కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దయతో చేసిన ఒక్క పని

దయతో చేసిన ఒక్క పని

ఇండియాలోని గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో జాన్‌ ఉంటున్నాడు. జాన్‌ వాళ్ల నాన్న 60 ఏళ్ల వయసున్నప్పుడు బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షి అయ్యాడు. కానీ జాన్‌, అతని ఐదుగురు తోబుట్టువులు, తల్లి మాత్రం రోమన్‌ క్యాథలిక్కులు. వాళ్లకు తమ మతమంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనొక యెహోవాసాక్షి అవ్వడం వాళ్లకు నచ్చలేదు.

ఒకరోజు ఆయన, సంఘంలోని సహోదరునికి ఒక కవరు ఇచ్చి రమ్మని జాన్‌కు చెప్పాడు. అయితే, ఆ రోజు ఉదయం ఒక పెద్ద డబ్బా మూత తీస్తుండగా జాన్‌ చేతివేలికి గాయమైంది. కానీ, వాళ్ల నాన్న చెప్పిన పని చేయాలనే ఉద్దేశంతో రక్తం కారుతున్న వేలికి గుడ్డ చుట్టుకొని ఆ కవరు ఇవ్వడానికి నడుచుకుంటూ వెళ్లాడు.

చెప్పిన అడ్రస్‌కు వెళ్లి, ఆ సహోదరుని భార్యకు ఆ కవరు ఇచ్చాడు. ఆమె యెహోవాసాక్షి. ఆమె జాన్‌ వేలికి అయిన గాయాన్ని చూసింది. వెంటనే ఫస్ట్‌-ఎయిడ్‌ బాక్సు తీసుకొచ్చి, గాయాన్ని శుభ్రం చేసి, కట్టుకట్టింది. తర్వాత వేడివేడిగా కప్పు టీ ఇచ్చింది. ఒకవైపు ఈ పనులన్నీ చేస్తూనే ఆమె బైబిలు గురించి స్నేహపూర్వకంగా మాట్లాడింది.

ఆమె చూపించిన దయను బట్టి, యెహోవాసాక్షుల మీద జాన్‌కున్న అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. కాబట్టి క్యాథలిక్‌ చర్చి బోధలకు భిన్నంగా ఉన్న యెహోవాసాక్షుల నమ్మకాల గురించి జాన్‌ ఆమెను రెండు ప్రశ్నలు అడిగాడు. యేసు దేవుడా, క్రైస్తవులు మరియకు ప్రార్థన చేయాలా అని అతను అడిగాడు. ఆమె గుజరాతీ భాష నేర్చుకుంది కాబట్టి అతని భాషలోనే మాట్లాడుతూ బైబిలు నుండి జవాబు చెప్పింది. దాంతోపాటు“ఈ రాజ్య సువార్త” అనే చిన్నపుస్తకాన్ని ఇచ్చింది.

దాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్నది సత్యమని జాన్‌ అర్థంచేసుకున్నాడు. అతను తన ప్రీస్టు దగ్గరకు వెళ్లి అవే రెండు ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రీస్టు చాలా కోపంతో జాన్‌ మీద బైబిలు విసిరి, “నువ్వు సాతానుగా మారిపోయావు. యేసు దేవుడు కాదని బైబిల్లో ఎక్కడ ఉందో చూపించు. మరియను ఆరాధించకూడదని ఎక్కడ ఉందో చూపించు, నాకు చూపించు” అని అరిచాడు. ఆ ప్రీస్టు ప్రవర్తనకు జాన్‌ అవాక్కయ్యాడు. దాంతో ఇంకెప్పుడూ క్యాథలిక్‌ చర్చీలో అడుగుపెట్టనని ప్రీస్టుకు చెప్పాడు. చెప్పినట్టుగానే అతను ఇంకెప్పుడూ వెళ్లలేదు.

జాన్‌ యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు, సత్యాన్ని అంగీకరించాడు, యెహోవా సేవచేయడం కూడా మొదలుపెట్టాడు. కొంతకాలానికి తన కుటుంబంలోని ఇంకొంతమంది కూడా అలాగే చేశారు. ఇది జరిగి సుమారు 60 ఏళ్లు గడిచిపోయాయి. తన వేలికున్న గాయం తాలూకా మచ్చను చూసినప్పుడు, దయతో చేసిన ఆ ఒక్క పని తనను యెహోవా వైపుకు ఎలా నడిపించిందో జాన్‌కు ఇప్పటికీ గుర్తొస్తుంది.—2 కొరిం. 6:4, 6.