కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను

క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను

నా చుట్టూ బుల్లెట్ల వర్షం కురుస్తోంది. నేను మెల్లగా తెల్లని రుమాలు పైకెత్తి చూపించాను. కాల్పులు జరుపుతున్న సైనికులు అది చూసి, నన్ను దాక్కున్న చోటు నుండి బయటికి రమ్మని అరిచారు. నన్ను ప్రాణాలతో ఉండనిస్తారో లేదోనని భయంభయంగా వాళ్ల దగ్గరకు వెళ్లాను. అసలు ఈ గందరగోళ పరిస్థితిలో నేనెలా చిక్కుకున్నానో తెలుసుకోవాలని ఉందా?

మాది గ్రీసులోని కరిట్జా అనే ఒక చిన్న పల్లెటూరు. కష్టపడి పనిచేసుకునే మా అమ్మానాన్నలకు మొత్తం ఎనిమిది మంది సంతానం, నేను ఏడవ వాడిని, 1926లో పుట్టాను.

నేను పుట్టడానికి ఒక సంవత్సరం ముందు, మా అమ్మానాన్నల్ని జాన్‌ పపారిజస్‌ అనే ఉత్సాహవంతమైన బైబిలు విద్యార్థి కలిశాడు, అతను మంచి మాటకారి. యెహోవాసాక్షుల్ని అప్పట్లో బైబిలు విద్యార్థులు అని పిలిచేవాళ్లు. జాన్‌ లేఖనాల్ని చాలా చక్కగా వివరించేవాడు, అమ్మానాన్నలకు అది నచ్చి మా ఊరిలో జరుగుతున్న బైబిలు విద్యార్థుల మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టారు. మా అమ్మకు యెహోవా మీద చెక్కుచెదరని విశ్వాసం ఉండేది. ఆమెకు చదువు రాకపోయినా నేర్చుకున్న విషయాల్ని అవకాశం దొరికినప్పుడల్లా ఇతరులకు చెప్పేది. కానీ నాన్న ప్రజల్లో ఉండే లోపాల మీదే మనసుపెట్టడం వల్ల మీటింగ్స్‌కు రావడం మెల్లగా ఆపేశాడు.

నా తోబుట్టువులకు, నాకు బైబిలంటే గౌరవం ఉండేదిగానీ ఆటలు, స్నేహితులతో సమయం గడపడంవల్ల దానిపై మనసు నిలపలేకపోయాం. అయితే 1939 యూరప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు మా ఊరిలో జరిగిన ఒక సంఘటన మమ్మల్ని కుదిపేసింది. నాకు వరసకు అన్న అయ్యే నికలస్‌ సారస్‌ మా ఇంటిపక్కన ఉండేవాడు. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న అతన్ని గ్రీకు సైన్యంలో చేరమని పిలిచారు. అప్పటికి అతనికి 20 ఏళ్లు ఉంటాయి, కానీ చాలా ధైర్యంగా “నేను యుద్ధం చేయలేను ఎందుకంటే నేను క్రీస్తు సైనికుణ్ణి” అని మిలిటరీ అధికారులతో చెప్పాడు. దాంతో అతన్ని మిలిటరీ కోర్టులో విచారణ చేసి పదేళ్ల జైలు శిక్ష వేశారు, మాకు నోట మాటరాలేదు.

కానీ 1941వ సంవత్సరం తొలినాళ్లలో మిత్రదేశ సైన్యం గ్రీసుకు వచ్చింది, అప్పుడు నికలస్‌ను విడుదల చేశారు. జైలు నుండి బయటికి రాగానే అతను కరిట్జాకు వచ్చాడు, అప్పుడు అతనిపై మా పెద్దన్న ఇలీయస్‌ బైబిలు గురించిన ప్రశ్నల వర్షం కురిపించాడు. నేను చాలా ఆసక్తిగా విన్నాను. కొంతకాలానికి ఇలీయస్‌, నేను, మా చెల్లి ఎఫ్మార్ఫియ బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టి మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లేవాళ్లం. ఆ తర్వాతి సంవత్సరం మేం ముగ్గురం యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాం. ఆ తర్వాత మా ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు కూడా యెహోవాసాక్షులయ్యారు.

1942లో కరిట్జా సంఘంలో 15 నుండి 25 ఏళ్ల మధ్య వయసున్న యౌవనస్థులు తొమ్మిదిమంది ఉండేవాళ్లు. ముందుముందు తీవ్రమైన ఇబ్బందులు ఎదురౌతాయని మా అందరికీ తెలుసు. కాబట్టి ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు బైబిల్ని అధ్యయనం చేయడానికి, రాజ్యగీతాలు పాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి వీలైనప్పుడల్లా కలుసుకునేవాళ్లం. దానివల్ల మా విశ్వాసం బలపడింది.

కరిట్జాలో డమీట్రీయస్‌, అతని స్నేహితులు

అంతర్యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తుందనగా, గ్రీకు కమ్యూనిస్టులు గ్రీకు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు, దాంతో దేశంలో యుద్ధం మొదలైంది. కమ్యూనిస్టు ఉద్యమకారులు పల్లెటూరుల్లో తిరుగుతూ తమతో కలిసి పోరాడమని ప్రజల్ని బలవంతం చేసేవాళ్లు. వాళ్లు మా ఊరికి వచ్చినప్పుడు యౌవన సాక్షులమైన అంటోన్యో సూకారిస్‌ని, ఇలీయస్‌ని, నన్ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. మేం క్రైస్తవులమనీ ఎవ్వరి పక్షాన యుద్ధం చేయమనీ చెప్పి, మమ్మల్ని వదిలేయమని ప్రాధేయపడ్డాం. అయినప్పటికీ వినకుండా మా ఊరి నుండి 12 గంటల ప్రయాణమంత దూరంలో ఉన్న మౌంట్‌ ఒలింపస్‌కు మమ్మల్ని వాళ్లతోపాటు బలవంతంగా తీసుకెళ్లారు.

కాసేపటికి ఒక కమ్యూనిస్టు ఆఫీసర్‌ వచ్చి ఉద్యమకారులతో కలిసి పోరాడమని మమ్మల్ని ఆదేశించాడు. నిజ క్రైస్తవులు ఆయుధాలు పట్టుకుని సాటి మనుషులపై దాడిచేయరని అతనికి వివరించాం. అది విని కోపంతో మండిపడి మమ్మల్ని జనరల్‌ దగ్గరకు లాక్కెళ్లాడు. అతనికి కూడా అదే చెప్పాం. అప్పుడు అతను “యుద్ధంలో గాయపడినవాళ్లను గాడిద మీద హాస్పిటల్‌కు చేరుస్తూ ఉండండి” అని ఆదేశించాడు.

అప్పుడు మేము “ఒకవేళ ప్రభుత్వ సైనికులు పట్టుకుంటే, మమ్మల్ని కూడా తిరుగుబాటు చేసేవాళ్లని అనుకుంటారు కదా” అని అన్నాం. అప్పుడు అతను, “అయితే యుద్ధం చేస్తున్న ఉద్యమకారులకు ఆహారం చేరవేస్తూ ఉండండి” అని చెప్పాడు. అప్పుడు మేము “మా దగ్గర గాడిద ఉండడం చూసి ఎవరైనా ఆఫీసరు మమ్మల్ని ఆయుధాలు మోసుకెళ్లమని చెప్తే ఏమి చేయాలి?” అని అడిగాం. జనరల్‌ చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి చివరికి “గొర్రెల్ని చూసుకునే పని మీకు బాగా సరిపోతుంది. కొండ మీద ఉండి గొర్రెల్ని కాయండి” అని చెప్పాడు.

దేశంలో యుద్ధ వాతావరణం అంతకంతకూ వేడెక్కుతున్న ఆ సమయంలో, గొర్రెల్ని కాసే పని మా మనస్సాక్షికి తప్పనిపించలేదు. ఇది జరిగిన సంవత్సరానికి నాన్న చనిపోవడంతో అమ్మను చూసుకోవడానికి మా పెద్దన్న ఇలీయస్‌ను ఇంటికి పంపించారు. అంటోన్యో ఆరోగ్యం పాడవడంతో అతన్ని కూడా విడిచిపెట్టారు. నేను మాత్రం ఇంకా ఆ ఉద్యమకారుల చేతుల్లోనే ఉన్నాను.

అప్పటికి గ్రీకు సైనికులు మెల్లమెల్లగా కమ్యూనిస్టుల్ని చుట్టుముడుతున్నారు. నన్ను బంధీగా తీసుకెళ్లిన గుంపు కొండల గుండా పొరుగు దేశమైన అల్బేనియా వైపు పారిపోయింది. అయితే సరిహద్దు దగ్గరకు వెళ్తుండగా మమ్మల్ని గ్రీకు సైనికులు చుట్టుముట్టారు. తిరుగుబాటుదారులు కంగారుపడి పారిపోయారు. నేనేమో పడిపోయిన ఓ చెట్టు వెనకాల దాక్కున్నాను, అలా నేను మొదట చెప్పిన పరిస్థితుల్లో చిక్కుకున్నాను.

కమ్యూనిస్టులు నన్ను బంధీగా తీసుకొచ్చారని గ్రీకు సైనికులకు చెప్పాను. నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి వెరియ అనే ప్రాంతం దగ్గరున్న మిలిటరీ క్యాంపుకు నన్ను తీసుకెళ్లారు. బైబిల్లో ప్రస్తావించబడిన బెరయ పట్టణమే వెరియ. అక్కడ, సైనికులు దాక్కోవడం కోసం ఉపయోగించే గుంతల్ని తవ్వే పని నాకు అప్పగించారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పడంతో నేరస్థుల్ని ఉంచే మ్యాక్రోనిసొస్‌ ద్వీపానికి నన్ను పంపించమని కమాండింగ్‌ ఆఫీసర్‌ ఆదేశించాడు.

భయంకర ద్వీపం

మ్యాక్రోనిసొస్‌ ద్వీపం చీకటిగా, ఎండిపోయి, తీవ్రమైన వేడితో ఉంటుంది. ఇది ఏథెన్సుకు 50 కి.మీ. దూరంలో ఉన్న అటిక తీరాన ఉంది. ఆ ద్వీపం కేవలం 13 కి.మీ. పొడవుతో, 2.5 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. కానీ 1947 మొదలుకొని 1958 వరకు లక్షకన్నా ఎక్కువమంది ఖైదీలను అక్కడ ఉంచారు. వాళ్లలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులుగా అనుమానించబడేవాళ్లు, ఒకప్పటి ఉద్యమకారులు, అలాగే ఎంతోమంది నమ్మకమైన యెహోవాసాక్షులు ఉన్నారు.

నేను అక్కడికి 1949లో వెళ్లాను, అప్పటికి ఖైదీలను గుంపులు గుంపులుగా విడగొట్టి వేర్వేరు క్యాంపుల్లో ఉంచారు. నన్ను కొన్ని వందలమంది ఉన్న గుంపుతో కలిపి అంతగా భద్రతలేని క్యాంపులో ఉంచారు. 10 మందికి సరిపోయే కాన్వాస్‌ టెంట్‌లో దాదాపు 40 మందిమి పడుకునేవాళ్లం. మురిగిపోయి కంపుకొట్టే నీళ్లను తాగేవాళ్లం, ఎక్కువశాతం చిక్కుడు గింజలు, వంకాయలు తినేవాళ్లం. ఎప్పుడూ దుమ్ము, గాలి ఉండడం వల్ల అక్కడ ఉండడం కష్టంగా అనిపించేది. కానీ బండరాళ్లను ముందుకు వెనక్కు లాగడం వంటి పైశాచిక శిక్షలను విధించనందుకు ఊపిరిపీల్చుకున్నాం. ఇంతకుముందు ఎంతోమంది ఖైదీలు ఆ శిక్ష వల్ల నరకయాతన అనుభవించారు.

బంధీలుగా తీసుకెళ్లబడిన ఇతర సాక్షులతో కలిసి మ్యాక్రోనిసొస్‌ ద్వీపంలో

ఒక రోజు బీచ్‌లో నడుస్తుండగా వేరే క్యాంపుల్లో ఉంటున్న చాలామంది సాక్షుల్ని కలిశాను. అలా కలిసినందుకు చాలా సంతోషించాం. ఎవరి కంట్లో పడకుండా వీలైనప్పుడల్లా మేం కలుసుకునేవాళ్లం. సాధ్యమైనప్పుడు కొంతమంది ఇతర ఖైదీలకు ప్రకటించేవాళ్లం కూడా, వాళ్లలో కొందరు ఆ తర్వాత యెహోవాసాక్షులయ్యారు. ప్రకటించడం, మనసువిప్పి ప్రార్థన చేయడమే మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచింది.

పరిస్థితులు ఇంకా భయంకరంగా మారడం

పది నెలలపాటు పునరావాస కేంద్రంలో ఉంచిన తర్వాత, నన్ను బంధీగా ఉంచినవాళ్లు నాకు మిలిటరీ యూనిఫాం ఇచ్చి వేసుకోమన్నారు. నేను వేసుకోనని అనడంతో నన్ను క్యాంపు కమాండెంట్‌ దగ్గరకు తీసుకెళ్లారు. “నేను క్రీస్తు సైనికునిగా మాత్రమే ఉంటాను” అని రాసివున్న కాగితాన్ని అతనికి ఇచ్చాను. నన్ను బెదిరించారు, ఆ తర్వాత రెండవ అధికారికి అప్పగించారు. అతను గ్రీకు ఆర్థడాక్స్‌ ఆర్చిబిషప్‌ వేసుకునే బట్టలు వేసుకుని ఉన్నాడు. అతను వేసిన ప్రశ్నలకు లేఖనాల నుండి ధైర్యంగా జవాబు చెప్పాను. అప్పుడు అతను చాలా కోపంగా “ఇతన్ని తీసుకెళ్లిపొండి. ఇతను మతోన్మాది” అని అరిచాడు.

తర్వాతి రోజు ఉదయం, సైనికులు మళ్లీ నన్ను మిలిటరీ యూనిఫాం వేసుకోమని ఆదేశించారు. వేసుకోనని చెప్పినందుకు పిడికిలితో, చెక్క లాఠీలతో కొట్టారు. ఆ తర్వాత నన్ను క్యాంపులో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి నా ఎముకలేమైనా విరిగాయేమో పరీక్షించి, తర్వాత తిరిగి నా టెంటు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. రెండు నెలలపాటు రోజు ఇలాగే జరిగేది.

నా విశ్వాసం విషయంలో రాజీపడనని, విసిగిపోయిన సైనికులు కొత్త పథకం వేశారు. చేతులు వెనక్కి కట్టేసి, నా అరికాళ్ల మీద కొరడాలతో గట్టిగా కొట్టేవాళ్లు. భరించలేని ఆ నొప్పిలో యేసుక్రీస్తు అన్న ఈ మాటల్ని గుర్తుచేసుకునేవాడిని: “ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, . . . పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఎంతో ఆనందించండి; ఎందుకంటే వాళ్లు అంతకుముందు ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు.” (మత్త. 5:11, 12) అలా చాలాసేపు కొట్టడంతో చివరికి స్పృహ కోల్పోయాను.

మెలకువ వచ్చి చూసేసరికి చల్లగా ఉన్న ఒక సెల్‌లో ఉన్నాను. తినడానికి, తాగడానికి, కప్పుకోవడానికి అక్కడేమీ లేవు. అయినాసరే నేను కంగారుపడకుండా ప్రశాంతంగా ఉన్నాను. బైబిలు మాటిస్తున్నట్లు “దేవుని శాంతి” ‘నా హృదయానికి, మనసుకు కాపలా’ ఉంది. (ఫిలి. 4:7, అధస్సూచి) తర్వాతి రోజు దయగల ఒక సైనికుడు నాకు బ్రెడ్‌, నీళ్లు, కప్పుకోవడానికి ఒక కోటు ఇచ్చాడు. మరో సైనికుడు తన సరుకులను నాకు ఇచ్చాడు. ఇలా ఇంకా ఎన్నో ఇతర విధాలుగా యెహోవా ప్రేమగల శ్రద్ధను రుచి చూశాను.

అధికారులు నన్ను కరడుగట్టిన తిరుగుబాటుదారుడు అనుకుని మిలిటరీ కోర్టులో విచారణ చేయడానికి ఏథెన్సుకు తీసుకెళ్లారు. అక్కడ నాకు యారోస్‌ (గ్యారోస్‌) ద్వీపంలో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అది మ్యాక్రోనిసొస్‌ ద్వీపానికి తూర్పున 50 కి.మీ. దూరంలో ఉంది.

“మిమ్మల్ని నమ్ముతున్నాం”

యారోస్‌ జైలు ఎర్ర ఇటుకలతో కట్టిన పెద్ద కోట. అందులో ఐదు వేలకన్నా ఎక్కువమంది తిరుగుబాటుదారులు ఖైదీలుగా ఉన్నారు. తటస్థంగా ఉన్నందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు యెహోవాసాక్షులు కూడా అక్కడ ఉన్నారు. కలుసుకోకూడదనే ఖచ్చితమైన నియమం ఉన్నప్పటికీ మేం ఏడుగురం రహస్యంగా కలుసుకుని బైబిలు అధ్యయనం చేసుకునేవాళ్లం. మాకు ఎప్పటికప్పుడు దొంగచాటుగా అందే కావలికోటల్ని చేత్తో రాసుకొని ఆ కాపీలను కూడా మా అధ్యయనంలో ఉపయోగించేవాళ్లం.

ఒకరోజు మేం రహస్యంగా బైబిలు అధ్యయనం చేసుకుంటుండగా, అకస్మాత్తుగా జైలు గార్డు మమ్మల్ని చూసి మా దగ్గరున్న పత్రికల్ని లాక్కున్నాడు. డిప్యూటీ వార్డెన్‌ని కలవమని ఆదేశం వచ్చింది. మా శిక్ష ఖచ్చితంగా పొడిగిస్తారని అనుకుంటూ వార్డెన్‌ను కలవడానికి వెళ్లాం. ఆశ్చర్యకరంగా ఆ డిప్యూటీ వార్డెన్‌ “మీరెవరో మాకు తెలుసు, మీ నమ్మకాల్ని మేం గౌరవిస్తాం. మిమ్మల్ని నమ్మవచ్చని మాకు తెలుసు. వెళ్లి మీ పని చేసుకోండి” అని అన్నాడు. మాలో కొంతమందికి తేలికైన పనులు కూడా అప్పగించాడు. మా హృదయం యెహోవాపట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మా క్రైస్తవ తటస్థత జైల్లో కూడా యెహోవాకు స్తుతి తెచ్చింది.

మేము స్థిరంగా ఉండడం వల్ల ఇతర చక్కని ఫలితాలు కూడా వచ్చాయి. మా మంచి ప్రవర్తనను దగ్గర నుండి చూసిన మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ అయిన ఒక ఖైదీ మా నమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నాడు. 1951వ సంవత్సరం తొలినాళ్లలో యెహోవాసాక్షులైన మమ్మల్ని విడుదల చేస్తున్నప్పుడు అతన్ని కూడా విడుదల చేశారు. కొంతకాలానికి అతను బాప్తిస్మం తీసుకుని, పూర్తికాల సేవ మొదలుపెట్టాడు.

ఇప్పటికీ సైనికుడినే

నా భార్య జానెట్‌తో

జైలు నుండి విడుదలయ్యాక నేను కరిట్జాలో ఉన్న మా కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లిపోయాను. కొంతకాలం తర్వాత మా దేశంలోని చాలామందితో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లిపోయాను. అక్కడ జానెట్‌ అనే చక్కని క్రైస్తవ స్త్రీని కలిశాను, ఆమెనే పెళ్లి చేసుకున్నాను. మాకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు, వాళ్లు కూడా యెహోవాసాక్షులయ్యారు.

ఇప్పుడు నా వయసు 90 దాటింది. ఇప్పటికీ క్రైస్తవ పెద్దగా చురుగ్గా సేవచేస్తున్నాను. కాకపోతే గతంలో నన్ను కొట్టిన దెబ్బల వల్ల నా ఒళ్లు, అరికాళ్లు ఇప్పటికీ నొప్పి పుడుతుంటాయి. ముఖ్యంగా ప్రీచింగ్‌కు వెళ్లొచ్చాక నొప్పిగా ఉంటాయి. ఏదేమైనా నేనెప్పటికీ ‘క్రీస్తు సైనికుడిగా’ ఉండాలనే నిర్ణయించుకున్నాను.—2 తిమో. 2:3.