కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనుషుల్లో ఉన్న తేడా చూడండి

మనుషుల్లో ఉన్న తేడా చూడండి

“అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో . . . కనుగొందురు.”మలా. 3:18.

పాటలు: 127, 101

1, 2. నేడు దేవుని సేవకులకు జీవితం ఎందుకు కష్టంగా ఉండవచ్చు? (ప్రారంభ చిత్రాలు చూడండి.)

చాలామంది డాక్టర్లు, నర్సులు అంటువ్యాధులతో బాధపడేవాళ్లకు చికిత్స చేస్తుంటారు. రోగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్లపట్ల శ్రద్ధ చూపిస్తారు. కానీ రోగులకు ఉన్న అంటువ్యాధి తమకు సోకకుండా డాక్టర్లు, నర్సులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యెహోవా సేవకులమైన మనం కూడా ఆ డాక్టర్లు, నర్సులు ఉన్నలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే దేవుని లక్షణాలకు పూర్తి భిన్నమైన లక్షణాలు, ఆలోచనలు కలిగివున్న ప్రజలమధ్య మనం బ్రతుకుతున్నాం, పనిచేస్తున్నాం. దానివల్ల మన జీవితం కాస్త కష్టంగా ఉండవచ్చు.

2 ఈ చివరి రోజుల్లో దేవున్ని ప్రేమించని ప్రజలు, తప్పొప్పుల విషయంలో ఆయనకున్న ప్రమాణాలను పట్టించుకోవట్లేదు. వాళ్లలో ఉండే చెడు లక్షణాల గురించి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో ప్రస్తావించాడు. అంతం దగ్గరయ్యేకొద్దీ ఈ చెడు లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయని పౌలు చెప్పాడు. (2 తిమోతి 3:1-5, 13 చదవండి.) ఎటుచూసినా అలాంటి చెడు లక్షణాలు ఉన్న ప్రజలే కనిపించినప్పుడు మనం అవాక్కవుతాం. కానీ వాస్తవమేమిటంటే, వాళ్ల ఆలోచనలు, మాటలు, పనులు మనపై కూడా ప్రభావం చూపించవచ్చు. (సామె. 13:20) ఈ ఆర్టికల్‌లో లోకంలోని వాళ్లకున్న లక్షణాలకు, దేవుని ప్రజలకున్న లక్షణాలకు మధ్య తేడాను పరిశీలిస్తాం. అంతేకాదు ప్రజలకు యెహోవా గురించి నేర్పిస్తూనే, వాళ్ల చెడు లక్షణాల ప్రభావం మనమీద పడకుండా ఎలా జాగ్రత్తపడవచ్చో కూడా తెలుసుకుంటాం.

3. రెండవ తిమోతి 3:2-5⁠లో ఎలాంటి ప్రజల గురించి పౌలు ప్రస్తావించాడు?

3 “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు” ఉంటాయని చెప్పిన తర్వాత, మనకాలంలో సర్వసాధారణంగా కనిపించే 19 చెడు లక్షణాలను పౌలు ప్రస్తావించాడు. అవి రోమీయులు 1:29-31లో పౌలు ప్రస్తావించిన లక్షణాల్లాంటివే. కానీ తిమోతికి రాసిన ఉత్తరంలో ఆయన ప్రస్తావించిన పదాలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మరెక్కడా కనిపించవు. పౌలు ఆ చిట్టాను “ఇలాంటి మనుషులు ఉంటారు” అనే మాటలతో మొదలుపెట్టాడు. అయితే మనుషులందరికీ అలాంటి చెడు లక్షణాలు ఉండవు. ఎందుకంటే నిజక్రైస్తవులు పూర్తి భిన్నమైన లక్షణాలు కలిగివుంటారు.—మలాకీ 3:18 చదవండి.

మనగురించి మనం ఆలోచించుకునే విధానం

4. గర్వంతో ఉబ్బిపోవడమంటే ఏమిటి?

4 స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు చాలామంది ఉంటారని చెప్పిన తర్వాత గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు కూడా ఉంటారని పౌలు చెప్పాడు. ఈ లక్షణాలు ఉన్న ప్రజలు తమ సామర్థ్యాల్నిబట్టి, అందాన్నిబట్టి, డబ్బునుబట్టి, లేదా హోదానుబట్టి ఇతరుల కన్నా తామే గొప్పవాళ్లమని అనుకుంటారు. అందరూ తమనే గౌరవించాలని కోరుకుంటారు. అలాంటివ్యక్తి గురించి ఒక విద్వాంసుడు ఇలా రాశాడు, “అతని హృదయంలో ఒక చిన్న బలిపీఠం ఉంటుంది. అతను దాని ముందు నమస్కరిస్తూ తనను తాను ఆరాధించుకుంటాడు.” గర్వం ఎంత అసహ్యమైన లక్షణమంటే, వేరేవాళ్లు గర్వం చూపిస్తే గర్విష్ఠులకు కూడా నచ్చదని కొంతమంది చెప్పారు.

5. యెహోవాకు నమ్మకంగా సేవచేసినవాళ్లు కూడా ఎలా గర్వాన్ని చూపించారు?

5 యెహోవా గర్వాన్ని అసహ్యించుకుంటాడు. గర్వాన్ని బైబిలు “అహంకారదృష్టి” అని వర్ణిస్తుంది. (సామె. 6:16, 17) నిజానికి గర్వం ఉన్న వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. (కీర్త. 10:4) గర్వం అపవాది లక్షణం. (1 తిమో. 3:6) కానీ చేదు నిజమేమిటంటే, కొంతమంది యెహోవా నమ్మకమైన సేవకులు కూడా గర్వం చూపించారు. ఉదాహరణకు, యూదా రాజైన ఉజ్జియా యెహోవాకు ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా సేవచేశాడు. కానీ “అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము” చేశాడని బైబిలు చెప్తుంది. ఆ తర్వాత, దేవుని సేవకుడైన హిజ్కియా రాజు కూడా కొంతకాలంపాటు గర్వం చూపించాడు.—2 దిన. 26:16; 32:25, 26.

6. వేటివల్ల దావీదుకు గర్వం వచ్చే అవకాశం ఉంది? కానీ ఆయన వినయంగా ఎలా ఉండగలిగాడు?

6 కొంతమంది తమ అందాన్ని బట్టి, పేరు-ప్రఖ్యాతల్ని బట్టి, సంగీతంలో తమకున్న ప్రావీణ్యాన్ని బట్టి, తమ బలాన్ని బట్టి, లేదా ఇతరులు తమకిచ్చే గౌరవాన్ని బట్టి గర్వం చూపిస్తారు. దావీదుకు అవన్నీ ఉన్నప్పటికీ తన జీవితమంతా వినయంగా ఉన్నాడు. ఉదాహరణకు, దావీదు గొల్యాతును చంపిన తర్వాత, రాజైన సౌలు తన కూతుర్ని పెళ్లి చేసుకోమని దావీదును అడిగాడు. కానీ, “రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివి” అని దావీదు అన్నాడు. (1 సమూ. 18:18) అలా వినయంగా ఉండడానికి దావీదుకు ఏది సహాయం చేసింది? తనకున్న లక్షణాలు, సామర్థ్యాలు, సేవావకాశాలు అన్నీ దేవుడు వినయంగా తన మీద దృష్టి పెట్టడం వల్లే వచ్చాయని దావీదుకు తెలుసు. (కీర్త. 113:5-8) తన దగ్గరున్న మంచివన్నీ యెహోవాయే ఇచ్చాడని ఆయన గుర్తించాడు.—1 కొరిం. 4:7 పోల్చండి.

7. మనం వినయంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

7 నేడున్న యెహోవా సేవకులు దావీదులాగే వినయంగా ఉండడానికి కృషిచేస్తారు. విశ్వంలో అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న యెహోవాయే వినయాన్ని చూపిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో కదా! (కీర్త. 18:35) మనం ఈ మాటల్ని పాటిస్తాం, “వాత్సల్యంతో కూడిన ప్రేమను, కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును అలవర్చుకోండి.” (కొలొ. 3:12) అంతేకాదు ప్రేమ “గొప్పలు చెప్పుకోదు, గర్వంతో ఉబ్బిపోదు” అని మనకు తెలుసు. (1 కొరిం. 13:4) మనం వినయంగా ఉండడం ఇతరులు చూసినప్పుడు, వాళ్లు కూడా యెహోవాను తెలుసుకోవడానికి ఇష్టపడవచ్చు. క్రైస్తవ భార్య మంచి ప్రవర్తన చూసి యెహోవాసాక్షికాని భర్త ఎలాగైతే సత్యంలోకి వచ్చే అవకాశం ఉందో, అలాగే దేవుని సేవకుల వినయాన్ని చూసి ఇతరులు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంది.—1 పేతు. 3:1.

ఇతరులతో వ్యవహరించే విధానం

8. (ఎ) ఈరోజుల్లో అమ్మానాన్నలకు లోబడకపోవడాన్ని కొంతమంది ఎలా భావిస్తున్నారు? (బి) పిల్లలకు బైబిలు ఏమి చెప్తుంది?

8 చివరి రోజుల్లో ప్రజలు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారో పౌలు వివరించాడు. పిల్లలు అమ్మానాన్నలకు లోబడరని ఆయన రాశాడు. ఈరోజుల్లో అమ్మానాన్నలకు లోబడకపోవడం తప్పేమీ కాదన్నట్లు, అది సర్వసాధారణ విషయమన్నట్లు ఎన్నో పుస్తకాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూపిస్తున్నాయి. కానీ వాస్తవమేమిటంటే, కుటుంబం అనేది సమాజంలో చాలా ప్రాముఖ్యమైన భాగం, అవిధేయత వల్ల కుటుంబ బంధాలు బలహీనమౌతాయి. ఈ వాస్తవాన్ని మనుషులు ఎంతోకాలం క్రితమే గ్రహించారు. ఉదాహరణకు ప్రాచీన గ్రీసు దేశంలో, తల్లిదండ్రుల్ని కొట్టిన వ్యక్తి ఆ దేశ పౌరునిగా తనకున్న హక్కులన్నిటినీ కోల్పోయేవాడు. రోమా చట్టం ప్రకారం, తండ్రిని కొట్టిన వ్యక్తి హంతకునితో సమానం. హీబ్రూ అలాగే గ్రీకు లేఖనాలు, పిల్లలు తమ అమ్మానాన్నలకు లోబడాలని బోధిస్తున్నాయి.—నిర్గ. 20:12; ఎఫె. 6:1-3.

9. తమ అమ్మానాన్నలకు లోబడడానికి పిల్లలకు ఏది సహాయం చేస్తుంది?

9 తమ చుట్టూ ఉన్నవాళ్లు లోబడకపోయినా, తాము మాత్రం అమ్మానాన్నలకు లోబడడానికి పిల్లలకు ఏది సహాయం చేస్తుంది? అమ్మానాన్నలు తమ కోసం చేసిన మంచి పనులన్నిటి గురించి ఆలోచించినప్పుడు వాళ్లపట్ల పిల్లలకు కృతజ్ఞత పెరుగుతుంది, అలాగే వాళ్లకు లోబడాలనే కోరిక కలుగుతుంది. పిల్లలు అమ్మానాన్నలకు లోబడాలనేది మనందరి తండ్రైన యెహోవా కోరికని పిల్లలు అర్థంచేసుకోవాలి. పిల్లలు తమ అమ్మానాన్నల్లో ఉన్న మంచి విషయాల గురించి స్నేహితులకు చెప్పినప్పుడు, వాళ్లు కూడా తమ అమ్మానాన్నల్ని మరింతగా గౌరవించగలుగుతారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల మమకారం చూపించకపోతే, పిల్లలు వాళ్లకు లోబడడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అమ్మానాన్నలు తమను నిజంగా ప్రేమిస్తున్నారని పిల్లలకు అనిపించినప్పుడు, కష్టమైనాసరే వాళ్లు లోబడగలుగుతారు. అస్టన్‌ అనే యువ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నేను చేసిన తప్పును దాచిపెట్టాలని చూసేవాణ్ణి. కానీ మా అమ్మానాన్నలు నేను పాటించగలిగే నిర్దేశాలు ఇచ్చేవాళ్లు, ఫలానా నియమం ఎందుకు పెడుతున్నారో వివరించేవాళ్లు, వాళ్లతో ధైర్యంగా మాట్లాడగలిగే వాతావరణం కల్పించేవాళ్లు. వీటన్నిటి వల్ల నేను వాళ్లకు లోబడగలిగాను. వాళ్లు నాపట్ల చూపించే శ్రద్ధను గ్రహించగలిగాను, దానివల్ల వాళ్లను సంతోషపెట్టాలని కోరుకున్నాను.”

10, 11. (ఎ) ఒకరిపట్ల ఒకరికి ప్రేమ లేదని తెలియజేసే ఏ లక్షణాల్ని పౌలు ప్రస్తావించాడు? (బి) నిజక్రైస్తవులు “సాటిమనిషిని” ఎంతగా ప్రేమిస్తారు?

10 ఒకరిపట్ల ఒకరికి ప్రేమ లేదని తెలియజేసే ఇతర లక్షణాల్ని కూడా పౌలు ప్రస్తావించాడు. “అమ్మానాన్నలకు లోబడనివాళ్ల” గురించి ప్రస్తావించిన తర్వాత పౌలు కృతజ్ఞత లేనివాళ్ల గురించి చెప్పాడు. నిజమే కృతజ్ఞత లేనివాళ్లు, ఇతరులు తమకు చేసిన మంచిని గుర్తించరు. అంతేకాదు ప్రజలు నమ్మకంగా ఉండరని పౌలు చెప్పాడు. వాళ్లు మొండివాళ్లుగా ఉంటారు, అంటే ఇతరులతో రాజీపడడానికి ఏమాత్రం ఇష్టం చూపించరు. వాళ్లు దైవదూషణ, నమ్మకద్రోహం చేస్తారు అంటే ప్రజల్ని, చివరికి దేవున్ని కూడా దూషిస్తూ, కఠినంగా మాట్లాడతారు. లేనిపోనివి కల్పించి చెప్తారు అంటే ఇతరుల మంచిపేరును పాడుచేయడానికి పచ్చి అబద్ధాలు చెప్తారు. *

11 లోకంలోని చాలామందికి, యెహోవా సేవకులకు ఉన్న తేడా ఏమిటంటే, యెహోవా సేవకులు నిజమైన ప్రేమ చూపిస్తారు. అది నిజమని అనాదిగా రుజువౌతోంది. నిజానికి ధర్మశాస్త్రం అంతటిలో, సాటిమనిషిని ప్రేమించాలనేదే రెండవ అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (మత్త. 22:38, 39) అంతేకాదు, తమ మధ్య ఉన్న ప్రేమను బట్టే నిజ క్రైస్తవులు గుర్తించబడతారని యేసు చెప్పాడు. (యోహాను 13:34, 35 చదవండి.) నిజక్రైస్తవులు తమ శత్రువుల్ని సైతం ప్రేమిస్తారు.—మత్త. 5:43, 44.

12. యేసు ఇతరులపట్ల ఎలా ప్రేమ చూపించాడు?

12 ప్రజల మీద తనకు నిజంగా ప్రేమ ఉందని యేసు చూపించాడు. ఏవిధంగా? ఆయన ఒక నగరం నుండి మరో నగరానికి ప్రయాణిస్తూ దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించాడు. గుడ్డివాళ్లను, కుంటివాళ్లను, కుష్ఠు రోగులను, చెవిటివాళ్లను బాగుచేశాడు. అంతేకాదు చనిపోయినవాళ్లను బ్రతికించాడు. (లూకా 7:22) చాలామంది తనను ద్వేషించినా యేసు మాత్రం మనుషులందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమ చూపించే విషయంలో యేసు తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరించాడు. భూవ్యాప్తంగా, యెహోవాసాక్షులు సాటి మనుషులపట్ల అలాంటి ప్రేమనే చూపిస్తారు.

13. మనం చూపించే ప్రేమనుబట్టి ఇతరులు యెహోవాను ఎలా తెలుసుకోగలుగుతారు?

13 మనం ప్రజల్ని ప్రేమిస్తున్నామని చూపించినప్పుడు, వాళ్లు మన పరలోక తండ్రి గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. ఉదాహరణకు, ఒకాయన థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రాదేశిక సమావేశానికి హాజరయ్యాడు. అక్కడ సహోదరసహోదరీలు ఒకరిపట్ల ఒకరు చూపించుకునే ప్రేమకు ఆయన ముగ్ధుడయ్యాడు. ఇంటికి తిరిగొచ్చాక, తనతో వారానికి రెండుసార్లు బైబిలు అధ్యయనం చేయమని యెహోవాసాక్షుల్ని అడిగాడు. ఆ తర్వాత ఆయన తన బంధువులందరికీ మంచివార్త చెప్పాడు. ఆరు నెలలు తిరిగేసరికి ఆయన రాజ్యమందిరంలో బైబిలు పఠన నియామకాన్ని చేశాడు. కాబట్టి మనం కూడా ఇతరులపట్ల ప్రేమ చూపిస్తున్నామో లేదో పరిశీలించుకోవడానికి ఈ ప్రశ్నలు వేసుకోవాలి, ‘నా కుటుంబ సభ్యులకు, సంఘంలోని సహోదరసహోదరీలకు, పరిచర్యలో కలిసేవాళ్లకు సహాయం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నానా? ఇతరుల్ని యెహోవా చూసినట్లు చూస్తున్నానా?’

తోడేళ్లు, గొర్రెలు

14, 15. చాలామంది ఎలాంటి చెడు లక్షణాలు చూపిస్తున్నారు? కొంతమంది తమ వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకున్నారు?

14 చివరి రోజుల్లో, ప్రజలు చూపించే ఇతర చెడు లక్షణాలకు కూడా మనం దూరంగా ఉండాలి. ఉదాహరణకు, చాలామంది మంచిని ప్రేమించరు. వాళ్లు మంచిని ద్వేషించడమే కాకుండా వ్యతిరేకిస్తారు కూడా. అలాంటివాళ్లకు ఆత్మనిగ్రహం ఉండదు, క్రూరంగా ప్రవర్తిస్తారు. కొంతమందైతే మూర్ఖంగా ఉంటారు. వాళ్లు అనాలోచితంగా ప్రవర్తిస్తారు, తమ పనులవల్ల ఇతరులు ఎంత ఇబ్బందిపడతారో ఆలోచించరు.

15 క్రూర జంతువుల్లా ప్రవర్తించిన చాలామంది తమ వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారు. ఈ గొప్ప మార్పు గురించి బైబిలు ముందే చెప్పింది. (యెషయా 11:6, 7 చదవండి.) తోడేళ్లు, సింహాలు వంటి క్రూర జంతువులు; గొర్రెపిల్లలు, దూడలు వంటి సాధు జంతువులతో కలిసిమెలిసి ఉంటాయని ఆ ప్రవచనంలో చదువుతాం. అవి ఎందుకు శాంతిగా ఉంటాయి? ఎందుకంటే, “లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును” అని బైబిలు చెప్తుంది. (యెష. 11:9) జంతువులు యెహోవా గురించి నేర్చుకోలేవు, కాబట్టి ఈ ప్రవచనం కేవలం కొత్తలోకంలో జంతువులకు, మనుషులకు మధ్య ఉండే శాంతిని మాత్రమే సూచించట్లేదు. బదులుగా, చాలామంది ప్రజలు తమ వ్యక్తిత్వంలో చేసుకునే మార్పుల్ని కూడా సూచిస్తుంది.

బైబిలు ప్రమాణాలు జీవితాల్ని మారుస్తాయి! (16వ పేరా చూడండి)

16. ప్రజలు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేసింది?

16 మన సహోదరసహోదరీల్లో చాలామంది ఒకప్పుడు తోడేళ్లలా క్రూరంగా ప్రవర్తించారు, కానీ ఇప్పుడు శాంతిగా ఉంటున్నారు. అలాంటి అనుభవాలను jw.orgలో “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే శీర్షికతో వచ్చే ఆర్టికల్స్‌లో మీరు చదవవచ్చు. యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ను సేవించేవాళ్లు పైకి భక్తిగా ఉండి, దానికి తగ్గట్టు జీవించనివాళ్లలా ఉండరు. కొంతమంది దేవున్ని ఆరాధిస్తున్నట్లు నటిస్తారు, కానీ వాళ్ల ప్రవర్తన దానికి తగ్గట్టు ఉండదు. ఒకప్పుడు క్రూరంగా ప్రవర్తించిన చాలామంది ఇప్పుడు యెహోవా సేవకులయ్యారు. వాళ్లు “నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకున్నారు. (ఎఫె. 4:23, 24) ప్రజలు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రమాణాలు పాటించాలని వాళ్లు గుర్తిస్తారు. దానివల్ల తమ నమ్మకాల్లో, ఆలోచనల్లో, పనుల్లో మార్పులు చేసుకోగలుగుతారు. అలా మార్పులు చేసుకోవడం అంత సులభం కాదు. కానీ దేవున్ని నిజంగా సంతోషపెట్టాలని కోరుకునే ప్రజలకు ఆయన పవిత్రశక్తి సహాయం చేస్తుంది.

“అలాంటివాళ్లకు దూరంగా” ఉండండి

17. చెడు లక్షణాలు చూపించేవాళ్ల ప్రభావం మనమీద పడకూడదంటే ఏమి చేయాలి?

17 దేవున్ని సేవించేవాళ్లెవరో, సేవించనివాళ్లెవరో తెలుసుకోవడం ఈరోజుల్లో మరింత తేలికౌతుంది. దేవున్ని సేవించనివాళ్ల చెడు లక్షణాల ప్రభావం మనపై పడకుండా జాగ్రత్తపడాలి. 2 తిమోతి 3:2-5 వచనాల్లో పౌలు వర్ణించిన వ్యక్తులకు దూరంగా ఉండమనే యెహోవా నిర్దేశాన్ని మనం పాటిస్తాం. వాస్తవానికి, చెడు లక్షణాలు ఉన్న ప్రతీఒక్కరికి మనం పూర్తిగా దూరంగా ఉండలేం. ఎందుకంటే, అలాంటి వాళ్లతో కలిసి పనిచేయాల్సి రావచ్చు, కలిసి స్కూల్‌లో చదవాల్సి రావచ్చు లేదా వాళ్లమధ్య జీవించాల్సి రావచ్చు. అయినాసరే వాళ్లలా ఆలోచించకుండా, ప్రవర్తించకుండా ఉండడానికి మనకేమి సహాయం చేస్తుంది? బైబిలు చదువుతూ యెహోవాతో మనకున్న స్నేహాన్ని బలపర్చుకోవాలి, యెహోవాను ప్రేమించేవాళ్లను మాత్రమే ప్రాణ స్నేహితులుగా ఎంచుకోవాలి.

18. యెహోవా గురించి తెలుసుకునేలా ఇతరులకు మనమెలా సహాయం చేయవచ్చు?

18 యెహోవా గురించి తెలుసుకునేలా ఇతరులకు కూడా మనం సహాయం చేయాలి. మంచివార్త ప్రకటించే అవకాశాల కోసం చూడండి. సరైన సమయంలో, సరైన విషయాలు మాట్లాడేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. మనం యెహోవాసాక్షులమని ఇతరులు తెలుసుకునేలా ప్రవర్తించాలి. అప్పుడు, మన మంచి ప్రవర్తన యెహోవాకు ఘనత తెస్తుంది. “ప్రస్తుత వ్యవస్థలో భక్తిలేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా, మంచి వివేచనతో, నీతితో, దేవుని మీద భక్తితో జీవించేలా” యెహోవా మనకు శిక్షణనిచ్చాడు. (తీతు 2:11-14) మనం యెహోవాను అనుకరిస్తూ ఆయన కోరేవాటిని చేస్తే, ఇతరులు దాన్ని గమనిస్తారు. కొంతమంది ఇలా కూడా అనవచ్చు: ‘దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాం కాబట్టి మేము కూడా మీతో వస్తాం.’—జెక. 8:23, NW.

^ పేరా 10 “లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు” అనే మాటకు గ్రీకులో డయాబోలస్‌ అనే పదాన్ని ఉపయోగించారు. బైబిల్లో ఈ పదాన్ని సాతానుకు బిరుదుగా వాడారు. సాతాను దేవుని గురించి లేనిపోనివి కల్పించి చెడుగా చెప్పాడు.