కంటెంట్‌కు వెళ్లు

ప్రాణాల్ని కాపాడిన ప్రచార కార్యక్రమం

ప్రాణాల్ని కాపాడిన ప్రచార కార్యక్రమం

మెక్సికోలోని టబస్కో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యెహోవాసాక్షులు, “జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండడానికి మూడు కారణాలు” (“Why Go On?​—Three Reasons to Keep Living”) అనే శీర్షిక ఉన్న ఏప్రిల్‌ 2014 తేజరిల్లు! పత్రికను రెండు నెలలపాటు పంచిపెట్టే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని 2017లో ఏర్పాటు చేశారు. ఆ ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు ఎంతో విలువైనదిగా ఎంచారు.

సరిగ్గా అవసరమైనప్పుడు సహాయం

22 ఏళ్ల తన కొడుకు గురించి ఆందోళనపడుతున్న ఒక స్త్రీతో ఫౌస్టీనో అనే యెహోవాసాక్షి మాట్లాడాడు. ఆ యువకుడు డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. అతనికి ఎలా సహాయం చేయాలో వాళ్లమ్మకు తెలియట్లేదు. అయితే ఫౌస్టీనో ఆ తేజరిల్లు! పత్రికను ఇచ్చినప్పుడు, ఆమె “మా అబ్బాయికి కావాల్సింది సరిగ్గా ఇదే” అని అంది. తర్వాతి రోజు ఫౌస్టీనో ఆమె కొడుకును కలిశాడు, వాళ్లిద్దరూ ఆ పత్రికలోని బైబిలు సలహాల గురించి చర్చించుకున్నారు. అలా కొన్నిసార్లు కలిసి మాట్లాడాక, ఆ యువకుడి స్వభావంలో మార్పు కనిపించింది. “అతను ఇప్పుడు కాస్త ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తున్నాడు” అని ఫౌస్టీనో చెప్తున్నాడు. అంతేకాదు తాను నేర్చుకుంటున్న విషయాల్ని, డిప్రెషన్‌తో బాధపడుతున్న తన తమ్ముడికి కూడా చెప్తున్నాడు.

వీమాన్గీయో నగరంలో ఉంటున్న కార్లా, ఈ పత్రికను ఉపయోగించి తన క్లాస్‌మేట్‌కి సహాయం చేసింది. కార్లా ఇలా చెప్తోంది, “మా క్లాస్‌లో ఒక 14 ఏళ్ల అమ్మాయి బాధగా కనిపించింది. నేను ఆమెతో మాట్లాడాను, ఆమె తన కుటుంబ పరిస్థితిని నాతో చెప్పింది. మేము మాట్లాడుతున్నప్పుడు, ఆమె ఎడమచేతి మీద గాట్లు ఉండడం నేను గమనించాను.” ఆమెకు చేతుల్ని, కాళ్లను కోసుకునే అలవాటు ఉందని తెలిసింది. ఆమె తాను అందంగా లేనని, తన జీవితానికి అర్థం లేదని అనుకునేది. కార్లా ఆ తేజరిల్లు! పత్రికను ఆమెకు ఇచ్చింది. ఆ అమ్మాయి దాన్ని చదివాక, ఆ పత్రికను తన కోసమే రాసినట్లు అనిపించిందని కార్లాతో అంది. ముఖం మీద చిరునవ్వుతో ఆమె ఇప్పుడు తన జీవితానికి అర్థం ఉందని నమ్ముతున్నానని చెప్పింది.

వీయాహెర్మోసా నగరంలో ఉంటున్న ఒకతను చాలా నిరాశలో కూరుకుపోయాడు. అతని ఉద్యోగం పోయింది, అతని భార్య అతన్నీ పిల్లల్నీ వదిలి వెళ్లిపోయింది. సహాయం చేయమని అతను దేవునికి ప్రార్థించాడు, అయినా నిరాశ పోలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న సమయంలో మార్టీన్‌, మీగెల్‌ అనే ఇద్దరు యెహోవాసాక్షులు అతని ఇంటి తలుపు తట్టారు. అతను తలుపు తీశాడు, వాళ్లు అతనికి ఆ తేజరిల్లు! పత్రిక ఇచ్చారు. అతను ఆ పత్రిక శీర్షిక చూసినప్పుడు, అది దేవుడు తన ప్రార్థనకు ఇచ్చిన జవాబు అని అతనికి అనిపించింది. మార్టీన్‌, మీగెల్‌ బైబిల్లోని మాటలతో అతన్ని ఓదార్చి కొన్ని రోజుల తర్వాత మళ్లీ అతన్ని కలిశారు. ఈసారి అతను మనశ్శాంతితో కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్లు వారానికి రెండుసార్లు అతనితో బైబిలు అధ్యయనం చేస్తున్నారు.

ఖైదీలు మంచివార్త వింటున్నారు

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా యెహోవాసాక్షులు టబస్కో రాష్ట్రంలోని కొన్ని జైళ్లను సందర్శించారు. బైబిల్లోని విషయాలను ఖైదీలతో పంచుకొని, జీవితానికి ఒక అర్థముందని గ్రహించేలా వాళ్లకు సహాయం చేయాలనుకున్నారు. ఆ సాక్షులు వీడియోలు, బైబిలు ప్రసంగం, జీవితం మీద ఆశ కోల్పోకుండా ఉండడానికి ఈ తేజరిల్లు! పత్రికలో ఉన్న కారణాల్ని చర్చించడం వంటివాటితో ఒక కార్యక్రమం రూపొందించారు. ఖైదీలు, జైల్లో పనిచేసే మిగతావాళ్లు ఈ సందర్శనాలను ఎంతో విలువైనవిగా ఎంచారు. ఒక ఖైదీ ఇలా చెప్పాడు: “నేను మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. దేవునికి నా మీద శ్రద్ధ ఉందని కొంతమంది చెప్పారు, కానీ వాళ్లు చెప్పింది నిజమని నమ్మేలా ఆ విషయాన్ని బైబిలు నుండి చూపించలేదు. మీ మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.”

ఈ ప్రచార కార్యక్రమాన్ని ఇతరులు కూడా గమనించారు. సమాజ శ్రేయస్సు కోసం యెహోవాసాక్షులు చేస్తున్న ప్రయత్నాల్ని ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ప్రశంసించారు. అంతేకాదు, “వాళ్లు ఆత్మహత్యల మీద పోరాటానికి బయల్దేరారు” అనే శీర్షికతో స్థానిక వార్తాపత్రికలో ఈ ప్రచార కార్యక్రమం గురించి ఒక ఆర్టికల్‌ ప్రచురించారు.