కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు ఆయనే’

‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు ఆయనే’

2018 వార్షిక వచనం: ‘యెహోవా కోసం ఎదురుచూసేవాళ్లు నూతన బలం పొందుతారు.’యెష. 40:31.

పాటలు: 3, 47

1. మనం సహించాల్సిన సమస్యల్లో కొన్ని ఏమిటి? కానీ తన నమ్మకమైన సేవకుల్ని చూసి యెహోవా ఎందుకు సంతోషిస్తున్నాడు? (ప్రారంభ చిత్రాలు చూడండి.)

ఈ లోకంలో జీవితం కష్టంగా తయారౌతోంది. ఉదాహరణకు, మీలో చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకొంతమంది వయసు పైబడినప్పటికీ, వృద్ధాప్యంలో ఉన్న కుటుంబసభ్యుల్ని చూసుకోవాల్సి వస్తోంది. మరికొంతమంది కుటుంబ కనీస అవసరాల్ని తీర్చడానికే ఎన్నో కష్టాలు పడుతున్నారు. చాలామంది వీటిలో ఏదోక సమస్యతో కాదుగానీ ఇలాంటి ఎన్నో సమస్యలతో సతమతమౌతున్నారని మాకు తెలుసు. వాటిని తట్టుకోవడానికి చాలా సమయం, శక్తి, డబ్బు అవసరం. కానీ యెహోవా ఖచ్చితంగా సహాయం చేస్తాడనే నమ్మకంతో మీరున్నారు. అంతేకాదు యెహోవా పరిస్థితుల్ని చక్కదిద్దుతానని మాటిచ్చాడు కాబట్టి ఆయన ఆ మాటను నిజం చేస్తాడని మీకు తెలుసు. మీ విశ్వాసాన్ని చూసి యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు!

2. యెషయా 40:29 ఏమని ప్రోత్సహిస్తోంది? కానీ మనం ఏ పెద్ద పొరపాటు చేసే అవకాశం ఉంది?

2 సమస్యల్ని తట్టుకోవడం మీ వల్లకాదని కొన్నిసార్లు అనిపిస్తోందా? ఒకవేళ అలా అనిపిస్తుంటే, మీలా భావించేవాళ్లు చాలామంది ఉన్నారని గుర్తుంచుకోండి. ప్రాచీన కాలంలోని కొందరు నమ్మకమైన దేవుని సేవకులు, కష్టాలతో పోరాడడం తమ వల్లకాదని అనుకున్నారు. (1 రాజు. 19:4; యోబు 7:7) మరి వాళ్లెలా సహించారు? బలం కోసం యెహోవాపై ఆధారపడ్డారు. ‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు’ దేవుడేనని బైబిలు చెప్తోంది. (యెష. 40:29) కానీ విచారకరంగా నేడు కొందరు దేవుని సేవకులు, కొంతకాలంపాటు యెహోవా సేవను ఆపడమే సమస్యల్ని తట్టుకోవడానికి సరైన మార్గమని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లు యెహోవా సేవను భారంగా చూస్తున్నారేగానీ, దీవెనగా భావించట్లేదు. అందుకే బైబిలు చదవడం, మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లడం ఆపేస్తున్నారు. వాళ్లు అలా చేస్తారనే సాతాను ఎదురుచూస్తున్నాడు.

3. (ఎ) సాతాను మనల్ని బలహీనపర్చకూడదంటే మనమేమి చేయాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 మనం యెహోవా సేవను ఎంత ఎక్కువ చేస్తే, అంత బలంగా తయారౌతామని సాతానుకు తెలుసు. కానీ మనం బలంగా ఉండడం అతనికి ఇష్టంలేదు. మీకు శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు అనిపించినప్పుడు యెహోవాకు దూరంగా వెళ్లకండి. అలాంటి సమయాల్లో ఆయనకు మరింత దగ్గరగా ఉండండి. ఎందుకంటే “ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు” అని బైబిలు చెప్తోంది. (1 పేతు. 5:10; యాకో. 4:8) ఈ ఆర్టికల్‌లో యెషయా 40:26-31 వచనాల్ని పరిశీలిస్తుండగా, మనల్ని బలపర్చగల సామర్థ్యం యెహోవాకు ఉందని తెలుసుకుంటాం. అంతేకాదు, ఏ రెండు పరిస్థితులు మనల్ని యెహోవా సేవలో వెనుకబడేలా చేయగలవో చర్చిస్తాం. బైబిలు సూత్రాల సహాయంతో వాటినెలా తట్టుకోవచ్చో తెలుసుకుంటాం.

‘యెహోవా కోసం ఎదురుచూసేవాళ్లు నూతన బలం పొందుతారు’

4. యెషయా 40:26 నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

4 యెషయా 40:26 చదవండి. విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఇప్పటివరకు ఎవ్వరూ లెక్కపెట్టలేకపోయారు. ఒక్క మన నక్షత్రవీధిలోనే దాదాపు 40 వేలకోట్ల నక్షత్రాలు ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. కానీ యెహోవా ప్రతీ నక్షత్రానికి ఒక పేరు పెట్టాడు! ఇది మనకు ఏ పాఠం నేర్పిస్తోంది? జీవంలేని నక్షత్రాల మీదే యెహోవాకు అంత శ్రద్ధ ఉంటే, ఎవ్వరి బలవంతం లేకుండా ప్రేమతో ఆయన్ను సేవిస్తున్న మీపట్ల ఇంకెంత శ్రద్ధ ఉంటుందో ఆలోచించండి. (కీర్త. 19:1, 3, 14) మన ప్రియమైన తండ్రికి మీ గురించి అంతా తెలుసు. “మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు” అని బైబిలు చెప్తోంది. (మత్త. 10:30) అంతేకాదు, “నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు” అనే అభయాన్ని కీర్తనకర్త మనకిస్తున్నాడు. (కీర్త. 37:18) అవును, మీ కష్టాలన్నిటినీ యెహోవా చూస్తున్నాడు. వాటిలో ప్రతీదాన్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని ఆయన మీకివ్వగలడు.

5. మనకు కావాల్సిన బలాన్ని యెహోవా ఇవ్వగలడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?

5 యెషయా 40:28 చదవండి. యెహోవాకు అపారమైన శక్తి ఉంది. ఉదాహరణకు, సూర్యునికి ఆయన ఎంత శక్తి ఇస్తున్నాడో పరిశీలించండి. సూర్యుడు ఒక సెకనుకు ఉత్పత్తి చేసే శక్తి, కొన్ని వందలకోట్ల అణుబాంబుల విస్ఫోటనం వల్ల వెలువడే శక్తితో సమానమని డేవిడ్‌ బోడానెస్‌ అనే విజ్ఞానశాస్త్ర రచయిత అంటున్నాడు. మరో శాస్త్రవేత్త, కేవలం ఒక సెకనుకు సూర్యుడు ఉత్పత్తి చేసే శక్తి, ప్రపంచంలోని ప్రతీ మనిషికి 2 లక్షల ఏళ్ల వరకు సరిపోతుందని చెప్పాడు. కాబట్టి సూర్యునికి శక్తినిచ్చే యెహోవా, మనకు సమస్యల్ని తట్టుకునే బలాన్ని ఇవ్వలేడంటారా? ఖచ్చితంగా ఇవ్వగలడు.

6. యేసు కాడి మోయడానికి సులభంగా ఉండడమంటే ఏమిటి? మరి మనమేమి చేయాలి?

6 యెషయా 40:29 చదవండి. యెహోవా సేవ మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, ‘నా కాడిని మీమీద ఎత్తుకోండి. అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు. ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.’ (మత్త. 11:28-30) ఆయన చెప్పింది నిజమే! కొన్నిసార్లు ఇంటి నుండి మీటింగ్‌కి లేదా ప్రీచింగ్‌కి బయలుదేరే సమయానికి అలసటగా అనిపించవచ్చు. కానీ తిరిగొచ్చాక ఎలా అనిపిస్తుంది? సేదదీరినట్లుగా, సమస్యల్ని తట్టుకోవడానికి కావాల్సిన బలం వచ్చినట్లుగా ఉంటుంది. నిజంగానే యేసు కాడి మోయడానికి సులభంగా ఉంటుంది.

7. మత్తయి 11:28-30⁠లో ఉన్న మాటలు నిజమని నిరూపించే అనుభవం చెప్పండి.

7 ఒక సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె క్రానిక్‌​ ఫెటీగ్‌ సిండ్రోమ్‌తో, డిప్రెషన్‌తో, మైగ్రేన్‌తో బాధపడుతోంది. కొన్నిసార్లు మీటింగ్స్‌కు వెళ్లడానికి ఆమె ఆరోగ్యం అస్సలు సహకరించదు. అయితే ఒకసారి, ఆరోగ్యం బాలేకపోయినా ఎలాగోలా మీటింగ్‌కి వెళ్లింది. ఆమె ఇలా రాసింది, “ఆరోజు నిరుత్సాహం గురించి ప్రసంగం ఇచ్చారు. అందులోని సమాచారాన్ని ఎంత దయతో, శ్రద్ధతో చెప్పారంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. మీటింగ్స్‌కు హాజరవ్వడం నాకెంత అవసరమో ఆ ప్రసంగం గుర్తుచేసింది.” మీటింగ్‌కి వెళ్లడానికి కృషి చేసినందుకు ఆమె చాలా సంతోషించింది.

8, 9. “నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి” అని పౌలు అన్న మాటలకు అర్థమేమిటి?

8 యెషయా 40:30 చదవండి. మనకు చాలా నైపుణ్యాలు ఉండవచ్చు, కానీ సొంత బలంతో కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాం అనేది మనందరం నేర్చుకోవాల్సిన పాఠం. అపొస్తలుడైన పౌలుకు ఎన్నో పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ, ఆయన అనుకున్నవన్నీ చేయలేకపోయాడు. తన ఆందోళనను యెహోవాకు చెప్పినప్పుడు, యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీలో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.” యెహోవా ఏమన్నాడో పౌలు అర్థంచేసుకున్నాడు. అందుకే పౌలు ఇలా అన్నాడు, “నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి.” (2 కొరిం. 12:7-10) పౌలు మాటలకు అర్థమేమిటి?

9 తన సొంత బలంతో అన్నీ చేయలేనని, తనకన్నా శక్తిమంతుని సహాయం అవసరమని పౌలు గుర్తించాడు. బలహీనంగా ఉన్నప్పుడు దేవుని పవిత్రశక్తి ఆయనకు బలాన్ని ఇవ్వగలదు. అంతేకాదు, సొంత బలంతో ఎన్నడూ చేయలేని పనుల్ని కూడా పవిత్రశక్తి సహాయంతో పౌలు చేయగలడు. మనకు కూడా పవిత్రశక్తి బలాన్ని ఇవ్వగలదు. యెహోవా ఇచ్చే పవిత్రశక్తి మనల్ని బలవంతుల్ని చేస్తుంది.

10. కష్టాల్ని సహించడానికి దావీదుకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

10 దేవుని పవిత్రశక్తి ఇచ్చే బలాన్ని కీర్తనకర్త దావీదు ఎన్నోసార్లు రుచిచూశాడు. దావీదు ఇలా పాడాడు, ‘నీ సహాయంతో నేను సైన్యాన్ని జయిస్తాను. నా దేవుని సహాయంతో ప్రాకారాన్ని దాటుతాను.’ (కీర్త. 18:29) ప్రాకారం ఎలాగైతే మనం దాటలేనంత ఎత్తుగా ఉంటుందో, అలాగే కొన్ని సమస్యలు కూడా మనం సొంతగా పరిష్కరించుకోలేనంత పెద్దగా ఉంటాయి. కాబట్టి మనకు యెహోవా సహాయం అవసరం.

11. కష్టాల్ని సహించడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది?

11 యెషయా 40:31 చదవండి. పక్షిరాజు లేదా గద్ద ఎక్కువసేపు ఎగురుతూ ఉండడానికి దాని సొంత బలం సరిపోదు. పైకి ఎగిసే వేడి గాలి సహాయంతో అది పైకి ఎగురుతుంది. దానివల్ల ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది, శక్తిని ఆదా చేసుకోగలుగుతుంది. కాబట్టి మీ శక్తికి మించిన సమస్య ఏదైనా వస్తే గద్దను గుర్తుచేసుకోండి. “సహాయకుడు అంటే పవిత్రశక్తి” ద్వారా ఎక్కువ బలాన్ని ఇవ్వమని యెహోవాను వేడుకోండి. (యోహా. 14:26) తన పవిత్రశక్తిని ఇవ్వమని 24 గంటల్లో ఎప్పుడైనా యెహోవాను అడగవచ్చు. ముఖ్యంగా సంఘంలోని సహోదరునితో లేదా సహోదరితో మనకు అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు యెహోవా సహాయం అవసరం కావచ్చు. ఇంతకీ అభిప్రాయభేదాలు ఎందుకు వస్తాయి?

12, 13. (ఎ) క్రైస్తవుల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు ఎందుకు వస్తాయి? (బి) యోసేపు జీవితం యెహోవా గురించి మనకేమి నేర్పిస్తుంది?

12 మనందరం అపరిపూర్ణులం కాబట్టి అభిప్రాయభేదాలు వస్తాయి. కొన్నిసార్లు ఇతరుల మాటలు లేదా పనులు మనకు చిరాకు తెప్పించవచ్చు. అదేవిధంగా మన మాటలు లేదా పనులు ఇతరులకు చిరాకు తెప్పించవచ్చు. అలాంటి పరిస్థితి పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. కానీ యెహోవా పట్ల మనకున్న యథార్థతను నిరూపించుకోవడానికి అవి ఒక అవకాశాన్నిస్తాయి. ఏవిధంగా? మన సహోదరసహోదరీలతో కలిసి ఐక్యంగా ఎలా పనిచేయాలో అవి నేర్పిస్తాయి. మన సహోదరసహోదరీల్లో అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు. మనం కూడా వాళ్లను ప్రేమించాలి.

యెహోవా యోసేపును కాపాడినట్లే మిమ్మల్ని కూడా కాపాడతాడు (13వ పేరా చూడండి)

13 మనకు పరీక్షలు రాకుండా యెహోవా ఆపడు. దానికొక ఉదాహరణ యోసేపు. యోసేపు చిన్నతనంలో అతని అన్నలు ఈర్ష్యతో, అతన్ని కొంతమంది వర్తకులకు బానిసగా అమ్మేశారు. వాళ్లు అతన్ని ఐగుప్తుకు తీసుకెళ్లిపోయారు. (ఆది. 37:28) జరుగుతున్నదంతా యెహోవా చూశాడు. తన స్నేహితుడూ, నమ్మకమైన సేవకుడూ అయిన యోసేపుకు జరుగుతున్న అన్యాయం చూసి ఆయన ఖచ్చితంగా బాధపడివుంటాడు. కానీ యెహోవా దాన్ని ఆపలేదు. ఆ తర్వాత, పోతీఫరు భార్యను పాడుచేయడానికి ప్రయత్నించాడనే నెపంతో యోసేపును జైల్లో వేశారు. అప్పుడు కూడా యెహోవా యోసేపును కాపాడలేదు. దానర్థం ఆయన యోసేపును వదిలేశాడనా? లేదు. “యెహోవా అతనికి తోడైయుండెను . . . అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను” అని బైబిలు చెప్తోంది.—ఆది. 39:21-23.

14. కోపాన్ని మనసులో పెట్టుకోకపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

14 మరో ఉదాహరణ దావీదు. ఆయనకు జరిగి నంత అన్యాయం చాలా తక్కువమందికి జరిగి వుంటుంది. అయినప్పటికీ దేవుని స్నేహితుడైన దావీదు కోపాన్ని మనసులో పెట్టుకోలేదు. ఆయనిలా రాశాడు, “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్త. 37:8) కోపాన్ని ‘మానేయడానికి’ లేదా మనసులో పెట్టుకోకపోవడానికి ముఖ్యమైన కారణమేమిటంటే, మనం యెహోవాను అనుకరించాలనుకుంటాం. ఆయన “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు,” బదులుగా క్షమించాడు. (కీర్త. 103:10) కోపాన్ని మనసులో పెట్టుకోకపోవడం వల్ల వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కోపం వల్ల బి.పి. పెరుగుతుంది, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. అంతేకాదు కోపం వల్ల కాలేయం, క్లోమము దెబ్బతినవచ్చు; జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావచ్చు. పైగా కోపంలో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేం. దానివల్ల మనం ఇతరుల్ని బాధపెట్టేలా మాట్లాడే లేదా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా జరిగితే ఆ బాధ మనల్ని చాలాకాలంపాటు వేధిస్తుంది. కాబట్టి కోప్పడకుండా ఉండడమే మేలు. బైబిలు ఇలా చెప్తోంది, ‘ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం.’ (సామె. 14:30, NW) మరి ఇతరులు మనల్ని బాధపెడితే మనమేమి చేయవచ్చు? మన సహోదరునితో ఎలా సమాధానపడవచ్చు? బైబిలిచ్చే తెలివైన సలహాను పాటించడం ద్వారా మనం సమాధానపడవచ్చు.

తోటి సహోదరులవల్ల బాధపడినప్పుడు . . .

15, 16. తోటి సహోదరుడు మనల్ని బాధపెడితే ఏమి చేయాలి?

15 ఎఫెసీయులు 4:26 చదవండి. యెహోవాను ఆరాధించనివాళ్లు మనల్ని బాధపెడితే అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తోటి సహోదరుడుగానీ, సహోదరిగానీ, కుటుంబసభ్యులుగానీ తమ మాటల ద్వారానో పనుల ద్వారానో బాధపెడితే మన మనసు చాలా గాయపడుతుంది. ఒకవేళ జరిగినదాన్ని మనం మర్చిపోలేకపోతే అప్పుడేంటి? సంవత్సరాలు గడిచిపోయినా కోపాన్ని అలానే మనసులో పెట్టుకుంటామా? లేదా బైబిలిచ్చే తెలివైన సలహాను పాటించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటామా? బాధపెట్టిన వ్యక్తితో మాట్లాడడానికి ఎంత ఆలస్యం చేస్తే, సమాధానపడడం మనకు అంత కష్టమౌతుంది.

16 ఒకవేళ తోటి సహోదరుడు మిమ్మల్ని బాధపెట్టిన సందర్భాన్ని మీరు మర్చిపోలేకపోతుంటే సమాధానపడడానికి మీరేమి చేయవచ్చు? మొదటిగా యెహోవాకు ప్రార్థించండి. ఆ సహోదరునితో మనసువిప్పి మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థనలో వేడుకోండి. ఆ సహోదరుడు కూడా యెహోవాకు స్నేహితుడని మర్చిపోకండి. (కీర్త. 25:14) దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు. యెహోవా తన స్నేహితులతో దయగా ప్రవర్తిస్తాడు, మనం కూడా వాళ్లతో అలాగే ప్రవర్తించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (సామె. 15:23; మత్త. 7:12; కొలొ. 4:6) రెండవదిగా, మీ సహోదరునితో ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ముందే జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆయన కావాలనే మిమ్మల్ని బాధపెట్టాడని అనుకోకండి. బహుశా అనుకోకుండా అలా జరిగివుండవచ్చు లేదా మీరే ఆయన్ని అపార్థం చేసుకుని ఉండవచ్చు. జరిగినదాంట్లో మీ పొరపాటు కూడా ఉండవచ్చని ఒప్పుకోవడానికి వెనకాడకండి. మీ సహోదరునితో, “బహుశా నేను చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటున్నానేమో. కానీ నిన్న నువ్వు మాట్లాడినప్పుడు, నాకు ఎలా అనిపించిందంటే . . . ” అని సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఒకవేళ ఆ సంభాషణ మీ ఇద్దరి మధ్య సమాధానాన్ని తీసుకురాకపోతే మళ్లీమళ్లీ మాట్లాడండి. మీ సహోదరుని కోసం ప్రార్థించండి. ఆయన్ని దీవించమని, ఆయనలోని మంచి లక్షణాల్ని చూడడానికి మీకు సహాయం చేయమని యెహోవాను అడగండి. దేవుని స్నేహితుల్లో ఒకరైన మీ సహోదరునితో సమాధానపడడానికి మీరు చేసే కృషిని చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడు.

గతానికి సంబంధించిన అపరాధ భావాలు వేధిస్తుంటే . . .

17. మనం పాపం చేసినప్పుడు, తన స్నేహాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యెహోవా ఎవరి ద్వారా సహాయం అందిస్తాడు? దాన్ని మనమెందుకు అంగీకరించాలి?

17 ఘోరమైన పాపం చేసినందువల్ల తాము యెహోవాను ఆరాధించడానికి అర్హులం కాదని కొంతమంది అనుకుంటారు. అపరాధ భావాలు ఆనందాన్ని, మనశ్శాంతిని, బలాన్ని మనకు దూరం చేస్తాయి. అలాంటి భావాలతో పోరాడిన దావీదు రాజు ఇలా అన్నాడు, “నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను.” కానీ సంతోషకరమైన విషయమేమిటంటే, యెహోవా తన సేవకుల నుండి కోరేదాన్ని దావీదు చేశాడు. ఆయన, “నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని . . . నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు” అని అన్నాడు. (కీర్త. 32:3-5) మీరు ఏదైనా ఘోరమైన పాపం చేసివుంటే, మిమ్మల్ని క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. తన స్నేహాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. కాకపోతే సంఘపెద్దల ద్వారా ఆయన అందించే సహాయాన్ని మీరు తీసుకోవాలి. (సామె. 24:16; యాకో. 5:13-15) కాబట్టి ఆలస్యం చేయకండి! మీ శాశ్వత జీవితం దానిమీదే ఆధారపడి ఉంది. ఒకవేళ యెహోవా మిమ్మల్ని క్షమించిన చాలాకాలం తర్వాత కూడా దానికి సంబంధించిన అపరాధ భావాలు మిమ్మల్ని వేధిస్తుంటే మీరేమి చేయాలి?

18. అపరాధ భావాలతో బాధపడేవాళ్లకు పౌలు ఉదాహరణ ఎలా సహాయం చేస్తుంది?

18 అపొస్తలుడైన పౌలు గతంలో చేసిన పాపాలను బట్టి కొన్నిసార్లు కృంగిపోయాడు. ఆయనిలా అన్నాడు, “నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి. నేను దేవుని సంఘాన్ని హింసించాను కాబట్టి, అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు.” ఆయనింకా ఇలా అన్నాడు, “దేవుని అపారదయ వల్ల నేను అపొస్తలుణ్ణి అయ్యాను.” (1 కొరిం. 15:9, 10) పౌలు అపరిపూర్ణుడని యెహోవాకు తెలుసు. అయినాసరే యెహోవా ఆయన్ను అంగీకరించాడు, ఆ నిజాన్ని పౌలు కూడా నమ్మాలని యెహోవా కోరుకున్నాడు. మీరు చేసిన తప్పుల విషయంలో నిజంగా పశ్చాత్తాపపడి, దానిగురించి యెహోవాతో, అవసరమైతే సంఘపెద్దలతో కూడా మాట్లాడివుంటే యెహోవా మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన మిమ్మల్ని క్షమించాడని నమ్మండి, దాన్ని స్వీకరించండి.—యెష. 55:6, 7

19. 2018 వార్షిక వచనం ఏమిటి? అది ఎందుకు సరైనది?

19 మనం ఈ లోకాంతానికి దగ్గరయ్యేకొద్దీ కష్టాలు ఇంకా ఎక్కువ అవ్వవచ్చు. కానీ ‘సొమ్మసిల్లేవాళ్లకు బలమిచ్చి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే’ యెహోవా మనకు కావాల్సిన బలాన్నిచ్చి తన సేవను నమ్మకంగా చేయడానికి సహాయం చేయగలడని గుర్తుంచుకోవాలి. (యెష. 40:29; కీర్త. 55:22; 68:19) 2018లో రాజ్యమందిరంలో జరిగే మీటింగ్‌కి హాజరైన ప్రతీసారి, ప్రాముఖ్యమైన ఆ సత్యం మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే ‘యెహోవా కోసం ఎదురుచూసేవాళ్లు నూతన బలం పొందుతారు’ అనేదే మన వార్షిక వచనం.—యెష. 40:31.