కంటెంట్‌కు వెళ్లు

ఇటలీలోని యెహోవాసాక్షులు తమ పొరుగువాళ్లకు సహాయం చేశారు

ఇటలీలోని యెహోవాసాక్షులు తమ పొరుగువాళ్లకు సహాయం చేశారు

2016 నవంబరు చివర్లో ఉత్తర ఇటలీలో కురిసిన భారీ వర్షాల వల్ల, మోన్కాలైరీ అనే పట్టణానికి దక్షిణాన ఉన్న కొన్ని గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల ఒకటిన్నర అడుగుల కన్నా ఎక్కువ లోతు వరకు నీళ్లు నిలిచాయి. ఒక వార్తాపత్రిక ఇలా నివేదించింది: “నీళ్లు ఎవ్వర్నీ, దేన్నీ లెక్కచేయలేదు.” స్థానిక అధికారులు అక్కడున్న దాదాపు 1,500 మందిని ఖాళీ చేయించారు. రక్షణ టీంలు త్వరగా చర్య తీసుకోవడం వల్ల ఎవ్వరూ చనిపోలేదు. అయితే చాలా కుటుంబాలు ఎంతో నష్టపోయాయి.

కలిసికట్టుగా సహాయం చేయడం

స్థానిక యెహోవాసాక్షుల టీంలు వెంటనే పనిని మొదలుపెట్టాయి. బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన మట్టిని, చెత్తను తీసేసి మిగిలిన వస్తువుల్ని భద్రపర్చడానికి వాళ్లకు సహాయం చేశాయి. బ్లాక్‌ చేసిన ఒక రోడ్డు దగ్గరికి పరికరాలతో, వేడివేడి ఆహారంతో ఒక టీం వచ్చినప్పుడు అధికారులు వాళ్లను వెళ్లనిచ్చేవాళ్లు. అలా ఆ టీంలు అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయగలిగాయి. ఆ స్వచ్ఛంద సేవకులు తోటి సాక్షులకే కాకుండా వేరే మతాలకు చెందిన తమ పొరుగువాళ్లకు కూడా సహాయం చేశారు.

ఉదాహరణకు, ఒక అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్‌ పూర్తిగా నీళ్లల్లో మునిగిపోయింది. రక్షణ టీంలు నీళ్లను తోడేసిన తర్వాత, యెహోవాసాక్షుల ఒక పెద్ద టీం అక్కడ పేరుకుపోయిన చెత్తను తీసేయడానికి తోటి సాక్షి అయిన ఆంటోన్యోకి, అతని కుటుంబానికి సహాయం చేసింది. తర్వాత వాళ్లు ఆ బిల్డింగ్‌లో ఉన్న ఇతరులకు సహాయం చేశారు. వాళ్లు ఒక మానవహారంలా ఏర్పడి కేవలం కొన్ని గంటల్లోనే బేస్‌మెంట్‌లన్నీ పూర్తిగా శుభ్రం చేశారు. వాళ్లు చేసిన సహాయం పట్ల ప్రతిఒక్కరూ ఎంతో కృతజ్ఞత చూపించారు. వాళ్లలో వీవీయాన అనే ఆమె కృతజ్ఞతతో నిండిపోయి ఆంటోన్యో భార్య దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఇలా అంది: “దయచేసి మా తరఫున మీ సహోదరులకు థ్యాంక్స్‌ చెప్పండి, నిజంగా మీరు చాలా గ్రేట్‌!”

వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఒక గ్రామంలోని వాళ్లు, బాధితులకు సహాయం చేస్తున్న సాక్షుల టీంలను గమనించారు. తాము చూసినదాన్ని బట్టి వాళ్లు ఎంతగా కదిలించబడ్డారంటే, ఆ గ్రామంలోని కొంతమంది సాక్షులతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా సాక్షుల టీం లీడర్‌ ఇచ్చిన సూచనలు కూడా సంతోషంగా పాటించారు.

“వెలకట్టలేని సహాయం” పట్ల కృతజ్ఞత

ఒకతని ఇల్లు చాలా దెబ్బతింది, వాళ్ల గ్యారేజీ మట్టిలో కూరుకుపోయింది. ఆ మట్టిని తీసేయడానికి 8 మంది సాక్షులు ఆగకుండా 4 గంటలు పనిచేయడం చూసి అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. అతను కృతజ్ఞతతో కొంతమంది సాక్షుల్ని కౌగిలించుకున్నాడు. అంతేకాదు వాళ్లు చేసిన “వెలకట్టలేని సహాయం” పట్ల కృతజ్ఞత తెలుపుతూ సోషల్‌ మీడియాలో మెసేజ్‌ పెట్టాడు.

ఒక సాక్షి ఇలా చెప్పాడు: “మేం సాక్షులు కాని కొందరు పొరుగువాళ్లకు సహాయం చేశాం, వాళ్లలో చాలామంది 80వ పడిలో ఉన్నవాళ్లే. వాళ్లలో కొందరు మేం చేసిన సహాయానికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు.” స్థానిక క్యాథలిక్‌ చర్చిలో చురుగ్గా పనిచేస్తున్న ఒకాయన సాక్షులు చేసిన సహాయాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతూ ఇలా అన్నాడు: “మా మతనమ్మకాలు వేరైనా మేం ఒకరికొకరం సహాయం చేసుకోవడం నిజంగా అద్భుతం.” ఇంకొకతను ఇలా చెప్పాడు: “మీరు ఆదివారం ఉదయం ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తారని మాత్రమే ప్రజలకు తెలుసు, కానీ ఈ విధంగా సహాయం చేస్తారని తెలీదు, అది చాలా బాధాకరం.”