కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏ కొదువ లేని దేవునికి మనమేమి ఇవ్వగలం?

ఏ కొదువ లేని దేవునికి మనమేమి ఇవ్వగలం?

“మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.”1 దిన. 29:13.

పాటలు: 80, 50

1, 2. యెహోవా ఉదారతను ఎలా చూపిస్తున్నాడు?

యెహోవా ఉదారంగా ఇచ్చే దేవుడు. మన దగ్గరున్న ప్రతీదీ ఆయన ఇచ్చినదే. బంగారం, వెండి, ఇంకా భూమ్మీదున్న సహజ వనరులన్నీ ఆయన సొంతమే. జీవరాశులన్నీ మనుగడ సాగించేలా ఆయన వాటిని ఉపయోగిస్తాడు. (కీర్త. 104:13-15; హగ్గ. 2:8) తన ప్రజలను అద్భుతరీతిలో పోషించడానికి యెహోవా ఆ వనరుల్ని కొన్నిసార్లు ఎలా ఉపయోగించాడో బైబిలు నుండి తెలుసుకుంటాం.

2 ఉదాహరణకు, ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు మన్నా ద్వారా, నీళ్ల ద్వారా యెహోవా వాళ్లను పోషించాడు. (నిర్గ. 16:35) ఫలితంగా వాళ్లకు ఏమీ తక్కువ కాలేదు. (నెహె. 9:20, 21) కొంతకాలం తర్వాత, యెహోవా ఎలీషా ప్రవక్త ద్వారా నమ్మకస్థురాలైన ఒక విధవరాలి దగ్గరున్న కొంచెం నూనెను అధికమయ్యేలా అద్భుతం చేశాడు. దేవుడిచ్చిన ఆ బహుమానంతో ఆమె తన అప్పుల్ని తీర్చగలిగింది. ఆమె, ఆమె కొడుకులు బ్రతకడానికి సరిపోయే డబ్బు సంపాదించగలిగింది. (2 రాజు. 4:1-7) యెహోవా సహాయంతో, యేసు అద్భుతరీతిలో ఎంతోమందికి ఆహారం పెట్టాడు, అవసరమైనప్పుడు డబ్బు కూడా ఇచ్చాడు.—మత్త. 15:35-38; 17:27.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 తన సృష్టిని కాపాడడానికి యెహోవా దేన్నైనా ఉపయోగించగలడు. అయినప్పటికీ, తన సంస్థ చేస్తున్న పనికి మద్దతిచ్చే అవకాశాన్ని ఆయన తన సేవకులకు ఇస్తున్నాడు. (నిర్గ. 36:3-7; సామెతలు 3:9 చదవండి.) యెహోవా మనకిచ్చిన విలువైనవాటిని తిరిగి తనకోసం ఉపయోగించాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? బైబిలు కాలాల్లో ఉన్న దేవుని సేవకులు యెహోవా పనికి ఎలా మద్దతిచ్చారు? సంస్థ నేడు విరాళాలను ఎలా ఉపయోగిస్తోంది? వంటి ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

మన దగ్గరున్న విలువైనవాటిని యెహోవాకు ఇస్తాం

4. మన దగ్గరున్న విలువైనవి యెహోవాకు ఎందుకు ఇస్తాం?

4 మన దగ్గరున్న విలువైనవి యెహోవాకు ఇవ్వడానికి ఒక కారణమేమిటంటే, మనకు ఆయనపట్ల ఉన్న ప్రేమ, కృతజ్ఞత. యెహోవా మనకోసం చేసిన వాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు, మన హృదయాలు కృతజ్ఞతతో ఉప్పొంగుతాయి. రాజైన దావీదు, ఆలయాన్ని కట్టడానికి ఏమేమి అవసరమో వివరిస్తున్నప్పుడు అలాగే భావించాడు. మనకున్నవన్నీ యెహోవా ఇచ్చినవేననీ, ఆయనకు మనం ఏదైనా ఇస్తున్నామంటే ఆయనిచ్చిన వాటినే తిరిగి ఇస్తున్నామనీ దావీదు అన్నాడు.—1 దినవృత్తాంతములు 29:11-14 చదవండి.

5. నిస్వార్థంగా ఇవ్వడం సత్యారాధనలో ప్రాముఖ్యమైన భాగమని బైబిలు ఎలా తెలియజేస్తోంది?

5 మరో కారణమేమిటంటే, ఇవ్వడం మన ఆరాధనలో ఒక భాగం. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో పరలోకంలోని యెహోవా సేవకులు ఇలా అనడం విన్నాడు, “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.” (ప్రక. 4:11) అవును సమస్త మహిమ, ఘనత పొందడానికి యెహోవాయే అర్హుడు కాబట్టి మన దగ్గరున్న శ్రేష్ఠమైనవి ఆయనకు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి మూడు పండుగలు జరుపుకోవాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఆ పండుగల్లో యెహోవాకు ఏదోకటి ఇవ్వడం వాళ్ల ఆరాధనలో ఒక భాగం. ‘వాళ్లు వట్టిచేతులతో యెహోవా సన్నిధిలో కనబడకూడదు’ అని ఆయన ఆజ్ఞాపించాడు. (ద్వితీ. 16:16, 17) నేడు కూడా, నిస్వార్థంగా ఇవ్వడం మన ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన భాగం. అలా ఇవ్వడం ద్వారా యెహోవా సంస్థలో జరుగుతున్న పనికి విలువిస్తున్నామని, మద్దతిస్తున్నామని చూపిస్తాం.

6. ఉదారంగా ఇవ్వడం ఎందుకు మంచిది? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 కేవలం తీసుకోవడమే కాకుండా, ఉదారంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. (సామెతలు 29:21 చదవండి.) ఉదాహరణకు, ఒక బాబు తన అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్‌ మనీ నుండి కొంత డబ్బు తీసి వాళ్లకు ఒక గిఫ్ట్‌ కొని ఇచ్చాడనుకోండి. అప్పుడు ఆ అమ్మానాన్నలకు ఎలా అనిపిస్తుంది? లేదా ఒక యౌవన పయినీరు, ఇంటి అద్దె కోసం లేదా కుటుంబ అవసరాల కోసం తన అమ్మానాన్నలకు కొంత డబ్బు ఇవ్వడాన్ని ఊహించుకోండి. అలా ఇవ్వాలని అతని అమ్మానాన్నలు కోరుకోరు, కానీ ఇస్తే సంతోషిస్తారు. ఎందుకంటే, అలా ఇవ్వడం ద్వారా తన కోసం చేసిన వాటన్నిటికీ ఆ సహోదరుడు కృతజ్ఞత చూపించినట్లు అవుతుంది. అదేవిధంగా, మన దగ్గరున్న విలువైనవాటి నుండి ఇవ్వడం మంచిదని యెహోవాకు తెలుసు.

ప్రాచీనకాలంలోని దేవుని సేవకులు ఎలా ఇచ్చారు?

7, 8. ప్రాచీనకాలంలోని దేవుని సేవకులు వీటి విషయంలో ఎలాంటి ఆదర్శాన్ని ఉంచారు: (ఎ) ప్రత్యేకమైన పనుల కోసం విరాళాలు ఇవ్వడం (బి)  యెహోవా పనికి నాయకత్వం వహించినవాళ్లకు ఆర్థిక మద్దతివ్వడం?

7 యెహోవా పని కోసం ఆయన సేవకులు విరాళాలు ఇచ్చారని బైబిల్లో చదువుతాం. కొన్నిసార్లు వాళ్లు ప్రత్యేకమైన పనుల కోసం విరాళాలు ఇచ్చారు. ఉదాహరణకు, గుడారాన్ని కట్టడానికి విరాళాలు ఇవ్వమని మోషే ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడు. కొంతకాలం తర్వాత, ఆలయాన్ని కట్టడానికి దావీదు కూడా విరాళాలు ఇవ్వమని ప్రజల్ని ప్రోత్సహించాడు. (నిర్గ. 35:5; 1 దిన. 29:5-9) రాజైన యోవాషు పరిపాలనలో, ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే యాజకులు ఆలయాన్ని బాగుచేయించారు. (2 రాజు. 12:4, 5) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు యూదయలో కరువు వచ్చిందని తెలుసుకొని, అక్కడి సహోదరులకు సహాయం చేయడానికి ప్రతీఒక్కరు తాము ఇవ్వగలిగింది ఇచ్చారు.—అపొ. 11:27-30.

8 కొన్ని సందర్భాల్లో, యెహోవా పనికి నాయకత్వం వహించినవాళ్లకు కూడా దేవుని ప్రజలు ఆర్థిక మద్దతిచ్చారు. ఉదాహరణకు మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యెహోవా మిగతా గోత్రాలకు ఇచ్చినట్టు లేవీయులకు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇశ్రాయేలీయులు తమకున్న దాంట్లో పదోవంతును లేవీయులకు ఇచ్చేవాళ్లు. దానివల్ల లేవీయులు గుడారంలో తమకు అప్పగించిన పని మీద మనసుపెట్టగలిగారు. (సంఖ్యా. 18:21) అదేవిధంగా, యేసుకు ఆయన శిష్యులకు సహాయం చేయడానికి ఉదార స్వభావంగల కొంతమంది స్త్రీలు తమ దగ్గరున్నవి ఇచ్చారు.—లూకా 8:1-3.

9. గతంలో దేవుని సేవకులు ఎలా విరాళాలు ఇవ్వగలిగారు?

9 అయితే వాళ్లు ఆ విరాళాలు ఎలా ఇవ్వగలిగారు? ఇశ్రాయేలీయులు బహుశా ఐగుప్తునుండి తెచ్చుకున్న విలువైనవాటిని గుడారాన్ని కట్టడానికి విరాళంగా ఇచ్చుంటారు. (నిర్గ. 3:21, 22; 35:22-24) మొదటి శతాబ్దంలో, కొంతమంది క్రైస్తవులు తమ దగ్గరున్న వాటిని అంటే పొలాలను లేదా ఇళ్లను అమ్మి అపొస్తలులకు విరాళాలు ఇచ్చారు. అపొస్తలులు ఆ డబ్బును అవసరంలో ఉన్న సహోదరసహోదరీలకు సహాయం చేయడానికి ఉపయోగించారు. (అపొ. 4:34, 35) ఇంకొంతమంది క్రైస్తవులు, దేవుని పనికి మద్దతివ్వడానికి క్రమంగా కొంత డబ్బు పక్కన పెట్టేవాళ్లు. (1 కొరిం. 16:2) ఆ విధంగా బాగా పేదవాళ్ల నుండి బాగా ధనవంతుల వరకు అన్నిరకాల ప్రజలు ఏదోకటి ఇవ్వగలిగారు.—లూకా 21:1-4.

మనకాలంలో ఎలా ఇవ్వవచ్చు?

10, 11. (ఎ) బైబిలు కాలాల్లో ఉదారంగా ఇచ్చిన దేవుని సేవకులను మనమెలా అనుకరించవచ్చు? (బి) రాజ్య పనికి మద్దతివ్వడం మీకెలా అనిపిస్తుంది?

10 నేడు మనం కూడా ప్రత్యేక పనుల కోసం విరాళాలు ఇవ్వాల్సి రావచ్చు. బహుశా అది మన రాజ్యమందిరాన్ని బాగుచేయడానికి లేదా కొత్త రాజ్యమందిరాన్ని కట్టడానికి కావచ్చు. లేదా స్థానిక బ్రాంచి కార్యాలయ మరమ్మతుల కోసం కావచ్చు. కొన్నిసార్లు, సమావేశ ఖర్చుల కోసం లేదా ప్రకృతి విపత్తువల్ల నష్టపోయిన వేరే ప్రాంతంలోని మన సహోదరసహోదరీల కోసం విరాళాలు ఇవ్వాల్సి రావచ్చు. మనమిచ్చే విరాళాలు మిషనరీలకు, ప్రత్యేక పయినీర్లకు, ప్రాంతీయ పర్యవేక్షకులకు, ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్నవాళ్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాంచి కార్యాలయాల్లో సేవ చేస్తున్నవాళ్లకు కూడా ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా సమావేశ హాళ్లు, రాజ్యమందిరాలు కట్టే పని కోసం మీ సంఘం క్రమంగా విరాళాలు పంపిస్తుండవచ్చు.

11 ఈ చివరి రోజుల్లో యెహోవా సంస్థ చేస్తున్న పనికి మద్దతుగా మనందరం ఏదోకటి ఇవ్వవచ్చు. చాలావరకు ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారో బయటికి చెప్పరు. మనం రాజ్యమందిరంలోని చందాపెట్టెలో విరాళం వేసినా లేదా jw.org వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విరాళం పంపించినా ఎంత ఇస్తున్నామో ఇతరులకు తెలియనివ్వం. ఒకవేళ మీరు ఇచ్చే విరాళం మీకు చాలా తక్కువగా అనిపిస్తే అప్పుడేమిటి? నిజమేమిటంటే, సంస్థకు విరాళాలు పెద్దమొత్తంలో కన్నా చిన్న మొత్తంలోనే ఎక్కువగా వస్తుంటాయి. పేదవాళ్లయిన మన సహోదరులు కూడా మాసిదోనియాలోని తొలి క్రైస్తవులను అనుకరిస్తున్నారు. ఆ క్రైస్తవులు “ఎంతో పేదరికంలో” ఉన్నప్పటికీ, విరాళమిచ్చే అవకాశం ఇవ్వమని బ్రతిమాలారు, ఉదారంగా ఇచ్చారు.—2 కొరిం. 8:1-4.

12. మన సంస్థ విరాళాలను జాగ్రత్తగా ఎలా ఉపయోగిస్తుంది?

12 పరిపాలక సభ విరాళాలను నమ్మకంగా, తెలివిగా ఉపయోగిస్తుంది. (మత్త. 24:45) పరిపాలక సభ సభ్యులు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థన చేస్తారు, విరాళాలను ఎలా ఉపయోగించాలో జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. (లూకా 14:28) బైబిలు కాలాల్లో విరాళాలను చూసుకునే నమ్మకమైన పురుషులు, వాటిని యెహోవా ఆరాధనకు మాత్రమే ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదాహరణకు, పారసీక రాజు విరాళంగా ఇచ్చిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులతో ఎజ్రా యెరూషలేముకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు వాటి విలువ 10 కోట్ల అమెరికన్‌ డాలర్ల కన్నా ఎక్కువే ఉంటుంది. ఎజ్రా వాటిని యెహోవాకు కానుకలుగా భావించాడు, కాబట్టి ప్రమాదకరమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా ఉంచేలా స్పష్టమైన నిర్దేశాల్ని ఇచ్చాడు. (ఎజ్రా 8:24-34) ఆ తర్వాత, అవసరంలో ఉన్న యూదయలోని సహోదరులకు సహాయం చేయడానికి అపొస్తలుడైన పౌలు విరాళాలు సేకరించాడు. ఆ విరాళాలను అందజేసేవాళ్లు “ప్రతీ పనిని యెహోవా ముందే కాదు, మనుషుల ముందు కూడా నిజాయితీగా” చేసేలా పౌలు చూశాడు. (2 కొరింథీయులు 8:18-21 చదవండి.) ఎజ్రా, పౌలులాగే నేడు మన సంస్థ కూడా విరాళాలను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తుంది.

13. ఈమధ్య కాలంలో సంస్థ ఎందుకు కొన్ని మార్పులు చేస్తుంది?

13 ఒక కుటుంబం ఆదాయానికి మించి ఖర్చుపెట్టకుండా ఉండడానికి, అలాగే యెహోవా సేవ ఎక్కువ చేయడానికి వీలుగా సాదాసీదాగా జీవించేలా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. యెహోవా సంస్థ కూడా అలాంటి మార్పులు చేస్తుంది. ఈమధ్య కాలంలో సంస్థ ఎన్నో కొత్త ప్రాజెక్టులు చేపట్టింది, దానివల్ల వచ్చిన విరాళాలకన్నా కొన్నిసార్లు ఎక్కువే ఖర్చు అయ్యింది. కాబట్టి సంస్థ ఒక కుటుంబంలాగే డబ్బును ఆదా చేయడానికి, పనుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల మీరు ఉదారంగా ఇస్తున్న విరాళాలను సాధ్యమైనంత చక్కగా ఉపయోగించడానికి వీలౌతుంది.

మీ విరాళాల వల్ల వచ్చే ప్రయోజనాలు

మీరు ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పనికి ఉపయోగపడతాయి (14-16 పేరాలు చూడండి)

14-16. (ఎ) మీరిచ్చే విరాళాలను సంస్థ వేటికి ఉపయోగిస్తుంది? (బి) సంస్థ చేసే పనుల నుండి మీరు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం పొందారు?

14 ఎన్నో సంవత్సరాల నుండి యెహోవాను సేవిస్తున్నవాళ్లు, ముందెన్నడూ లేనంత ఎక్కువగా సంస్థ నుండి బహుమతుల్ని అందుకుంటున్నామని చెప్తున్నారు. మనకు ఇప్పుడు jw.org వెబ్‌సైట్‌, JW బ్రాడ్‌కాస్టింగ్‌ ఉన్నాయి. అంతేకాదు పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం బైబిలు చాలా భాషల్లో అందుబాటులో ఉంది. 2014/2015లో “దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి!” అనే మూడు రోజుల అంతర్జాతీయ సమావేశాలు, వేర్వేరు దేశాల్లోని 14 నగరాల్లో పెద్దపెద్ద స్టేడియంలలో జరిగాయి. వాటికి హాజరైన వాళ్లందరూ ఎంతో ఆనందించారు!

15 యెహోవా సంస్థ ఇస్తున్న ఈ బహుమతులకు తాము ఎంతో కృతజ్ఞులమని చాలామంది చెప్పారు. ఉదాహరణకు, ఆసియాలో సేవచేస్తున్న ఒక జంట ఇలా రాసింది, “మేము ఒక చిన్న నగరంలో సేవచేస్తున్నాం. కొన్నిసార్లు మేము అందరికీ దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, యెహోవా పని ఎంత విస్తృతంగా జరుగుతుందో త్వరగా మర్చిపోతుంటాం కూడా. కానీ JW బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చే వేర్వేరు కార్యక్రమాలు చూసిన ప్రతీసారి, మేము కూడా అంతర్జాతీయ సహోదర బృందంలో భాగమని గుర్తొస్తుంది. మా స్థానిక సహోదరసహోదరీలు JW బ్రాడ్‌కాస్టింగ్‌ కోసం ఆతురతతో ఎదురుచూస్తుంటారు. నెలనెలా వచ్చే కార్యక్రమాలను చూసిన తర్వాత పరిపాలక సభ సభ్యులకు దగ్గరైనట్టు అనిపిస్తుందని వాళ్లు తరచూ మాతో చెప్తుంటారు. దేవుని సంస్థలో ఉన్నందుకు ఇప్పుడు వాళ్లు మరింత గర్వపడుతున్నారు.”

16 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 రాజ్యమందిరాలు నిర్మాణ దశలో ఉన్నాయి లేదా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. హోండూరాస్‌లో ఒక సంఘంలోని సహోదరులు సొంత రాజ్యమందిరం కోసం కలలు కన్నామని, ఆ కల ఇప్పుడు నిజమైందని చెప్పారు. వాళ్లు ఇలా రాశారు, “యెహోవా విశ్వవ్యాప్త కుటుంబంలో ఒకరిగా ఉన్నందుకు, ప్రపంచవ్యాప్త సహోదరసహోదరీలతో సహవసిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.” బైబిల్ని, ఇతర ప్రచురణల్ని తమ సొంతభాషలో అందుకున్నప్పుడు; ప్రకృతి విపత్తుల సమయంలో సహోదరసహోదరీలు తమకు సహాయం చేసినప్పుడు; లేదా తమ క్షేత్రంలో మెట్రోపోలిటన్‌ సాక్ష్యంవల్ల, బహిరంగ సాక్ష్యంవల్ల మంచి ఫలితాలు వచ్చినప్పుడు కూడా అదే ఆనందాన్ని పొందుతున్నామని చాలామంది చెప్తున్నారు.

17. సంస్థలో జరిగే పనంతటినీ యెహోవాయే నడిపిస్తున్నాడని ఎలా చెప్పవచ్చు?

17 కేవలం స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతోనే సంస్థ ఈ పనులన్నిటిని ఎలా చేస్తుందో బయటి ప్రజలకు అర్థంకాదు. ఒక దేశంలో ఓ పెద్ద కంపెనీ అధికారి మన ప్రింటరీని చూడ్డానికి వచ్చాడు. అక్కడ పనిచేసేవాళ్లంతా స్వచ్ఛందంగా చేస్తున్నారని, స్వచ్ఛంద విరాళాలతోనే ఆ పని జరుగుతుందని, డబ్బు సేకరించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించట్లేదని తెలుసుకొని ఆ అధికారి ఆశ్చర్యపోయాడు. ఈవిధంగా పనిచేయడం అసాధ్యమని ఆయన అన్నాడు. నిజమే అది అసాధ్యం! కానీ యెహోవా సహాయంతో అది సాధ్యమే.—యోబు 42:2.

యెహోవాకు ఇవ్వడం వల్ల వచ్చే దీవెనలు

18. (ఎ) రాజ్య పనికోసం విరాళాలు ఇస్తే ఎలాంటి దీవెనలు పొందుతాం? (బి) విరాళాలు ఇవ్వడం మన పిల్లలకు, కొత్తవాళ్లకు ఎలా నేర్పించవచ్చు?

18 రాజ్యానికి సంబంధించిన గొప్ప పనికి మద్దతిచ్చే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా మనల్ని గౌరవిస్తున్నాడు. ఆ పనికి మద్దతిచ్చినప్పుడు మనల్ని దీవిస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. (మలా. 3:10) ఉదారంగా ఇచ్చినప్పుడు మనకు ప్రయోజనాలు ఉంటాయని యెహోవా మాటిస్తున్నాడు. (సామెతలు 11:24, 25 చదవండి.) అంతేకాదు ఇవ్వడంవల్ల సంతోషంగా ఉంటామని యెహోవా చెప్తున్నాడు. ఎందుకంటే “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) రాజ్య పనికోసం విరాళాలు ఇస్తూ, మెండైన దీవెనలు ఎలా పొందవచ్చో మన పిల్లలకు, కొత్తవాళ్లకు మన మాటల ద్వారా, పనుల ద్వారా నేర్పిద్దాం.

19. ఈ ఆర్టికల్‌ నుండి మీరెలాంటి ప్రోత్సాహం పొందారు?

19 మన దగ్గరున్న ప్రతీదీ యెహోవా ఇచ్చినదే. మన దగ్గరున్న విలువైనవాటిని ఆయనకు ఇచ్చినప్పుడు మనం ఆయన్ను ప్రేమిస్తున్నామని, ఆయన చేసిన వాటన్నిటి పట్ల కృతజ్ఞత కలిగివున్నామని చూపిస్తాం. (1 దిన. 29:17) ఇశ్రాయేలీయులు ఆలయ నిర్మాణ పనికి, ‘స్వేచ్ఛార్పణలు ఇచ్చినందుకు సంతోషించారు, ఎందుకంటే వాళ్లు నిండు హృదయంతో వాటిని ఇచ్చారు.’ (1 దిన. 29:9, NW) కాబట్టి మనం కూడా యెహోవా ఇచ్చిన వాటిలో నుండి ఆయనకు తిరిగి ఇచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని, సంతృప్తిని పొందుతూ ఉందాం.