కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అన్నిరకాల ప్రజల” పట్ల కనికరం చూపించండి

“అన్నిరకాల ప్రజల” పట్ల కనికరం చూపించండి

మంచివార్త ఎలా ప్రకటించాలో శిష్యులకు నేర్పిస్తున్నప్పుడు, అందరూ దాన్ని అంగీకరించరని యేసు వాళ్లకు చెప్పాడు. (లూకా 10:3, 5, 6) నేడు మన కాలంలో కూడా అదే జరుగుతోంది. పరిచర్యలో మనం కలిసేవాళ్లలో కొంతమంది మనతో కఠినంగా ప్రవర్తించవచ్చు లేదా మనపై మండిపడొచ్చు. అలాంటి వాళ్లపట్ల కనికరం చూపించడం, వాళ్లకు మంచివార్త ప్రకటించడం మనకు కష్టంగా అనిపించవచ్చు.

కనికరం ఉన్న వ్యక్తి ఇతరుల అవసరాల్ని గుర్తిస్తాడు, వాళ్ల సమస్యల్ని అర్థంచేసుకుంటాడు, వాళ్లపట్ల సానుభూతి చూపిస్తాడు, వాళ్లకు సహాయం చేయాలనుకుంటాడు. ఒకవేళ పరిచర్యలో కలిసే వాళ్లపట్ల మనకు కనికరం లేకపోతే ఏం జరుగుతుంది? మన ఉత్సాహం చల్లబడిపోతుంది. అంటే ఇతరులకు ప్రకటించాలనే ఉత్సాహం మనలో ఉండదు, అప్పుడు మనం వాళ్లకు సహాయం చేయలేం. మన ఉత్సాహాన్ని మంటతో పోల్చవచ్చు. మంట ఆరిపోకుండా ఉండాలంటే కట్టెలు వేస్తూ ఉండాలి. అదేవిధంగా మన ఉత్సాహం తగ్గిపోకుండా ఉండాలంటే కనికరాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి.—1 థెస్స. 5:19.

కనికరం చూపించడం కష్టంగా ఉండే సందర్భాల్లో కూడా ఆ లక్షణాన్ని మరింత ఎక్కువగా ఎలా చూపించవచ్చు? మనం ఆదర్శంగా తీసుకోదగిన ముగ్గురి ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. వాళ్లు ఎవరంటే: యెహోవా, యేసు, అపొస్తలుడైన పౌలు.

యెహోవాలా కనికరం చూపించండి

కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు యెహోవా గురించి అబద్ధాల్ని వ్యాప్తిచేస్తూ ఉన్నారు. కానీ యెహోవా మాత్రం “కృతజ్ఞతలేని చెడ్డవాళ్ల మీద దయ చూపిస్తున్నాడు.” (లూకా 6:35) ఏవిధంగా? ఆయన అందరిపట్ల సహనం చూపిస్తున్నాడు. “అన్నిరకాల ప్రజలు” రక్షించబడాలని కోరుకుంటున్నాడు. (1 తిమో. 2:3, 4) దేవుడు చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నప్పటికీ, మనుషుల్ని ఆయనెంతో విలువైనవాళ్లుగా చూస్తున్నాడు, వాళ్లలో ఒక్కరు కూడా నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు.—2 పేతు. 3:9.

ప్రజలు అబద్ధాలు నమ్మేలా చేయడంలో సాతాను ఆరితేరిపోయాడని యెహోవాకు తెలుసు. (2 కొరిం. 4:3, 4) ఎంతోమంది చిన్నతనం నుండే దేవుని గురించి అబద్ధాలు వింటూ పెరిగారు. కాబట్టి తమ ఆలోచనా తీరునుబట్టి, తమ భావాల్నిబట్టి సత్యం అంగీకరించడం వాళ్లకు కష్టంగా ఉండవచ్చు. కానీ యెహోవా వాళ్లకు సహాయం చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. అలాగని ఎలా చెప్పవచ్చు?

ఉదాహరణకు, నీనెవె పట్టణస్థుల గురించి యెహోవా ఎలా భావించాడు? వాళ్లు దౌర్జన్యపరులు అయినప్పటికీ యెహోవా యోనాతో ఇలా అన్నాడు, “నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనము . . . గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా?” (యోనా 4:11) తన గురించి సత్యం తెలియని ప్రజలమీద యెహోవా జాలిపడ్డాడు. అందుకే వాళ్లను హెచ్చరించమని యోనాను పంపించాడు.

యెహోవాలాగే మనం కూడా ప్రజల్ని విలువైనవాళ్లుగా చూస్తాం. వాళ్లు సత్యం అంగీకరించరని మనకు అనిపించినప్పటికీ వాళ్లకు యెహోవా గురించి ఉత్సాహంగా తెలియజేయడం ద్వారా మనం యెహోవాను అనుకరించవచ్చు.

యేసులా కనికరం చూపించండి

తన తండ్రిలాగే యేసు కూడా ప్రజలమీద జాలిపడ్డాడు. ఎందుకంటే “వాళ్లు చర్మం ఒలిచేయబడి, విసిరేయబడిన కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు.” (మత్త. 9:36) వాళ్లు అలాంటి పరిస్థితిలో ఉండడానికి గల కారణాన్ని యేసు అర్థంచేసుకున్నాడు. అదేమిటంటే, మతనాయకులు వాళ్లతో కఠినంగా ప్రవర్తించారు, అబద్ధాల్ని బోధించారు. అయితే, తన బోధలు వినడానికి వచ్చినవాళ్లలో చాలామంది వేర్వేరు కారణాల చేత తన అనుచరులు అవ్వరని యేసుకు తెలుసు. అయినప్పటికీ ఆయన వాళ్లందరికీ ఎన్నో విషయాలు బోధించాడు.—మార్కు 4:1-9.

ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు సరిగ్గా స్పందించకపోతే నిరుత్సాహపడకండి

జీవితంలో పరిస్థితులు మారినప్పుడు ఒక వ్యక్తికి సత్యంపట్ల ఉన్న అభిప్రాయం మారవచ్చు

అదేవిధంగా మనం ప్రకటించిన మంచివార్తకు ప్రజలు ప్రతికూలంగా స్పందించినప్పుడు, దానికిగల కారణాన్ని అర్థంచేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. బహుశా క్రైస్తవులమని చెప్పుకుంటూ చెడ్డపనులు చేసేవాళ్లను బట్టి బైబిలు పట్ల లేదా క్రైస్తవుల పట్ల వాళ్లకు చెడు అభిప్రాయం ఏర్పడివుండవచ్చు. ఇంకొంతమంది మన నమ్మకాల గురించి అబద్ధాల్ని వినివుండవచ్చు. మరికొంతమంది, మనతో మాట్లాడితే తమ బంధువులు లేదా తోటివాళ్లు ఎగతాళి చేస్తారేమోనని భయపడుతుండవచ్చు.

ఇంకొందరైతే, తమకు ఎదురైన విషాదకర సంఘటనలను బట్టి మనం ప్రకటించే మంచివార్తకు ప్రతికూలంగా స్పందించవచ్చు. కిమ్‌​ అనే ఒక మిషనరీ సహోదరి పనిచేస్తున్న క్షేత్రంలో, యుద్ధంలో సర్వస్వం కోల్పోయి ప్రాణాలతో బయటపడినవాళ్లే ఎక్కువమంది ఉన్నారు. జీవితం వాళ్లకు శూన్యంలా అనిపించింది. వాళ్లు విసిగిపోయి, మనుషుల మీద నమ్మకం కోల్పోయి బ్రతుకుతున్నారు. సాక్షుల్ని మంచివార్త ప్రకటించనివ్వకుండా ఆ క్షేత్రంలోని ప్రజలు చాలాసార్లు అడ్డుపడ్డారు. ఒకసారైతే వాళ్లు కిమ్‌​ మీద దాడి కూడా చేశారు.

అయినాసరే కిమ్‌​ వాళ్లపట్ల కనికరం ఎలా చూపించగలిగింది? ఆమె ఎప్పుడూ సామెతలు 19:11⁠లోని ఈ మాటల్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది: “ఒకని సుబుద్ధి [లోతైన అవగాహన, NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును.” తన క్షేత్రంలోని ప్రజలు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో ఆలోచించడం వల్ల ఆమె వాళ్లమీద కనికరం చూపించగలిగింది. అయితే అందరూ కాకపోయినా కొంతమందైనా ఆమె ప్రకటించిన సందేశానికి చక్కగా స్పందించారు. ఆ ప్రాంతంలో ఆమెకు కొన్ని పునర్దర్శనాలు కూడా దొరికాయి.

అయితే మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవాసాక్షులు మొట్టమొదటిసారి నాకు మంచివార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు నేనెలా స్పందించి ఉండేవాణ్ణి?’ ఒకవేళ అప్పటికే మనం సాక్షుల గురించి ఎన్నో అబద్ధాలు వినుంటే అప్పుడేంటి? బహుశా మనం కూడా ప్రతికూలంగా స్పందించేవాళ్లమేమో, అప్పుడు మనపట్ల కూడా కనికరం చూపించాల్సి వచ్చేది. ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో మనం కూడా వాళ్లతో అలాగే ప్రవర్తించాలని యేసు చెప్పాడు. కాబట్టి కొంచెం కష్టమే అయినా, ఇతరుల భావాల్ని అర్థంచేసుకుని, ఓపిగ్గా ఉండడానికి మనం ప్రయత్నించాలి.—మత్త. 7:12.

పౌలులా కనికరం చూపించండి

మంచివార్త ప్రకటించినందుకు తనను హింసించిన వాళ్లపట్ల కూడా అపొస్తలుడైన పౌలు కనికరం చూపించాడు. ఎందుకు? ఎందుకంటే గతంలో తానెలా ప్రవర్తించాడో పౌలు గుర్తుచేసుకున్నాడు. అతనిలా చెప్పాడు, “ఒకప్పుడు నేను దైవదూషణ చేశాను, హింసించాను, తలబిరుసుగా ప్రవర్తించాను. అయినా ఆయన నన్ను నమ్మకస్థునిగా ఎంచాడు. తెలియక, విశ్వాసం లేక అలా ప్రవర్తించాను కాబట్టి ఆయన నన్ను కరుణించాడు.” (1 తిమో. 1:13) యెహోవా, యేసు తనపట్ల ఎంతో కరుణ చూపించారని పౌలుకు తెలుసు. తన పరిచర్యను ఆపడానికి ప్రయత్నించిన వాళ్లను పౌలు అర్థంచేసుకోగలిగాడు, ఎందుకంటే ఒకప్పుడు అతను కూడా అలానే ప్రవర్తించాడు.

అబద్ధ బోధల్ని బలంగా నమ్మిన కొంతమందిని పౌలు పరిచర్యలో కలిశాడు. అతనికెలా అనిపించింది? పౌలు ఏథెన్సుకు వెళ్లినప్పుడు “ఆ నగరం విగ్రహాలతో నిండి ఉండడం చూసి అతనికి చాలా చిరాకొచ్చింది” అని అపొస్తలుల కార్యాలు 17:16 చెప్తుంది. కానీ చిరాకు కలిగించిన ఆ విషయాన్ని ఉపయోగించే ఆ నగర ప్రజలకు అతను మంచివార్త ప్రకటించాడు. (అపొ. 17:22, 23) “ఎలాగైనా కొందరిని రక్షించాలనే ఉద్దేశంతో” ప్రకటించే పద్ధతిని కాస్త మార్చి వివిధ నేపథ్యాల ప్రజలతో వివిధ పద్ధతుల్ని ఉపయోగించి పౌలు మాట్లాడాడు.—1 కొరిం. 9:20-23.

ప్రతికూలంగా స్పందించేవాళ్లకు లేదా తప్పుడు అభిప్రాయాలు ఉన్నవాళ్లకు ప్రకటించేటప్పుడు మనం పౌలును అనుకరించవచ్చు. వాళ్ల గురించి మనకు తెలిసిన విషయాల్ని ఉపయోగించి వాళ్లకు మేలైన విషయాల గురించిన మంచివార్తను నేర్పించవచ్చు. (యెష. 52:7) డోరతీ అనే ఒక సహోదరి ఇలా చెప్పింది, “మేం ప్రకటించే ప్రాంతంలో చాలామందికి దేవుడు కఠినుడు, తప్పులు వెదికేవాడు అనే అభిప్రాయం ఉంది. అలాంటివాళ్లను కలిసినప్పుడు ముందుగా దేవునిపై వాళ్లకున్న బలమైన నమ్మకాన్ని బట్టి వాళ్లను మెచ్చుకుంటాను. ఆ తర్వాత బైబిలు ఉపయోగించి యెహోవా ఎంత ప్రేమగలవాడో, భవిష్యత్తు గురించి ఆయన ఎలాంటి వాగ్దానాలు చేశాడో వివరిస్తాను.”

“మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ ఉండండి”

మనం అంతానికి దగ్గరయ్యే కొద్దీ, కొంతమంది ఆలోచనా విధానం ‘అంతకంతకూ చెడుగా’ మారుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. (2 తిమో. 3:1, 13) అలాంటివాళ్లు స్పందించే తీరును చూసి మనం మన కనికరాన్ని, ఆనందాన్ని కోల్పోకూడదు. “మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ” ఉండేందుకు కావాల్సిన బలాన్ని యెహోవా మనకిస్తాడు. (రోమా. 12:21) జెస్సిక అనే పయినీరు సహోదరి ఇలా చెప్తుంది, “నాకు తరచూ గర్విష్ఠులుగా ఉండే ప్రజలు ఎదురౌతుంటారు. వాళ్లు మమ్మల్నీ, మేం ప్రకటించే సందేశాన్నీ ఎగతాళి చేస్తారు. వాళ్ల పనులకు నాకు చాలా కోపమొస్తుంది. కానీ వాళ్లతో మాట్లాడడం ప్రారంభించాక, ఆ వ్యక్తిని యెహోవా చూస్తున్నట్లు చూడడానికి సహాయం చేయమని మనసులో ప్రార్థించుకుంటాను. దాంతో ఆ వ్యక్తిపై నాకున్న అభిప్రాయాన్ని మర్చిపోయి, అతనికి ఎలా సహాయం చేయాలనే దానిగురించి ఆలోచించగలుగుతాను.”

సత్యం తెలుసుకోవాలనుకునే వాళ్లకోసం మనం వెదుకుతూనే ఉంటాం

కాలం గడిచేకొద్దీ కొంతమంది మన సహాయాన్ని స్వీకరించి, సత్యం తెలుసుకుంటారు

ప్రకటనా పనిలో మనతో కలిసి పనిచేసే సహోదరసహోదరీల్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నించాలి. జెస్సిక ఇలా చెప్తుంది, “మాలో ఒకరికి చేదు అనుభవం ఎదురైతే, దానిగురించి మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదు దానిగురించి మాట్లాడకుండా మంచి విషయాల గురించి అంటే కొంతమంది సరిగ్గా స్పందించకపోయినా పరిచర్య వల్ల వచ్చే మంచి ఫలితాల గురించి మాట్లాడుతుంటాను.”

ప్రకటనా పని కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటుందని యెహోవాకు తెలుసు. కానీ మనం ఆయనలా కరుణ చూపించినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. (లూకా 6:36) కానీ లోకంలోని ప్రజలపట్ల యెహోవా ఎప్పటికీ కనికరం, సహనం చూపిస్తూ ఉండడు. అంతం ఎప్పుడు తీసుకురావాలో యెహోవాకు బాగా తెలుసనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అప్పటివరకు మనం పరిచర్య చేస్తూ ఉండడం చాలా ప్రాముఖ్యం. (2 తిమో. 4:2) కాబట్టి ఉత్సాహంతో ప్రకటిస్తూ, “అన్నిరకాల ప్రజల” పట్ల కనికరం చూపిస్తూ ఉందాం.