వరదల సమయంలో సహాయం చేసినందుకు ప్రశంసలు అందుకున్న హంగేరీలోని యెహోవాసాక్షులు
2013 జూన్ నెలలో, కుండపోత వర్షాలు వల్ల సెంట్రల్ యూరప్‌లోని నదులు పొంగిపొర్లాయి. హంగేరీలోని డాన్యూబ్ నదిలో నీటి మట్టం క్రితమెన్నడూ లేనంత ప్రమాద స్థాయికి చేరుకుంది.
అత్యవసర పరిస్థితుల కారణంగా, వరదల వల్ల నష్టం జరగకుండా సహాయం చేయడానికి సాక్షులు తమకు సహాయం చేయగలరేమోనని హంగేరీ మానవవనరుల మంత్రిత్వ శాఖ అక్కడున్న యెహోవాసాక్షుల బ్రాంచీ కార్యాలయాన్ని అడిగింది. దాంతో, వరద నష్టాన్ని తగ్గించడానికి స్థానిక అధికారులు చేసే కార్యాక్రమాల్లో సహాయం చేయమని డాన్యూబ్ నదీ తీరాన ఉన్న సంఘాలను బ్రాంచి కోరింది.
ఆ ఆహ్వానానికి అక్కడున్న సహోదరసహోదరీలు అద్భుతంగా స్పందించారు. ఆ సమయంలో, నది ఒడ్డును బలంగా ఉంచడానికి చేసిన పనిలో 72 సంఘాలనుండి 900కు పైగా సాక్షులు సహాయం చేశారు. అప్పుడు వాళ్లను తమ పేరు, నగరంతోపాటు “యెహోవాసాక్షులు” అని రాసివున్న బ్యాడ్జీలను పెట్టుకోమని కోరారు.
ఒక నగరంలో, స్థానిక హంగేరియన్ రెడ్ క్రాస్ ప్రతినిధి అక్కడున్న సంఘానికి ఇలా రాశాడు, “మీకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ మధ్య ఉన్నలాంటి ఐక్యత, స్వచ్ఛందంగా సహాయం చేయడానికి మీరు చూపించే స్ఫూర్తి ఈ కాలాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. పైగా మీరు ఎంతోదూరం నుండి వచ్చి సహాయంచేశారు. మీ అందరి గురించి మన నగరంలో గర్వంగా చెప్తాను.”
హంగేరియన్ పార్లమెంట్ సభ్యుడైన ఓ వ్యక్తి, ఒక విపత్తు సహాయక సంస్థకు ఛైర్మన్‌గా పని చేస్తున్నాడు. సాక్షులు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన బ్రాంచి కార్యాలయానికి ఓ ఉత్తరం పంపించాడు.