందుకంటే హీబ్రూ లేఖనాల్లో అమర్త్యత గురించిన ప్రస్తావన లేదు.