కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, రోజువారీ చట్టపరమైన తగాదాలను పరిష్కరించుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలోని సూత్రాలు ఉపయోగపడ్డాయా?

అవును, కొన్నిసార్లు ఉపయోగపడ్డాయి. ఒక ఉదాహరణ పరిశీలించండి. ద్వితీయోపదేశకాండము 24:14,15లో ఇలా ఉంది, “నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. . . . వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టునేమో అది నీకు పాపమగును.”

మట్టి పెంకు మీద రాసివున్న రైతు విన్నపం

క్రీ.పూ. 7వ శతాబ్దం నాటి ఒక రైతు, తాను ఎదుర్కొంటున్న సమస్యను గవర్నర్‌కు విన్నవిస్తూ రాయించుకున్న ఒక పత్రం అష్డోదు దగ్గర బయటపడింది. బహుశా, ఆ రైతు తాను ఇవ్వాల్సిన ధాన్యాన్ని ఇవ్వలేదనే ఆరోపణతో ఒక వ్యక్తి అతని వస్త్రాన్ని తీసేసుకొని ఉంటాడు. మట్టి పెంకు మీద రాసిన ఉన్న ఆ విన్నపంలో ఇలా ఉంది, “కొన్ని రోజుల క్రితం నీ సేవకుడు [విన్నవించుకుంటున్న రైతు] ధాన్యాన్ని నిల్వ చేసిన తర్వాత, షోబై కుమారుడైన హోసయాహూ వచ్చి నీ సేవకుని వస్త్రాన్ని తీసేసుకున్నాడు. . . . నేను చెప్పింది నిజమనడానికి, . . . ఎండలో నాతోపాటు పొలంపని చేసినవాళ్లంతా సాక్ష్యం. నేను ఏ తప్పూ చేయలేదు. . . . నీ సేవకుని వస్త్రాన్ని తిరిగి ఇప్పించడం తమ బాధ్యత కాదని గవర్నర్‌ గారికి అనిపించినా, నా మీద దయ చూపించి, నా వస్త్రాన్ని ఇప్పించండి! నీ సేవకుడు వస్త్రంలేక బాధపడుతుంటే మీరు మౌనంగా ఉండకూడదు.”

చరిత్రకారుడైన సైమన్‌ షామ ఇలా అంటున్నాడు: ఆ విన్నపాన్ని గమనిస్తే, “తన వస్త్రాన్ని తిరిగి పొందడానికి ఆ రైతు పడుతున్న ఆవేదన కనిపిస్తుంది. అంతేకాదు, పేదవాళ్లతో కఠినంగా ప్రవర్తించేవాళ్లకు విధించే శిక్ష గురించి బైబిల్లో ఉన్న నియమాలు; ముఖ్యంగా లేవీయకాండములో, ద్వితీయోపదేశకాండములో ఉన్న నియమాలు ఆ రైతుకు కాస్తోకూస్తో తెలుసని అర్థమౌతుంది.”