కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 24

పాట 24 యెహోవా పర్వతానికి రండి

ఎప్పటికీ యెహోవా అతిథులుగా ఉండండి!

ఎప్పటికీ యెహోవా అతిథులుగా ఉండండి!

“యెహోవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు?”కీర్త. 15:1.

ముఖ్యాంశం

మనం యెహోవాకు ఎప్పటికీ స్నేహితులుగా ఉండాలంటే ఏం చేయాలో అలాగే తన స్నేహితులతో మనం ఎలా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడో చూస్తాం.

1. కీర్తన 15:1-5 మనకు ఎలా సహాయం చేస్తుంది?

 యెహోవాకు సమర్పించుకుని, ఆయనతో దగ్గరి స్నేహం చేస్తే మనం ఆయనకు అతిథులుగా ఉండొచ్చని మొదటి ఆర్టికల్‌లో చూశాం. కానీ, మనం ఎప్పటికీ ఆయనకు అతిథులుగా ఉండాలంటే ఏం చేయాలి? దీనిగురించి 15వ కీర్తన చెప్తుంది. (కీర్తన 15:1-5 చదవండి.) ఆయనతో దగ్గరి స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి సహాయం చేసే ముఖ్యమైన పాఠాలు ఇందులో ఉన్నాయి.

2. యెహోవా గుడారం అన్నప్పుడు కీర్తనకర్తయైన దావీదు మనసులో ఏం ఉండవచ్చు?

2 15వ కీర్తన ఈ ప్రశ్నలతో మొదలౌతుంది: “యెహోవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?” (కీర్త. 15:1) యెహోవా “గుడారం” అన్నప్పుడు కీర్తనకర్తయైన దావీదు మనసులో ఏం ఉండొచ్చు? కొంతకాలంపాటు గిబియోనులో ఉన్న ఒప్పంద మందసం ఆయన మనసులో ఉందేమో. తర్వాత దావీదు “పవిత్ర పర్వతం” అన్నప్పుడు ఆయన మనసులో ఏం ఉండవచ్చు? బహుశా యెరూషలేములో ఉన్న సీయోను పర్వతం ఆయన మనసులో ఉందేమో. అక్కడే అంటే గిబియోనుకు దక్షిణాన దాదాపు 10 కి.మీ. దూరంలో దావీదు ఒక డేరాను వేయించాడు. ఆలయాన్ని కట్టేవరకు ఒప్పంద మందసాన్ని అక్కడే ఉంచారు.—2 సమూ. 6:17.

3. 15వ కీర్తనలో ఏం చూస్తాం? (చిత్రం కూడా చూడండి.)

3 అయితే, చాలామంది ఇశ్రాయేలీయులకు గుడారంలో సేవచేసే అవకాశం ఉండేదికాదు. అలాగే వాళ్లు ఒప్పంద మందసాన్ని కూడా ఎన్నడూ చూసి ఉండరు. కానీ యెహోవాకు స్నేహితులై, ఆ స్నేహాన్ని కొనసాగించే నమ్మకమైన సేవకులందరూ సూచనార్థక గుడారంలో అతిథులుగా ఉండవచ్చు. అలా అతిథులుగా ఉండాలని మనమందరం కోరుకుంటాం. యెహోవాకు ఎప్పటికీ స్నేహితులుగా ఉండాలంటే మనం పెంచుకోవాల్సిన లక్షణాల గురించి 15వ కీర్తనలో చూస్తాం.

యెహోవా గుడారంలో అతిథులుగా ఉండడం అంటే ఏంటో దావీదు కాలంలోని ఇశ్రాయేలీయులు తేలిగ్గా ఊహించుకోగలిగారు (3వ పేరా చూడండి)


మచ్చలేకుండా జీవిస్తూ సరైనది చేస్తూ ఉండండి

4. యెహోవాకు అతిథులుగా ఉండాలంటే కేవలం బాప్తిస్మం తీసుకుంటే సరిపోదని ఎందుకు చెప్పవచ్చు? (యెషయా 48:1)

4 కీర్తన 15:2 లో దేవునికి స్నేహితునిగా ఉండే వ్యక్తి “మచ్చ లేకుండా జీవిస్తూ, సరైనది చేస్తూ” ఉంటాడని ఉంది. ఇక్కడ “జీవిస్తూ,” “చేస్తూ” అనే పదాలు ఎప్పటికీ జరిగే ఒక ప్రక్రియను సూచిస్తున్నాయి. కానీ మనం నిజంగానే ఏ ‘మచ్చ లేకుండా జీవించవచ్చా’? జీవించవచ్చు. మనుషులుగా మనం అపరిపూర్ణులమే అయినా, తనకు లోబడడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా దృష్టిలో మనం ‘మచ్చ లేకుండా జీవించినట్టే.’ మనం సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం దేవునితో మనం చేసే ప్రయాణానికి తొలి అడుగు మాత్రమే. బైబిలు కాలాల్లో ఒక వ్యక్తి ఇశ్రాయేలు జనాంగంలో పుట్టినంతమాత్రాన అతడు యెహోవాకు అతిథి అయిపోడని గమనించండి. కొంతమందైతే ఆయనకు ప్రార్థన చేశారు “కానీ సత్యంతో, నీతితో కాదు.” (యెషయా 48:1 చదవండి.) యెహోవాకు అతిథిగా ఉండాలని నిజాయితీగా కోరుకునే ఇశ్రాయేలీయులు దేవుడు తమ నుండి కోరేవాటిని తెలుసుకోవాలి, వాటిని పాటించాలి. అదేవిధంగా ఈరోజుల్లో కూడా దేవుని ఆమోదం మనకు ఉండాలంటే మనం బాప్తిస్మం తీసుకుని, సంఘంతో సహవసిస్తే సరిపోదు. మనం “సరైనది చేస్తూ” ఉండాలి. దానర్థం ఏంటి?

5. “మచ్చ లేకుండా జీవిస్తూ, సరైనది చేస్తూ” ఉండడం అంటే ఏంటి?

5 యెహోవా దృష్టిలో “మచ్చ లేకుండా జీవిస్తూ, సరైనది చేస్తూ” ఉండాలంటే రాజ్యమందిరంలో మీటింగ్స్‌కి క్రమంగా వెళ్లడం మాత్రమే సరిపోదు. (1 సమూ. 15:22) మన జీవితంలో ఏంచేసినా, ఆఖరికి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం దేవునికి లోబడుతున్నాం అని చూపించాలి. (సామె. 3:6; ప్రసం. 12:13, 14) చిన్నచిన్న విషయాల్లో కూడా మనం ఆయనకు లోబడడం చాలా ప్రాముఖ్యం. అలా చేసినప్పుడు మనం ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నామని చూపిస్తాం. అప్పుడు యెహోవా కూడా తిరిగి మనమీద చెప్పలేనంత ప్రేమను కుమ్మరిస్తాడు.—యోహా. 14:23; 1 యోహా. 5:3.

6. గతంలో మనం చేసిన పనులతో పాటు ఏది ప్రాముఖ్యమని హెబ్రీయులు 6:10-12 చెప్తున్నాయి?

6 మనం గతంలో చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా చాలా సంతోషిస్తాడు. అయితే, మనం గతంలో మంచిపనులు చేశాం కాబట్టి యెహోవా గుడారంలో ఇప్పుడు అతిథులుగా ఉంటామని చెప్పలేం. ఆ విషయం హెబ్రీయులు 6:10-12 లో స్పష్టం చేయబడింది. (చదవండి.) నిజమే, మనం గతంలో చేసిన మంచిపనుల్ని యెహోవా మర్చిపోడు. కానీ “అంతం వరకు” మనం పూర్ణశక్తితో తనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. “మనం అలసిపోకుండా” అలాచేస్తే యెహోవా మనకు శాశ్వతకాలం స్నేహితునిగా ఉంటాడు.—గల. 6:9.

హృదయంలో సత్యాన్ని మాట్లాడండి

7. హృదయంలో సత్యాన్ని మాట్లాడడం అంటే ఏంటి?

7 యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలనుకునే వ్యక్తి ‘తన హృదయంలో సత్యాన్ని మాట్లాడతాడు.’ (కీర్త. 15:2) అంటే అతను అబద్ధాలు చెప్పకపోవడమే కాదు. అతను చేసే ప్రతీ పనిలో, మాట్లాడే ప్రతీ మాటలో నిజాయితీ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీ. 13:18) ఇది చాలా ప్రాముఖ్యం. “ఎందుకంటే, కపట బుద్ధి గలవాళ్లు యెహోవాకు అసహ్యం, నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు.”—సామె. 3:32.

8. మనం ఎలా ఉండకూడదు?

8 “హృదయంలో సత్యాన్ని మాట్లాడే వ్యక్తి” నలుగురిలో ఉన్నప్పుడు దేవుని నియమాల్ని పాటిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని మీరడు. (యెష. 29:13) అతను కపట బుద్ధితో పనులు చేయడు. కపట బుద్ధిగల వ్యక్తి యెహోవా నియమాలు అప్పుడప్పుడు తనకు సరిపోవు అనుకోవచ్చు. (యాకో. 1:5-8) చిన్నచిన్న విషయాల్లో వాటిని అతను పాటించకపోవచ్చు. ఆ తర్వాత అతను చేసే తప్పులకు శిక్ష పడకపోవడం వల్ల ఇంకా పెద్దపెద్ద విషయాల్లో దేవుని నియమాల్ని మీరే అవకాశం ఉంది. అప్పుడు అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని అనుకున్నా యెహోవా మాత్రం అతని ఆరాధనను అంగీకరించడు. (ప్రసం. 8:11) కానీ మనం ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలనుకుంటాం.

9. యేసు నతనయేలును మొట్టమొదటిసారి కలిసినప్పుడు అన్న మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

9 హృదయంలో నిజాయితీగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవడానికి యేసు నతనయేలును మొట్టమొదటిసారి కలిసిన సందర్భాన్ని గమనించండి. ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలును యేసుకు పరిచయం చేశాడు. యేసు అంతకుముందు ఎప్పుడూ నతనయేలును కలవకపోయినా ఇలా అన్నాడు: “ఇదిగో, ఇతను ఏ కపటమూ లేని నిజమైన ఇశ్రాయేలీయుడు.” (యోహా. 1:47) నిజమే తన మిగతా శిష్యులు నిజాయితీపరులని యేసుకు తెలుసు. కానీ నతనయేలు ఇంకా ఎక్కువ నిజాయితీపరుడని ఆయన అన్నాడు. నతనయేలు మనలాగే అపరిపూర్ణుడు. కానీ అతనిలో ఏ కపటం లేకుండా అన్ని విషయాల్లో నిజాయితీగా ఉన్నాడు. అది యేసుకు బాగా నచ్చి ఆయన్ని మెచ్చుకున్నాడు. మన గురించి కూడా యేసు అలా అనాలని కోరుకుంటాం కదా!

ఏ కపటమూ లేని తన స్నేహితుడైన నతనయేలును ఫిలిప్పు యేసుకు పరిచయం చేశాడు. మన గురించి కూడా ఎవరైనా అలా చెప్పగలరా? (9వ పేరా చూడండి)


10. మన నాలుకను మనం ఎందుకు సరిగ్గా ఉపయోగించాలి? (యాకోబు 1:26)

10 15వ కీర్తనలో ఉన్న చాలా విషయాలు మనం ఇతరులతో ఎలా ఉండాలనే దానిగురించి చెప్తున్నాయి. యెహోవా గుడారంలో అతిథిగా ఉండాలనుకునే వ్యక్తి “తన నాలుకతో లేనిపోనివి కల్పించి చెప్పడు, తన పొరుగువానికి ఏ కీడూ చేయడు, తన స్నేహితుల పేరు చెడగొట్టడు” అని కీర్తన 15:3 లో ఉంది. కాబట్టి మన నాలుకను సరిగ్గా ఉపయోగించకపోతే ఇతరులకు చాలా హాని చేస్తాం. యెహోవా గుడారంలో అతిథులుగా ఉండే అర్హత కోల్పోతాం.—యాకోబు 1:26 చదవండి.

11. లేనిపోనివి కల్పించి చెప్పడం అంటే ఏంటి? సంఘంలో అలాంటి పనులు చేసే వాళ్లకు ఏం జరుగుతుంది?

11 లేనిపోనివి కల్పించి చెప్పడం గురించి కీర్తనకర్త ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇంతకీ లేనిపోనివి కల్పించి చెప్పడం అంటే ఏంటి? సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్న మంచిపేరును పాడుచేయడానికి చెప్పే అబద్ధాలను అది సూచిస్తుంది. పశ్చాత్తాపం చూపించకుండా అలాంటి పనులు చేసేవాళ్లను సంఘం నుండి బహిష్కరిస్తారు.—యిర్మీ. 17:10.

12-13. ఎలాంటి సందర్భాల్లో మనకు తెలీకుండానే మన స్నేహితుల మంచి పేరును పాడుచేసే అవకాశం ఉంది? (చిత్రం కూడా చూడండి.)

12 యెహోవాకు అతిథిగా ఉండే వ్యక్తి, “తన పొరుగువానికి ఏ కీడూ చేయడు, తన స్నేహితుల పేరు చెడగొట్టడు” అని కూడా కీర్తన 15:3 గుర్తుచేస్తుంది. దానర్థం ఏంటి?

13 ఒక వ్యక్తికి సంబంధించిన విషయాల్ని వ్యాప్తి చేయడంవల్ల మనం తెలీకుండానే అతనికున్న మంచిపేరును పాడుచేసే అవకాశం ఉంది. ఉదాహరణకు: (1) ఒక సిస్టర్‌ పయినీరు సేవను ఆపేసి ఉండవచ్చు, (2) ఒక జంట బెతెల్‌ సేవను ఆపేసి ఉండవచ్చు, (3) ఒక సహోదరుడు సంఘపెద్దగా గానీ సంఘ పరిచారకునిగా గానీ తొలగించబడి ఉండవచ్చు. ఇలా ఎందుకు జరిగిందా అని వాటిగురించి ఏవేవో ఊహించుకుని, వేరేవాళ్లకు చెప్పడం సరైనదే అంటారా? బహుశా అలాంటి మార్పులు జరగడం వెనుక మనకు తెలియని కొన్ని కారణాలు ఉండవచ్చు. అంతేకాకుండా, యెహోవా గుడారంలో అతిథిగా ఉండే వ్యక్తి “తన పొరుగువానికి ఏ కీడూ చేయడు, తన స్నేహితుల పేరు చెడగొట్టడు.”

ఇతరుల విషయాల్ని వ్యాప్తి చేస్తే మనం లేనిపోనివి కల్పించి చెప్పే ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టే (12-13 పేరాలు చూడండి)


యెహోవాకు భయపడేవాళ్లను ఘనపర్చండి

14. యెహోవాకు అతిథులుగా ఉండేవాళ్లు ‘నీచుల్ని’ ఎలా చూస్తారో వివరించండి.

14 యెహోవాకు స్నేహితునిగా ఉండే వ్యక్తికి “నీచుడంటే అసహ్యం” అని కీర్తన 15:4 చెప్తుంది. అయితే ఒక వ్యక్తి నీచుడని మన సొంత అభిప్రాయాన్నిబట్టి గానీ ఇష్టాయిష్టాల్ని బట్టి గానీ చెప్పలేం. ఎందుకు? ఎందుకంటే మనం అపరిపూర్ణులం. కాబట్టి మనకు ఇష్టమైనవాళ్లను దగ్గరకు తీసుకుంటాం, ఇష్టంలేనివాళ్లను దూరం పెడతాం. అందుకే, యెహోవా ఎవరినైతే ‘నీచునిగా’ చూస్తాడో వాళ్లను మనం దూరం పెట్టాలి. (1 కొరిం. 5:11) అంటే పశ్చాత్తాపం చూపించకుండా ఎవరైతే చెడ్డపనులు చేస్తారో, మన నమ్మకాల్ని గౌరవించరో, మన ఆధ్యాత్మికతను తగ్గించడానికి చూస్తారో వాళ్లను మనం దూరం పెట్టాలి.—సామె. 13:20.

15. “యెహోవాకు భయపడేవాళ్లను” ఘనపర్చే ఒక విధానం ఏంటి?

15 అంతేకాదు, “యెహోవాకు భయపడేవాళ్లను” ఘనపర్చాలని కీర్తన 15:4 చెప్తుంది. కాబట్టి యెహోవా స్నేహితుల మీద దయ చూపించడానికి, గౌరవం చూపించడానికి అవకాశాల కోసం మనం చూస్తాం. (రోమా. 12:10) ఎలా? ఒక విధానం ఏంటంటే, యెహోవా గుడారంలో అతిథిగా ఉండే వ్యక్తి “నష్టం కలిగినా, అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు” అని కీర్తన 15:4 చెప్తుంది. మనం ఇచ్చిన మాటను తప్పితే, ఎదుటివ్యక్తిని బాధ పెట్టినవాళ్లమౌతాం. (మత్త. 5:37) ఉదాహరణకు, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని యెహోవా ఆశిస్తున్నాడు. అంతేకాదు, అమ్మానాన్నలు పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే యెహోవా సంతోషిస్తాడు. దేవుని మీద, పొరుగువాళ్ల మీద ప్రేమ ఉంటే మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాం.

16. యెహోవా స్నేహితుల్ని ఘనపర్చే ఇంకో విధానం ఏంటి?

16 దేవుని స్నేహితుల్ని ఘనపర్చే ఇంకో విధానం ఏంటంటే, ఆతిథ్యం ఇస్తూ ఉదారస్ఫూర్తి చూపించడం. (రోమా. 12:13) మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో మీటింగ్‌లో, ప్రీచింగ్‌లోనే కాకుండా వేరే సమయాల్లో కూడా సమయం గడిపితే వాళ్లతో అలాగే యెహోవాతో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. అంతేకాదు, మనం ఆతిథ్యం ఇస్తే యెహోవాను అనుకరించినట్లే.

డబ్బు మోజులో పడకండి

17. 15వ కీర్తనలో డబ్బు గురించి ఎందుకుంది?

17 యెహోవా గుడారంలో అతిథిగా ఉండే వ్యక్తి “తన డబ్బును వడ్డీకి ఇవ్వడు, నిర్దోషులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు.” (కీర్త. 15:5) ఈ కీర్తనలో డబ్బు గురించి ఎందుకుంది? ఎందుకంటే, దాని మాయలో పడితే మనకు మనుషుల కన్నా, ఆఖరికి యెహోవా కన్నా డబ్బే ముఖ్యమైపోతుంది. (1 తిమో. 6:10) బైబిలు కాలాల్లో కొంతమంది తమ మధ్యున్న పేద బ్రదర్స్‌సిస్టర్స్‌కి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్లు. అంతేకాదు, కొంతమంది న్యాయాధిపతులు లంచాలు తీసుకుని, అమాయకుల్ని ఇరికించి అన్యాయంగా తీర్పుతీర్చేవాళ్లు. అలాంటి వాళ్లంటే యెహోవాకు కంపరం.—యెహె. 22:12.

18. డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో తెలుసుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవాలి? (హెబ్రీయులు 13:5)

18 డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవడం మంచిది. మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: ‘నా మనసంతా డబ్బు చుట్టూ తిరుగుతూ ఏ వస్తువులు కొనాలా అని ఆలోచిస్తుందా? నేను ఒకవేళ అప్పు తీసుకుంటే నాకు అప్పిచ్చిన వ్యక్తి దగ్గర చాలా డబ్బుందని, తిరిగి నిదానంగా ఇద్దాంలే అనుకుంటున్నానా? నా దగ్గర డబ్బు ఉండడం వల్ల వేరేవాళ్ల కంటే నేనే గొప్ప అనుకుంటున్నానా? ఇతరులకు ఏదైనా ఇవ్వడానికి నాకు మనసు రావట్లేదా? ఆస్తిపాస్తులు ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ అందరూ డబ్బు మనుషులే అనుకుంటున్నానా? డబ్బున్న వాళ్లతో స్నేహం చేస్తూ పేదవాళ్లను చిన్నచూపు చూస్తున్నానా?’ యెహోవాకు అతిథులుగా ఉండే గొప్ప అవకాశం మనకు వచ్చింది. కాబట్టి డబ్బు మీద మోజుతో ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. అప్పుడు యెహోవా కూడా మనల్ని ఎప్పుడూ వదులుకోడు.—హెబ్రీయులు 13:5 చదవండి.

తన స్నేహితులంటే యెహోవాకు ప్రాణం

19. 15వ కీర్తనలో ఉన్నవన్నీ మనం చేయాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

19 15వ కీర్తన ఈ మాటలతో ముగుస్తుంది: “అలాంటి వ్యక్తి ఎప్పటికీ కదిలించబడడు.” (కీర్త. 15:5) ఈ కీర్తనలో ఉన్నవన్నీ మనం చేయాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడో కీర్తనకర్త చెప్తున్నాడు. ఎందుకంటే యెహోవాకు మన సంతోషమే ముఖ్యం. అవన్నీ చేసినప్పుడు మన జీవితం బాగుంటుంది, మనకు కావల్సిన సంరక్షణను కూడా యెహోవా ఇస్తాడు.—యెష. 48:17.

20. యెహోవా అతిథులు దేనికోసం ఎదురుచూడవచ్చు?

20 యెహోవా అతిథులందరికీ బంగారు భవిష్యత్తు వేచివుంది. నమ్మకమైన అభిషిక్తులందరూ పరలోకంలో యేసుక్రీస్తు సిద్ధం చేసిన “చాలా నివాసాల్లో” చోటు సంపాదించుకుంటారు. (యోహా. 14:2) భూనిరీక్షణ ఉన్నవాళ్లు ప్రకటన 21:3 లో ఉన్న మాటలు నిజమవ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. అవును, యెహోవా గుడారంలో ఎప్పటికీ అతిథులుగా ఉండే గొప్ప అవకాశం దొరికినందుకు మన జీవితం ధన్యం అయ్యింది!

పాట 39 దేవుని ఎదుట మంచిపేరు సంపాదించుకుందాం