కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్ఞాపకార్థ ఆచరణ దేవుని ప్రజల్ని ఐక్యం చేస్తుంది

జ్ఞాపకార్థ ఆచరణ దేవుని ప్రజల్ని ఐక్యం చేస్తుంది

“ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”కీర్త. 133:1.

పాటలు: 18, 14

1, 2. మార్చి 2018లో జరిగే ఏ కార్యక్రమం మనందర్నీ ఒక ప్రత్యేకమైన విధంగా ఐక్యం చేస్తుంది? ఎందుకు? (ప్రారంభ చిత్రం చూడండి.)

ప్రపంచవ్యాప్తంగా 2018, మార్చి 31న జరిగే ఒక కార్యక్రమానికి లక్షలమంది హాజరౌతారు. ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఆరోజు సూర్యాస్తమయం తర్వాత యెహోవాసాక్షులతో కలిసి ఎంతోమంది కొత్తవాళ్లు, యేసు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటారు. ప్రతీ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ప్రజలందర్నీ ఒక ప్రత్యేకమైన విధంగా ఐక్యపరుస్తుంది. భూమ్మీద జరిగే మరే కార్యక్రమంలో అలాంటి ఐక్యతను చూడలేం.

2 భూవ్యాప్తంగా జరిగే ఆ ప్రత్యేక కార్యక్రమానికి లక్షలమంది రావడం చూసి యెహోవా, యేసు ఖచ్చితంగా సంతోషిస్తారు. బైబిలు ఇలా చెప్తోంది, ‘ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం కనిపించింది. వాళ్లు అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి వచ్చారు. వాళ్లు పెద్ద స్వరంతో ఇలా అంటూ ఉన్నారు: “సింహాసనం మీద కూర్చున్న మన దేవుని నుండి, గొర్రెపిల్ల నుండి మా రక్షణ వస్తుంది.”’ (ప్రక. 7:9, 10) యెహోవా, యేసు చేసిన గొప్ప పనులనుబట్టి ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ రోజున లక్షలమంది వాళ్లను ఘనపర్చడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: (1) జ్ఞాపకార్థ ఆచరణ నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి నేను ఎలా సిద్ధపడవచ్చు? (2) దేవుని ప్రజలందరూ ఐక్యంగా ఉండడానికి జ్ఞాపకార్థ ఆచరణ ఏయే విధాలుగా సహాయం చేస్తుంది? (3) దేవుని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి నేనేమి చేయవచ్చు? (4) చివరి జ్ఞాపకార్థ ఆచరణ ఎప్పుడు జరుగుతుంది?

జ్ఞాపకార్థ ఆచరణ నుండి ప్రయోజనం పొందడానికి మనమెలా సిద్ధపడవచ్చు?

4. జ్ఞాపకార్థ ఆచరణకు మనమెందుకు హాజరవ్వాలి?

4 జ్ఞాపకార్థ ఆచరణకు మనమెందుకు హాజరవ్వాలి? ఒక కారణమేమిటంటే, మీటింగ్స్‌కు వెళ్లడం మన ఆరాధనలో ఒక భాగం. ప్రతీ సంవత్సరం జరిగే అత్యంత ప్రాముఖ్యమైన ఈ మీటింగ్‌కు హాజరవ్వడానికి మనలో ప్రతీఒక్కరు చేసే కృషిని యెహోవా, యేసు తప్పకుండా గమనిస్తారు. అనివార్య కారణాలవల్ల తప్ప మరే కారణంవల్ల మనం ఆ ఆచరణకు వెళ్లకుండా ఉండం. మీటింగ్స్‌ ప్రాముఖ్యమని మన పనుల్లో చూపించినప్పుడు, మన పేర్లను “జ్ఞాపకార్థముగా ఒక గ్రంథములో” రాయడానికి యెహోవాకు మరో కారణం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని “జీవగ్రంథం” అని కూడా బైబిలు పిలుస్తోంది. యెహోవా శాశ్వత జీవం ఇవ్వాలని అనుకుంటున్నవాళ్ల పేర్లు అందులో ఉంటాయి.—మలా. 3:16; ప్రక. 20:15.

5. “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరిశీలించుకుంటూ” ఉండడానికి జ్ఞాపకార్థ ఆచరణకు కొన్ని వారాల ముందు ఏమి చేయవచ్చు?

5 యెహోవాతో మనకున్న సంబంధం ఎంత బలంగా ఉందో ఆలోచించడానికి, ప్రార్థించడానికి జ్ఞాపకార్థ ఆచరణకు కొన్ని వారాల ముందు నుండే కొంత సమయం కేటాయించవచ్చు. (2 కొరింథీయులు 13:5 చదవండి.) “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరిశీలించుకుంటూ ఉండండి” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు చెప్పాడు. మనం దాన్నెలా చేయవచ్చు? దానికోసం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించుకుంటున్న ఏకైక సంస్థ ఇదేనని నేను బలంగా నమ్ముతున్నానా? మంచివార్త ప్రకటించడానికి, బోధించడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నానా? మనం చివరిరోజుల్లో జీవిస్తున్నామని, సాతాను పరిపాలన త్వరలోనే అంతమౌతుందని నా పనుల్లో చూపిస్తున్నానా? యెహోవా మీద, యేసు మీద నాకు మొదట్లో ఉన్నంత బలమైన నమ్మకం ఇప్పుడు ఉందా?’ (మత్త. 24:14; 2 తిమో. 3:1; హెబ్రీ. 3:14) ఈ ప్రశ్నలకు జవాబులు ఆలోచించినప్పుడు, మనమేమిటో “రుజువు చేసుకోవడానికి” వీలౌతుంది.

6. (ఎ) శాశ్వత జీవితం పొందడానికి ఏకైక మార్గం ఏమిటి? (బి) ఒక సంఘపెద్ద ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు ఎలా సిద్ధపడతాడు? ఆయనలాగే మీరు కూడా ఏమి చేయవచ్చు?

6 జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యతను వివరించే ఆర్టికల్స్‌ చదవడం ద్వారా, వాటిగురించి ఆలోచించడం ద్వారా మీరు ఆ కార్యక్రమానికి సిద్ధపడవచ్చు. (యోహాను 3:16; 17:3 చదవండి.) యెహోవా గురించి తెలుసుకుని, ఆయన కుమారుడైన యేసు మీద విశ్వాసం ఉంచితేనే శాశ్వత జీవితం పొందుతాం. వాళ్లకు దగ్గరవ్వడానికి సహాయపడే ఆర్టికల్స్‌ని అధ్యయనం చేయడం ద్వారా ఆ ఆచరణకు సిద్ధపడవచ్చు. ఎంతోకాలం నుండి సంఘపెద్దగా సేవచేస్తున్న ఒక సహోదరుడు అదే చేశాడు. జ్ఞాపకార్థ ఆచరణను వివరించే ఆర్టికల్స్‌ను అలాగే యెహోవా, యేసు చూపించిన ప్రేమను వివరించే కావలికోట ఆర్టికల్స్‌ని ఆయన ఎన్నో సంవత్సరాలపాటు సేకరించాడు. జ్ఞాపకార్థ ఆచరణకు కొన్నివారాల ముందు వాటిని మళ్లీ చదివి, ఆ కార్యక్రమం ఎందుకంత ప్రాముఖ్యమైనదో లోతుగా ఆలోచిస్తాడు. అప్పుడప్పుడు ఆయన సేకరించిన ఆర్టికల్స్‌కి మరికొన్ని ఆర్టికల్స్‌ని జత చేస్తాడు. అంతేకాదు జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన బైబిలు భాగాన్ని కూడా చదివి, లోతుగా ఆలోచిస్తాడు. అలా చేయడం వల్ల ప్రతీ సంవత్సరం కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటున్నానని, అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా యేసుల మీద తనకున్న ప్రేమ పెరిగిందని చెప్పాడు. మీరు కూడా అలా చదివితే యెహోవాను, యేసును మరింతగా ప్రేమిస్తారు, వాళ్లు చేసిన వాటికి ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉంటారు, జ్ఞాపకార్థ ఆచరణ నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు.

ఐక్యంగా ఉండడానికి జ్ఞాపకార్థ ఆచరణ ఎలా సహాయం చేస్తుంది?

7. (ఎ) మొదటిసారి ప్రభువు రాత్రి భోజనం ఆచరించినప్పుడు యేసు దేనిగురించి ప్రార్థించాడు? (బి) యేసు చేసిన ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడని ఎలా చెప్పవచ్చు?

7 మొదటిసారి ప్రభువు రాత్రి భోజనం ఆచరించినప్పుడు యేసు ఒక ప్రత్యేక ప్రార్థన చేశాడు. తనకూ, తన తండ్రికీ మధ్య ఉన్న గొప్ప ఐక్యత గురించి యేసు ప్రస్తావించాడు. అలాంటి ఐక్యతే తన శిష్యులందరి మధ్య ఉండాలని ఆయన ప్రార్థించాడు. (యోహాను 17:20, 21 చదవండి.) తన ప్రియ కుమారుడు చేసిన ఆ ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడు. ఏవిధంగా? మరే ఇతర మీటింగ్స్‌లో కన్నా జ్ఞాపకార్థ ఆచరణలో యెహోవాసాక్షుల ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోజు వేర్వేరు దేశాలకు, జాతులకు చెందిన లక్షలమంది భూవ్యాప్తంగా సమకూడి, యెహోవా తన కుమారుడైన యేసును పంపించాడనే తమ నమ్మకాన్ని చాటిచెప్తారు. కొన్ని ప్రాంతాల్లో, వేర్వేరు జాతులకు చెందిన ప్రజలు కలిసి మత సంబంధమైన కూటాలు జరుపుకోవడం అరుదు, ఒకవేళ జరుపుకున్నా అది తప్పని కొందరు భావిస్తారు. కానీ యెహోవా, యేసు అలా అనుకోరు. జ్ఞాపకార్థ ఆచరణలో కనిపించే ఐక్యత వాళ్లకు ఎంతో మనోహరంగా ఉంటుంది.

8. యెహోవా యెహెజ్కేలుకు ఏమి చేయమని చెప్పాడు?

8 యెహోవా ప్రజలైన మన మధ్య ఉన్న ఐక్యతను చూసి మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే, అలాంటి ఐక్యత ఉంటుందని యెహోవా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ముందే చెప్పాడు. ఆయన యెహెజ్కేలును రెండు కర్రల్ని తీసుకోమని, వాటిలో ఒకటి “యూదా” కోసం, మరొకటి “యోసేపు” కోసం అని చెప్పాడు. తర్వాత, ఆ రెండు కర్రలు ఒక్కటయ్యేలా వాటిని కలపమని యెహోవా చెప్పాడు. (యెహెజ్కేలు 37:15-17 చదవండి.) 2016, జూలై 15 కావలికోట సంచికలో వచ్చిన “పాఠకుల ప్రశ్న” అనే ఆర్టికల్‌లో ఇలా ఉంది: “తన ప్రజలు వాగ్దాన దేశానికి తిరిగొచ్చి ఒక్క జనాంగంగా మళ్లీ ఐక్యంగా ఉంటారని యెహోవా తన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ముందే చెప్పాడు. అంతేకాదు తన ఆరాధకులు చివరి రోజుల్లో ఐక్యమౌతారని కూడా యెహోవా ముందే చెప్పాడు.”

9. ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణలో యెహెజ్కేలు చెప్పిన ఎలాంటి ఐక్యతను మనం చూస్తున్నాం?

9 యెహోవా 1919 నుండి అభిషిక్త క్రైస్తవులను క్రమక్రమంగా సంస్థీకరించి ఐక్యపరిచాడు. వాళ్లు “యూదా” కర్రను సూచిస్తున్నారు. తర్వాత, భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉన్న వేలమంది వాళ్లతో కలిశారు. భూనిరీక్షణ ఉన్నవాళ్లు “యోసేపు” కర్రను సూచిస్తున్నారు. ఈ రెండు కర్రల్ని కలిపి ఒకటిగా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. (యెహె. 37:19) అభిషిక్త క్రైస్తవులను, ‘వేరే గొర్రెలను’ యెహోవా “ఒకే మందగా” చేశాడు. (యోహా. 10:16; జెక. 8:23) నేడు ఆ రెండు గుంపులవాళ్లు ఐక్యంగా యెహోవాకు సేవ చేస్తున్నారు. అంతేకాదు వాళ్లందరికీ రాజు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. యెహెజ్కేలు ప్రవచనం యేసుక్రీస్తును దేవుని “సేవకుడైన దావీదు” అని పిలుస్తుంది. (యెహె. 37:24, 25) ప్రతీ సంవత్సరం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కలుసుకున్నప్పుడు, ఈ రెండు గుంపుల మధ్య యెహెజ్కేలు ప్రవచించిన ఐక్యతను చూడవచ్చు. అయితే దేవుని ప్రజల మధ్య ఉన్న ఆ ఐక్యతను కాపాడడానికి, పెంపొందించడానికి మనలో ప్రతీఒక్కరం ఏమి చేయవచ్చు?

ఐక్యతను పెంపొందించడానికి ప్రతీఒక్కరం ఏమి చేయవచ్చు?

10. సంఘంలో ఐక్యతను పెంపొందించడానికి మనమేమి చేయవచ్చు?

10 దేవుని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి మొదటి మార్గమేమిటి? వినయంగా ఉండడానికి కృషిచేయడం. తన శిష్యులు వినయంగా ఉండాలని యేసు భూమ్మీదున్నప్పుడు చెప్పాడు. (మత్త. 23:12) లోకంలోని ప్రజలు తాము ఇతరుల కన్నా గొప్పవాళ్లమని అనుకుంటారు. కానీ మనకు వినయం ఉంటే సంఘపెద్దల్ని గౌరవిస్తాం, వాళ్లిచ్చే నిర్దేశాల్ని పాటిస్తాం. దానివల్ల సంఘం ఐక్యంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం వినయంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే, “దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు, కానీ వినయస్థులకు అపారదయను ప్రసాదిస్తాడు.”—1 పేతు. 5:5.

11. రొట్టె, ద్రాక్షారసం వేటిని సూచిస్తున్నాయో ఆలోచించడంవల్ల ఐక్యతను ఎలా పెంపొందించవచ్చు?

11 ఐక్యతను పెంపొందించడానికి రెండవ మార్గమేమిటి? రొట్టె, ద్రాక్షారసం నిజంగా వేటిని సూచిస్తున్నాయో జాగ్రత్తగా ఆలోచించడం. మనం జ్ఞాపకార్థ ఆచరణకు ముందు, అలాగే ఆరోజు రాత్రి ఆ చిహ్నాల గురించి లోతుగా ఆలోచించాలి. (1 కొరిం. 11:23-25) పులవని రొట్టె, యేసు మనకోసం బలిగా ఇచ్చిన తన పరిపూర్ణ శరీరాన్ని సూచిస్తుంది. ఎర్రని ద్రాక్షారసం, ఆయన రక్తాన్ని సూచిస్తుంది. అయితే మనం కేవలం ఈ ప్రాథమిక విషయాలను తెలుసుకుంటే సరిపోదు. యేసు విమోచన క్రయధనం ఇద్దరు వ్యక్తులు చూపించిన అత్యంత గొప్ప ప్రేమకు నిదర్శనమని గుర్తుంచుకోవాలి. యెహోవా తన కుమారుణ్ణి మనకోసం ఇచ్చాడు. అలాగే యేసు ఇష్టంగా మనకోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ గురించి ఆలోచించినప్పుడు, మనం కూడా వాళ్లను ప్రేమించాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం. యెహోవా మీద మనందరికీ ఉన్న ప్రేమే మన మధ్య ఐక్యతను పెంచుతుంది.

మనం ఇతరుల్ని క్షమించినప్పుడు ఐక్యతను పెంపొందిస్తాం (12-13 పేరాలు చూడండి)

12. మత్తయి 18:23-34 వచనాల్లో యేసు ఏ విషయాన్ని స్పష్టం చేశాడు?

12 ఐక్యతను పెంపొందించడానికి మూడవ మార్గమేమిటి? ఇతరుల్ని మనస్ఫూర్తిగా క్షమించడం. అలా చేయడంవల్ల, విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా మన పాపాల్ని క్షమిస్తున్నందుకు మనం కృతజ్ఞులమని చూపిస్తాం. క్షమించడం ఎంత ప్రాముఖ్యమో అర్థంచేసుకోవడానికి మత్తయి 18:23-34 వచనాల్లో యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. దాన్ని చదివి, ఇలా ప్రశ్నించుకోండి: ‘యేసు చెప్పింది చేయడానికి నేను ఇష్టపడుతున్నానా? నా తోటి సహోదరసహోదరీలతో ఓపిగ్గా ఉంటూ, వాళ్లను అర్థంచేసుకుంటున్నానా? నన్ను బాధపెట్టినవాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానా?’ నిజమే కొన్ని పాపాలు ఘోరమైనవి కావచ్చు. కొన్ని తప్పుల్ని అపరిపూర్ణులమైన మనం క్షమించలేకపోవచ్చు. కానీ మనం ఏమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో యేసు చెప్పిన ఉదాహరణ బట్టి అర్థమౌతుంది. (మత్తయి 18:35 చదవండి.) మన సహోదరసహోదరీలను క్షమించడానికి సరైన కారణాలు ఉన్నా వాళ్లను క్షమించకపోతే యెహోవా మన పాపాల్ని క్షమించడని యేసు స్పష్టంగా చెప్పాడు. అది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. యేసు చెప్పినట్లు మనం ఇతరుల్ని క్షమిస్తే, మన మధ్య ఉన్న ఐక్యతను కాపాడినవాళ్లమౌతాం.

13. ఇతరులతో శాంతిగా ఉంటే ఐక్యతను ఎలా పెంపొందిస్తాం?

13 మనం తోటివాళ్లను క్షమించినప్పుడు వాళ్లతో శాంతిగా ఉంటాం. ఒకరితో ఒకరం ఐక్యంగా, శాంతిగా ఉండడానికి “పట్టుదలగా” ప్రయత్నించాలని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఎఫె. 4:3) కాబట్టి మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారో జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, అలాగే ఆరోజు రాత్రి జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘నన్ను బాధపెట్టిన వాళ్లమీద కోపం పెంచుకునే వ్యక్తిని కాదని ఇతరులకు తెలుసా? ఇతరులతో శాంతిగా, ఐక్యంగా ఉండడానికి కృషి చేసే వ్యక్తిగా నా తోటివాళ్లు నన్ను గుర్తించగలుగుతున్నారా?’ ఇవి ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్నలు.

14. మనం ప్రేమతో ఒకరినొకరం భరించుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?

14 ఐక్యతను పెంపొందించడానికి నాలుగవ మార్గమేమిటి? యెహోవాలా ప్రేమ చూపించడం. (1 యోహా. 4:8) “నేను నా సహోదరుల్ని భరించాలి గానీ ప్రేమించాల్సిన అవసరం లేదు” అని ఎప్పుడూ అనుకోకూడదు. అలా అనుకుంటున్నామంటే, “ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ” ఉండాలని పౌలు ఇచ్చిన సలహాను మనం పాటించనట్లే. (ఎఫె. 4:2) కేవలం “ఒకరినొకరు భరించుకుంటూ” ఉండమని పౌలు చెప్పలేదు గానీ “ప్రేమతో” భరించుకోవాలని చెప్పాడు. రెండిటికీ తేడా ఉంది. మన సంఘాల్లో రకరకాల ప్రజలు ఉన్నారు, యెహోవా వాళ్లందర్నీ ఆకర్షించాడు. (యోహా. 6:44) అంటే వాళ్లందర్నీ ప్రేమించడానికి ఆయనకు ఎన్నో మంచి కారణాలు కనిపించివుంటాయి. మన సహోదరసహోదరీలు యెహోవా ప్రేమను పొందడానికి అర్హులైనప్పుడు, మన ప్రేమను పొందడానికి అర్హులు కాదని ఎలా అనగలం? వాళ్లను ఎలా ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడో అలా ప్రేమించడానికి మనం కృషిచేయాలి.—1 యోహా. 4:20, 21.

చివరి ఆచరణ ఎప్పుడు జరుగుతుంది?

15. ఏదోకరోజు మనం చివరి జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటామని ఎందుకు చెప్పవచ్చు?

15 ఏదోకరోజు మనం చివరి జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటాం. అది మనకెలా తెలుసు? ప్రతీ సంవత్సరం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, అభిషిక్త క్రైస్తవులు ‘ప్రభువు మరణం గురించి ప్రకటిస్తూ ఉంటారని, ఆయన వచ్చేవరకు’ అలా చేస్తారని పౌలు చెప్పాడు. (1 కొరిం. 11:26) అంతం గురించిన ప్రవచనంలో, యేసు కూడా తాను “రావడం” గురించి మాట్లాడాడు. త్వరలో రాబోయే మహాశ్రమ గురించి చెప్తూ ఆయనిలా అన్నాడు, “మానవ కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీదున్న అన్ని దేశాల ప్రజలు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు; మానవ కుమారుడు శక్తితో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం వాళ్లు చూస్తారు. ఆయన గొప్ప బాకా శబ్దంతో తన దూతల్ని పంపిస్తాడు. ఆ దూతలు ఆయన ఎంచుకున్నవాళ్లను ఆకాశం ఈ చివర నుండి ఆ చివర వరకు నాలుగు దిక్కుల నుండి సమకూరుస్తారు.” (మత్త. 24:29-31) భూమ్మీద మిగిలిన అభిషిక్తులందర్నీ పరలోకానికి తీసుకెళ్లినప్పుడు యేసు తాను ‘ఎంచుకున్నవాళ్లను సమకూరుస్తాడు.’ మహాశ్రమ మొదలైన తర్వాత, హార్‌మెగిద్దోను యుద్ధానికి ముందు అది జరుగుతుంది. ఆ యుద్ధంలో, యేసు అలాగే 1,44,000 మంది భూరాజులతో యుద్ధం చేసి, విజయం సాధిస్తారు. (ప్రక. 17:12-14) అభిషిక్తుల్ని సమకూర్చడానికి యేసు “వచ్చే” ముందు చేసే జ్ఞాపకార్థ ఆచరణే చివరిది అవుతుంది.

16. మీరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని ఎందుకు నిశ్చయించుకున్నారు?

16 మనం 2018, మార్చి 31న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు తప్పకుండా హాజరవ్వాలని నిశ్చయించుకుందాం. అంతేకాదు దేవుని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి మన వంతు కృషి చేద్దాం, సహాయం కోసం యెహోవాను అడుగుదాం. (కీర్తన 133:1 చదవండి.) ఏదోకరోజు మనం చివరి జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటాం. అప్పటివరకు, జ్ఞాపకార్థ ఆచరణలో మన మధ్య ఉండే మనోహరమైన ఐక్యతను కాపాడుకుందాం.