కంటెంట్‌కు వెళ్లు

థాయ్‌లాండ్‌లోని స్కూల్‌ పిల్లలకు సహాయం

థాయ్‌లాండ్‌లోని స్కూల్‌ పిల్లలకు సహాయం

2012, డిసెంబరు నెలలో థాయ్‌లాండ్‌లోని యెహోవాసాక్షులు, విద్యార్థులు తమ స్కూల్‌లో ప్రగతి సాధించడానికి సహాయం చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇరవైమంది సాక్షులు బ్యాంకాక్‌లో ఉన్న స్కూల్‌లన్నిటికి వెళ్లారు. వాళ్లు ప్రతీ స్కూల్‌లోని యాజమాన్యాన్ని కలిసి, “హౌ టు సక్సీడ్‌ ఎట్‌ స్కూల్‌” (ఇంగ్లీషు) అనే శీర్షిక ఉన్న 2012 అక్టోబరు నెల తేజరిల్లు! పత్రికలను అక్కడి టీచర్లకు, విద్యార్థులకు పంచిపెట్టారు.

ఆ కార్యక్రమం వల్ల మంచి ఫలితాలు రావడంతో, సాక్షులు దాన్ని థాయ్‌లాండ్‌ దేశమంతటిలో చేపట్టారు. వాళ్లు దాదాపు ఒకటిన్నర సంవత్సరంలో 830 స్కూల్‌లకు వెళ్లారు. ఆ స్కూల్‌లలోని విద్యార్థులకు, టీచర్లకు ఆ తేజరిల్లు! పత్రిక బాగా నచ్చి ఇంకా కావాలని అడగడంతో ఆ పత్రికను మూడు సార్లు రీప్రింట్‌ చేయాల్సివచ్చింది. మొదట్లో 2012, అక్టోబరు నెల తేజరిల్లు! పత్రికను దాదాపు 30,000 కాపీలు ఆర్డరు చేశారు. కానీ ఆ పత్రికలో వచ్చిన అంశం అందర్నీ ఎంత ఆకట్టుకుందంటే 6,50,000 కన్నా ఎక్కువ పత్రికల్ని సహోదరసహోదరీలు పంచిపెట్టగలిగారు.

తేజరిల్లు! పత్రికలో ఎంత విలువైన సమాచారం ఉందో స్కూలు యాజమాన్యాలు, టీచర్లు తొందరగానే అర్థం చేసుకున్నారు. ఒక టీచరు ఇలా అన్నాడు, “మా విద్యార్థులు తమ కుటుంబసభ్యులతో మంచి సంబంధం కలిగివుండడానికి, అలాగే మంచి లక్ష్యాలు పెట్టుకోవడానికి ఈ పత్రిక సహాయం చేస్తుంది.” కొన్ని స్కూల్‌లలో అయితే, ఆ పత్రికలోని అంశాలను తమ తరగతి కరిక్యూలమ్‌లో చేర్చారు. ఇంకొన్ని స్కూల్‌లలో, ఈ పత్రికను తరగతి గదిలో చదివించారు. ఓ స్కూల్‌లో, విద్యార్థులు ఆ పత్రికలో వచ్చిన అంశాల మీద ఓ రిపోర్టు రాయాలని అందరికన్నా బాగా రాసినవాళ్లకు బహుమతులు ఇస్తామని చెప్పారు.

ఆ పత్రికలో వచ్చిన “విన్నింగ్‌ ద వార్‌ అగెయినస్ట్‌ ఒబెసిటి ఇన్‌ ద యంగ్‌ ఏజ్‌” అనే ఆర్టికల్‌ చాలా బాగుందని ఓ విద్యార్థిని చెప్పింది. ఒబెసిటి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందని, ఈ సమస్య గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి తన స్నేహితులు ఎవ్వరూ ఇష్టపడరని ఆమె వివరించింది. “బాగా అర్థమయ్యే, పాటించడానికి తేలిగ్గా ఉండే సలహాలను ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్‌” అని ఆ అమ్మాయి చెప్పింది.

ఆ పత్రికలో వచ్చిన అంశాలు తల్లిదండ్రులకు కూడా చాలా నచ్చాయి. ఓ స్త్రీ, తనను కలవడానికి వచ్చిన సాక్షులతో ఇలా చెప్పింది, “నా కూతురు స్కూల్‌లో ప్రగతి సాధించడానికి సహాయం చేసే విషయాలు ఇందులో ఉన్నాయి.”

థాయ్‌లాండ్‌లోని యెహోవాసాక్షుల ప్రతినిధి అయిన పిచై పిట్రాట్యోటీన్‌ ఇలా చెప్పాడు, ‘ఏ కాలంలో అయినా ఉపయోగపడే జ్ఞానం బైబిల్లో ఉంది, దాన్ని తేజరిల్లు! పత్రిక నొక్కి చెప్తుంది. అది నేడు ఉన్న ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుంది. చదువు ఎంత విలువైనదో యెహోవాసాక్షులు గుర్తించారు అందుకే ఈ సంచికను అందరికీ ఉచితంగా ఇస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం.’