అధ్యయన ఆర్టికల్ 26
పాట 8 యెహోవా మనకు ఆశ్రయం
యెహోవాను మీ ఆశ్రయదుర్గంగా చేసుకోండి
“మా దేవునిలాంటి ఆశ్రయదుర్గం [బండరాయి] ఏదీ లేదు.” —1 సమూ. 2:2, అధస్సూచి.
ముఖ్యాంశం
యెహోవా ఎలా ఒక ఆశ్రయదుర్గంగా లేదా బండరాయిలా ఉన్నాడో, ఆయనకున్న బండరాయి లాంటి లక్షణాల్ని మనం ఎలా చూపించవచ్చో తెలుసుకుంటాం.
1. కీర్తన 18:46 ప్రకారం దావీదు యెహోవాను ఏమని పిలిచాడు?
కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవి మన జీవితాల్ని తలకిందులు చేయవచ్చు. అలాంటి సమయాల్లో యెహోవా సహాయం చేస్తాడని తెలుసుకుని మనం కాస్త ఊపిరిపీల్చుకోవచ్చు. ముందటి ఆర్టికల్‌లో యెహోవా జీవంగల దేవుడని, మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలుసుకున్నాం. ఆయన ఇచ్చే సహాయాన్ని రుచి చూసినప్పుడు “యెహోవా సజీవుడు!” అనే మన నమ్మకం బలపడుతుంది. (కీర్తన 18:46 చదవండి.) అయితే, యెహోవా సజీవుడు అని చెప్పిన వెంటనే ఆయన “నా బండరాయి” అని దావీదు అన్నాడు. జీవంగల యెహోవాను ఒక జీవంలేని వస్తువుతో దావీదు ఎందుకు పోల్చాడు?
2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
2 యెహోవాను ఎందుకు ఒక బండరాయితో పోల్చవచ్చు? ఆ పోలిక ఆయన గురించి ఏం చెప్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు, ఆయన్ని మన బండరాయిగా ఎలా చేసుకోవచ్చో పరిశీలిస్తాం. చివరిగా, ఆయనకున్న బండరాయి లాంటి లక్షణాల్ని మనం ఎలా చూపించవచ్చో చర్చిస్తాం.
యెహోవా బండరాయిలా ఎలా ఉన్నాడు?
3. బైబిల్లో సాధారణంగా “బండరాయి” అనే పదాన్ని ఎలా ఉపయోగించారు? (చిత్రం చూడండి.)
3 యెహోవాకున్న లక్షణాల్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిలు “బండరాయి” అనే పదచిత్రాన్ని ఉపయోగించింది. సాధారణంగా, తనకు ఎవ్వరూ సాటిలేరు అని దేవున్ని స్తుతించే సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించారు. ద్వితీయోపదేశకాండం 32:4 లో (అధస్సూచి) మొట్టమొదటిసారి యెహోవా “బండరాయి” అని ఉంది. హన్నా చేసిన ప్రార్థనలో “మా దేవునిలాంటి బండరాయి ఏదీ లేదు” అని ఆమె అంది. (1 సమూ. 2:2, అధస్సూచి.) హబక్కూకు యెహోవాను “నా బండరాయీ” అన్నాడు. (హబ. 1:12, అధస్సూచి.) 73వ కీర్తన రాసిన కీర్తనకర్త దేవుణ్ణి “నా హృదయానికి బండరాయి” అని అన్నాడు. (కీర్త. 73:26, అధస్సూచి.) యెహోవా కూడా తననుతాను ఒక బండరాయి అని పిలుచుకున్నాడు. (యెష. 44:8, అధస్సూచి.) ఇప్పుడు యెహోవాకున్న బండరాయి లాంటి లక్షణాల్లో మూడిటిని చర్చిద్దాం. అంతేకాదు ఆయన్ని ‘మన బండరాయిలా’ ఎలా చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం.—ద్వితీ. 32:31, అధస్సూచి.
4. యెహోవా ఎలా ఒక ఆశ్రయంగా ఉన్నాడు? (కీర్తన 94:22)
4 యెహోవా ఆశ్రయంగా ఉంటాడు. ఒక భయంకరమైన తుఫాను నుండి ఒక వ్యక్తి తననుతాను కాపాడుకోవడానికి ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కుంటాడు. అలాగే మన ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితులు వచ్చినప్పుడు యెహోవా మనకు ఆశ్రయంగా ఉంటాడు. (కీర్తన 94:22 చదవండి.) ఆయనతో మనకున్న బంధాన్ని కాపాడుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. అలాగే మనకున్న కష్టాలు మనకు శాశ్వత హాని చేయకుండా చూస్తాడు. అంతేకాదు, మన శాంతిభద్రతలకు అడ్డొచ్చే దేన్నైనా త్వరలోనే తీసేస్తానని ఆయన మాటిస్తున్నాడు.—యెహె. 34:25, 26.
5. యెహోవాను బండరాయి లాంటి ఆశ్రయంగా ఎలా చేసుకోవచ్చు?
5 యెహోవాను బండరాయి లాంటి ఆశ్రయంగా చేసుకునే ఒక విధానం ఏంటంటే, ఆయనకు ప్రార్థించడం. మనం ప్రార్థన చేసినప్పుడు మన మనస్సును, హృదయాన్ని కాపాడే ‘దేవుని శాంతిని’ యెహోవా ఇస్తాడు. (ఫిలి. 4:6, 7) విశ్వాసం కారణంగా జైలుకు వెళ్లిన ఆర్టెమ్ అనే బ్రదర్ అనుభవాన్ని గమనించండి. విచారణ పేరుతో ఒక అధికారి దురుసుగా ప్రవర్తించి ఆయన్ని చిత్రహింసలు పెట్టేవాడు. ఆర్టెమ్ ఇలా అంటున్నాడు: “నన్ను విచారణకు పిలుస్తున్నారంటే చెమటలు పట్టేసేవి. . . . నేను ఎప్పుడూ యెహోవాకు ప్రార్థించేవాణ్ణి. తెలివి కోసం, మనశ్శాంతి కోసం అడిగేవాణ్ణి. ఆ అధికారి అంత చిత్రహింసలు పెట్టినా యెహోవా సహాయంతో నేను ప్రశాంతంగా ఉండగలిగాను. . . . యెహోవా ఒక రాతిగోడలా ఉంటే నేను ఆయన వెనక దాక్కున్నట్టు అనిపించింది.”
6. యెహోవా మీద మనం ఎందుకు ఎప్పటికీ ఆధారపడవచ్చు? (యెషయా 26:3, 4)
6 యెహోవా నమ్మకస్థుడిగా ఉంటాడు. ఒక బండరాయి కదలకుండా ఉన్నట్టే యెహోవా కూడా మనకోసం ఎప్పుడూ ఉంటాడు. ఆయన ‘నిత్య బండరాయిలా’ ఉంటాడు కాబట్టి ఆయన్ని మనం నమ్మవచ్చు. (యెషయా 26:3, 4 చదవండి.) తన మాట నిలబెట్టుకోవడానికి, మన ప్రార్థనలు వినడానికి, అవసరమైనప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సజీవంగా ఉంటాడు. తనను ఆరాధించేవాళ్లకు ఆయన విశ్వసనీయంగా ఉంటాడు కాబట్టి మనం ఆయనపై ఆధారపడవచ్చు. (2 సమూ. 22:26) అంతేకాదు, మనం చేసే దాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోడు. అలాగే ఆయన ఎప్పుడూ ప్రతిఫలం ఇస్తాడు.—హెబ్రీ. 6:10; 11:6.
7. యెహోవా మీద ఆధారపడితే మనం ఏం రుచి చూస్తాం? (చిత్రం కూడా చూడండి.)
7 యెహోవా మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు మనం ఆయన్ని మన బండరాయిలా చేసుకోవచ్చు. కష్టమైన పరిస్థితుల్లోనైనా సరే ఆయన మాట వింటేనే మనకు ప్రయోజనం అని మనం నమ్ముతాం. (యెష. 48:17, 18) ఆయన సహాయాన్ని రుచి చూసినప్పుడల్లా ఆయన మీద మన నమ్మకం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఏ కష్టమైన పరిస్థితి వచ్చినాసరే దాన్ని గట్టెక్కడానికి యెహోవా మాత్రమే సహాయం చేయగలడని మనం గట్టిగా నమ్ముతాం. ఎవ్వరూ సహాయం చేయలేరని అనిపించిన సందర్భాల్లో కూడా యెహోవా మీద ఆధారపడవచ్చని మనం గుర్తిస్తాం. వ్లాడిమిర్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “నన్ను నిర్బంధ కేంద్రంలో ఉంచినప్పుడు యెహోవాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అక్కడ నేను ఒక్కడినే ఉండేవాణ్ణి, అయోమయంగా ఉండేది కాబట్టి ఆయన్ని ఎక్కువగా నమ్మడం నేర్చుకున్నాను.”
8. (ఎ) యెహోవా మారకుండా స్థిరంగా ఉంటాడని మనం ఎందుకు చెప్పవచ్చు? (బి) దేవుణ్ణి మన బండరాయిలా చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? (కీర్తన 62:6, 7)
8 యెహోవా స్థిరంగా ఉంటాడు. ఒక పెద్ద బండరాయిలా యెహోవా స్థిరంగా, మారకుండా ఉంటాడు. యెహోవా తన వ్యక్తిత్వాన్ని, తన సంకల్పాన్ని ఎప్పుడూ మార్చుకోడు. (మలా. 3:6) ఏదెను తోటలో ఆదాముహవ్వలు తనకు ఎదురుతిరిగినప్పటికీ మనుషుల విషయంలో ఆయన తన సంకల్పాన్ని మార్చుకోలేదు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు, యెహోవా “తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.” (2 తిమో. 2:13) అంటే ఏం జరిగినా లేదా వేరేవాళ్లు ఏం చేసినా యెహోవా తన లక్షణాల్ని, తన సంకల్పాన్ని లేదా తన ప్రమాణాల్ని అస్సలు మార్చుకోడు. యెహోవా ఎప్పుడూ మారడు కాబట్టి కష్టమైన పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తాడని, భవిష్యత్తు గురించి ఆయనిచ్చిన మాటను నిలబెట్టుకుంటాడని మనం ఆశతో ఉండవచ్చు.—కీర్తన 62:6, 7 చదవండి.
9. టాత్యాన అనుభవం నుండి మీరు ఏం నేర్చుకున్నారు?
9 యెహోవా లక్షణాల గురించి, ఆయన సంకల్పం గురించి లోతుగా ఆలోచించినప్పుడు ఆయన్ని మన బండరాయిలా చేసుకోగలుగుతాం. అలా చేస్తే కష్టాలు వచ్చినప్పుడు మన మనసు అటుఇటు ఊగిసలాడకుండా ఉంటుంది. (కీర్త. 16:8) సిస్టర్ టాత్యాన విషయంలో అదే జరిగింది. ఆమెను తన విశ్వాసం కారణంగా గృహనిర్బంధంలో ఉంచారు. ఆమె ఇలా చెప్తుంది: “నా చుట్టూ ఎవ్వరూ లేక నేను ఒంటరి అయిపోయాను. మొదట్లో అది చాలా కష్టంగా అనిపించింది. నేను డీలా పడిపోతూ ఉండేదాన్ని.” అయితే ఆమె తన కష్టానికి అలాగే యెహోవాకు, ఆయన సంకల్పానికి మధ్యవున్న సంబంధం గురించి ఆలోచించినప్పుడు దాన్ని తట్టుకోగలిగింది. ప్రశాంతంగా, ధైర్యంగా ఉండగలిగింది. ఆమె ఇలా చెప్తుంది: “ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆలోచించినప్పుడు, నేను యెహోవా కోసమే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అనే విషయాన్ని అర్థం చేసుకున్నాను. దానివల్ల నా గురించి నేను అతిగా ఆలోచించకుండా ఉండగలిగాను.”
10. యెహోవా ఇప్పుడు మన బండరాయిలా ఎలా ఉంటాడు?
10 ముందుముందు ఎప్పుడూ లేనంతగా యెహోవా మీద ఆధారపడాల్సినన్ని కష్టాలు మనకు వస్తాయి. కాబట్టి వాటిని నమ్మకంగా తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడనే నమ్మకాన్ని బలపర్చుకోవడానికి ఇదే సమయం. దానికోసం ఏం చేయవచ్చు? బైబిలు వృత్తాంతాల్ని అలాగే మనకాలంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్ అనుభవాల్ని చదవండి. తన సేవకుల్ని కాపాడడానికి యెహోవా ఎలా ఒక బండరాయిలా ఉన్నాడో, ఎలాంటి లక్షణాల్ని చూపించాడో గమనించండి. ఆ వృత్తాంతాల గురించి లోతుగా ఆలోచించండి. అలా చేసినప్పుడు యెహోవాను మీ బండరాయిగా చేసుకోగలుగుతారు.
యెహోవాకున్న బండరాయి లాంటి లక్షణాల్ని చూపించండి
11. యెహోవాకు ఉన్న బండరాయి లాంటి లక్షణాల్ని మనం ఎందుకు చూపించాలి? (“ యువ సహోదరులకు ఒక లక్ష్యం” అనే బాక్స్ కూడా చూడండి.)
11 ఇప్పటివరకు యెహోవాకు ఉన్న లక్షణాల్ని బట్టి ఆయన ఎలా ఒక బండరాయిలా ఉన్నాడో పరిశీలించాం. ఇప్పుడు ఆయనకున్న బండరాయి లాంటి లక్షణాల్ని మనం ఎలా చూపించవచ్చో పరిశీలిద్దాం. మనం ఆ లక్షణాల్ని ఎంతగా చూపిస్తే సంఘాన్ని అంతగా బలపర్చిన వాళ్లమౌతాం. ఉదాహరణకు, యేసు సీమోనుకు కేఫా అనే పేరు పెట్టాడు (దాన్ని అనువదిస్తే, “పేతురు”), అంటే “రాయి” అని అర్థం. (యోహా. 1:42) పేతురు సంఘంలో ఉన్నవాళ్లను ఓదార్చేలా, వాళ్ల విశ్వాసాన్ని స్థిరపరిచేలా తయారౌతాడని సూచిస్తుంది. సంఘపెద్దలు కూడా ‘పెద్ద బండ నీడలా ఉన్నారు’ అని బైబిలు చెప్తుంది. వాళ్లు సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎంతలా కాపాడతారో ఆ పదచిత్రం చూపిస్తుంది. (యెష. 32:2) నిజమే, సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్ అందరూ యెహోవాకున్న బండరాయి లాంటి లక్షణాల్ని చూపిస్తే సంఘం కళకళలాడుతుంది.—ఎఫె. 5:1.
12. మనం ఇతరులకు ఒక ఆశ్రయంగా ఎలా ఉండవచ్చు?
12 ఆశ్రయంగా ఉండండి. కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు, అల్లర్లు లేదా యుద్ధం లాంటివి జరిగినప్పుడు మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి నిజంగానే ఆశ్రయం ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ “చివరి రోజుల్లో” పరిస్థితులు రోజురోజుకు ఘోరంగా తయారౌతున్నప్పుడు ఒకరికొకరు చేయి అందించుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. (2 తిమో. 3:1) అంతేకాదు మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఊరటను, ప్రశాంతతను కూడా మనం ఇవ్వొచ్చు. అలా చేయడానికి ఒక విధానం ఏంటంటే, వాళ్లు మీటింగ్స్‌కి వచ్చినప్పుడు వాళ్లను ఆప్యాయంగా పలకరించి, కష్ట-సుఖాలు అడిగి తెలుసుకోవచ్చు. అలా చేస్తే సంఘం ప్రేమానురాగాలకు నెలవుగా ఉంటుంది. ఈ లోకంలో జీవితం చాలా కఠినంగా, నిర్దయగా, భారంగా ఉంటుంది. కాబట్టి మన బ్రదర్స్‌సిస్టర్స్ మీటింగ్స్‌కి వచ్చినప్పుడు వాళ్ల భారమంతా దిగిపోయేలా, వాళ్ల మనసుకు హాయిగా ఉండేలా, వాళ్లను ప్రేమించేవాళ్లు ఉన్నారని అనిపించేలా చేయడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.
13. పెద్దలు సంఘంలో వాళ్లకు ఎలా ఆశ్రయంగా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
13 సంఘంలో ఉన్నవాళ్లకు నిజమైన తుఫాను వచ్చినా లేదా తుఫాను లాంటి కష్టాలు వచ్చినా సంఘపెద్దలు ఒక ఆశ్రయంగా ఉండవచ్చు. ఏదైనా విపత్తు జరిగినప్పుడు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, బ్రదర్స్‌సిస్టర్స్‌కి కావాల్సిన సహాయం చేయడానికి సంఘపెద్దలు వెంటనే ఏర్పాట్లు చేస్తారు. అంతేకాదు వాళ్లు బైబిలు ఆధారంగా నిర్దేశాన్ని, ప్రోత్సాహాన్ని కూడా ఇస్తారు. దయగా మాట్లాడే, శ్రద్ధగా వినే, అర్థం చేసుకునే మనసున్న సంఘపెద్దలకు సమస్యలు చెప్పుకోవడానికి బ్రదర్స్‌సిస్టర్స్ ఇష్టపడతారు. అలాంటి లక్షణాలు ఉంటే పెద్దలకు తమ మీద ప్రేమ ఉందని బ్రదర్స్‌సిస్టర్స్‌కి అనిపిస్తుంది. అప్పుడు పెద్దలు బైబిలు ఆధారంగా ఇచ్చే నిర్దేశాన్ని పాటించడం వాళ్లకు తేలికౌతుంది.—1 థెస్స. 2:7, 8, 11.
14. మనం నమ్మకస్థులమని ఎలా చూపించవచ్చు?
14 నమ్మకస్థులుగా ఉండండి. ఇతరులు మనల్ని నమ్మాలని, ముఖ్యంగా కష్టమైన సమయాల్లో మనల్ని నమ్మాలని కోరుకుంటాం. (సామె. 17:17) మరి మనం నమ్మకస్థులుగా పేరు సంపాదించుకోవడానికి ఏం చేయవచ్చు? మనం ఎప్పుడూ దేవుని లాంటి లక్షణాల్ని చూపించడానికి చూడాలి. ఉదాహరణకు మనం ఏదైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి, అన్నీ టైమ్‌కి చేయాలి. (మత్త. 5:37) అంతేకాదు, అవసరంలో ఉన్నవాళ్లకు మాటల వరకే కాకుండా మన పనుల్లో కూడా సహాయం చేయాలి. దాంతోపాటు, మనకున్న నియామకాల్ని సంస్థ ఇచ్చే నిర్దేశాల ప్రకారంగా చేయాలి.
15. నమ్మకస్థులైన సంఘపెద్దలు సంఘానికి ఓ వరమని ఎందుకు చెప్పవచ్చు?
15 నమ్మకస్థులైన సంఘపెద్దలు సంఘానికి ఒక వరం. అలాగని ఎలా చెప్పవచ్చు? తమకు అవసరమైనప్పుడు సంఘపెద్దలకు కాల్ చేయవచ్చు అని బ్రదర్స్‌సిస్టర్స్‌కి తెలిస్తే వాళ్లకు అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సంఘపెద్దలు తమకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారని ప్రచారకులకు అర్థమైతే తమను పట్టించుకునేవాళ్లు ఉన్నారని వాళ్లకు తెలుస్తుంది. అంతేకాదు, సంఘపెద్దలు సొంత అభిప్రాయాలు కాకుండా బైబిలు ఆధారంగా, నమ్మకమైన దాసుడు ఇచ్చే ప్రచురణల ఆధారంగా సలహా ఇచ్చినప్పుడు సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్ వాళ్లను నమ్మగలుగుతారు. అలాగే వ్యక్తిగత విషయాల్ని గోప్యంగా ఉంచే, మాట మీద నిలబడే సంఘపెద్దల్ని బ్రదర్స్‌సిస్టర్స్ ఇంకా ఎక్కువ నమ్మగలుగుతారు.
16. మనం స్థిరంగా ఉన్నప్పుడు మనకు అలాగే ఇతరులకు ఏంటి ఉపయోగం?
16 స్థిరంగా ఉండండి. సరైంది చేసే విషయంలో మనం స్థిరంగా ఉన్నప్పుడు, బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇతరులు మనల్ని చూసి నేర్చుకోగలుగుతారు. మనం బైబిల్ని అధ్యయనం చేసి, యెహోవా మీద విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు ఆయనకు, ఆయన ప్రమాణాలకు కట్టుబడి ఉంటాం. ఈ లోకంలో ఉన్న ఆలోచనలకు, తప్పుడు బోధలకు త్వరగా పడిపోకుండా ఉంటాం. అలాగే, నిర్ణయాలు తీసుకోవడానికి అటూఇటూ ఊగిసలాడం. (ఎఫె. 4:14; యాకో. 1:6-8) యెహోవా మీద, ఆయన ఇచ్చిన మాట మీద మనకున్న విశ్వాసం వల్ల “చెడ్డవార్తకు” భయపడం. (కీర్త. 112:7, 8) అంతేకాదు, కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్లకు సహాయం కూడా చేస్తాం.—1 థెస్స. 3:2, 3.
17. బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయాలంటే సంఘపెద్దలు ఎలా ఉండాలి?
17 సంఘపెద్దలు అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, మంచి వివేచన చూపించాలి, పద్ధతిగా నడుచుకోవాలి, అర్థం చేసుకునే వాళ్లుగా ఉండాలి. అలాంటి సంఘపెద్దలు కష్టాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండేలా, యెహోవా మీద బలమైన విశ్వాసం చూపించేలా ఇతరులకు సహాయం చేస్తారు. అలాగే వాళ్లు ‘నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా అంటిపెట్టుకోవడం’ వల్ల సంఘాన్ని బలపరుస్తారు. (తీతు 1:9; 1 తిమో. 3:1-3) ప్రచారకులు క్రమంగా మీటింగ్స్‌కి-ప్రీచింగ్‌కి వచ్చేలా, క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేసేలా సంఘపెద్దలు తమ ఆదర్శం ద్వారా, కాపరి సందర్శనాల ద్వారా సహాయం చేస్తారు. గుండెల్లో గుబులు పుట్టించే లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా మీద, ఆయన మాటిచ్చిన వాటిమీద మనసు పెట్టమని బ్రదర్స్‌సిస్టర్స్‌ని పెద్దలు ప్రోత్సహించగలుగుతారు.
18. మనం ఎందుకు యెహోవాను స్తుతించాలని అనుకుంటాం? ఎందుకు ఆయనకు దగ్గరవ్వాలని అనుకుంటాం? (“ యెహోవాకు దగ్గరవ్వడానికి ఒక మార్గం” అనే బాక్స్ కూడా చూడండి.)
18 యెహోవా అద్భుతమైన లక్షణాల్ని పరిశీలించిన తర్వాత, మనం కూడా దావీదు రాజులాగే ఇలా అనగలం: “నా బండరాయి అయిన యెహోవా స్తుతించబడాలి.” (కీర్త. 144:1, అధస్సూచి.) యెహోవా మన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయడు. మనం ముసలివాళ్లమైన తర్వాత కూడా తనకు దగ్గరగా ఉండడానికి యెహోవా సహాయం చేస్తూనే ఉంటాడనే నమ్మకంతో ఇలా చెప్తాం: “ఆయనే నా బండరాయి.”—కీర్త. 92:14, 15, అధస్సూచి.
పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి
a చిత్రం వివరణలు: రాజ్యమందిరంలో ఒక సిస్టర్ ఇద్దరు సంఘపెద్దలతో మనసువిప్పి మాట్లాడుతుంది.